పుట్టినరోజు

పుట్టినరోజు

"
హ్యాపీ బర్త్ డే రా సుధాకర్ అంటూ ఆఫీస్ కి రాగానే కొలీగ్స్ అందరూ సుధాకర్ చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ తిరగడం ప్రారంభించారు. అందరికీ థాంక్స్ చెప్పి సుధాకర్ తన సీట్లో కూర్చున్నాడు. అదొక ప్రభుత్వ రంగ బ్యాంకు కార్యాలయం అక్కడ పనిచేసే పదిమంది ఉద్యోగు లు మేనేజర్ దగ్గర నుంచి సబ్ స్టాప్ వరకు ఏ నెలలో ఎవరు పుట్టినరోజులు వచ్చాయో క్యాలెండర్లో నోట్ చేసి పెట్టుకుంటారు. ఆరోజు ఎవరిదైతే పుట్టినరోజు వస్తుందో వాళ్లు హోటల్ లో లంచ్ ఇవ్వాలి. లంచ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కేక్ కట్ చేసి తర్వాత ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు. అలా ప్రతినెల ఎవరిదో ఒకరికి పుట్టినరోజు వస్తూనే ఉంటుంది. రేపు పుట్టినరోజు అనగా ముందు రోజు అందరికీ లంచ్ కి రమ్మని ఎవరిదైతే పుట్టినరోజు అవుతుందో వాళ్ళు ఆహ్వానిస్తారు. ఇది ఆఫీస్ సాంప్రదాయం

కానీ సుధాకర్ పుట్టినరోజు ముందు రోజు అటువంటి ఆహ్వానం అందలేదు. అదేంటి రేపు సుధాకర్ పుట్టినరోజు కదా మర్చిపోయాడా ఏమిటి ఎవరికీ చెప్పలేదు కనీసం మేనేజర్ గారికి అయినా చెప్పాడా అని ఎదురుచూసిన సహ ఉద్యోగులు ఆశ నిరాశ అయింది. ఆఫీస్ కి వచ్చిన తర్వాత కూడా సుధాకర్ ఆ లంచ్ మాట ఎత్తలేదు. కానీ అందరికీ మటుకు స్వీటు హాటు తోటి ఆరోజు సరిపెట్టేసాడు.

ఒకప్పుడు ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా తలంటు పోసి కొత్త బట్టలు కట్టి గుడికి తీసుకువెళ్లి స్వీట్ ఇంట్లో తయారు చేసి పెట్టేవారు. అంతే ఈ రోజుల్లో గా పార్టీలు కేకులు అంటూ హడావుడి ఏమీ లేదు. కేకులు కోయడం అనే ప్రసక్తి లేదు. ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో. ఇప్పుడు అదే రోజు హోటల్ కెళ్ళి పార్టీలు చేసుకోవడం విహారయాత్రలకు వెళ్లడం సినిమాలకి షికారులకి వెళ్లడం ఇదో ఒక అలవాటుగా మారింది. పని చేసే కార్యాలయంలో కూడా కేకులు కట్ చేయడం పార్టీలు ఇవ్వడం అలవాటుగా మారింది. అయితే సుధాకర్ ఇలాంటి విషయాల్లో ముందుండే వాడు. అలాంటివాడు ఇలా మారిపోయాడు ఏమిటో అర్థం కాలేదు సహోద్యోగులకి.

అలా మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఒక గంట లేటుగా వస్తానని చెప్పి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్ళాడు సుధాకర్. అలా అందరూ లంచ్ పూర్తి చేసుకుని ఎవరు సీట్లో వాళ్లు కూర్చుని పని చేసుకుంటూ ఉండగా సుధాకర్ గారు వచ్చిన తర్వాత స్టాఫ్ అందర్నీ మేనేజర్ గారు రమ్మన్నారు అంటూ వచ్చి చెప్పాడు ప్యూన్. విషయం ఏమిటో ఎవరికి ఏం అర్థం కాలేదు. అనుకున్న సమయానికి సుధాకర్ రాగానే అందరూ మేనేజర్ గారు గదిలోకి వెళ్ళారు. అందర్నీ కూర్చోమని చెప్పిన తర్వాత సుధాకర్ ని కంగ్రాట్యులేషన్స్ సుధాకర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అంటూ అభినందించారు మేనేజర్. విషయం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. మేనేజర్ సుధాకర్ ని పార్టీ ఇవ్వలేదని ఆటపట్టిస్తున్నాడేమో అనుకున్నారు.

 అప్పుడు మేనేజర్ స్టాప్ వైపు చూస్తూ ఇవాళ మధ్యాహ్నం నేను లంచ్ నుండి తిరిగి వస్తూ దారిలో ప్లాట్ ఫామ్ మీద ఉండే బిచ్చగాళ్ళకి ప్యాకెట్లు ఇస్తూ ఒక యువకుడు కనబడ్డాడు. యధాలాపంగా నేను అటు వైపు చూస్తే మన సుధాకర్లా కనపడ్డాడు. వెంటనే బండి ఆపుకుని ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకున్నాను. ఇది విషయం. ఈ మధ్యకాలంలో చాలామంది యువతీ యువకులు దారి పక్కన పడుకున్న వాళ్ళకి దుప్పట్లు కప్పడం అలాగే ఆహార పొట్లాలు అందించడం అలాగే కొన్ని మూగజీవాలు అంటే కోతులుకి పండ్లు పెట్టడం చాలా వీడియోలో చూస్తున్నాము. నేను అటువంటివి నమ్మలేదు. కానీ ఇప్పుడు మన స్నేహితుడు సేవా భావం చూసి ఆశ్చర్యపడ్డాను అంటూ మరొకసారి సుధాకర్ ని అభినందించాడు. సుధాకర్ సడన్ గా నీలో ఈ మార్పుకు కారణం ఏమిటి అంటూ ప్రశ్నించడం మేనేజర్.

సుధాకర్ కాస్త సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. అంటే ప్రతి సంవత్సరం నేను తిధుల ప్రకారం పుట్టినరోజు చేసుకుంటాను. ఈసారి నా పుట్టినరోజు నెలలో ఆఖరివారం లో వచ్చింది. జీతం అంతా ఖర్చయిపోయి మా అమ్మని పది వేలు ఇమ్మని అడిగాను. మీకు తెలుసు కదా నేను క్రెడిట్ కార్డులు వాడనని . ఎందుకు అంత డబ్బు అని అడిగింది. నా పుట్టినరోజు కదా రేపు ఆఫీసులో మా స్టాఫ్ కి పార్టీ ఇవ్వాలి అంటూ చెప్పాను. అమ్మ వెంటనే నవ్వి నీకు డబ్బులు ఇవ్వడానికి నాకు ఏమీ ప్రాబ్లం లేదు. కానీ పార్టీలకు అంత డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. తప్పుగా అనుకోకు ఆ ఖరీదైన హోటల్లో మీ సహోద్యోగులు ఎవరు డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుని తినగల స్తోమత ఉన్న వాళ్లు కదా. ఏదో సరదాకొద్దీ వాళ్లు అడుగుతారు తప్పితే. మరి ఏమి కాదు. నువ్వు ఇచ్చేది చాలా చిన్న పార్టీ. కానీ మన దేశంలో రోజుకి ఒక పూట కూడా కడుపునిండా అన్నం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కళ్లు తెరిచి చూస్తే మన చుట్టుపక్కలే ఉన్నారు. అటువంటి వాళ్లకి ఆ ఖరీదైన హోటల్ భోజనం కనీసం పదిమందికైనా తినిపిస్తే వాళ్ళ కళ్ళల్లో కనిపించే వెలుగు నీకు చాలా సంతృప్తినిస్తుంది. పదిమంది కాకపోతే కనీసం ఐదుగురికి. అలా నీలాంటి యువకులు అందరూ అనుకుంటే దేశంలో చాలామంది పేదవాళ్లు ఒక్కపూటైనా అన్నం తినగలుగుతారు. ఒక్కసారి ఆలోచించి చూడు. ఇది నీకు ఎంతో ఆత్మ సంతృప్తినిస్తుంది. డబ్బు ఎక్కడైనా ఖర్చు అవుతుంది. స్నేహితులకు పార్టీ ఇచ్చిన ,లేని వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టిన కానీ ఈ సంతృప్తి వేరు అంటూ చెప్పారు. మనం చేసేది ఏడాదికి ఒకసారి మాత్రమే అని చేతిలో పదివేలు పెట్టారు. కానీ మీ అందరికీ ఈ విషయం ఎలా చెప్పాలని మదనపడ్డాను. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు మన మేనేజర్ గారు నన్ను చూడడం తర్వాత జరిగిన కథ ఇది అంటూ చెప్పాడు సుధాకర్. 

అలా సుధాకర్ చెప్పిన తర్వాత తోటి ఉద్యోగులందరు ఆలోచనలో పడ్డారు. తర్వాత ఆ కార్యాలయంలో పుట్టినరోజు పండుగలకి పార్టీలు ఇవ్వడం అనేది సాంప్రదాయం ఆగిపోయింది. సుధాకర్ బాటలోనే కొత్త సాంప్రదాయం మొదలైంది. ఆ బ్రాంచ్ లో జరిగే సంప్రదాయం చూసి హెడ్ ఆఫీస్ వాళ్లు కూడా ఎంతో మెచ్చుకున్నారు. 

డొక్కా సీతమ్మ గారి లాంటి అన్నపూర్ణలు పుట్టిన భారతదేశo మనది. ఎంతోమంది దాతలు తమ ఆస్తిపాస్తులుని అన్న సత్రాలకి విరాళంగా ఇచ్చి ఉచిత అన్నదానం చేస్తున్న దేశం మనది. అటువంటి దేశంలో పుట్టిన మన కనీస కర్తవ్యం ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం. మరి పుట్టినరోజు పండక్కి ఏం చేయాలి ? మీరే ఆలోచించండి. 

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం