రుచులు వెనుక జీవితం
రుచులు వెనుక జీవితం
" సాయంకాలం వచ్చేటప్పుడు ఉగాది పచ్చడి సరుకులు తీసుకురండి. పొద్దున్నే నేను లేచి పచ్చడి చేసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ సంచి వేసుకుని బజార్ కి వెళ్లి సరుకులు తీసుకొస్తానంటే బాగుండదు అంటూ చెబుతున్న భార్య సుజాత మాటకి ఆఫీసుకు బయలుదేరి పోతున్న రామారావు "సరే తప్పకుండా తీసుకొస్తా! అని గత సంవత్సరం వేప పువ్వు కొనలేదు కదా అన్నాడు. అవును కానీ ఈ ఏడాది ఆ చెట్టు కొట్టేసి ఆ స్థలంలో ఇల్లు కట్టేశారు అoది సుజాత.
ఆఫీస్ నుండి తిరిగి వస్తూ బజారు లోకి వెళ్లిన రామారావుకి మార్కెట్ అంతా సందడిగా కనిపించింది. ఒకపక్క తట్టలో వేప పువ్వు మరొక పక్క కొత్త బెల్లం కొత్త చింతపండు ఇలా ఉగాది పచ్చడి సరుకులు అన్ని వరుసగా పెట్టుకుని అమ్ముతున్నారు. ఎన్ని షాపులు తిరిగిన వేప పువ్వు అంతా వాడిపోయినట్టుగా ఉంది. అన్ని సరుకులు హై రేట్లు. డిమాండ్ అలా ఉంది. ఏమిటో రాను రాను పండగలకు కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సరుకుల రేట్లు మండిపోతున్నాయి అనుకుని సరుకులు అన్నీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు రామారావు
ఇంటికి వచ్చి భార్యకు సరుకులు సంచి అందించి పిల్లలు ఎవరూ లేకపోతే పండగలా లేదు అన్నాడు భార్యతో రామారావు. ఒకరోజు సెలవుకి ఏమి వస్తారండి! అంది సుజాత.
ఏమిటో రాను రాను పిల్లలు లేకుండానే పండగలు చేసుకోవాల్సి వస్తోంది అనుకున్నాడు రామారావు. ఇంట్లో పండగ కన్నా బజార్లోనే పండగ సందడి ఎక్కువగా ఉంది అనుకున్నాడు రామారావు. సరే ఆ వేప పువ్వు ఇలా పట్టుకురా!. బాగు చేసి పెడతాను అన్నాడు రామారావు. మీరు బాగు చేస్తారా !అని ఆశ్చర్యంగా అడిగింది.
"అవును మా చిన్నతనంలో ఉగాది పండక్కి ముందు రోజు పక్క ఊరిలో అమ్మవారి తీర్థ o. ఆ తీర్థానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థంలో సామాన్లు కొనుక్కుని ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం అయ్యేది. తోటలోకి వెళ్లి వేపపువ్వు కోసుకు రావడం ,దాన్ని శుభ్రంగా బాగు చేయడం ఇవన్నీ పిల్లలందరం కలిసి చేసేవాళ్ళం. పక్క ఊర్లో తీర్థం రోజు అమ్మవారికి నైవేద్యాలు, మర్నాడు ఉగాది పిండి వంటలు ఇంక చెప్పేదేముంది. చిన్నపిల్లలం కదా! అదే పని మీద ఉండేవాళ్ళం. ఆ మర్నాడు కడుపునొప్పి. నాన్న అమ్మని తిట్టడం. ఇలా ఉండేది మా ఉగాది అంటూ చెప్పుకుంటూ వచ్చి వేప పువ్వు బాగు చేసి సుజాతకి ఇచ్చేసి గదిలోకి వెళ్ళిపోయాడు రామారావు.
హమ్మయ్య ఈరోజు ఆఫీస్ కి వెళ్లక్కర్లేదనుకుంటూ మర్నాడు ఉదయం గదిలోంచి బయటకు వచ్చేటప్పటికి అప్పటికే సుజాత వంటింట్లో కుస్తీ పడుతోంది. రామారావు బాత్రూంలోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని తలంటుకుని వచ్చి కొత్త బట్టలు కట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు.
"సుజాత కాఫీ !అని అలవాటు కొద్దిగా అరవబోయి నాలిక కరుచుకున్నాడు. ఇంతలో ఒక కప్పులో ఉగాది పచ్చడి పట్టుకుని రామారావు చేతిలో పెట్టింది సుజాత. వెంటనే సుజాత కళ్ళల్లోకి చూసాడు రామారావు. రామారావు ఎందుకు చూశాడో సుజాతకు అర్థం అయింది. ప్రతిరోజు లేచిన వెంటనే కాఫీ పడకపోతే రామారావుకి పిచ్చెక్కిపోతుంది. రామారావు మొహం చూసిన వెంటనే సుజాతకు పక్కన నవ్వు వచ్చింది. అయినా తప్పదు కదా! ముందుగా ఉగాది పచ్చడి తి నాలి ఉగాది నాడు .
అది చిన్నప్పటి నుంచి చేస్తున్న పని అనుకుని మొదటి స్పూన్ నోట్లో పెట్టుకున్నాడు. తియ్యటి రుచితో పాటు చిన్న చిరునవ్వు కూడా వచ్చింది రామారావుకి. ఈ సంవత్సరం మధురంగా ఉండబోతోందా అనుకొని రెండో స్పూన్ ఉత్సాహంగా నోట్లో పెట్టుకొన్నాడు. అబ్బా ఇంత పుల్లగా ఉంది ఏమిటి అంది నాలుక. తల్లీ! అది నీకు పుల్లగా ఉన్నా నా జీవితంలో ఏదో ఆసక్తికరమైన అనుభవం రుచి చూడబోతున్నానన్నమాట. అందుకే ఉగాది పండుగ నాకు ఆ రుచిని తొలిరోజే చూపించేసింది అన్నాడు రామారావు. మూడో స్పూన్ నోట్లో పెట్టుకోగానే కళ్ళు వెంట నీళ్లు వచ్చాయి. అబ్బా ఎంత కారంగా ఉంది అనుకున్నాడు రామారావు. మరి జీవితం అంటే ఎప్పుడు తియ్యగా ఉంటుంది ఏమిటి కష్టాలు సుఖాలు ఉంటాయి రా తట్టుకోవాలి అని అమ్మ అప్పుడప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి రామారావుకి.
బజార్ నుంచి తెచ్చిన వేప పువ్వు అంతా ఇందులోనే వేసేసినట్లు ఉంది అనుకున్నాడు రామారావు చేదుగా ఉన్న పచ్చడి తిని. ఉగాది రోజున ఉగాది పచ్చడిలో ఏది ఎక్కువైనా సరే మనం పాడైయకుండా తినేసినట్లే జీవితంలో ఏది ఎక్కువైనా తక్కువైనా తట్టుకుని అన్నిటికీ అలవాటు పడడమే అంటూ ఎప్పుడూ చెప్పే నాన్న మాటలు గుర్తుకొచ్చాయి రామారావుకి. జీవితంలో అన్నీ సుఖాలే ఉంటే మనిషి మనిషిలా ఉండడు కొన్ని పరీక్షలు కూడా ఉండాలి అప్పుడే అసలు శక్తి బయటపడుతుంది మనిషికి మిగిలిన పచ్చడి అంత తినేసాడు.
" ఉగాది పచ్చడి ఎలా ఉందండి అని అడిగింది రామారావు భార్య సుజాత. అన్ని రుచులు చూపించేసావు. నా జీవితం నాకు చూపించేసావు.రాబోయే కాలంలో నా జీవితం ఇలాగే ఉంటుంది అన్నాడు రామారావు. ఏమి మార్పు ఉండదు. ఒకసారి కష్టం ఒకసారి సుఖం అలా వస్తుంటాయి పోతుంటాయి. మీ జీవితమే కాదండి నా జీవితం కూడాను అంది నవ్వుతూ సుజాత.
సరే అండి సాయంకాలం గుళ్లో పంచాంగ శ్రవణం ఉంది. మనిద్దరం వెళ్దాం అంది సుజాత. ఎందుకంత ఉత్సాహం . జీవితంలో ఏది వచ్చినా తట్టుకునేది మనమే. భవిష్యత్తును తెలుసుకుని సంతోషపడడం బాధపడడం , ఏదో చెడు జరగబోతుందని అదే ఆలోచనలో ఉండడం ఇది మంచి పని కాదు.
ఇది డిజిటల్ యుగం. గుడిలోనే కాదు మన ఇంటి హాల్లో కూర్చుంటే చాలు అన్నాడు రామారావు.
ఇంకా ఆదాయం వ్యయం లెక్కలు మన చేతుల్లోనూ చేతల్లోనూ ఉంటాయి. ఆడంబరాలకు షోకులకి పోకుండా జాగ్రత్తగా కాలక్షేపం చేస్తే ఆదాయం పెరిగినట్లే. ప్రతిగృహిణి సంసారానికి ఒక ఆడిటర్ లాంటిది. ఏది అవసరం ఏది అనవసరం ఏది మంచి ఏది చెడు అనే విషయం నిత్యకృత్యంలో గమనిస్తూ భర్త తెచ్చిన సంపాదనని జాగ్రత్తగా ఖర్చు చేస్తే ఆదాయం పెరిగినట్లే. అదేవిధంగా వ్యయం కూడా తగ్గిపోతుంది. మనం కాలాన్ని నమ్ముకోవాలి. కాలాన్ని ఆరాధించాలి. మంచి కాలం రావాలని. కానీ కాలానుగుణంగా వచ్చే మార్పులతో మనం పోటీ పడకూడదు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో రోజుకో వస్తువు మార్కెట్లోకి వస్తుంది. దాని వెంట పరిగెడితే మన పని ఇంతే .
అని చెప్పిన భర్త మాటలలో ఎంతో నిజం ఉందనిపించింది సుజాతకి . రామారావు చెప్పిన ఉగాది సందేశం విని నవ్వుకుంది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి