నీటిలో దేవుడు
నీటిలో దేవుడు
ఉదయం ఆరు గంటలయింది
నగరం అంతా మంచు కప్పేసి ఉంది. ఇప్పుడిప్పుడే బద్దకంగా ఒళ్ళు విరుచుకొంటోంది. నగరం అంతా నిశ్శబ్దంగా కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడి నుంచో పెద్ద శబ్దం ,రక్షించండి! రక్షించండి !అని ఎవరివో అరుపులు వినబడ్డాయి చెరువు పక్కన గుడిసెలో మంచం మీద పడుకున్న రాజుకి. ప్రతిరోజు ఇలాంటి అరుపులు మామూలే. ఆ అరుపులు విన్న వెంటనే రాజు ,అతని భార్య మీరా పరుగు పరుగున బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ జనం గుమిగూడి ఉన్నారు. ." ఎవరో పాతికేళ్లు ఉంటాయేమో ఆ అబ్బాయికి చూస్తుండగానే దూకేసాడు! అంటూ చెప్పుకొచ్చారు.
వెంటనే రాజు భార్య మీరా రాజు కేసి చూసింది. ఇది నీ కేసు అన్నట్లుగా !ఏ పక్క నుంచి దూకాడు! అని అడిగాడు రాజు. ఆ ప్రదేశం చూపించారు అక్కడ ఉన్న జనం. రాజు వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకి కొంచెం దూరం ఈత కొట్టి చేతికి దొరికిన కాలును పట్టుకుని చెరువు గట్టుమీదకు తీసుకొచ్చి పొట్ట మీద గట్టిగా నొక్కాడు .
అలా నాలుగు మూడుసార్లు చేయగా తాగిన నీళ్లన్నీ బయటకు వచ్చి పాపం ఆ కుర్రవాడు కళ్ళు తెరిచి బిత్తర చూపులు చూడ సాగాడు .
చుట్టూ ఉన్న జనం నీ పేరేమిటి ?నీది ఏ ఊరు? ఫోన్ నెంబర్ ఏమిటి? రకరకాల ప్రశ్నలు అడుగుతున్న ఆ కుర్రవాడు ఏమీ సమాధానం చెప్పే స్థితిలో లేడు. రాజు అందరికీ చేతులు ఎత్తి జోడించి మీరు దయచేసి ఏమి ప్రశ్నలు వేయకండి !. "ఆ కుర్రవాడు ఇప్పుడు అయోమయ స్థితిలో ఉన్నాడు అని చెప్పి అక్కడున్న జనాలందరిని పంపించేసరికి దూరం నుంచి వస్తున్న పోలీసులకి ఆ విషయం చెప్పి ఆ కుర్రవాడిని అప్పచెప్పాడు.
రాజుని ఎప్పటిలాగానే పోలీసులు అభినందించి నిజానికి నీకు సన్మానం చేయాలి రా !ఇప్పటికి వంద ప్రాణాలు పైగా కాపాడేవు అని భుజం తట్టి పిల్లాడిని తీసుకుని వెళ్లిపోయారు.
రాజు పోలీసులు మాటలకి ఉప్పొంగిపోయాడు. రాజుకి ఇటువంటి ప్రశంసలు ఏమీ కొత్త కాదు .అయినా ఆ చెరువులో దూకిన వారిని కాపాడడం అంటే కత్తి మీద సామే. ప్రాణాలతో బయటకు వస్తాడో లేదో అనుమానమే. పక్కమనిషి గురించి ఎవరూ పట్టించుకోని ఈ రోజుల్లో ఒక ఆత్మహత్యకు పాల్పడే వారిని రాజు ఎందుకు కాపాడుతున్నాడు? అనే ప్రశ్న అందరికీ కలగవచ్చు. ప్రతి మనిషి జీవితం మీద అతను జీవితంలో ఉండే అనుభవాలు చాలా ప్రభావం చూపుతాయి.
రాజు తల్లిదండ్రులు ఇద్దరూ ఏదో ఒక ఫ్యాక్టరీలో కూలి పని చేస్తూ ఒక గుడిసెలో ఇద్దరు పిల్లలతో కాలక్షేపం చేస్తుండేవారు. పెద్దవాడు రాజు. రాజుకి ఒక తమ్ముడు. వాడి పేరు కృష్ణ.
రాజుకి ఊహ తెలిసేటప్పటికీ తల్లిదండ్రులు ఇద్దరు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చనిపోవడం పిల్లలిద్దరూ దిక్కులేని వాళ్ళు అవ్వడం వలన పక్కింటి వాళ్ళు అనాధాశ్రమంలో చేర్పించారు. ఎవరో దాతలు ఇచ్చిన విరాళాలతో ఆశ్రమం నడిచేది. ఆ ఆశ్రమంలోని పిల్లలందరూ దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ ఉండేవారు. ఒకరోజు వేసవి సెలవుల్లో రాజు, కృష్ణ ఇద్దరూ కలిసి ఆడుకుంటూ దగ్గరలో ఉన్న చెరువులో స్నానం చేద్దామని దిగి పాపం కృష్ణ ఈతరాక మునిగిపోయి చనిపోయాడు. ఆ చెరువు గట్టు మీద ఎంతమంది ఉన్నా "రక్షించండి రక్షించండి అని రాజు అరిచిన ఎవరికి ఈత రాక దానికి తోడు ధైర్యం లేక ముందుకు రాలేదు. కృష్ణ చివరిసారగా అరుస్తూ చేతులు పైకెత్తు ఊపుతూ నీళ్లలో మునిగిపోయాడు. దానివల్ల చూస్తూ ఉండగానే ఒక నిండు ప్రాణము నీటిలో మునిగిపోయింది. ఆ దృశ్యం ఇప్పటికీ రాజు కన్నుల్లో మెదులుతూ ఉంటుంది .
ఆ తర్వాత స్కూల్ చదువు ఆపేసి వీధుల్లో పాత సామాన్లు ఏరుకుంటూ పదోపరక సంపాదించుకుంటూ ఏదో కాలక్షేపం చేసేవాడు రాజు ..
ఆ చెరువు గట్టు మీదకి వెళ్లినప్పుడల్లా ప్రతిసారి కృష్ణ గుర్తుకు రావడం, అంతేకాకుండా అలాగే ప్రమాదవశాత్తు , మరియు ఆత్మహత్యలతో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోవడం ఆ చెరువు గట్టుమీద శవాలను పెట్టుకుని ఏడుస్తున్న బంధువులను చూసి మనస్సు కరిగిపోయి ఏదో విధంగా వాళ్ళని కాపాడాలని మనసులో నిశ్చయించుకుని నగరంలోని ఆ ప్రముఖ చెరువు వద్ద రేకుల షెడ్డు వేసుకుని ఇలా సహాయం చేస్తూ ఉంటాడు రాజు. రాజుకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ చెరువుకు చాలా పెద్ద చరిత్ర ఉంది.
ఒకప్పుడు హైదరాబాదు నగరంలో మంచినీటి కోసం 1562 సంవత్సరంలో ఇబ్రహీం కుతుబ్షా ఈ చెరువు నిర్మించారు . మూసీ నది లో ఉండే నీటితో ఆ చెరువు నింపేవారు. ఇది హైదరాబాదులో ప్రముఖ పర్యాటక కేంద్రమే కాకుండా హైదరాబాదు సికింద్రాబాద్ నగరాలని రెండింటిని కలుపుతుంది.
సరస్సు మధ్యలో బుద్ధుడు ఎంత శాంతిని బోధిస్తున్నప్పటికీ అశాంతితో రగిలిపోయే జనం తమ ఆత్మహత్యలకి అనువుగా ఈ చెరువు ని ఎంచుకుంటున్నారు. కాపురం బాలేదు అని ఒక చెల్లి, ఉద్యోగం రాలేదని ఒక తమ్ముడు, బ్రతుకు బాగా లేదని ఒక సంసారి, దిక్కుతోచక ఒకడు ,దిక్కు లేక మరొకడు పచ్చటి బ్రతుకుని ఆ చెరువులో కలిపేసినప్పుడు ఊపిరాడక మరో లోకం చూస్తున్నప్పుడు నేనున్నానంటూ తన బ్రతుకు చూసుకోకుండా ,బ్రతుకు మీద ఆశ లేకుండా చెరువులో మూడుమునకలేసి ఊపిరి ఉన్న వాళ్ళని ,ఊపిరి లేని వాళ్ళని బయటకు తీసి కుటుంబ సభ్యులకు అప్ప చెప్పడమే ఆ దంపతులకి నిత్య కృత్యం .
ఆ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరినీ కాపాడలేకపోయినా కడసారిచూపు ఆ కన్నవాళ్ళకి, కట్టుకున్న వాళ్ళకి దక్కించిన పుణ్యం ఆ దంపతులదే. లేదంటే ఏ జలచరాలకో పాపం ఆహారంగా మారిపోవడమే కదా!
నిన్న మొన్నటి వరకు మంచినీటి సరఫరా చేసే ఆ చెరువు క్రమేపి నగరం పెరగడంతో పారిశ్రామిక కాలుష్యం అంతా అందులోనే కాపురం చేస్తోంది. ప్రతి ఏట వినాయక చవితికి మూడుమునకలు వేసే నీటిలో కరిగిపోని భాగ్యనగర్ వినాయకుడి తయారీకి వాడే సామాగ్రి ప్రాణం రక్షించే తొందరలో అనేకసార్లు రాజుకు గుచ్చుకొని బాధపడిన సందర్భాలు లేకపోలేదు రాజుకి. ఇప్పుడా గొడవ లేదు అన్నీ మట్టి బొమ్మలే.
అయినా మురికి కంపుకొట్టే ఆ నీటిలో దూకడం వల్ల అనేకసార్లు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు కూడా వచ్చి బాధపడిన తన వ్రతం మటుకు మానలేదు రాజు . ఒడ్డు వరకు తీసుకొచ్చిన పాపం ప్రాణం పోతే ఆరోజు రాజు మనసు మనసులో ఉండదు. ఇంత సాహసోపేతంగా కొంతమంది ప్రాణాలు రక్షించిన చివరికి కొందరు నన్ను ఎందుకు రక్షించావు? రేపటి నుంచి నువ్వు చూస్తావా! అంటూ తన బాధను చెప్పుకున్నప్పుడు అది విని కన్నీళ్లు వచ్చినా ప్రాణం విలువ చెప్పి బ్రతుకు పై ఆశ కల్పిస్తాడు.
రాజు ఇంత సహాయం చేస్తున్న ఎవరిని చెయ్యి చాచి పది రూపాయలు అడగడు. అయినా అందరూ మనిషి దక్కాడని కొందరు, ఆఖరి చూపు దక్కిందని కొందరు ఏదో పదోపరకో చేతిలో పెడుతుంటారు రాజుకి అదే జీవనాధారం. విచిత్రం ఏమిటంటే ఇటువంటి ఆశయంతో జీవితం గడుపుతున్న రాజుకి జీవితంలో తోడుగా నిలిచింది మీరా.
మీరా ఒకప్పుడు బ్రతకలేని పరిస్థితుల్లో ఆ చెరువును ఆశ్రయిస్తే ప్రాణదాత గా నిలిచిన రాజు జీవిత భాగస్వామి అయిపోయాడు.
ప్రాణం విలువ చెప్పిన రాజు అంటే ఎనలేని ప్రేమ మీరాకి.
ఒక స్త్రీ ప్రాణాన్ని రక్షించే సందర్భంలో కలిగిన ఇబ్బందులు భార్యకు చెప్పాడు రాజు. రాజుకు జీవితాన్ని పంచి ఇవ్వడమే కాకుండా రాజు ఆశయానికి కూడా తోడుగా నిలిచింది.
అయితే అప్పటినుంచి ఏ స్త్రీమూర్తి ఆత్మహత్యకు పాల్పడిన మీరా కూడా వెనకా ముందు ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకి ప్రాణాన్ని రక్షించడం రాజు దగ్గర నేర్చుకుంది.
వైద్యశాస్త్రం నేర్చుకుని ప్రాణాలను కాపాడేది డాక్టర్లు అని మనకు అందరికీ తెలుసు. ఏ శాస్త్రము నేర్చుకోకుండా కేవలo ఒక ఆశయం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్న రాజు దంపతులను ఏ పేరుతో పిలవాలి?
శవం అంటేనే భయపడి ఎవరు దగ్గరికి రారు. కానీ ఒక సామాజిక సేవా సంస్థ వారి సహకారంతో అనాధ శవాలని, కావాలని ప్రాణం తీసుకున్న వారిని వ్యాన్ లో వేసుకుని ఆసుపత్రికి తరలించడం ఇప్పుడు రాజుకి నిత్య కృత్యంలో ఒక భాగం.
ఇది కథ కాదు. కానీ పాత్రల పేర్లు వేరు. నిజ జీవితంలో ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా చేస్తున్న త్యాగం. ఒక వ్యక్తి యొక్క బలమైన ఆశయం. చాలా విచిత్రమైన ఆశయo . ఆశయానికి ఒక నమస్కారం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి