ఇల్లు
ఇల్లు
" అబ్బా రోజు మన చెట్ల మీద వాలి కావు కావు మంటూ అరిచే కాకులు అదేమిటి రెండు రోజుల నుంచి ఎక్కడా కనబడలేదు. గోడ మీద నిన్న పెట్టిన అన్నముద్ద అలాగే ఉంది. ఈవేళ అన్న ముద్ద పెట్టిన ఆకాశంలో ఎక్కడా కాకిజాడ కనపడట్లేదు. మనసేమీ బాగుండట్లేదు. ఊరంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చనిపోయిన భవాని శంకర్ గారు ఏదో తీరని కోరికతో పోయారు. అది కోరికో లేకపోతే భయమో ఎవరికి ఏమి చెప్పలేదు. ఆయన పోయి అప్పుడే రెండు రోజులైంది. ఆయనకు తీరని కోరికలు ఏముంటాయి. కడుపుని పుట్టిన ఆరుగురు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలకి మనవలు కూడా పుట్టేశారు. అందరూ కోటీశ్వరులు కాకపోయినా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఆయన మీద ఆధారపడి న వాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు భవాని శంకరం గారి భార్య రెండవది మొగుడు వదిలేసిన కూతురు. వాళ్ళిద్దరికీ బతకడానికితగిన ఏర్పాట్లు ముందుగానే చేసేసాడు భవాని శంకర్ గారు. పిల్లలందరూ తండ్రి కార్యక్రమాలన్నీ యధావిధిగానే చేస్తున్నారు. మరి కాకి అన్నo ముద్ద ఎందుకు తీసుకెళ్లడం లేదు ఎవరికీ అర్థం కాని ప్రశ్న అలా ఎవరిలో వాళ్లు బాధపడుతూ కార్యక్రమాలు నడిపిస్తున్నారు.
అలా పన్నెండు రోజులు గడిచిపోయాయి కానీ ఏనాడు కాకి అన్నం ముద్ద తీసుకెళ్లలేదు.కుటుంబ సభ్యులు ఎవరు మటుకు వాళ్ళు మనవలుతో సహా దండం పెట్టుకున్న కాకి కనికరించలేదు.
ఇల్లంతా ఒక్కసారి బోసిపోయింది. ఎక్కడ సందడి లేదు.
పాపం భవాని శంకర్ గారు బతికున్న రోజుల్లో ఆ ఇల్లు ఎంత సందడిగా ఉండేది. భవాని శంకర్ గారు ఒక ఆయుర్వేద వైద్యుడు. ఎప్పుడో ఒక చిన్న చేతి సంచి తో భార్యను తీసుకుని కోనసీమలోని ఊరికి వచ్చి ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ పొరుగు గ్రామానికి క్యాంపులకు వెళుతూ కష్టపడి సంపాదించిన సొమ్ముతో 500 గజాల స్థలం కొనుక్కుని అందంగా కట్టుకున్న ఇల్లు అంటే ఆయనకి చాలా ఇష్టం. చుట్టూ మామిడి పనస దానిమ్మ అరటి జామ చెట్లు, అన్నిరకాల పూల మొక్కలతో ఆ ఇల్లు చూడడానికి నందనవనంలా ఉంటుంది. ఉదయం లేస్తూనే భవాని శంకర్ గారు తోటంతా శుభ్రంగా తుడుచుకుని మొక్కలకు నీళ్లు పెట్టుకుని మందుల తయారీలో మునిగిపోయేవారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు అలా దూరప్రాంతాల నుంచి కూడా పేషెంట్లు వస్తూనే ఉండే వారు
దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లని భోజనం పెట్టకుండా పంపడు. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళాలి అది ఆయన పద్ధతి.అలా సాయంకాల వరకు పేషెంట్లతో గడిపి స్నానం చేసి వీధి అరుగు మీద కూర్చునేవాడు. అప్పటికే ఆ ఊరిలోని పెద్దలందరూ అక్కడికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.
అందరూ ఇంచుమించుగా ఆయన వయసు వాళ్లే. ఆ కబుర్లు గ్రామ రాజకీయాల నుంచి దేశ రాజకీయాల వరకు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అబ్బా ఒకటేమిటి అలా ఎనిమిది గంటల వరకు సాగేవి. మధ్యలో చిరుతిళ్లు ఇంట్లో నుంచి కానీ వీధిలో నుంచి కానీ వచ్చేవి. ఎప్పుడూ పదిమందితోటి సందడిగా ఉండే ఆ ఇల్లు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ ఇల్లు ఆయనని ఆర్థికంగా గట్టివాడిని చేసింది. కుటుంబ పరంగా మంచి సంతానాన్ని ఇచ్చింది. ఎన్నో మొండి రోగాలను తగ్గించి మంచి డాక్టర్ అని పేరు తెచ్చుకునేలా చేసింది. వృత్తిపరంగా ఒక మెట్టు ఎక్కిo చేసింది. ఎన్నో బహుమతులు సంపాదించింది. తెలియని వ్యక్తి ఇంటికి వచ్చిన భోజనం పెట్టి సాగనంపే మంచి అన్నపూర్ణలాటి ఇల్లాల్ని ఇచ్చింది అది ఆ ఇల్లు మీద ఆయనకున్న అభిప్రాయం.
ఆయనకు వయసు ముదిరే కొద్దీ ఈమధ్య ఒక బెంగ పట్టుకుంది.
తను చనిపోయిన తర్వాత పిల్లలందరూ ఇంకా ఊర్లో ఇల్లు తోటి పని ఏముందని అమ్మేసుకుని వెళ్ళిపోతారేమో అని భయం. దానికి తోడు బెంగ. ఒకసారి అమ్ముకుంటే మళ్లీ ఏ పిల్లలు ఇంత పెద్ద ఇల్లు కట్టలేరు. ఆ కాలం వేరు.ఈ కాలం వేరు. ఆ కాలంలో ఇల్లు కట్టడం అంటే ఈ కాలం కంటే ఈజీ. డబ్బుతో పాటుబాగా అనుభవజ్ఞుడైన తాపీ మేస్త్రి, వడ్రం మేస్త్రి లు ఉంటే సరిపోయేది.
దానికి తోడు ఆయుర్వేద వైద్యం చేసేవారు కాబట్టి ఆ ఊరి జనంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. డబ్బు కోసం ఎవరిని పీడించేవాడు కాదు.
ఎంత ఇస్తే అంత జేబులో పెట్టుకునే వాడు. అలాంటి డాక్టర్ గారికి ఆ ఊరి జనం శ్రమదానం చేసి ఇల్లు అందంగా ఇలా కట్టారు. మరి మెయిన్ రోడ్డు మీద ఉన్న ఇల్లు మంచి రేట్ వస్తుంది అమ్మేయండని ఇదివరలో పిల్లలు గొడవపెట్టా రు. అప్పుడు ససేమీరా ఒప్పుకోలేదు భవాని శంకర్ గారు . ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళ అమ్మ మాట ఎవరు వినరు అని తనలో తాను మధనబడుతూ మరి పిల్లలు ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో తన భార్య ,కూతురుఎక్కడ ఉంటారు.. అద్దె ఇళ్లల్లో ఆ నగరాలలో ఎలా బతుకుతారు అనుకుంటూ తన మనసులోని మాటని భార్యతో పంచుకున్నాడు. భార్యకు కూడా ఆయన భయం సమంజసమే అనిపించింది. చివరికి భార్యతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
భవాని శంకర్ గారి కార్యక్రమాలన్నీ అయిపోయి పిల్లలందరూ ఎవరు మటుకు వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోతూ భవాని శంకర్ గారు భార్యని కూతుర్ని తమతో పాటు వచ్చేయమని అడిగారు. మేము ఇల్లు వదిలి ఎక్కడికి రాలేమని ఇక్కడ ఉంటే నాన్నగారు ఉన్నట్లు ఉంటుందని ఆ నగరంలో ఉండలేమని చెబుతూ నాన్నగారు పోయేటప్పుడు ఈ ఇంటి గురించి ఒక మాట చెప్పారు. ఆయనకు ఇల్లు అంటే ప్రాణం.
ఆయన దగ్గర ఒక మొండి రోగానికి వైద్యం చేయించుకుని తగ్గి ఆరోగ్యం కుదుటపడిన ఈ ఊరి వాడు తను పిల్లల దగ్గరికి వెళ్ళిపోతూ భవాని శంకర్ గారినీ బ్రతిమాలి ఈ స్థలం అమ్మడం జరిగింది.
మీ నాన్నగారి దగ్గర అప్పుడు డబ్బులు లేవుట. ఉన్నప్పుడల్లా డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుందామనే లోపు ఆయన చనిపోయారు. ఒకటి రెండు సార్లు హైదరాబాదుకు కూడా వెళ్లి వాళ్ళ పిల్లల్ని కలుసుకున్న వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయడానికి రాలేదు. ఇంతవరకు ఇంటికి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత ఇల్లు కట్టేసాం. ఇంకా ఈ స్థలం ఆ ఓనర్ గారి పేరు మీద ఉంది. మీ నాన్నగారి పేరు మీద అగ్రిమెంట్ మాత్రమే ఉంది. అగ్రిమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన సమయం ఎప్పుడో అయిపోయింది కదా.
డబ్బు పూర్తిగా ఇచ్చినట్లు రసీదులు మటుకు ఉన్నాయి అంటూ ఆ కాగితాలు తెచ్చి ఇచ్చింది. ఇంటికి దస్తావేజులు లేవు అంటూ చెప్పింది. ఈ విషయం చాలా సార్లు మీ నాన్న నాతోటి చెప్పారు. ఈ విషయం ఆయన మనసులో ఉండిపోయింది. అందుకనే కాకి కూడా అన్నం ముట్టుకోలేదు అంటూ ఏడుపు మొదలు పెట్టింది. అంతవరకు ఇల్లు అమ్మితే కోటి రూపాయలు వస్తాయి అని రెండు కోట్లు వస్తాయి అనుకుంటూ లెక్కలు చూసుకునే భవాని శంకర్ గారు కొడుకులు కోడళ్ళ బుర్రలు తిరిగిపోయేయి. ఎవరు ఏమి మాట్లాడలేదు.
ఇప్పుడు కాగితాలు పుట్టించాలంటే చాలా ఖర్చవుతుంది. ఎవరు పెట్టుకుంటారు ఈ డబ్బు అనుకుంటూ ఎవరైనా బాధ్యత తీసుకుంటే మనకి వాటా వస్తుంది కదా అనుకుని పిల్లలు ఎవరు మటుకు వాళ్ళు వెళ్లిపోయారు. అంతేకానీ ఎవరికి కూడా లాయర్ ని సంప్రదించలేదు.
పిల్లలందరూ వెళ్లిపోయిన తర్వాత భవాని శంకర్ గారి కూతురు అమ్మ నిజంగానే డాక్యుమెంట్లు లేవా అని అడిగింది. అదేం కాదమ్మా మన జీవితాలు వెళ్లాలి కదా. లేదంటే వీళ్ళు ఇప్పుడే ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతారు.
మనమిద్దరం దిక్కులేని వాళ్ళమైపోతాం. ఇది మీ నాన్నగారు ఆలోచన. అందుకే అన్ని డాక్యుమెంట్లు పెట్టిలో పెట్టి అటక మీద పెట్టారు అంటూ తీసి చూపించింది. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది ? అoటు అడిగింది కూతురు. మనం లెటర్ వ్రాసి ఇనప్పెట్లో పెడదామంటూ ఆ పని చేయడానికి ఇద్దరు ఉపక్రమించారు. కొద్ది కాలానికి భవాని శంకర్ గారి భార్య కూతురు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి వస్తూ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఏదో కాగితాల కోసం ఇనప్పె ట్టి వెతుకుతూ ఉంటే పిల్లలకి ఈ లెటర్ కనబడింది.
ఇంకేముంది అడ్డు ఆపు ఏమీ లేదు కదా అటక మీద ఉన్న డాక్యుమెంట్లు కిందకు దింపి చేతులు మార్చేశారు భవాని శంకర్ గారి పిల్లలు.
ఆ ఊర్లో మంచి డాక్టర్ గా పేరు సంపాదించుకున్న భవాని శంకర్ గారి శిలా విగ్రహం పెట్టి ఊరి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. భవాని శంకర్ గారి కోరిక ప్రకారం భార్య కూతురు జీవితాలు ఆ ఇంట్లోనే తెల్లారిపోయాయి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి