వీధి కుక్కలు
"ఎందుకు మావయ్య గారు, ఆ వీధి కుక్కలకి రోజు అనవసరంగా పనిగట్టుకుని బిస్కెట్లు పెడుతుంటారు? అవి మీద పడి ఎక్కడ కరుస్తాయని భయం మాకు. మీరేమో ప్రతిరోజూ ఇదే పని!" అంటూ కోడలు భారతి కోపంగా అడిగింది మామగారు రాజారావుని.
"ఎన్నోసార్లు వద్దని చెప్పాం! అయినా కానీ మీరు మానట్లేరు. రేపటి నుంచి మీరు ఆ తూముల వైపు వెళ్ళకండి. మిమ్మల్ని చూడగానే అవి తోక ఊపుకుంటూ దగ్గరకు వస్తాయి. మీరేమో జాలిపడి బిస్కెట్లు కొనిపెడుతుంటారు. చంటి పిల్లలకు పెట్టినట్లు ఏమిటో ఈ అలవాటు!" అని విసుక్కుంది రాజారావు కోడలు భారతి.
"పైగా ఇది అనవసరం ఖర్చు. నెలాఖరికి ఎంత ఖర్చవుతుందో, మీరైనా లెక్క చూసుకున్నారా!" అని అడిగేసరికి, ఒక్కసారిగా మనసు చివుక్కుమంది రాజారావుకి.
అయినా భారతి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా చెప్పులు వేసుకుని వాకింగ్‌కి వెళ్ళిపోయాడు రాజారావు.
అలా రోడ్డు మీద నడుస్తూ ప్రతిరోజూ వెళ్లే లాల్‌బహుదూర్‌నగర్ రోడ్ నెంబర్ రెండు లో ఉన్న తూముల దగ్గర కూర్చున్నాడు.
రాజారావు అలా కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో తోకలు ఊపుకుంటూ పది కుక్కలు రాజారావు చుట్టూ చేరేయి.
వచ్చే ముందు భారతి మాట్లాడిన మాటలకి మనసు బాధపడి, ఈ రోజు వారీ అలవాటు మానేద్దాం అనుకుని కాసేపు వాటి వైపు చూడకుండా ఎటో చూస్తూ కూర్చున్నాడు.
కాసేపటికి అరవడం మొదలెట్టాయి ఆ కుక్కలు.
"అవును మరి, పాపం ఆకలేమో! ప్రతిరోజూ నేనే కదా వీటికి అలవాటు చేశాను. ఇప్పుడు అకస్మాత్తుగా తిండిపెట్టడం మానేస్తే పాపం నాకే కదా ! అయినా కానీ నేను ఎవరికి భయపడాలి? నా పెన్షన్ నుంచే కదా వీటికి ఖర్చు పెడుతున్నాను. ఎవరి మాటలు పట్టించుకోకూడదు!" అనుకుని ఎప్పటిలాగే ఎదురుగా ఉన్న కిళ్లీ షాపులో బిస్కెట్ ప్యాకెట్లు కొని వాటికి పెట్టి తృప్తిపడ్డాడు రాజారావు.
అలా బిస్కెట్లన్నీ తిని మూతి నాకుకుంటూ ఆ కుక్కలు అక్కడే పడుకొన్నాయి.
పాపం ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ఎక్కడ పుట్టాయో తెలీదు. ఈ వీధిలోకి వచ్చి దొరికిందల్లా తింటూ, రాత్రిపూట కొత్త మనిషి కనిపిస్తే గట్టిగా అరుస్తూ ఉంటాయి.
సాధారణంగా ఆ వీధిలోకి వెళ్లాలంటే, అక్కడ కుక్కలు ఉంటాయని భయం అందరికీ.
రాత్రి పది గంటలకి ఇంట్లో మిగిలిన అన్నాన్ని గేటు బయట పడేస్తే, పరుగు పరుగున వచ్చి పాపం ఆకలిని తీర్చుకుంటాయి. రాత్రంతా రోడ్డు పక్కన పడుకుని, ఏదైనా చప్పుడైతే గట్టిగా అరుస్తూ ఉంటాయి.
"కుక్కలు అరుస్తున్నాయి ఏమిటి?" అని బయటకు వచ్చి చూసిన కొన్ని సమయాల్లో దొంగలు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి.
పాపం, వీటిని వీధికుక్కలని తరిమేస్తుంటారు. అసహ్యంగా చూస్తారు. జ్ఞానం తెలియని పిల్లలు చేతికి అందిన రాయిని తీసుకుని గట్టిగా కొడితే, పాపం, అవి అరిచే అరుపుకి మనకి మనసుంటే ఎంతో బాధపడుతుంది.
అవి జాతి కుక్కలు అయితే, యజమాని గారి మంచం మీద పడుకుని, ఖరీదైన బిస్కెట్లు తింటూ, అందమైన పేర్లు పెట్టించుకుని హాయిగా జీవితం గడుపుతాయి.
జాతి ధర్మం దొంగల్ని పట్టుకోవడమే. కానీ వీధి కుక్కలకి పెంపుడు కుక్కలకి మరి ఇంత తారతమ్యం ఉందంటే, దానికి కూడా కర్మ సిద్ధాంతం వర్తిస్తుందేమో!
ఈ అలవాటు ఇవాళ నిన్నటిది కాదు. ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు అయిందేమో.
ఆరోజు ఇప్పటికీ బాగా గుర్తుంది. రోడ్డుమీద నడిచి వెళ్తుంటే, పక్కనే కదలలేకుండా కాలు మీద ఎర్రటి పుండుతో బాధతో అరుస్తూ పడుకున్న కుక్కపిల్ల చూసి, మనసు ద్రవించిపోయింది.
సంచిలో ఉన్న బ్రెడ్‌లోంచి రెండు ముక్కలు పడేస్తే, ఆత్రంగా తినడం మొదలెట్టింది. అలా రెండు మూడు రోజులు అదే సమయానికి పెడుతూ ఉంటే, క్రమేపీ చుట్టుపక్కల ఉన్న కుక్కలు అది చూసి తోక ఆడించుకుంటూ ఆశగా చూసేవి.
కొద్దిరోజులకి ఆ కుక్కపిల్ల కనపడలేదు. కానీ ప్రతిరోజూ నన్ను చూసేసరికి పరిగెత్తుకుంటూ వస్తుంటే, వాటి ఆకలిబాధ తీర్చడానికి నాకు ఈ అలవాటు అయ్యింది.
చిన్నప్పుడు మా ఊర్లో కరణం గారు రోడ్డు మీద ఉన్న చీమలకి పంచదార పోసేవారు. ఎదురింటిలో ఉన్న రామారావు మాస్టారు ప్రతిరోజు ఉదయం పది గంటలకి పక్షులకి కారం బూంది మేడ మీద వేసేవారు.
మళ్లీ ఆ కారం బూంది ఒకే షాపులోనే కొంటానని, అక్కడదైతేనే పక్షులు తింటాయని మా నాన్నగారితో చెబుతూ ఉండేవారు.
మా ఇంటి చూరుకి ధాన్యపు కుచ్చులు పక్షుల కోసం వేలాడదీయడం మా చిన్నతనంలో అలవాటు. ఇవన్నీ నా ఈ అలవాటుకి ఒక కారణమేమో అనుకుని, చీకటి పడిపోతుందని ఇంటిదారి పట్టాడు రాజారావు.
ఇంట్లో అడుగు పెట్టేసరికి హాల్లో కుర్చీలో కూర్చుని రాజారావు కోడలు భారతి టీవీలో వస్తున్న "పంచ యజ్ఞాలు" గురించి ఒక ప్రవచనం ఆసక్తిగా వింటోంది.
ఆఖరిలో "భూతయజ్ఞం" గురించి చెప్తున్న మాటల విని, రాజారావు వైపు ఒకసారి చూసి, "మావయ్య గారు, కాళ్లు కడుక్కుని రండి. టిఫిన్ పెడతాను," అని చెప్పి కుర్చీలోంచి లేచి టీవీ కట్టేసింది.
"లేదమ్మా, పూర్తిగా విను! నాకేం కంగారు లేదు," అన్నాడు రాజారావు.
"లేదండి, ఇదే పని మీరు ప్రతి రోజు చేస్తున్నారు. నేను తెలుసుకోలేకపోయాను. మీ తరం వాళ్లు పెద్దలు చూసి అనుసరించడం నేర్చుకున్నారు. మా తరం వాళ్లు పెద్దలు చెప్పిన ఆచరించలేకపోతున్నాము. రేపటి నుంచి మీతో పాటు నేను కూడా తూముల దగ్గరకి వస్తాను," అంది భారతి.
"శంఖంలో పోస్తే గాని తీర్థం కాదేమో!" అనుకుని, ఆ ప్రముఖ ప్రవచనకారుడికి మనసులో కృతజ్ఞతలు చెప్పాడు రాజారావు.
ఇన్నాళ్లు రాజారావుని తప్పు పట్టిన భారతికి, ఆ ప్రవచనకారుడు ఒక మార్గదర్శి అయ్యి మనసు మార్చాడు. అలా కొద్ది రోజులు గడిచింది.
ఎప్పటిలాగే మామగారు–కోడలు తూముల దగ్గరికి వెళ్లేటప్పటికీ, రోజు వచ్చే కుక్కలు కనపడలేదు.
దూరంగా మున్సిపాలిటీ వ్యాను కనబడింది. అందులోంచి కుక్కల అరుపులు వినపడుతున్నాయి.
"మన కాలనీ వాళ్ళలో ఎవరో కంప్లైంట్ ఇచ్చారట. కుక్కలన్నీ మున్సిపాలిటీ వాళ్లు పట్టుకుని తీసుకెళ్లిపోయారు," అంటూ చెప్పుకొచ్చాడు కిళ్లీ షాపు యజమాని రాజారావుని చూసి.
ఆ మాటలు వినగానే రాజారావు మనసు అదోలా అయిపోయింది. కాళ్లు ముందుకి నడవలేదు.
తూము దగ్గర ఆ పాత చోట కూర్చొని, ఒక్కసారి ఆ కుక్కల కోసం చూసినట్టు చుట్టూ చూసాడు. ఒక్కటి కూడా కనిపించలేదు.
చాలా సంవత్సరాలుగా అలవాటు పడిన చిన్న జీవాలే కానీ, ఇప్పుడు మిగిలింది ఆ శూన్యం మాత్రమే.
"పాపం, ఊరికి కాపలా కాసే వీధికుక్కలు... మనుషుల రక్షణ కోసం జీవితాంతం గడిపినా, వాటికి మాత్రం ఎవ్వరి రక్షణ లేదు," అనుకున్నాడు రాజారావు.
పక్కనే నిశ్శబ్దంగా నిలుచున్న కోడలు భారతి చేతిని తడిమి అడిగింది—
"ఎందుకు మావయ్యా, వీటిని ప్రేమించడం తప్పా?"
రాజారావు ఆకాశం వైపు చూసి నవ్వాడు.
"అవి వెళ్లిపోయినా... వాటి కోసం మనసులో మిగిలిన ఈ మమకారం మాత్రం... మనిషిని మనిషిగా నిలిపే నిజమైన యజ్ఞం."
ఆ రోజు రాత్రి రాజారావు భారతితో కలసి ఇంటి గేటు పక్కన చిన్న గిన్నెలో అన్నం పెట్టాడు."ఏదో జీవి ఆకలితో వచ్చి తింటుంది," అన్నాడు రాజారావు. అలా ప్రతిరోజు ఉదయం చూసేటప్పటికీ ఆ గిన్నె ఖాళీగానే కనబడుతోంది. అంటే ఎన్ని జీవులు ఆకలితో ఉంటున్నాయో పాపం మరి అందుకేనేమో మనకు శాస్త్రం చెప్పింది పంచ యజ్ఞాల గురించి అని అనుకుంది భారతి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి