బుట్ట భోజనం
బుట్ట భోజనo
ఆ నగరానికి పనిమీద వచ్చిన వాళ్ళు ఎవరు ఆ భోజనశాలలో అడుగుపెట్టకుండా ఉండరు. ఆ ఆతిథ్యం స్వీకరించకుండా ఉండరు. కొసరి కొసరి వడ్డించే ఆ అమృతాన్ని తిని సంతృప్తిగా మెట్లు దిగుతారు. పుచ్చుకున్న దానికి రెండు రెట్లు ఎక్కువగానే పెట్టాడు అనుకుని ఆశీర్వదించి వెళ్తారు. సుమారు యాభై సంవత్సరాల నుంచి అందరి అధరాలకు అమృతాన్ని పంచి ఇచ్చిన ఆ భోజనశాల ఏమై ఉంటుందో ఊహించండి? ఆ నగరం పేరు చెప్పుకోండి చూద్దాం. ఒక చిన్న హింట్ ఇస్తాను. దాని పేరు బుట్ట భోజనం. అమ్మ చేతి వంటలా మురిపిస్తుంది. విందు భోజనాన్ని మరిపిస్తుంది. బుట్టలో ఒదిగి మీ ముంగిట వాలుతుంది. ఆ వీధి పేరు ఒక ప్రముఖ నటుడిది. ఆ భోజనశాల పేరు ప్రపంచానికి మార్గదర్శకమైన గీతను బోధించినవారి పేరు.
ఈ బుట్ట భోజనం కాకినాడ మహానగరంలోని సుబ్బయ్య గారి హోటలు వారి ట్రేడ్ మార్క్..సుమారు 50 సంవత్సరాల క్రితం విద్యార్థులకి క్యారేజీలతో భోజనం సరఫరా చేసే ఒక చిన్న భోజనశాలగా నగరంలో అడుగుపెట్టి ఈనాడు రాష్ట్రంలోనూ పొరుగు రాష్ట్రంలోను శాఖలు పెట్టి ప్రజాదరణ చూరగొన్న సుబ్బయ్య గారు హోటల్ రుచికి మహారాజు, ఆతిథ్యానికి పెట్టింది పేరు.
కాకినాడ మహానగరానికి వన్నెతెచ్చిన భోజన శాల. రామారావు పేట లోని శ్రీకృష్ణ విలాస్ అంటే ఎవరికి తెలియదు సుబ్బయ్య గారి హోటల్ అంటేనే తెలుస్తుంది.
ఆ యజమాని శ్రీ సుబ్బయ్య గారు ఏ ముహూర్తంలో మొదలు పెట్టారో తెలియదు గాని ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకే రకమైన రుచితో ప్రజలని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు .ఆనాడు క్యారేజీలలో భోజనం తిన్న ఆ తరం వాళ్లు ఈనాటి కూడా భోజనం రుచి చూసి తృప్తిగా తల ఊపుతున్నారు. అందులో అసలు సిసలైన ఆంధ్రుల భోజనం. పచ్చటి అరిటాకు వేసిఆప్యాయతతో వడ్డించే భోజనం. అదే వారి ట్రేడ్ మార్క్. ఒకసారి ఒక పట్టు పడదా o పదండి.
ఆ శ్రీకృష్ణ విలాస్ లోకి అడుగుపెట్టగానే పైనుండి చల్లని గాలి
కంటికి అందంగా కనిపించే పచ్చటి అరిటాకు నిండా నోరూరించే ఆహార పదార్థాలు. కడుపులో ఆత్మా రాముడు గోల. పప్పు కలుపుకోండి నెయ్యి వేస్తాను అంటూ ఆత్మీయమైన పిలుపు.
ఎర్రగా వేగిన కందిపప్పులో ముక్కలైన టమాటా జీవితం వెరసి మనకి టమాటా పప్పు. దానికి దోసె డు నెయ్యి జోడించి బాగా కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంకేముంది. ఐదు నిమిషాల్లో పప్పు అన్నం అయిపోయింది.
నేను ఎంత ఎదిగినా నా జీవితం కూరలో ముక్కగానే ముగుస్తుంది. అయినా నేను మీకు ఎంతో మేలు చేస్తాను. నాకు తోడుగా జీడిపప్పు కూడా ఉంది అంటూ ములక్కాడల కూర ముద్దలుగా మారిపోయింది. అల్పాహారంగా తినే పెసర పునుకులు ఒక మెట్టెక్కి బుట్ట భోజనంలో ముఖ్యమైన కూరగా మారింది. ఇది మా సుబ్బయ్య గారు స్పెషల్ అండి
. ఆ పక్కనే కరకరలాడే పకోడీ బెండకాయ కూర పరమాద్భుతం. ముద్ద మీద ముద్ద లాగిo చేస్తున్నారు జనం.ప్రతిరోజు తాజా కూరగాయలన్నీ యజమాని స్వయంగా మార్కెట్కు వెళ్లి కొనుగోలు చేసి దగ్గర ఉండి వండించి వడ్డించేసాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. యజమాని ఎక్కడో ఏసీ గదుల్లో కూర్చోడు. ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి కొసరి కొసరి వడ్డించడం ఆ మహానుభావుడు పెట్టిన సాంప్రదాయం అది ఈనాటికి అలాగే కొనసాగుతోంది. అందుకే జనం మెచ్చుతారు. ముక్క విరిచి అన్నంలో కలుపుకోవడం కాదు ముద్దలో గుత్తి వంకాయ ఏకంగా ఒకేసారి నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది.
పచ్చటి అడవిలో దున్నపోతులా మెరిసిపోతోంది. కమ్మని పప్పు నూనె వాసన వేస్తోంది. నోటికి పుల్లగా ఉంది కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుంటే స్వర్గం కనబడుతోంది. అదేనండి గోంగూర పచ్చడి. ఆంధ్రుల అభిమాని. అది లేకుండా ముద్ద దిగదు మనకి.
కిందటి ఏడాది వేసవికాలానికి పెట్టిన ఊరగాయ కూడా ఈనాటికి కూడా రుచి కొత్త ఆవకాయలా ఉంది. అనుభవజ్ఞులైన
వాళ్లు చేతితో స్వయంగా పెట్టిన ఊరగాయ. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మజ్జిగ మిరపకాయ అప్పడం వడియం అన్ని
స్వంత తయారీలే. రుచి చూస్తే తెలియడం లేదు. ఇంటిలో మన అమ్మ చేతి రుచి. పదిమంది మనస్ఫూర్తిగా కడుపునిండా తినాలని అమ్మ చేసినట్టే వీళ్ళు కూడా అంతే. కాకినాడ వాసులకి తరతరాలు అనుబంధం. ఇంకా చెప్పవలసి వస్తేతూర్పుగోదావరి జిల్లా వాసులికి ఆ భోజనం అంటే పంచ ప్రాణం.
కందిపప్పుని మూకుట్లో వేసి నానాబాధలు పెట్టి కర్కశంగా యంత్రంలో వేసి నలిపేసి కళ్ళల్లో కారం కొట్టి పప్పు నూనె వేసి
ముద్ద నోట్లో పెట్టుకుంటే ఇంకేముంది స్వర్గమే. ఇంట్లో చేసుకోలేని వాళ్ళు అక్కడ అన్ని కొనుక్కోవచ్చు. అన్ని రకాల పొడులు పచ్చళ్ళు ఆవకాయలు తినుబండారాలు అప్పటికప్పుడు తయారుచేసినవే. నిలవ సరుకు అసలు ఉండదు. కాలం మారినా కరివేపాకు పొడి ఎలా మర్చిపోతాం. అందులో సుబ్బయ్య గారీ హోటల్ తయారీ. ముందే కొనుక్కుంటాం. రుచి చూడకుండా ఉండలేం.
ఈ ఒత్తిడి ప్రపంచంలో కడుపునిండా భోజనం తినే సమయం గానీ సొంతంగా వస్తువులు తయారు చేసుకునే సమయం గానీ ఎవరికీ లేదు. అటువంటి సమయంలో బజార్లో ఉన్న భోజన శాల మీద ఆధారపడవలసి వస్తుంది. పైగా బయట నాణ్యత కూడా చూస్తే భయంగా ఉంటోంది. తరతరాలుగా శుచి శుభ్రతలకు మారుపేరు ఈ సుబ్బయ్య గారు హోటల్. అందుకే ఏ వేళలో వెళ్లిన గాలి దూరే సందు కూడా ఉండదు. మంచి పాకశాస్త్రం తెలిసిన వంటవారు కష్టపడే మనస్తత్వం గల సప్లయర్లు అనుభవం కలిగిన యజమానుల అవిరళ కృషి ఈ సంస్థ ఎదుగుదలకు కారణమైంది.
చిన్నప్పుడు చంటి పిల్లలకు చారు అన్నం పెట్టేవారు. ఇప్పటికీ అన్నం లోకి చారు లేకపోతే చాలామందికి ముద్ద దిగదు. చారు పేరు మార్చుకుని రసo గా మారింది. రసంతో కలిపిన ముద్ద తింటుంటే నోటిలో సరాగాలు వస్తాయి. అంటే కావలసిన వస్తువు తిన్నప్పుడు మనసు ఆనందపడి కూని రాగాలు తీస్తుంది. రసంతో పాటు పంటికిందకు గుమ్మడివడియ o అప్పడం నంజుకుంటే ఉన్నచోటు మర్చిపోతాం. రసంతో సరి పెట్టేస్తే ఎలాగా ఇందులో నవరసాలు ఉన్నాయి అంటూ తెల్లగా ఉన్న కరివేపాకు వేసిన మజ్జిగ పులుసు గుంట చేసుకోండి వేస్తానంటూ ఆప్యాయంగా చెప్పారు. అబ్బా ఇది మిగిలిపోయిన మజ్జిగ కాదండి. ప్రత్యేకంగా రాత్రి తోడు పెట్టిన పెరుగు. ఇది కేవలం మజ్జిగ పులుసుకు మాత్రమే. అనుమానం తీరిపోయింది. అధరానికి కొత్త రుచి తెలిసింది. మనసు మధురం అయిపోయింది. ఆ మూల గిన్నెలో ఏమిటండి అది . అయ్యరు గారీ సాంబార్. ఒక ముద్ద తినండి. మళ్లీ ఎప్పుడు వస్తారో మా హోటల్ కి. బలవంతంగా ముద్ద తినిపించేశారు.
ఎవరు కనిపెట్టారో ఏమో ఆ టైగర్ ఫుడ్ ని. పచ్చగా ఆవపెట్టుకుని గిన్నెలో మెరిసిపోతోంది. మజ్జిగలోకి పెట్టుకోవచ్చు లే అనుకుంటాం గానీ కనపడిందాన్ని రుచి చూడకుండా ఎలా ఉండగలం. ఆ కాలం వాళ్ళే కాకుండా నవతరాన్ని కూడా ఆకర్షించే పులావులు పలావులు ఫ్రైడ్ రైస్ టమాటా రైస్ లు పన్నీర్లు పుల్కాలు అన్నీ కూడా ఆధునికమైన హోటళ్లతో సమానంగా పోటీపడి తయారుచేసి యువతరo అభిమానం సంపాదించుకుంటున్నారు.
చివరగా నోరు తీపి చేయకుండా వదలదు ఆంధ్రుల భోజనం. తీపి గుండెతో పైకి ఎర్రగా మెరిసిపోతూ ఆకర్షించే బూరి. కడుపు కాళీ లేదండి బాబు అంటూ చెయ్యి అడ్డం పెట్టినా పెళ్లి వారికి వడ్డించినట్లు వడ్డించి నాలుగు బూర్లు తినిపించి బూరి అంటే బోరు కొట్టేలాగా చేసి ఆఖరిని కత్తితో కోసిన పెరుగు ముక్క
విస్తరిలో వడ్డిస్తే కలుపుకోవడానికి భుక్తాయసం వచ్చి నెమ్మదిగా చెయ్యి నాకి ఒక ఐదు నిమిషాలు కూర్చుని బరువుగా కుర్చీలోంచి లేచి కౌంటర్ దగ్గర కిళ్ళీ తీసుకుని బయట అడుగు
పెట్టి బ్రేవ్ మంటూ మెట్టు దిగుతూ అన్నదాత సుఖీభవ ని ఆశీర్వదిస్తారు జనం. అందుకే సుబ్బయ్య గారు చేరారు స్వర్గం.
ఇంకా ఏమి వెరైటీలు ఉన్నాయి. తినడానికి కాదండి గూగుల్ తల్లిని అడిగితే ఒక పెద్ద లిస్టు చూపిస్తోంది. నేను ప్రత్యేకంగా మీకు చెప్పడం ఎందుకు మీరే సుబ్బయ్య గారి హోటల్ డాట్ కామ్ కి వెళితే ఏది కావాలంటే అదే ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఏ రోజుకు ఆ రోజు మెనూ మారిపోతుంది. గోడ మీద బోర్డులో మెరిసిపోతుంది. నోరు తెరిచే ఎవరిని అడగక్కర్లేదు. ఈ మధ్యకాలంలో భోజనమే కాదు అల్పాహారాలు కూడా అందించి కాకినాడ ప్రజల్ని ఆనంది oప చేస్తున్నారు. శనివారం ఒక్కరోజే కాదండి సాయంకాలం పూట ఆఫీసు నుండి లేదా షాపులు కట్టేసిన తర్వాత నాలుగు పొట్లాలు పట్టుకుని ఇంటికి వెళితే పిల్లలు శ్రీమతి మొహాలు ఆనందంగా వెలిగిపోతున్నాయి. ఇది మన కాకినాడ ట్రెండు ప్రస్తుతం.
అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఈ భోజనశాలలో భోజనం చేసి సుబ్బయ్య గారిని అభినందించారని గూగుల్ తల్లి ప్రపంచానికి గర్వంగా చెప్తోంది. అతి సామాన్యుడి నుంచి ధనికుడు వరకు అందరూ తృప్తిగా చేసే భోజనం మన సుబ్బయ్య గారి భోజనం. కాకినాడకి వన్నెతెచ్చిన భోజనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి