పల్లెకవి గోరేటి

పల్లె కవి _ గోరేటి

భారతదేశం కవులకు, కళాకారులకు పుట్టినిల్లు. ఆదికావ్యాల నుంచి ఆధునిక కవిత్వం వరకు, అనేక మంది కవులు సమాజాన్ని ప్రతిబింబిస్తూ, మన సంస్కృతిని అభివ్యక్తం చేశారు. వీరిలో కొందరు ప్రేమను, కొందరు విరహాన్ని, మరికొందరు సమాజాన్ని కవిత్వంగా మలిచారు. అయితే, ఒక కవి మాత్రం తన జన్మభూమి పల్లెను, అక్కడి జీవనాన్ని తన కవిత్వంగా అక్షరాల్లో చూపించాడు. అతను ప్రజా కవి గోరేటి వెంకన్న.

గోరేటి వెంకన్న పాటలు పల్లె జన జీవనంలోని ప్రతిబింబాలు. అతని కవిత్వంలో మట్టివాసన ఉంది.పేదల కష్టసుఖాలున్నాయి, ప్రకృతితో మమేకమైన జీవన సౌందర్యం ఉంది. వేదిక మీద నిలబడి, తన స్వరంతో ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లే శక్తి ఆయన గీతాలలో ఉంది. ఆయన పాటలు కల్పితాలు కాదు, పచ్చి నిజాలు. పల్లె కష్టాలను, ప్రకృతిలోని మాధుర్యాన్ని ప్రతిబింబించే మహాకవి వెంకన్న.

పల్లె కన్నీటి గాథ

"పల్లె కన్నీరు పెడుతోంది" అంటూ చేతివృత్తులపై ఆధారపడిన ప్రజల బాధను తన గీతాల ద్వారా వ్యక్తీకరించారు. వృత్తి కోల్పోయిన పల్లె ప్రజలు పట్టణాల్లో ఎలా అల్లాడుతున్నారో, వారికి ఎదురవుతున్న అనుభవాల్ని పదాల రూపంలో చెబుతారు. "కులవృత్తికి సాటి లేదు గువ్వల చెన్న" అన్నప్పటికీ, జీవితంలో వాస్తవ పరిస్థితులు వేరని స్పష్టంగా చిత్రిస్తారు. "కుమ్మరివాములో తుమ్మల మొలిచెను, కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను" వంటి పాటలలో మునుపటి వృత్తుల పతనాన్ని హృదయ విదారకంగా వివరిస్తారు.
పేదల జీవన చిత్రణ
"గల్లీ చిన్నది" పాటలో పేదల బతుకంతా కళ్లకు కట్టేలా చిత్రించారాయన. "మూడు జానల పోరడు వాడి బాధలేమో బారెడు" అని, రోడ్డుపై బుడగలు అమ్మే పిల్లవాడి బాధను హృదయాన్ని హత్తుకునేలా చెప్పారు. కవి తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని పరిశీలించి గాని, అటువంటి భావోద్వేగభరితమైన కవిత్వం రాయలేడు.

ప్రకృతి ప్రేమ
గోరేటి వెంకన్న కవిత్వంలో ప్రకృతి కూడా ఓ ప్రధాన పాత్ర. "నరుడి బ్రతుకు కన్నా పిట్ట బ్రతుకే హాయి" అంటూ, మనిషి కన్నా పిట్ట నిరాడంబర జీవితమే మేలని చెప్పగల కవి. 

అలాగే, "ఓ నల్ల తుమ్మ" పాటలో తుమ్మ చెట్టును మహిమ చెబుతూ , దాని సహజ గుణగణాలను అందంగా ప్రతిబింబించారు. "గురక రాళ్ల సవుక నేలల్లో మొలిసేవు, గుట్టలు రాళ్లు ఉన్న గుబురుగా పెరిగేవు" అని, పల్లె ప్రకృతిని తన పాటల్లో జీవంతో నింపారు.
సారాంశం
గోరేటి వెంకన్న పాటలు పల్లె జీవనానికి అద్దం. పల్లె ప్రజల కష్టాలను, ప్రకృతిని, మట్టివాసనను పదాలలో నింపిన కవి. ఆయన కలం నుంచి మరిన్ని అమృత గీతాలు రావాలని ఆశిస్తూ...

రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం