చినుకు రాలాలి

చినుకు రాలాలి

" బయట అంత ఎండ గట్టిగా కాస్తుంటే వర్షాలు పడతాయని చెప్తున్నారు ఏంటండీ అంటూ అడిగింది ఒక భార్య ఒక భర్తని టీవీలో వార్తలు చూస్తూ! 

వేసవికాలంలో వర్షాలు ఏమిటి? కలికాలం కాకపోతే ను. మా చిన్నతనాల్లో గాలి దుమ్ములు వచ్చేవి. పెద్దగా గాలి వచ్చి తోటల్లో ఉండే మామిడికాయ లు రాలిపోయేవి. పిల్లలందరం తోటల్లోకి పరిగెత్తుకుని వెళ్లి చెట్టు కింద పడిన మామిడికాయలు ఏరుకుని తట్టలో పెట్టుకుని పట్టుకొచ్చే వాళ్ళo. అదొక వింత అనుభూతి. మర్నాడు ఎండ చాలా దారుణంగా ఉండేది అంటూ ఒక ముసలాయన తన అనుభవాల పరంపరలోకి వెళ్లిపోయాడు.

టీవీ వాళ్ళు వార్తలు ఏమీ ఆధారాలు లేకుండా చెప్పరు. వాతావరణ పరిశోధన శాఖ వాళ్లకి ఇచ్చిన సమాచారం ఆధారంగా చెబుతారు. చూస్తూ ఉండండి కాసేపట్లో వర్షం పడుతుంది అన్నాడు ఇంటి యజమాని. 

ఊరుకోండి ఊరగాయలు కూడా ఎండలో పెట్టాను. అలా చెబుతారు ఏమిటి ? అంటూ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది ఒక ఇల్లాలు.

అప్పటికి ఉదయం తొమ్మిది గంటలు అయింది. పిల్లలు స్కూల్ కి పెద్దల ఆఫీసులకి తయారవుతున్నారు. సడనుగా వాతావరణ శాఖ చెప్పినట్లుగా నీలిరంగు ఆకాశం ముఖం మార్చుకుని నల్లగా తయారైపోయింది. ఆకాశంలో నుంచి మంచు ముక్కలు ఊడి పడినట్లు పెద్ద పెద్ద చినుకులతో నగరం అంతా తలంటు పోసేసింది ఆ అకాల వర్షం. దానికి తోడు వాయుదేవుడు విజృంభించి అందంగా పెంచుకున్న తరువుల బాహులను నిర్దాక్షిణ్యంగా విరిచేశాడు .

నడిచే రహదారులను ప్రతిరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లు ఎంత శుభ్రం చేసినప్పటికీ ఎప్పుడూ మురికితో ఉండే రోడ్లు మురికి వదిలిన కేశములగా నిగనిగలాడుతూ కనిపించేయి.

 దుమ్ము కొట్టుకుపోయిన రహదారి పక్క ఉండే చెట్లు ఆకులు అసలు రంగు బయటపడింది. ఆరోజు ప్రకృతి అందం వెలుగులోకి వచ్చింది. 
ఆకాశాన్నంటే భవనాలు మీద నుండి జారిపడ్డ వర్షపు నీరు రంగు మార్చుకుంది. రహదారి పక్కనున్న భవనాలన్నీ మెరిసిపోతూ కనబడ్డాయి. 

చూరు లోంచి జారి పడుతున్న వర్షపు నీరు చంటి దాని పడవకి గోదావరి అయింది. చుక్కాని లేని పడవ పండు పాప కేరింతలకు కారణం అయింది . పాత కాగితాలన్నీ తీసుకొచ్చి నానమ్మకి ఇచ్చి నానమ్మకి పని చెప్పింది పండు పాప.
బీటలు వారిన పుడమి తల్లి గుండె చల్లబడి రైతు బాధ్యత గుర్తుచేసింది. గువ్వ గూడు వదలకుండా బిడ్డల మధ్య ముడుచుకుని కూర్చుంది. 

ఆకాశం వైపు చూసి కొయ్యకు తగిలించిన కోటు దుమ్ము దులిపి నౌకరీ కి బయలుదేరిన సర్కారు ఉద్యోగిని ఒక రోజుకి వర్షం దొరబాబుని చేసింది. 

చినుకు పేరు చెప్పి బడికి డుమ్మా కొట్టించి బుజ్జిగాడు మొహంలో వెలుగు తెప్పించింది అకాల వర్షం. పూరిపాక నడికొప్పులోంచి జారిపడ్డ వర్షపు చుక్క పేదవాడి గుండెను చెరువు చేసింది. మూడు రోజులుగా పొయ్యిలో పడుకున్న నల్ల పిల్లిని డొక్క ఎండిన చంటి పిల్లను చూసి పేదరాలు ఆకాశం వైపు కోపంగా చూసింది. సవారీ లేక ఓ బక్క జీవిని మూడు రోజులుగా మూడు కాళ్ల బండిలో ముడుచుకుని కూర్చునేలా చేసింది అకాల వర్షం.

వేసవిలో దొరికే అపురూపమైన ఫలం గాలి దేవుడు దెబ్బకి నేలకొరిగి దిష్టి చుక్క పెట్టుకుని బేరగాళ్ల కోసం ఆశగా ఎదురు చూసాయి. రైతు కాళ్లలో దుమ్ము కొట్టిన వాయుదేవుడు వరుణ దేవుడు మళ్లీ కనిపించిన దేవుళ్ళు అయిపోయారు. తట్టలోని మాలు తరగక రైతన్న సర్కారు వారి చెత్తకుండీ కి దారి వెతికాడు. గూడులో ఉండే బుడతడకి, గుమ్మం దగ్గర ఎదురు చూసే షావుకారికి, ఆశగా చూసే ఇల్లాలికి సమాధానం చెప్పలేక కళ్ళ నుండి కుంభవృష్టి కురిపించాడు రైతన్న. 
నగరంలో రహదారి మీద పడ్డ వర్షం ఎటు వెళ్ళాలో దిక్కు తెలియక అలా శిలలా నిలిచి పోయింది. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. వర్షం వస్తే నగరం జల సాగరంగా మారుతుందని తెలుసును కాబట్టి ప్రభుత్వం సెలవులో ఉన్నప్పటికీ పోలీసు ,మున్సిపాలిటీ శాఖ ని పరుగులు పెట్టించింది. కుండపోత వర్షంలో, హోరుగాలిలో నగరాన్ని మామూలు స్థితికి తీసుకురావడానికి తెల్లవారిపోయింది పాపం ఆ డిపార్ట్మెంట్ వారికి.

రాత్రి మంత్రి గారు నగరం అంతా ప్రశాంతంగా ఉందని వర్షపు నీరు వలన ఎవరికి ఏమీ ఇబ్బంది లేదని ప్రభుత్వం ప్రజలకు సహాయకారిగా ఉంటుందని ఉపన్యాసం చెప్పి ఊపిరి 
 పీల్చుకున్నారు.

కానీ ఆ రోజు రాత్రి ఎన్ని కుటుంబాల పస్తులు ఉన్నాయో, కంటిమీద కునుకు లేకుండా గడిపాయో, జలపాతంగా మారిన నగరంలో మూగజీవులు ఎన్ని కొట్టుకుపోయాయో, ప్రమాదవశాత్తు ఎంత మంది మరణించారో ఎవరికి తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఎవరు నగరంలో ఉంటున్నారు కానీ ప్రభుత్వానికి తెలియదు. ప్రభుత్వ లెక్కల్లో వీరు లేరు.  

అయినా వర్షం లేకపోతే ఎలాగా! అకాల వర్షం వద్దు. అయినా మేఘం గర్జించి చినుకురాల్చి పుడమి తల్లి పురుడు పోసుకోవడానికి సహాయం చేయకపోతే జీవకోటి బ్రతుకు ఎడారే.గమనం శూన్యం .గమ్యం ప్రశ్నార్థకం. అందుకే చినుకు రావాలి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట