సగం అక్కడ _ సగం ఇక్కడ

సగం అక్కడ… సగం ఇక్కడ 

ఆ మండువా లోగిల్లో,
పసిపిల్లల పరుగుల గోలతో,
అనుబంధాలు పెనవేసుకున్న
ఆనందపు ఆవరణంలో...

కాలచక్రం ముందుకు సాగింది,
పలకరింపులన్నీ ఓడిపోతూ,
స్నేహబంధాలు నెమ్మదిగా నీడలై మిగిలిపోయాయి.

ఒకప్పుడు ఉత్సాహంగా నిండిన ఆవరణలో,
ఇప్పుడో వెలితి చెమ్మగిల్లిన గాలి మిగిలింది.

అన్నదమ్ములు విడిపోయారు,
కన్నబిడ్డలు గువ్వల్లా ఎగిరిపోయారు,
ఇంటి గూటిని వదిలి వెలుగు వీధుల వైపు వాలిపోయారు.

ఏదైనా పండగకైనా, పబ్బానికైనా
ఊరికి వస్తారు, తల్లిని పలకరిస్తారు.
కానీ ఆ హడావుడి క్షణాలే...
ఆశలు చిగురించే సమయం నిదానమే!

మేము మాత్రం,
రెక్కలు విరిగిన పక్షిలా,
పాత గూటిలో మగ్గిపోతూ,
మనసు తట్టినప్పుడల్లా,
ఒక ఎర్రబస్సు ఎక్కి,
ఆత్మీయుల్ని పలకరించి వస్తాం.

కానీ మనసులో నిండిపోయే శూన్యం...
ఏ దారి తగిలినా, అదే గమ్యం!

వయసు మళ్లిన మా జీవితం—
సగం అక్కడ… సగం ఇక్కడ…

ఆధార్ కార్డు అడ్రస్ ఆంధ్ర రాష్ట్రమైతే,
కేరాఫ్ అడ్రస్ తెలంగాణలోని అబ్బాయిదీ!

 అది పరాయి రాష్ట్రం కాదు 
 పరిచయం లేని ఊరు కాదు.

తెల్లారి లేస్తే మమ్మల్ని పలకరించేది 
పల్లెటూర్లోని మన పక్కింటి వాడే

అందుకే మీది ఏ రాష్ట్రం అని అడిగితే 
మావి తెలుగు రాష్ట్రాలు అంటాం 
వయసు మళ్ళిన మా జీవితం 
సగం అక్కడ సగం ఇక్కడ

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం