నాటకం


ఉదయం పది గంటలు అయింది. అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రామరాజుకి ఎవరో ఇద్దరు మధ్య వయస్కులు స్కూటర్ మీద వచ్చి, "నాటకాలు వేసే రామరాజు గారి ఇల్లు ఇదేనా?" అని అడిగారు. "అవునండి, మీరు?" అంటూ కుర్చీ నుంచే లేచి, "నేనే రామరాజు"ని అని పరిచయం చేసుకొని, అరుగు మీదనున్న తాటాకుల చాప చూపించి, "కూర్చోండి బాబు," అని ఆహ్వానించాడు రామరాజు.

"మేము సఖినేటిపల్లి నుంచి వస్తున్నాం. మా ఊరిఅమ్మవారి సంబరాలకి శ్రీకృష్ణ రాయబారం నాటకం వేయించుదామని, దానికోసం మిమ్మల్ని కలవడానికి వచ్చాం," అన్నారు వాళ్లు.


"ఏంటి బాబు, మీరు చెప్పేది నిజమేనా? నేను కలగంటున్నట్టు లేదు కదా?" అంటూ రామరాజు, "ఈ రోజుల్లో నాటకాలు ఎవరు చూస్తారు అండి? మీరు ఏదో పరాచకాలు ఆడుతున్నారు నాతో," అన్నాడు.

"లేదండి, మా ఊరిలో ఉన్న మీ పాత తరం వాళ్ల కోరిక ప్రకారం ఈ నాటకం వేయించాలనుకుంటున్నాం. నవతరానికి కూడా ఆ పాత ఆణిముత్యాలాంటి నాటకాలు అంటే అభిమానం పెరిగేలా చేయాలని సంకల్పించాం. ఇంకా నెలరోజుల టైం ఉంది. ఈ లోగా మీరు రిహార్సల్స్, డ్రెస్సులు చూసుకోవాలిగా. అందుకే ముందుగా చెబుతున్నాం. అడ్వాన్స్ ఇచ్చి వెళదామని వచ్చాం," అన్నారు యువకులు.


వారి మాటలకి రామరాజు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. "ఎన్నాళ్లు అయ్యింది ఇలాంటి మాట విని! అప్పుడెప్పుడో... సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఏ ఉత్సవాలనికైనా ముందు ఇలాంటి మాటలే వినబడేవి. అసలు ఎవ్వరూ గుమ్మం తొక్కిన పాపానిపోలేదు. నాటకం అనే పేరు వినలేదు. అందులో పౌరాణిక నాటకం! ఏమిటి! మళ్లీ కాలం తిరుగుతోందా!" అనుకుంటూ, ఆనందపడుతూ, "బాబు, మీ అడ్రస్ ఇచ్చి వెళండి. అడ్వాన్స్ వద్దు. మీకు ఏ విషయం ఒక వారం రోజుల్లో చెబుతాను. ఎందుకంటే ఇది పదిమందితో పని," అంటూ చెప్పి ఆలోచనలో మునిగిపోయాడు రామరాజు.


ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోకుండా వెనక్కు పంపించడం ఇదే మొదటిసారి. ఎందుకంటే రామరాజుకు ఆ ధైర్యం లేదు. ఒకప్పుడు ఆ ఊరినిండా నాటక సమాజాలే. ప్రతి ఇల్లు కళాకారుల నిలయమే. కొంతమంది రంగు పూసుకుని రంగస్థలంపై నటించేవారు; మరి కొంతమంది పాడిన పద్యాలకు వాయిద్య సహకారం అందించేవారు.


ఆ కాలంలో వాడే ఆయుధాలు, గదలు, బాణాలు, కత్తులు, ధరించే దుస్తులు ఇలా ఎన్నో రకాల నాటక సామాగ్రి అద్దెకిచ్చేవాళ్లు ఊరంతా ఉండేవారు. రామరాజు తండ్రి, తాతల కాలం నుంచి నాటకం మీద ఆధారపడి జీవించిన వాళ్లు. చిన్నప్పటినుంచి తండ్రి వేసే పాత్రలు, రంగులు, దుస్తులు చూసి మోజుపడి డిగ్రీ మధ్యలో ఆపేసి వారసత్వాన్ని కాపాడాడు రామరాజు.


ఆరడుగుల భారీ శరీరం, అందమైన గిరజాల జుట్టు, శ్రావ్యమైన గొంతు, కొద్దిగా నేర్చుకున్న సంగీతం, స్పష్టంగా పలకగలిగే సంభాషణ శక్తి—అన్నిటికన్నా మించి కళాపై ఆసక్తి—ఇవి అన్నీ కలసి కళామతల్లి రామరాజుని తన ఒడిలోనే ఉంచేసింది.


అప్పట్లో నాటకాలు అంటే ప్రేక్షకులు గంటల తరబడి కూర్చుని చూస్తూ రాత్రంతా తెల్లవారేలా అయ్యేవారు. పద్యాలకు “వన్స్ మోర్!” అనేటప్పుడు గళం మారిపోయేదే. రాముడిగా, కృష్ణుడిగా, హరిశ్చంద్రుడిగా, దుర్యోధనుడిగా ఎన్నెన్ని పాత్రల్లో జీవించాడు! ఒక మూల గదిలో పద్యాలు వినిపించేవి. పెద్ద సంభాషణలు గదినిండా మారుమ్రోగించేవి. ఎక్కడ పడితే అక్కడ దుస్తులు, నాటక సామాగ్రి.


ఆ గది ఇప్పుడు మూగ పోయింది. గోడల మీద పాత ఫోటోలు వ్రేలాడుతున్నాయి. బీరువాలో పతకాలు, బహుమతులు దుమ్ము కూసుకున్నాయి. ఆ డొక్కా సీతమ్మ వారసురాలు కూడా కనుమరుగైంది. రాత్రి పొయ్యి వెలిగించి తేనీరు పెట్టే సతీమణి కూడా రాలేదు.


తండ్రి కామరాజు ఏడాదికి 300 రోజులు నాటకాలు ఆడి, ఐదు ఎకరాలు సంపాదించి, సమాజ సభ్యులందరినీ బిడ్డల్లా చూసి, చివరికి నాటకాన్ని ఎవ్వరూ ఆదరించక పోయేసరికి, తన సంపదంతా ఖర్చుచేసి, ఇల్లు మాత్రమే మిగిలింది. రామరాజుకు గుర్తొచ్చింది—రెండు ఎద్దుల బండిలో నాటక సామాను తీసుకుని ఊళ్ళోకి వెళుతుంటే “నాటకవాళ్లు వచ్చారు” అంటూ ఊరు మొత్తం పలకరిస్తుండేది.


ఆ గౌరవం గుర్తొచ్చి మళ్ళీ కళకోసం వెళ్ళాడు. కానీ, నటులెవరూ మిగిలి లేరు. అర్జునుడిగా నటించిన వీరన్న ఇల్లు ఖాళీ. ధర్మరాజు పాత్రధారి కమర్షియల్ కిళ్ళి కొట్టు పెట్టాడు. భీమరాజు హోటల్ పెట్టాడు. దుర్యోధనుడు ఉద్యోగంలో చేరాడు. వాయిద్యకారులు టీవీ రంగంలోకి వెళ్ళారు. చివరకు రామరాజు ఒక్కడే మిగిలాడు.


అంతా గుర్తు చేసుకుంటూ, రంగస్థల నటుడు అనగానే ఓ వరంలా భావించి, భగవంతుని వరంగా ఆ కళని భావించాడు. అయినా ఇన్ని కష్టాల మధ్య నటులం జీవించలేరు. ఆదరించేవారుండాలి. అప్పటిలా కళాభిమానుల సంఘాలు ఉండాలి.


ఇలా మూడు రోజులు గడిచాయి. ఒక రోజు ఉదయం తలుపు కొట్టిన శబ్దం. తలుపు తీస్తే—ఆ నాటకంలోని నటులు, శ్రీకృష్ణ రాయబారంలో ఉన్న పాత్రధారులంతా—ఒక్కరిద్దరిని తప్పించి—అక్కడే! ఒకసారి కళ్లలో నీళ్లు వచ్చి, “ఏమిటి ఈ మార్పు?” అని అడిగాడు.

"మాకు తిండి కూడా దొరకని రోజులలో మిమ్మల్ని మర్చిపోలేకపోయాం. మీ మాటలు, ఆదరణ మాకు బలం ఇచ్చాయి" అంటూ చెప్పారు.

"నటన భగవంతుడు ఇచ్చిన వరం. నిజ జీవితంలో ఎన్ని కష్టాలున్నా, పాత్రలో జీవించి ప్రేక్షకులని మెప్పించగలగడం గొప్పతనం. తల్లికి ఆస్తి లేకపోయినా వదలమా? రంగస్థలాన్ని మేము వదలమూ!" అని చెప్పడంతో, రామరాజు ఆనందంతో ఊరికి కబురు పంపించాడు.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట