గౌతమి గమనం
గౌతమి గమనం
కాకినాడ పోర్ట్ స్టేషన్ వచ్చే పోయే ప్రయాణికులతో హడావుడిగా ఉంది. కాకినాడ పోర్ట్ నుండి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్ప్రెస్ దేశంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది.
గౌతమి అంటే ఒక నది పేరు. ఆ పేరు వింటేనే ఒక ఆత్మీయత కనిపిస్తుంది. ఏదో మన సొంత వస్తువులా కాకినాడ ప్రయాణికులందరి అభిమానం సంపాదించుకుంది. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్‌లో ఎక్కితే హాయిగా కాకినాడలో దింపే ఏకైక ట్రైన్ ఒకప్పుడు ఇదే.
మానవుడు జీవితం సక్రమంగా నడవాలంటే కొన్ని నియమాలను చతుర్వేదాలు చెబుతున్నాయి. నా జీవితం సక్రమంగానే నడవాలంటే పట్టాలు దాటి ప్రయాణం చేయకూడదు. నిజంగా నేను మంచిదాన్ని. దూర ప్రాంతాల నుండి బంధువులందరిని తీసుకొచ్చి ఎన్నో వేల కుటుంబాల ఆనందానికి కారణం అవుతున్నాను.
నేను రోజు ఎంతోమందిని గమ్యం చేర్చి వాళ్ల కలలు సాకారం చేస్తున్నాను. ఉద్యోగంలో చేరవలసిన తమ్ముణ్ణి, ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సిన చిన్న తమ్ముడిని, అత్తవారింటికి వెళ్తున్న కూతురిని, ముఖ్యమైన పనులు చేయడానికి పక్క ఊరు వెళ్తున్న బాబాయిలను, ఉద్యోగస్తులను, కూలీలను, వ్యాపారులను ఇలా ఎంతోమందిని ఎక్కించుకొని ఊర్లన్నీ తిప్పుతూ వారి గమ్యం చేరుస్తున్నాను. చిరు వ్యాపారులకు ఆసరా ఇచ్చి వారి బ్రతుకు నిలబెడుతున్నాను. ఏ ఆధారం లేని వారికి పట్టెడు అన్నం దొరికేలా చేస్తున్నాను. ఆటలాడుకునే చిన్నపిల్లలు నన్ను చూసి రైలు ఆట నేర్చుకుని వాళ్ల ఆనందానికి కారణం అవుతున్నాను.
ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయులు తీసుకొచ్చి మనదేశంలో వదిలేశారు. అప్పటినుంచి మీ అందరికీ సేవ చేస్తూనే ఉన్నాను. ఊరికనే కాదు, తగినంత సౌకర్యం ఇచ్చి తగినంత మూల్యం వసూలు చేస్తున్నాను.
నిత్యం నాకు అనేక అనుభవాలు. రైలు ఎక్కిన తర్వాత కళ్ళు నీళ్లు పెట్టుకునేవారు, కింద నుండి టాటా చెబుతూ కళ్ళు తుడుచుకునేవారు, కిటికీ దగ్గర సీటు కోసం దెబ్బలాడుకునే చిన్నపిల్లలు, రైలులో అమ్మకానికి వచ్చే తినుబండారాలు కొన్నమని మారాం చేసే చిన్న పిల్లలు, లోకాభిరామాయణం చెప్పుకునే పెద్దలు, దెబ్బలాడుకునే భార్యాభర్తలు, సెల్‌ఫోన్‌లో మాట్లాడుకునే యువకులు, కిటికీలోంచి వీడియోలు తీసే పెద్దలు, షూ పాలిష్ వాళ్లతో బ్యాగ్ రిపేర్లు వారితో బేరాలు చేసే ముసలివారు — ఇలా అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల, అన్ని భాషల వారు తోడుగా మంచి నవ్వు తెప్పించే అనుభవాలు కలిగిస్తుంటారు.
కొంటె కుర్రాళ్లు చైన్ లాగి నన్ను బలవంతంగా ఆపి పెనాల్టీ కట్టిన సందర్భాలు అనేకం. అత్యవసరంగా బండి ఎక్కినవాళ్లు బెర్త్ కోసం టికెట్ కలెక్టర్ చుట్టూ చేసే ప్రదక్షిణం నాకు నవ్వు తెప్పిస్తుంది.
ఎంతమంది కలెక్టర్లు ఉన్నా కళ్ళు కప్పి టికెట్ లేకుండా ప్రయాణం చేసే వాళ్లు నా ఆదాయానికి గండి కొడుతున్నారు. దొరికిన బడా బాబులను మా ఇన్స్పెక్టర్ గారు జిల్లా కలెక్టర్ లెవెల్లో ఫోజు ఇచ్చి పచ్చనోటు జేబులో కుక్కుకున్న సందర్భాలు అనేకం. అయినా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను.
కొన్ని సందర్భాల్లో నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. వేల రూపాయలు పోసి టికెట్టు కొనుక్కుని సమయానికి నన్ను చేరుకోలేని వాళ్ల బాధ చూడలేను. నా ఒడిలో హాయిగా నిద్రపోతున్నవాళ్లని కత్తులతో బెదిరించి విలువైన వస్తువులు పోగొట్టుకున్నవాళ్లని, సామాను పోగొట్టుకున్నవాళ్లని, పర్సు పోగొట్టుకున్నవాళ్లని చూస్తే నాకు కన్నీళ్లు వస్తాయి.
పరిగెత్తే రైలు నుంచి జంప్ చేసే అబ్బాయిల అమాయకత్వం చూసి నవ్వు వస్తుంది. కానీ ప్రాణంతో చెలగాటం తలుచుకుంటే భయమేస్తుంది.
ప్రతి ఊర్లో నాకు ఒక ఇల్లు ఉంటుంది. అదేనండి, మీ భాషలో రైల్వే స్టేషన్. అక్కడ నా కోసం ఎదురు చూసే వాళ్లని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాను. ఆ గమ్యం కోసం ఎదురుచూసే వాళ్లకి వీడ్కోలు పలుకుతాను. నేను ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి బ్రతుకు దారి చూపిస్తున్నాను.
మొదట్లో మెడ నిండా నల్ల బంగారం వేసుకుని చెమటలు కక్కుతూ భారతదేశమంతా తిరిగి వచ్చేదాన్ని. నా బాధను చూడలేక ఒక మహానుభావుడు నాకు కరెంట్ పుట్టించాడు. ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది. ఇంద్రధనస్సు అంటే మీకు అందరికీ ఇష్టం. కానీ నాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. నా ఇష్టానుసారం పరిగెట్టొచ్చు. నా తొందర అంతా మిమ్మల్ని సకాలంలో గమ్యం చేర్చడమే. నన్ను రోజు ఎంతోమంది ప్రశంసిస్తుంటారు — నిర్ణీత సమయానికి గమ్యం చేర్చానని. నా పరుగు నా చేతుల్లో లేదు. ఆ రంగులోనే ఉంది. ఎప్పుడు ఏ రంగు పడుతుందో ఎవరికీ తెలియదు.
రైలు బండి గొడవ అలా పక్కన పెట్టండి. ఒక్కసారి పోర్ట్ స్టేషన్‌కి వచ్చి చూద్దాం. పోర్ట్ రైల్వే స్టేషన్లో తినుబండారాల వాసనతో పాటు దూరం నుంచి ఓడరేవు నుంచి ఎగుమతి దిగుమతుల వాసన కూడా గాలి మోసుకువస్తోంది.
స్టేషన్లో ఉండే ప్రయాణికులను వీడ్కోలు పలకడానికి వచ్చేవాళ్లు ఆనందంతో కొంతమంది, కన్నీళ్లతో కొంతమంది చేతులు ఊపుతూ భారమైన మనసుతో ఇంటిబాట పడుతున్నారు. నాక్కూడా టైం అయిందన్నట్టుగా, రైలు ఆఖరి కూత వేసి స్టేషన్ నుండి బయలుదేరింది.
అందరితో పాటు నేను లగేజ్ సర్దుకుని కిటికీ పక్కనే ఉన్న సీట్లో కూర్చున్నాను. రైలు పట్టాలు పక్కనున్న ఇళ్లు దాటి వెళ్ళిపోతుంటే, కాకినాడను వదిలి వెళ్తున్నాననే బాధ. నాలోనే కాదు, అందరికీ ఉందేమో అనిపించింది. కిటికీ వైపు చూస్తూ అందరూ ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు.
ఇప్పుడే బయలుదేరింది… అప్పుడే "కాఫీ, టీ, సమోసా!" అంటూ అరుపులు. బ్యాగులు రిపేర్ చేసే వాళ్ళు, జామకాయలు, వేరుశెనగకాయలు అమ్మేవాళ్ళు – బోగీ అంతా హడావిడిగా ఉంది.
అలా అమ్మకానికి వచ్చి పోయే వాళ్లని చూస్తుండగానే గౌతమి తన రెండో ఇంటికి వచ్చేసింది. రెండో ఇల్లు అంటే కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. అక్కడ చుట్టాలు ఎక్కే వాళ్లే ఎక్కువ, దిగేవాళ్లు తక్కువ. ఆ సుందరనగరం మధ్యలో ఉన్న టౌన్ స్టేషన్ పెద్ద ఊపిరి వదిలినట్టుగా ముందుకు కదిలింది.
"భారంగా" అనడం సబబు కాదు… "బరువుగా" అంటే బాగుంటుంది. రైలు బండికి మనసుండదు… బాధ్యత ఉంటుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, సమయానికి గమ్యం చేర్చడమే దాని బాధ్యత.
కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దాటి వెళ్తున్నప్పుడు, కాకినాడ తీపి గుర్తులు ఒక్కసారి గుర్తుకొచ్చి మనసు బాధపడింది. దేవాలయాలు దర్శనం చేసుకుని పంటికింద పొట్టి పెసరట్టు తిన్న రోజులు, మధ్యాహ్నం సుబ్బయ్య గారి భోజనం, సాయంకాలం కోటయ్య కాజాతో నోరు తీపి చేసుకున్న తీయటి రోజులు—అవన్నీ దాటి వెళ్తున్నానే బాధ మనసులో ఉండగానే, అవన్నీ నాకేం సంబంధం అంటూ రైలు పంచారామ క్షేత్రం సామర్లకోటలోకి అడుగుపెట్టింది.
ఒకప్పుడు సామర్లకోటలో అడుగుపెడితే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు పంచదార పరిశ్రమ కరిగిపోయి ఆ బాధలన్నీ కనుమరుగైపోయాయి. ఆ కిటికీలో నుంచే రెండు చేతులతో స్వామికి నమస్కరించి, బెల్లం గవ్వల మధుర స్మృతులను ఒక్కసారి గుర్తు చేసుకున్నాను.
ఆ బెల్లం గవ్వల రుచి ఇంకా జ్ఞాపకాలనుంచి వెళ్లిపోకుండానే దూరంగా అయ్యప్ప స్వామి గుడి కనబడింది.
ద్వారపూడి ప్లాట్‌ఫామ్ ఆ చివరి నుంచి చివరి వరకు స్వామి మాల వేసుకున్న భక్తులు, బట్టలు మూటలు తల మీద పెట్టుకుని రైలు కోసం పరిగెత్తే వ్యాపారులు కనిపించడంతో — "ఇది ద్వారపూడి స్టేషన్!" అని అనుకునే లోపే, రైలు "ఇంక నాకు సమయం లేదు!" అన్నట్టుగా పరుగు మొదలుపెట్టింది.
అప్పుడే సమయం 8 గంటలైంది. ఒక్కసారి బోగీలో కదలిక వచ్చింది. టిఫిన్ డబ్బాలు ఖాళీ చేసి, బెర్తులు పరుచుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించారు. నాది సైడ్ లోయర్ బెర్త్, అందుకే నాకేమీ ఇబ్బంది లేదు.
"రైలులో వచ్చే చెత్త అంతా తినకు, నీకు టిఫిన్ డబ్బా పెట్టాను!" అంటూ అమ్మ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తొచ్చాయి. డబ్బా తీసి చూసినప్పటికీ, దిబ్బ రొట్టె… చెరుకు పానకం ఆకల్ని గుర్తు చేసి, ఐదు నిమిషాల్లో డబ్బా ఖాళీ అయిపోయింది. అంత రుచికరంగా పెట్టే అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చేశాయి.
ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అమ్మ కొంగు పట్టుకుని తిరిగిన కుర్రాడిని… నూనూగు మీసాలు వచ్చిన, పట్టాపుచ్చుకుని భాగ్యనగరం వెళ్తున్న నవ యువకుడిని.
అంతవరకు పరుగులు తీస్తున్న రైలు, ఒక్కసారి సడన్‌గా వేసిన బ్రేక్‌తో రాజమహేంద్రవరం స్టేషన్‌కు వచ్చేసింది.
పూతరేకులు, పాలకోవా అమ్మేవాళ్లు ఎక్కువగా కనిపించారు. రైల్వే స్టేషన్ సందడి మామూలే. ఇది కొంచెం పెద్ద స్టేషన్. జనం రకరకాల ట్రైన్ల కోసం ప్లాట్‌ఫాం నిండా ఉన్నారు.
ఒక్కసారి గుండెల్లో అలజడి మొదలైంది — "ఇంక రాజమండ్రి దాటితే ఏముంది? తూర్పు గోదావరి జిల్లా అయిపోయినట్టే కదా!" అనుకుంటుండగానే, గోదావరి బ్రిడ్జిపై రైలు పరిగెడుతుంటే విచిత్ర శబ్దం చెవులకు వినబడింది.
చీకట్లో గోదావరి తల్లి కనబడకున్నా, జేబులోంచి చిల్లర తీసి గోదావరిలోకి వేసి దండం పెట్టుకున్నాను. ఇది అమ్మ చేసిన మంచి అలవాటు.
నా మనసు ఇంకా అమ్మ దగ్గరే ఉంది… కానీ రైలు మాత్రం గోదావరి బ్రిడ్జిని దాటి, కొవ్వూరు చేరి గోష్పాద క్షేత్రం గుర్తు చేసి, పాత కొత్త వంతెనలు చూపించి ముందుకు పరుగులు తీసింది.
రైలు బోగీ ప్రయాణికులంతా నిద్రలోకి జారుకున్నారు — నేను తప్ప. బ్యాగులోంచి దుప్పటి తీసి కప్పుకుని ఏదో పుస్తకం చదవడం మొదలుపెట్టాను. నాలుగు పేజీలు చదివినా కంటి మీద కునుకు రాలేదు.
రైలు నిడదవోలు స్టేషన్‌కి వచ్చే ఆగింది. చిన్నప్పుడు అమ్మ తీసుకెళ్లిన కోట సత్తెమ్మ తల్లి గుడి గుర్తొచ్చింది.
నిడదవోలు దాటి మళ్లీ పరుగు మొదలైంది. నేనో పేజీ కూడా చదవలేకపోయాను. హృదయంలో పాత జ్ఞాపకాల రైలు పరుగులు తీస్తోంది. ఒక్కసారి ఫోన్‌లో మ్యూజిక్ వేసుకుని కిటికీలోంచి వెలుతురు వెతుక్కుంటూ పరుగులు తీస్తున్న సైట్లను చూస్తున్నాను.
పొలాల్లో చిన్నచిన్న విద్యుత్ దీపాలు, కొండల నీడలు, మధ్యలో పంటలు… నిశ్శబ్దంగా మెలకువగా ఉన్నట్టున్న ప్రకృతి నన్ను మాయ చేసింది.ఒక నిమిషం ఈ రైలు నన్ను తీసుకెళ్తున్నదో… లేక నేను గౌతమి బండిని నడిపిస్తున్నానో తెలీదు. కానీ ఈ ప్రయాణం ఇక మరిచిపోలేనిది.
ఇది కేవలం స్టేషన్ల మధ్య ప్రయాణం కాదు… నాన్నమ్మలు చెప్పిన కథలు, అమ్మ పెట్టిన రుచులు, యువకుడిగా ఎదుగుతున్న బాధ్యతల మధ్య ఒక బండిపైన నడిచే జీవిత ప్రయాణం.
జీవిత ప్రయాణంలో ఈ గౌతమి ప్రయాణించే స్టేషన్‌లో ఏదో ఒక సందర్భంలో మధుర అనుభూతి, విచారకర సంఘటన అనుభవం ఉంటుంది. ఆ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ సంఘటన గుర్తు రాక మానదు.
ఇంతలో తాడేపల్లిగూడెం స్టేషన్‌లో రైలు ఆగి, బయలుదేరడం జరిగింది. ఎవరో పాపం సామాన్లు పట్టుకుని రైలు కోసం పరిగెత్తడం చూస్తుంటే బాధగా అనిపించింది. కానీ నాతో పాటు ఎవ్వరూ చైన్ లాగి రైలు ఆపడానికి సాహసం చేయకపోవడం విచిత్రంగా అనిపించింది. కారణం — "చైన్ లాగితే జరిమానా" అనే అక్షరాలు ప్రతి బోగీలో భయపెడుతూ ఉంటాయి.
ఆ ఆలోచనలో ఉండగానే రైలు వేగం పుంజుకుని ఏలూరు చేరిపోయింది. మాతోపాటు కాకినాడలో ఎక్కిన ఒక యువ జంట, చిన్న చంటిబాబుతో అక్కడ దిగారు. చంటిబాబు పుట్టిన వెంట్రుకల కోసం తిరుపతి వెళ్తున్నామన్నారు.
అంత చీకట్లోనూ రైలు నిర్భయంగా పట్టాలమీద పరిగెడుతూ, దుర్గమ్మ తల్లి యాత్రికులను రాయనపాడు వద్ద దింపేసి, ఖమ్మం వైపు దూసుకెళ్తుంటే… ఎప్పుడో నిద్ర పట్టింది.
మెలకువ వచ్చేసరికి చేతిలోని పుస్తకం కిందపడిపోయి ఉంది. రైలు సికింద్రాబాద్ అవుటర్ సిగ్నల్ దగ్గర ఆగి ఉంది.
"అప్పుడే వచ్చేసిందా?" అవును… ఇది గౌతమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణము
గౌతమి ఎక్స్‌ప్రెస్ చివరి స్టేషన్‌కు చేరింది. కానీ మన కథానాయకుని హృదయం మాత్రం మొదటి స్టేషన్లోనే నిలిచిపోయింది — కాకినాడలో! మట్టి వాసనలో, అమ్మ చేసిన టిఫిన్ రుచిలో, నానమ్మ చెప్పిన కథల గదిలో. ఈ కథ చదివిన ప్రతీ హృదయం… ఒకసారి కిటికీ వైపు తల తిప్పి తన బాల్యాన్ని వెతకక తప్పదు.
ఇది కేవలం గౌతమి ప్రయాణం కాదు... మన అందరి జీవిత ప్రయాణానికి ప్రతిరూపం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి