పార్వతమ్మ
పార్వతమ్మ.
రాత్రి ఎనిమిది గంటలు అయింది.
ఇంకా ఈ పిల్ల ఇంటికి రాలేదేమిటి ఒకసారి కోడలు రేవతినీ అడిగి చూద్దాం. ఏమైనా ఫోన్ చేసిందేమో అంటూ వంటిల్లు వేపు తొంగు చూసి "అమ్మా రేవతి పద్మ ఇంకా ఇంటికి రాలేదా ఏంటి చీకటి పడిపోయింది అని అడిగింది. రోజు ఇలాగే వస్తుంది
అంటూ సమాధానం చెప్పింది కోడలు రేవతి. వయసు వచ్చిన పిల్ల ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏమిటి తల్లి కూడా ఏమీ చెప్పటం లేదు ఏమిటో ఈ పిల్లలు, బయట భయాలుగా ఉన్నాయి అంటూ గట్టిగా అరిచింది రేవతి అత్తగారు పార్వతమ్మ.
భయపడవలసిన పని లేదండి అత్తయ్య గారు ఈ సిటీలో ఇలాగే ఉంటారు ఆడపిల్లని కంగారు పడక్కర్లేదు ఇవి ఆ రోజులు కాదు . అంటూ ధైర్యంగా సమాధానం చెప్పింది రేవతి.
ఏమిటో నాకైతే చాలా భయంగా ఉంది. మా పిల్లల చిన్నప్పుడు మగ పిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే చీకటి పడే వాళ్ళకి ఇంటికి రాకపోతే మీ మామగారు ఊరుకునేవారు కాదు. ఇప్పుడు అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటున్నారు గానీ అప్పుడు చిందులు తొక్కేవారు అంటూ చెప్పుకుంటూ వచ్చింది పార్వతమ్మ.
పార్వతమ్మ రఘురామయ్యల ఆరుగురు సంతానంలో పెద్దవాడు రామరాజు. రామరాజు హైదరాబాదులో ఒక జాతీయ బ్యాంకులో రీజనల్ మేనేజర్ గా పని చేస్తుంటాడు. రఘురామయ్య టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యి పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి వయసు మీద పడుతుండడంతో మూట ముల్లె సర్దుకుని పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి ఆరు నెలలు అయింది. రామరాజుకి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు ప్రవీణ్ ఎంటెక్ చదువుతున్నాడు. పిల్ల పద్మ బీటెక్ చదువులో ఉంది. పార్వతమ్మ ఇక్కడికి వచ్చిన దగ్గర్నుంచి ఇక్కడున్న పరిస్థితులకి ఆవిడకి ఏ నచ్చటం లేదు. ముఖ్యంగా మనవరాలి కట్టుబొట్టు చాలా తేడాగా ఉన్నట్లుగా అనిపించింది. దానికి తోడు మనవడు ప్రవీణ్ ఎప్పుడు ఈ లోకంలో ఉన్నట్టు ఉండడు. ఆ మొబైల్ పట్టుకుని కూర్చుంటాడు. ఏమిటో పిల్లల పరిస్థితి ఏం అర్థం కాలేదు పార్వతమ్మకి.
పార్వతమ్మ మంచి చెడు ఏనా చెప్ప పోతే కోడలు రేవతి పిల్లల్ని సపోర్ట్ చేయడం సాధ్యమైనంత వరకు పిల్లల్ని పార్వతమ్మ కంటపడకుండా చేయడం లాంటి పనులు అసలు నచ్చలేదు పార్వతమ్మకి.
దానికి తోడు కోడలు ఎనిమిది గంటలకు కానీ లేవకపోవడం లేచిన వెంటనే మొహం కడుక్కుని స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లడం పది గంటలకు కానీ పనిమనిషి రాకపోవడం అంతవరకు ఇల్లు ఊడ్చుకోకుండా ఉంచుకోవడం అంతా సాంప్రదాయానికి విరుద్ధంగా ఉండడంతో మనసులో బాధపడుతూ ఉండేది.
పైగా పడక గది కూడా సర్దుకోవడం నేర్పలేదు పిల్లలకి అని అనుకునేది. ఏ గదిలో చూసినా ఒక్క మంచం మీద పక్క తిన్నగా ఉండదు. చివరికి రామరాజు పడుకునే గదిలో కూడా.
పైగా ఇల్లంతా బూజులు. పండగలకి అబ్బాయిలకి కూడా శుభ్రం చేసుకోవడం లేదు. అది అనారోగ్యం కదా. ఇంట్లో పూజ పునస్కారం కూడా లేదు . దేవుడు గూడు చూస్తే బాధ వేస్తోంది. ఎప్పుడో లేవడం ఏదో వండుకోవడం ఏదో తినడం ఒక పద్ధతి ఒక పాడు ఏమి లేదు. ఇంట్లో అన్నీ ఖరీదైన వస్తువులే. దుమ్ము కొట్టుకుపోయి ఉంటున్నాయి.ఏదైనా మాట్లాడితే కోడలు దగ్గర అన్నిటికి సమాధానం ఉండేది. రామరాజు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళిపోయి రాత్రి పది గంటలకు కానీ ఇల్లు చేరడు. పిల్లలు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు కూడా రామరాజుకు తెలియదు. ఇంకా పిల్లలకి సాంప్రదాయ రుచులేమీ అలవాటు చేయలేదు పైగా వారానికి మూడు రోజులు జొమాటో ఆర్డర్లే .
కొడుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలియదు కానీ కోడలు మటుకు పొదుపుగా సంసారాన్ని చేస్తున్న వాతావరణం కనబడలేదు పార్వతమ్మకి. ఈ తిండి తిన్న పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఏమిటో ! చూస్తూ ఊరుకోలేక ఇది మన సాంప్రదాయం కాదని పద్ధతి మార్చుకోమని కోడలు రేవతికి చెప్పింది పార్వతమ్మ.
దానికి రఘురామయ్య గారు చూడు పార్వతి ఇది మన కాలం కాదు.కాలం మారిపోయింది. మారే కాలంతోపాటు పోటీగా పిల్లల్ని పెంచుతున్నారు ఈ తరం వాళ్లు అందుచేత అది తప్ప ఏమీ లేదు అంటూ కోడల్ని వెనకేసుకు రావడం పార్వతమ్మకి ఏమాత్రం నచ్చలేదు.
ఆ రాత్రి పడకగదిలో రఘురామయ్య తోటి పార్వతి ఇలా చెప్పింది నేను రేపు మన ఊరు వెళ్ళిపోతాను అండి. నేను ఎందుకో ఇక్కడ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. ఇక్కడ పద్ధతి నాకు నచ్చట్లేదు. చెబితే వినే వాళ్ళు ఎవరూ లేరు. పైగా మీరు కూడా కోడల్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు అంది.
దానికి రఘురామయ్య నవ్వి చూడు పార్వతి నాకు ఇక్కడ పద్ధతి నచ్చట్లేదు. నేను కూడా మౌనంగా అన్ని చూస్తూ ఊరుకుంటున్నాను. కారణం కాలం గడుపుకోవడం కోసం. మన వయసులో ఉన్న వాళ్ళు ఏదైనా చెప్తే ఈ కాలం వాళ్లకి నచ్చదు. మీవి ఈ కాలానికి సరిపడే మాటలు కాదంటారు. కాలం మీద తప్పు నెట్టేస్తున్నారు. మనo చెప్పే మాటలు పట్టించుకోరు. ప్రతి మాట ఎంతో అనుభవపూర్వకంగా చెప్పిన మాటనీ వాళ్లకు తెలియదు. అన్నిటికన్నా అనుభవం ఎంతో గొప్పది. చేసే పని వలన జరిగే మంచి చెడు లాభం నష్టం అనుభవం వలనే తెలుస్తుంది.
జీవితంలో అన్ని రకాల దశలోనూ ఎన్నో కష్టనష్టాలు చవిచూసి చెప్పిన మాటలు తేలికగా తీసిపారేస్తున్నారు. నిప్పు దగ్గరకు వెళ్ళవద్దు అని చెప్పినన్ని రోజులు వాళ్లు వినరు. ఒకసారి చేతులు కాలిన తర్వాత అది నిప్పు అనేది వాళ్ళకి తెలుస్తుంది . మన బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇంకా మనం బాధ్యతలు నెత్తిమీద వేసుకుని ముందుకు సాగడం అనేది మంచి పని కాదు. ఆ పిల్లల బాధ్యత ఇంటి బాధ్యత చూసుకునేందుకు కొడుకు కోడలు ఉన్నారు. మన జోక్యం అనవసరం. ఏదైనా సలహా అడిగితే తప్పకుండా చెప్పాలి.
వృద్ధాప్యం అన్నిటికన్నా భయంకరమైన దశ . శరీరం మీద రోగాలు దాడి చేస్తుంటా యి. ఒంట్లో శక్తి సన్నగిల్లు తుంది. మన బాధలు సంతోషం పంచుకోవడానికి ఎవరు కనపడరు. అందరూ ఉదయం లేస్తే పరుగుల పందెంలో పాల్గొనే వాళ్లే. వయసు మీరిన వాళ్ళందర్నీ ఒక రకమైన పేరుతో పిలుస్తున్నారట ఈ మధ్యన. ఆ మాట కూడా నా చెవిన పడింది. జరుగుతున్న తప్పులు అన్నిటిని నేను కూడా చూస్తున్నాను. కానీ మౌనంగా ఉంటున్నాను. తప్పును తప్పుగా చూపిస్తే రోజు గొడవలే. బ్రతికినన్నాళ్లు ఎవరిని ఏ మాట అనకుండా కాలక్షేపం చేయడమే మంచిది. ఆవేశాలు పెంచుకుని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు అని చెప్పిన భర్త మాటల్లో నిజాన్ని గ్రహించిన పార్వతమ్మ చూస్తూ ఊరుకోలేకపోతున్నానండి అంటూ చెప్పిన పార్వతమ్మ వైపు జాలిగా చూసాడు రఘురామయ్య.
ఇది ఒక కుటుంబంలోని వృద్ధుల కథ కాదు. సమాజంలోని చాలామంది వృద్ధుల వ్యధ . ఒక రకమైన జీవన విధానాన్ని అలవాటు పడిన ఆనాటి తరం సమాజంలో జరుగుతున్న మార్పులను చూసి తట్టుకోలేకపోతోంది. ఎందుకు అంటే అందులో ఉన్న లోటుపాట్లు అన్ని తెలుసును కాబట్టి. చూస్తూ ఊరుకోలేక ఏదో ఒక సలహా చెబితే గౌరవo నిలబడడం లేదు. అటు తప్పు జరుగుతుంటే సరిదిద్దలేక తప్పు అని చెప్పలేక సతమతమవుతున్నారు. కుటుంబంలో ఉండే పెద్దలు చెప్పే మాట వింటే కుటుంబాలు చక్కగా సాగుతాయి. పిల్లలు చక్కగా పెరుగుతారు. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి