పగటి వేషగాళ్లు

పగటి వేషగాళ్ళు.

 " ఏరా పోచయ్య దసరా దగ్గరికి వచ్చేస్తోంది. ఎప్పటిలాగా నువ్వు పులి వేషం వెయ్యాలి. నువ్వు చేసినట్లుగా పులి డాన్స్ ఎవరు చేయలేరు. రోజుకి ఎంత ఇమ్మంటావు?. కచ్చితంగా చెప్పు మనం రేపే బయలుదేరాలి !అంటూ చెప్పిన కాంట్రాక్టర్ రంగయ్య మాటలకి

" రోజుకు ఐదు వందలు ఇప్పించండి. రెండు పూటలా భోజనం. సాయంకాలం కాస్త ఒక గ్లాసు మందు. ఖరీదైంది అక్కర్లేదు లెండి. ఎప్పటిలాగా సత్రంలోనే కదా పడుకోవడం అంటూ సమాధానం ఇచ్చిన పోచయ్య మాటలకి రంగయ్య చాలా ఎక్కువ చెబుతున్నావు. ఇదివరకు ఇచ్చినట్లుగా ఇస్తాను అన్నాడు రంగయ్య. 

" అయ్యగారు కిట్టటం లేదు. కూలి పనికి వెళ్తే రోజుకి ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నారు. దానికి తోడు వయస్సు పెరిగిపోతుంది కదా కాళ్ల నొప్పులు మొదలయ్యే యి. దానికి తోడు ఆ ఊరి జనం నేను పులి వేషంలో కనబడితే ఊరికే ఉండనీరు. డాన్స్ చేయమంటారు. అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా కాళీ ఉండదు అంటూ చెప్పాడు పోచయ్య. 

సరే రా రేపు రెడీగా ఉండు . ఉదయం బస్సు కే బయలుదేరాలి. 
అంటూ చెప్పిన రంగయ్య మాటలకి తల ఊపేడు పోచయ్య.
రంగయ్య రాజమండ్రిలో చిన్న చిన్న నటులను సప్లై చేసే కాంట్రాక్టర్ . అలాగే ఒక షాప్ యజమాని కూడా. అక్కడ నాటకాలులో ధరించే డ్రస్సులు కిరీటాలు గదలు పగటివేషగాళ్ళుకి కావలసిన రంగులు దుస్తులు ఒకటేమిటి సమస్తం అద్దెకిస్తుంటాడు. అలాగే పగటివేషగాళ్ళునీ ఒక బృందంగా తయారు చేసి పండగలకి అమ్మవారి జాతర్లకి రాజకీయ నాయకులు మీటింగులకి పగటివేషగాళ్లను తీసుకెళ్లి ప్రదర్శనలు ఇప్పిస్తుంటాడు. 

ఈ పగటి వేషగాళ్లలో శక్తి వేషం, పులి వేషం ,పిట్టల దొరవేషం రావణాసురుడు వేషం ,అర్ధనారీశ్వరుడు వేషం వేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ పగటివేష గాళ్ళకి ఒకప్పుడు బాగా డిమాండ్ ఉండేది. ఇప్పుడు దసరా పండగ సమయంలోనే ఎక్కువ డిమాండ్. కాలక్రమేణా ఈ కళకి ఆదరణ తగ్గిపోయి నేర్చుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు.

 ఆధునిక కాలంలో ఈ కళని ఇంకా ఆదరించే ఊర్లు కొన్ని ఉన్నాయి. అవి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలోని ఒక గ్రామం. అక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు భారీ ఎత్తున చేస్తారు. ప్రతి ఏటా తప్పనిసరిగా రాజమండ్రి నుంచి రంగయ్య ట్రూప్ ని తీసుకొచ్చి వేషాలు వేయిస్తారు. ప్రతి ఏటా ఈ గ్రూపు కి అమ్మవారి దేవాలయం పక్కన గల సత్రంలో బస ఏర్పాటు చేస్తారు. అది ఉచిత అన్నదాన సత్రం. బస భోజనం అన్ని కూడా ఉచితమే. 
ప్రతి సంవత్సరం లాగే దసరా ఉత్సవాలు భారీ ఎత్తున ప్రారంభo అయ్యాయి. ఆ ఊరి ప్రధాన కూడలిలో పెద్ద తాటాకుల పందిరి, పచ్చటి తోరణాలు ,మధ్యలో పెద్ద దుర్గాదేవి విగ్రహం ,మైక్ లో పాటలు ,ఆ పందిరిలో చిన్నపిల్లల ఆటలు, భక్తుల కోలాహలం చూడ్డానికి ఎంతగానో కన్నుల పండుగ ఉంది. 

మొదటిరోజు ఉదయం పిట్టలదొర వేషంతో ప్రదర్శన ప్రారంభo అయ్యింది. ఒకపక్క ఎండ చురుక్కుమని అనిపిస్తుంటే తల పైన టోపీ ,ఒంటిపైన చిరిగిపోయిన కోటు ,దుమ్ము కొట్టుకుపోయిన బూట్లు ,చేతిలో ఒక తుపాకీ పట్టుకుని ఊరంతా తిరుగుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ సంబంధం లేకుండా తనలో తానే మాట్లాడుకుంటూ అందరికీ చూడగానే నవ్వు తెప్పిస్తున్నాడు పిట్టలదొర. పాపం ఆ వేడికి ఒళ్లంతా మంట పుట్టి ఊరంతా తిరిగి వచ్చి పడుకున్నాడు పిట్టలదొర వేషగాడు సాంబయ్య. 

ముందుగానే చెప్పినట్టుగానే ప్రతిరోజు మధ్యాహ్నం పూట పోచయ్య పులి వేషం వెయ్యాలి. ఇది ఒప్పందం ఎప్పటిలాగే భోజనం అయింది అనిపించి వేషం వేసుకోవడం ప్రారంభించాడు. నిజానికి ఆశ్వీయుజ మాసం అంటే వర్షాకాలం కానీ ఇప్పుడు ఎండలు దంచేస్తున్నాయి. ఒక కళ్ళు ఒకటే మాత్రమే కనపడేలా ఒళ్లంతా ఆ పులి తొడుగు తొడుక్కుని కాళ్లకు చెప్పులు లేకుండా రెడీ అయ్యాడు పోచయ్య. 

డప్పులు వాళ్లు కూడా రాగా అగ్రహారంలో తిరుగుతూ ముందుగా ప్రదర్శన ప్రారంభించాడు పోచయ్య. వీధి పిల్లలు అందరు వెంట పడ్డారు. కొంతమంది మళ్లీ మళ్లీ చేయమని అడిగారు. కొంతమంది పదోపరకో చేతిలో పెట్టి ఆశీర్వదించారు. కానీ ఏం లాభం ఆ పక్కనే ఉన్న రంగయ్య డబ్బులు లాక్కుని జేబులో పెట్టుకున్నాడు. ప్రతి ఏటా ఇది మామూలే. అలా సాయంకాలo ఐదు గంటల వరకు అగ్రహారం అంతా తిరిగి ప్రదర్శన ఇచ్చి సత్రం దగ్గరకి వచ్చేటప్పటికి ఒళ్లంతా హూనం అయిపోయింది పోచయ్యకి. కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగే డెమో కాళ్లు మంటలు పుడుతున్నాయి. రంగయ్య మటుకు ఇవేమీ పట్టనట్టు వచ్చిన చదివింపులు లెక్కపెట్టుకుని పెట్లో పెట్టుకునీ తన సంచిలో ఉన్న డైరీలో ఏదో రాసుకుంటూ కనిపించాడు పోచయ్యకి. ఒకసారి బాధగా అనిపించింది .కష్ట పడేవాడు ఒకడు. అనుభవించేవాడు మరొకడు ఏమిటో అనుకున్నాడు పోచయ్య.

 అసలు రంగయ్య అవసరం లేకుండా సొంతంగా ఈ పగటివేషగాళ్ళు ప్రదర్శన ఇద్దామని అనుకుంటే దానికి సంబంధించిన దుస్తులు పరికరాలు అలంకరణ సామాగ్రి సొంతంగా కొనుక్కునే స్తోమత ఈ ఆటగాళ్లకు లేదు. దానికి తోడు మధ్యలో రంగయ్య దగ్గర అప్పులు కూడా తీసుకుంటూ ఉంటారు అవసరానికి. అందుకే రంగయ్య మీద ఆధారపడ్డారు.

పోచయ్య స్నానం చేసి అలా చాప మీద పడుకుని ఒక గ్లాసు మందు తాగి అన్నం తినకుండానే అలా నిద్రలోకి జారిపోయాడు. ఉదయం అన్నం సరిగా తినలేదు. అన్నం తింటే డాన్స్ చెయ్యలేడనే భయంతో. ఈ వేషాలు వేసిన రోజులలో భోజనo సరిగా తినలేరు ఈ పగటి వేషగాళ్ళు.

మరునాడు ఉదయం అర్ధనారీశ్వరుడు వేషంతో ప్రదర్శన ప్రారంభమైంది. నిజంగా శివపార్వతులు ఇద్దరు ఎలా ఉంటారో అలాగే అలంకరణ చేసుకొని ప్రతి వీధి తిరుగుతూ ప్రదర్శన ఇచ్చాడు ఆ వేషధారి రాజయ్య. రాజయ్య కి నాటక అనుభవం ఎక్కువ. ఇలాంటి పవిత్రమైన వేషాలు వేసిన రోజుల్లో మందు తాగడం మాంసం తినడం లాంటి పనులు చెయ్యడు రాజయ్య. అప్పటివరకు నెత్తి మాడ్చేసిన ఎండ మారిపోయి ఆకాశం ఒక్కసారిగా మబ్బు పట్టి చినుకులు రావడం ప్రారంభించడంతో వెరైటీగా గొడుగు వేసుకుని అర్ధనారీశ్వర వేషం ప్రారంభించాడు రాజయ్య. రాజయ్య సమయస్ఫూర్తికి యువత అంతా గోల గోల చేశారు. ఎప్పటిలాగే చదివింపులు రంగయ్య జేబులో పెట్టుకున్నాడు. కోనసీమలో ఉన్న గ్రామంలో పగటి వేషగాళ్ళు అంటే ఆదరణ ఎక్కువ.

మధ్యాహ్నం పులి వేషం వేసుకొన్న పోచయ్యని డప్పుల వాళ్ళనీ వెంట పెట్టుకుని రాజయ్య కుమ్మరి వీధి నుంచి ప్రదర్శన ప్రారంభించాడు. అలా ప్రదర్శన చేస్తుంటే పోచయ్యకి కాలు బెణికింది. అయినా ప్రదర్శన ఎక్కడ ఆపకుండా పులి కుంటుతూ డాన్స్ చేసినట్లుగా చేశాడు. 
ఆ రకమైన వెరైటీ డాన్స్ కి చప్పట్లు నవ్వులు తో ఆ వీధి అంతా మారుమోగిపోయింది. చదివింపులు కూడా బాగానే వచ్చాయి. చీకటి పడుతుండగా సత్రం చేరిన పోచయ్య స్నానం చేసి కాలికి బ్యాండేజ్ కట్టుకుని టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ. 

మూడోరోజు ముచ్చటగా రాముడు వేషం వేసుకొని విల్లు చేత్తో పట్టుకుని ఎడ్ల బండిమీద ఊరంతా తిరిగి మధ్యాహ్నానికి సత్రం చేరుకున్నాడు రాజయ్య. మధ్యలో రామాయణంలో పద్యాలు చదువుతూ చాలామంది నీ తన గొంతుతో ఆకర్షించాడు. నిజానికి రంగస్థలం మీద నాటకాలు వేసే రాజయ్య ఇలా ఒకటి వేషాలు వేయవలసి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నాటకానికి ఇప్పుడు ఆదరణ లేదు. రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ ఒక ప్రదర్శన ఇస్తే గొప్ప. అలాంటి పరిస్థితుల్లో దొరికిన వృత్తితో పొట్ట పోసుకుంటున్నాడు రాజయ్య.

అలా వరుసుగా కృష్ణుడి వేషం రావణాసుడు వేషం శక్తి వేషం అన్నిటికీ తనదైన శైలిలో న్యాయం చేకూర్చాడు రాజయ్య 
శక్తి వేషంలో ఉన్న రాజయ్య చూసి చాలామంది పిల్లలకి జ్వరాలు వచ్చేసాయి. పెద్దలు కూడా ఆ భయంకరమైన వేషం చూసి నిజానికి శక్తి ఇలాగే ఉండేదేమో అనుకున్నారు. పోచయ్య దినచర్యలో ఏ మార్పు లేదు. 

ఎప్పటిలాగే మిగిలిన రోజుల్లో కూడా పులి వేషం కట్టి డాన్సులు చేస్తూ సినిమా పాటలు కూడా డాన్సులు చేస్తూ అటు పెద్ద వాళ్ళని పిల్లల్ని యువతని ఆకట్టుకున్నాడు పోచయ్య. నిజానికి పోచయ్య కూడా రాజయ్య అంత నటుడే. కానీ పులి వేషo కట్టి డాన్స్ చేయడంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు పోచయ్య. అందుకనే రంగయ్య పులి వేషానికే పరిమితం చేశాడు పోచయ్యని. 

అలా ఆ ఊరిలో పది రోజులు ప్రదర్శనలు ఇచ్చి కమిటీ వాళ్ళ సొమ్ము తీసుకుని సాయంకాలానికి సత్రం చేరుకున్నారు. రంగయ్య తన బ్యాగ్ లోంచి సొమ్ము తీసి ఒప్పందం ప్రకారం ఎవరి కూలి వాళ్లకి చదివింపులు బాగానే వచ్చి ఉండాలి.మరి చదివింపులు మాట ఏమిటి అనుకున్నాడు పోచయ్య తనలో.ఇంతలో రంగయ్య ట్రంకు పెట్టి లోని డబ్బులు లెక్క పెట్టడం ప్రారంభించాడు. మొత్తం పదిహేను వేల రూపాయలు వచ్చేయి చదివింపులు. ఈ పుస్తకంలో ఎవరెవరికి ఎంతందో వచ్చిందో రాశాను. ఒకసారి చూసుకోండంటూ పుస్తకం ఎదురుగుండా పెట్టాడు. ఇది నిజానికి మీ ప్రదర్శనకి సంతోషించి ప్రేక్షకులు ఇచ్చిన బహుమానం. కాబట్టి ఇది మీ ముగ్గురు సమానంగా పంచుకోండి అన్నాడు రంగయ్య. మరి మీకు అని అడిగాడు పోచయ్య. నేను కష్టపడింది చాలా తక్కువ. కష్టమంతా మీదే . ప్రతిరోజు ఒళ్లంతా రంగులు పూసుకుని వేషాలు వేసేవారు. ఈ రసాయనపు రంగులు క్రమేపి మీ చర్మానికి హాని కలగజేస్తాయి. 

అయినప్పటికీ మీరు రిస్క్ తీసుకుని చేసేదిలేక బ్రతికే వేరే దారి లేక ఈ వృత్తిలో దిగారు. నేను ఒంటరి వాడిని. ఈ వేషాల్లో నా వేషం కాంట్రాక్టర్ వేషం .నా రోజు కూలి మీలాగే కమిటీ వాళ్ళు ఇచ్చారు. నాకు అంతకన్నా కావాల్సిందేముంది. కానీ నేను ఇలా చెప్తే ఎవరు నా మాట నమ్మరు. దానికి ఒక కారణం ఉంది. నా తండ్రి కూడా ఇలాగే మొదట్లో నాటకాలు వేసేవాడు నాటకాలు క్రమేపి తగ్గిపోవడంతో గంపెడు సంసారాన్ని మోయలేక చాలా బాధలు పడేవాడు. తర్వాత పగటి వేషగాడిగా మారిపోయి అయిన కాడికి బేరం కుదుర్చుకుని వేషాలు వేసేవాడు. అందులో నాటకాలలో ఉన్నప్పుడే తాగుడు అలవాటయింది. దానికి తోడు చర్మ రోగo. మొదలైంది. ఆయన బాధలుచూడలేకపోయేవాళ్ళం.
చివరికి తాగడానికి డబ్బులు లేక అడపాదడపా దొంగతనాలు కూడా చేసేవాడు. ఒకరోజు రైల్వే స్టేషన్లో పట్టుబడి పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల ఉండి ఒకరోజు ఆత్మహత్య చేసుకున్నాడు.

 నేను ఇంటికి పెద్ద పిల్లవాడిని. నా తర్వాత అందరూ తమ్ముళ్ళు. ఆయన బాధ చూసి నేను పెళ్లి చేసుకోకుండా నాన్న కూడా పులి వేషం కట్టడానికి వెళ్లేవాడిని. అక్కడున్న రకరకాల వేషాలు కట్టే వాళ్ళ బాధలు చూసి పెరిగినవాడిని. నాకా చదువులేదు. తెలుసున్న విద్య ఇది ఒకటే. అందుకే నాటకాలకు దుస్తులు గదలు కత్తులు ఇలాంటి సామగ్రి అంతా సినిమా షూటింగులకి అడపాదడపా నాటకాలకి పగటి వేషగాళ్ళకి అద్దెకిచ్చే షాపు ప్రారంభించి కుటుంబాన్ని పోషించాను. ఇప్పుడు తమ్ముళ్లందరూ చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు.అమ్మ చనిపోయారు. అయినా నేను పెళ్లి చేసుకోలేదు.
 నాకు వారసులు ఎవరూ లేరు అందుకే నాకు డబ్బు మీద ఆశ లేదు. కళ అంటే అభిమానం ఉంది. కళాకారుల సమస్యల గురించి నాకు తెలుసు అoటూ చెప్పుకొచ్చాడు రాజయ్య. రాజయ్య నీ తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఎంతగానో సిగ్గుపడ్డాడు పోచయ్య. ఒక కాంట్రాక్టర్ గా మటుకే రంగయ్య గురించి తెలుసు కానీ గుండెలో ఇంత బాధ ఉందని ఎవరికీ తెలీదు. తన వంటి వాళ్ళకి సహాయం చేస్తున్న రంగయ్యని ఏ విధంగా అభినందించాలో తెలియలేదు పోచయ్యకి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం