ఇంతే కదా జీవితం
ఇంతే కదా జీవితం.
" పరంధామయ్య గారు రాత్రి కాలం చేశారట పొద్దున్నే పనిమనిషి చెప్పింది అంటూ భార్య శాంతి చెప్పిన మాటకి కాసేపు నోటి వెంట మాట రాకుండా ఉండిపోయాడు రాజారావు.
రాజారావు గారికి పరంధామయ్య గారు గురువుగారు. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉన్నా రోజు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి పరంధామయ్య గారి దగ్గర కాసేపు గడిపి వచ్చేవాడు రాజారావు. అయ్యో పాపం అలాగా నిన్న సాయంకాలం కూడా బాగానే ఉన్నాడే నాతో ఎప్పటివో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అంటూ కాసేపు బాధపడి ఇప్పుడే చూసి వస్తానంటూ బయలుదేరాడు రాజారావు.
రాజారావు పరంధామయ్య ఇంటికి వెళ్లేటప్పటికి ఇంటి నిండా బంధువులు స్నేహితులు పరంధామయ్య గారి ఎనిమిది మంది పిల్లలు అల్లుళ్లు మనవలుతో ఇల్లు నిండిపోయి ఉంది. రాజారావు గారిని చూడగానే పరంధామయ్య గారి పెద్దబ్బాయి కళ్ళు తుడుచుకుంటూ ఎదురు వచ్చాడు. చూడండి నాన్నగారు మమ్మల్ని అందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయారు అంటూ గట్టిగా ఏడుస్తూ వచ్చాడు. మిగతా పిల్లలందరూ ఆయనని అనుసరించారు. మా నాన్న మమ్మల్ని అందరినీ చాలా కష్టపడి పెంచారు. ఎప్పుడూ సైకిల్ తొక్కుకుంటూ ఉద్యోగం చేసి వచ్చేవారు గానీ రిక్షా కూడా ఎప్పుడు ఎక్కలేదు. ఇంత పెద్ద ఇల్లు ఇంటి చుట్టూ ఇంత స్థలం కష్టపడి సంపాదించారు. అమ్మని కూడా ఎప్పుడూ పల్లెెత్తు మాట ఏమీ అనలేదు .
ఎప్పుడూ ఖరీదైన బట్టలు కూడా కట్టుకోలేదు. ఎప్పుడూ ఆ పంచి లాల్చీ. అవి కూడా ఆయన చేతులతో ఆయన కొనుక్కోలేదు. ఆయన చదువు చెప్పిన పిల్లలు ఏదో అభిమానంతో తీసుకొచ్చినవే. ఆయన చదువు చెప్పిన పిల్లలు మాతో సహా అందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆయన నోటి వెంట వచ్చిన ఏ అక్షరమైన అది విద్యార్థికి జ్ఞానంతో పాటు కడుపుకిoత అన్నం పెట్టే ఉపాధిని కూడా సంపాదించి పెట్టేది.మాకు అందరికీ పెళ్లిళ్లు చేసి పేరంటాలు చేసి ఎప్పుడు ఏనాడూ మా నుండి ఏమీ ఆశించలేదు .పని ఒత్తిడిలో ఉండి మేము ఫోన్ చేయకపోయినా ఏనాడూ మనవళ్ళని సెలవులకు పంపించకపోయినా ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు అంటూ ఆయనలోని మంచి గుణాలన్నీ ఇప్పుడే కనుక్కున్నట్టు వచ్చిన వాళ్ళందరూ తోటి ఏకరువు పెడుతున్నారు. ఇంటికోడళ్ళు వచ్చిరాని ఏడుపుని ఆపుకుంటూ నోట్లో కొంగు పెట్టుకుని మాటిమాటికి కన్నీళ్లు రాకపోయినా తుడుచుకుంటున్నారు. మా మావయ్య గారు చాలా మంచి ఆయన మమ్మల్ని కన్న తండ్రిలా చూసుకునేవారు అంటూ ఎవరో పక్కన కూర్చున్న బంధువుల తోటి చెబుతున్నారు. నేను వండిన వంకాయ కూర అంటే ఎంత ఇష్టమో మా మావయ్య గారికి అంటూ గొప్పలు చెప్తోంది పెద్ద కోడలు. "అయినా ఈవిడ చేతి వంట ఎప్పుడు తిన్నాడు ఎప్పుడూ కొడుకు దగ్గరికి వెళ్లలేదే అనుకున్నడు రాజారావు. అల్లుళ్లు ఒక పక్కగా ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉన్నారు. మావగారు పోయిన విచారం కాబోలు.
ఇంతలో ఎవరో బంధువు అనుకుంటా ఆటోలో నుంచి దిగిన వెంటనే గట్టిగట్టిగా ఏడుస్తూ కూలబడిపోయింది.అయినా ఈవిడ ఎవరు ఎప్పుడు పరంధామయ్య గారింట్లో చూడలేదే అనుకున్నాడు రాజారావు. చాలా పెద్ద సీను క్రియేట్ చేసింది ఆవిడ. ఇక్కడ ఏమి టీవీలో చూపించడానికి వీడియోలు తీయటం లేదు. ఎందుకు అంత ఏడుపు. ఆవిడ ఏమి పరంధామయ్య గారి దగ్గర బంధువు కూడా కాదు. రెండు ఏళ్ల నుంచి మంచం మీద ఉన్న ఎప్పుడు పరంధామయ్య గారిని పలకరించిన పాపాన్ని పోలేదు. పరంధామయ్య గారు భార్య రెండు సంవత్సరాల క్రితం పోయింది. అప్పటినుంచి ఎక్కడికి వెళ్లడం ఇష్టం లేక ఎవరో స్నేహితుడు పంపించిన మనిషి చేత అన్ని పనులు చేయించుకుంటూ అన్నం వండించుకుంటూ అలా ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేసేవాడు. పెద్ద అనారోగ్యాలు ఏమీ లేవు. వయస్సు అటువంటిది. పైగా ఒంటరితనం. ఎప్పుడూ మంచం మీద పడుకుని ఉండే వాడు. బతికున్నంత కాలం ఎవరూ చూడ్డానికి కూడా రాలే దు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్ని ఏడుపులు ఇంత హడావిడి ఎందుకు. లోకాన్ని నమ్మించడం కోసమా! ఇంత నటన ఎందుకు ?లోకం కోసం భయపడడం. అంటే నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారని కాబోలు.
బ్ర తికి ఉన్న రోజుల్లో ఆయన గుండె గాయపడకుండా చూసుకున్నప్పుడు ఆ ఆనందం గుండెల్లో పెట్టుకుని హాయిగా వెళ్ళిపోతాడు ఎవరైనా సరే. పోయిన తర్వాత ఈ నాటకాలు ఏమిటి అంటూ అందరి గురించి బాగా తెలుసున్న వ్యక్తి అయిన రాజా రావుకి ఒళ్ళు మండిపోయి కోపం వచ్చేసింది.
ఇంతకీ రాజారావు ఎవరు అనే సందేహం అందరికీ కలగొచ్చు. రాజారావు పరంధామయ్య గారికి ప్రియ శిష్యుడు. నిజానికి ఒక శిష్యుడిలా కాకుండా చిన్నప్పటినుంచి ఒక కొడుకులా చూసేవాడు పరంధామయ్య. రాజారావు కూడా స్కూల్ టీచర్ గా అదే ఊర్లో ఉద్యోగం సంపాదించి వెనకాల వీధిలో కాపురం ఉంటున్నాడు. పరంధామయ్య కుటుంబం గురించి అన్ని విషయాలు తెలిసినవాడు రాజారావు. అందుకే అప్పటి నుంచి గురువుగారిని ఎప్పుడూ వదలకుండా రోజు సాయంకాలం పూట వెళ్లి కలిసి వచ్చేవాడు. చాలాసేపు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ కబుర్లలో కుటుంబ విషయాలు ,తన గుండె మంట అనుకోకుండా బయటికి చెప్పేవాడు పరంధామయ్య. ఇప్పుడు వీళ్ళందరూ సడన్ గా పరంధామయ్య గారి గురించి మాటలు చెబుతుంటే రాజారావుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలో పరంధామయ్య గారి పెద్దబ్బాయి ఎక్కడి నుంచో దుమ్ము కొట్టుకుపోయిన తల్లి తండ్రి ఫోటో తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి తండ్రిశవం దగ్గర పెట్టాడు. మళ్లీ ఆ ఫోటో గురించి కామెంట్లు. ఫోటోలో నాన్నగారు ఎంత బాగున్నారో అంటూ నవ్వులు. అమ్మానాన్న పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అంటూ ఆనంద పడిపోతున్నారు. నిజమే బతికున్న ఉన్నవాళ్లు పార్వతి పరమేశ్వరులు అని తెలియదా అనుకున్నాడు రాజారావు.
ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుపు రావడం అందరికీ సహజ మే. చనిపోయిన వారి గురించి గోరంతల కొండంతలు చేసి చెప్పుకోనక్కర్లేదు. ఇవన్నీ చూసి మన పరిస్థితి ఏమిటో తెలిసినవాళ్లు వెనకాల నవ్వుకుంటారు. తెలియనివాళ్లు ఆ పిల్లలకి తండ్రి మీద ఎంత ప్రేమో అని చెప్పుకుంటారు.
అప్పటికే ఉదయం పదకొండు గంటలయింది. మాస్టారి శిష్యులందరూ వచ్చి పూల దండలు వేసి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. అలా దండలతో శవం అంతా నిండిపోయింది. బతికున్న రోజుల్లో ఆయన జీవితం పూల పాన్పు కాదు. తెలిసి తెలియని వయసులో జరిగిన పెళ్ళిలో రిటైర్ అయినప్పుడు ఒకసారి మెడలో వేసిన పూలదండ చూసి మురిసిపోయి ఉంటారు మాస్టారు.ఆయన మెడలో ఇప్పుడు దండలు ఉన్నా ఆ ఆనందం ఆయన అనుభవించలేడు. అందుకే ఏదైనా సరే ఊపిరి ఉన్నప్పుడే. ఒక తీయటి మాటైనా ఒక సత్కారమైనా చనిపోయిన తర్వాత ఎందుకు. ఇప్పుడు ఈ దండలు కూడా ఆయనతో పాటు యాత్రగా అక్కడ వరకే వెళతాయి. అక్కడ చెత్తకుండీలోకి చేరిపోతాయి. ఏది ఆయన కూడా వెళ్లదు. ఆయన గురించి చెప్పుకున్న ఏ గొప్ప మాట అయినా సరే. అందుకే బ్రతికున్నప్పుడే ఏదైనా సరే. ఇంతలో ఒక్కసారిగా గట్టిగా ఏడుపు వినిపించింది. ఎవరా అని అందరూ అటు తిరిగి చూసేసరికి పరంధామయ్య గారి చిన్న కోడలు కాళ్ళ దగ్గర కూర్చుని మావయ్య గారు నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ఉంది. అంటే ఆవిడ క్షమించరాని నేరం ఏమైనా చేసిందా. అది అది ఎవరికి తెలుసు. ఒక్క పరంధామయ్య గారికి తెలుసు. అన్ని గుండెల్లో పెట్టుకుని గుండె రాయి చేసుకుని ఒక ఇంటి పెద్దగా ఇన్నాళ్లు ఉండి ఇదిగో ఇప్పుడు ఇలా వెళ్ళిపోయాడు పరంధామయ్య గారు అని అనుకున్నాడు రాజారావు. బ్రతికున్నప్పుడు తాతయ్య అంటూ ఎప్పుడూ ప్రేమగా పలకరించలేదు కానీ చేతిలో ఒక సెల్ పెట్టుకుని తాతయ్య అంతిమయాత్ర వీడియో తీస్తున్నాడు పెద్ద మనవడు. మన కర్మకి ఫేస్బుక్ లు ఒకటి వచ్చాయి. అందులో అప్లోడ్ చేయడానికి కాబోలు. అంతా నటన మాటలతోనే కడుపు నింపేస్తున్నారు. మాటలతోటే జీవితం గడిపే స్తున్నారు. అసలు రంగంలోకి ఎవరు రారు. అంతా గొప్పల కోసం తాపత్రయపడేవారే.
ఇంతలో పంతులుగారు వచ్చారు. చేయవలసిన కార్యక్రమాలు యధావిధిగా జరిగిపోయాయి. ఇన్నాళ్లు ఆ గుండెలో ఎన్ని మంటలు ఉన్నాయో ఎవరికీ చెప్పకుండా కుటుంబ పెద్దగా అన్ని బాధ్యతలు మోస్తూ ఎత్తలేని బరువులు ఎత్తుకుంటూ కుటుంబ క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తూ శరీరం సహకరించక మంచం మీద వాలిపోయిన ఆ పరంధామయ్య చితిమంటల్లో కాలిపోయాడు. ప్రతి మనిషి జీవితం ఇంతే కదా అనుకుని రాజారావు ఇంటి ముఖం పట్టాడు. మర్నాడు ఈనాడు పేపర్లో పరంధామయ్య గారి శ్రద్ధాంజలి ఫోటో చూసి రాజారావుకి అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చాయి.
మర్నాడు రాజారావు పరంధామయ్య గారి ఇంటికి వెళ్లేటప్పటికీ అంతా హాల్లో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నా రు. పంచభూతాల్లో కలిసిపోయిన పరంధామయ్య గారి మాట ఎక్కడ వినపడలేదు.
ఈ కథ అన్ని కుటుంబాల గురించి కాదు. ఈ కథలోని పాత్ర లాగా నిజజీవితంలో ఉంటారా అని అనుకుంటారు అందరు కానీ నా కళ్ళల్లో పడిన కుటుంబాల కథలు యధాతధంగా మీ ముందుకు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి