ప్రణాళిక

ప్రణాళిక

ఈ సమస్త జీవకోటిలో ఆలోచించే శక్తి, ఆలోచన ఆచరణలో పెట్టే శక్తి ఒక్క మనుషులకే ఉంది. ప్రతి ఒక్కరికి నిత్యజీవితంలో అనేక రకాలైన లక్ష్యాలు ఉంటాయి. చేయవలసిన పనులు ఉంటాయి. ఈ పనులను లేదా లక్ష్యాలను సాధించడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి అవసరం. ఆ పద్ధతిని ప్రణాళిక అంటారు. ఆంగ్ల భాషలో planning అంటారు. నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఏ పని మొదలుపెట్టిన అది సఫలీకృతం అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రణాళికంటే ఒక వ్యూహం. ఒక ఆలోచన. ఒక నిర్దిష్టమైన ఊహలతో కూడిన కొత్త మార్గం.

ఉదాహరణకి ఏదో విమాన ప్రయాణం చేయవలసి వస్తుంది మహానగరాల్లో ఉండేవాళ్లు ఆ విమానాశ్రయం చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది అని అనుకుందాం సాధారణంగా అయితే అక్కడున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ వలన ఇంకొక గంట ముందుగా బయలుదేరాలి. అంటే ప్రయాణ సమయం రెండు గంటలుగా ఊహించుకోవాలి . ఆ ఊహ ప్రణాళిక. ఒకవేళ ట్రాఫిక్ జాం వలన కొంచెం ఆలస్యం అయినప్పటికీ నిర్ణీత సమయానికి మనం అక్కడికి చేరుకోగలం.

 లేదంటే అనవసరమైన ఒత్తిడి కంగారు అనారోగ్యం కోపాలు తాపాలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం ఇవన్నీ జరిగిపోతాయి. ఇదంతా అనవసర రాద్ధాంతం. 

దూర ప్రాంతాల్లో ఉండే ఆఫీసులకు వెళ్లేవాళ్లు సరిగ్గా సమయానికి ఆఫీసుకు ఒక అరగంట ముందుగా ఆఫీసుకు చేరి స్థిమితబడి కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటే ఎంతో ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ముఖ్యంగా బ్యాంకులో పోస్ట్ ఆఫీస్ లు గవర్నమెంట్ ఆఫీసులు లాంటి వాటిలో పబ్లిక్ తో ఎక్కువగా సంబంధం ఉంటుంది. మనకోసం ఎదురు చూసేవాళ్ళు మనం రాగానే ఏదో ఒక సందేహం అడుగుతారు. మనంవిరుచుకుపడతాం. ఇది జరుగుతున్న విషయం. అక్కడి నుంచి ఆ సంస్థకి చెడ్డ పేరు ఆ ఉద్యోగి మీద కంప్లైంట్లు ఇవన్నీ అనవసరంగా కొనితెచ్చుకున్న చిక్కులు. దీనికి అంతటికి కారణం మనకి ప్రణాళిక లేకపోవడమే. ఒక అరగంట ముందు ఆఫీస్ కి వెళ్తే మన సొమ్మేం పోయింది. 

అలాగే మన నిజ జీవితంలో మన కుటుంబంలో ప్రణాళిక లేకుండా చేసే ఏ పనులైన జీవితం మీద చాలా దెబ్బకొడతాయి. ఏ వస్తువు పడితే ఆ వస్తువు బజారులో దొరుకుతుంది కదా అని కొని ఇంట్లో పెట్టడం అనవసరమైన ఆర్థిక భారం. అంటే డబ్బుని ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టుకోవాలి.  
ప్రణాళిక ప్రకారం అంటే వచ్చిన ఆదాయాన్ని మన బాధ్యతలు తీ ర్చడానికి ఖర్చుపెట్టి భవిష్యత్తు అవసరాలకి దాచుకోవడం. ఇది భవిష్యత్ కి ప్రణాళిక. ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు.  

ఎవరినైనా ఒక చెంప దెబ్బ కొడితే గాయం మాని పోతుంది. కానీ నోటి వెంట వచ్చిన మాట గుండెని బాధ పెడుతూనే ఉంటుంది. అందుకే ప్రతి మాట కూడా ఆచితూచి ప్రణాళిక బద్ధంగా మాట్లాడాలి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో తెలుసుకోవడం కూడా ఒక ప్రణాళిక. చనిపోయిన వ్యక్తి బంధువులను పలకరించడానికి వెళ్లి సినిమా గురించి మాట్లాడుతుంటే ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది. అలాగే వేదిక మీద మాట్లాడేటప్పుడు ఆ కార్యక్రమం గురించి నాలుగు విషయాలు చెప్పాలి తలా తోక లేని వాటి గురించి చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది. 

మనకి నిత్య జీవితంలో ముందుకి అడుగు వేస్తే ఒక ప్లానింగ్ ఉండాలి. లేదంటే అడుసులో కాలు వేయవలసి వస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న ఒక కథ ఒక ముసలివాడు మామిడి మొక్కను నాటుతున్న ప్పుడు దారిన పోయే రాజుగారు చూసి నవ్వి నీకు వయసు అయిపోయింది కదా నువ్వు మొక్క కాసిన కాయలను తింటావా అని అడిగినప్పుడు ఇది నా కోసం కాదు నా వారసులు కోసమని సమాధానం ఇస్తాడు. 
అంటే ఆ ముసలివాడికి ముందుచూపు ఎంత ఎక్కువో అర్థమైంది కదా. అంటే తన వారసుల కోసం వేసిన ప్రణాళిక.
ఎప్పుడు పడితే అప్పుడు ఆదరా బాదరాగా ఏదో ఒక పని చేయాలనుకోవడం ప్రణాళిక లేకపోవడమే. మనo ప్రతిరోజు చూస్తూ ఉంటాం చాలామంది రోడ్డుమీద స్కూటర్ను కానీ బండిని గాని నడిపించుకుంటూ వెళ్తుంటారు. ఇక్కడ దగ్గర్లో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉందా అని ఎంక్వయిరీ చేసుకుంటూ వెళుతుంటారు. అంటే బయలుదేరే సమయంలో వాహనంలో పెట్రోలు ఉందా లేదా సరిపోతుందా లేదా అని చూసుకోకపోవడం ప్రణాళిక లోపమే కదా! బాధపడేది ఆ వ్యక్తి. అంటే మనకి ప్రణాళిక లేకపోవడం మూలాన్ని మనమే బాధపడుతున్నాము.

చాలామందినీ మనం చూస్తుంటాం పదవీ విరమణ సమయం వచ్చినప్పటికీ పిల్లలకి పెళ్లిళ్ల ఒక జీవితంలో స్థిరపడక చాలా బాధలు పడుతూ ఉంటారు. జీవితం మొదలుపెట్టినప్పటినుంచి పిల్లలు తొందరగా పుడితే మన పదవి విరమణ సమయానికి పిల్లల బాధ్యతలు అన్ని తీరిపోతాయి. లేదంటే ఆ పిల్లలకి పెళ్లిళ్లు చేసే ఓపిక తల్లిదండ్రులకి ఉండదు. 

సరే పిల్లలు పుట్టారు . ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్లని ఒక ఇంటి వాళ్ళని చేయడం మన బాధ్యత. 
దానికి ఆర్థికంగా మనం స్థిరపడడం అవసరం. అందుకోసం ఆర్థిక ప్రణాళికలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక లక్ష్యం అమ్మాయి పెళ్లి అనుకుందాం. దానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక అంటే పొదుపు తప్పనిసరిగా పాటించాలి. అంటే ఇక్కడ లక్ష్యమునకు ప్రణాళికకు రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. జీవితంలో ఎదగాలంటే లక్ష్యం ఉండాలి. లక్ష్యం సాధించాలంటే ప్రణాళిక ఉండాలి. ఆర్థిక ప్రణాళిక ముఖ్యంగా కావలసింది మన జీవనశైలి. ఆదాయానికి తగినట్టుగా తమ జీవన శైలి మార్చుకోకపోతే ఉపయోగం లేదు. ప్రపంచాన్ని చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. 

ప్రణాళిక అంటే కోరిక కాదు. జీవితంలో ఏదో ఉద్యోగంలో స్థిరపడి పై స్థాయికి ఎదగడానికి ప్రతి వారికి ప్రణాళిక ఉండాలి. దానికి అనుగుణంగా మనం నిత్య జీవితాన్ని మార్చుకోవాలి. అనుకున్న లక్ష్యం సాధించాలంటే కొంచెం త్యాగం అవసరం. అది ఏ రకమైన త్యాగమైనా సరే. కుంటి సాకులు చెప్పి సానుభూతి సంపాదించడం కాదు.

అలాగే ప్రతి ఒక్కరు సొంతిల్లు కోసం కలలు కంటారు. దానికోసం ఎన్నో ఆర్థికపరమైన త్యాగాలు చేస్తుంటారు. కోరికలను చంపుకుంటూ ఉంటారు. బాగుంది. అయినప్పటికీ మన లక్ష్యం నెరవేరాలంటే ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల మీద ఆధారపడతాం. 
ఇది చిన్న వయసులోనే అంటే ముప్పై ఐదు సంవత్సరములు వచ్చేసరికి ఆ లక్ష్యం నెరవేర్చుకుంటే మన పదవీ విరమణ సమయానికి ఆ రుణ బాధ్యతలు అన్నీ తీరిపోతాయి. సొంత డబ్బు ఉంటే గొడవ లేదు నేను చెప్పేది బ్యాంకుల మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు మాత్రమే.

మన ప్రభుత్వాలకి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు నెరవేర్చడానికి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించారు. దానిని అమలు చేయడానికి ఒక వ్యవస్థ కూడా ఉంది. అలాగే ప్రతి కుటుంబంలో భార్య భర్త తన కుటుంబం కోసం లక్ష్యాలు, లక్ష్యాలు సాధించడానికి ప్రణాళిక వేసుకుంటూ ముందుకు ముందుకు సాగుతూ విజయాలను సాధిస్తారు.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ ,9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం