నిజమైన కార్మికుడు

నిజమైన కార్మికుడు

" వచ్చే నెలలోనే మన ప్రధాన కార్యాలయం నుంచి ఆడిటర్లు వస్తున్నారు. మన బ్రాంచ్ కి ఇన్స్పెక్షన్ టైం అయిపోయింది. ఏ క్షణమైనా రావచ్చు. మీరందరూ మీకు సంబంధించిన రికార్డులు అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ముఖ్యంగా రికార్డ్ రూము, బాత్రూం శుభ్రంగా ఉంచండి .ఇప్పటినుంచి ఎవరూ సెలవులు అడగడానికి వీల్లేదు అందరూ సమయానికి బ్రాంచ్ కి రావాలి రోజు కౌంటర్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. అంటూ ఆ బ్రాంచి యజమాని తన కింద ఉద్యోగస్తులకి చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి ఎవరెవరు ఏ పనులు చేయాలో ఒక పుస్తకంలో వ్రాసి సంతకాలు తీసుకుని తన సీట్ లోకి వెళ్ళిపోయాడు ఆ బ్రాంచ్ మేనేజర్ సత్యా రావు. 

అప్పటినుంచి ఉద్యోగస్తుల గుండెల్లో రాయి పడింది. మామూలుగానే రోజు రాత్రి 10 గంటల వరకు బ్యాంకు లోనే సరిపోతుంది. ఇంకా ఈ ఆడిటోచ్చిందంటే చెప్పేదేముంది. ఆదివారాలు ఉండవు శనివారాలు ఉండవు జాతీయ సెలవు దినాలు ఉండవు. ఆ నెల రోజులు బ్యాంకు లోనే సరిపోతుంది అనుకుంటూ పెండింగ్ పనుల్లో మునిగిపోయారు ఆ బ్రాంచ్ సిబ్బంది.

ఆ బ్రాంచ్ లో ఎవరి కౌంటర్ బాధ్యత వాళ్లకు ఉంటుంది కానీ అన్ని బాధ్యతలు తన నెత్తి మీద వేసుకునే వాళ్లు ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఒకరు ఆ బ్రాంచ్ కి మేనేజరు రెండోవాడు ఆ బ్రాంచ్ లో పనిచేసే క్రింది స్థాయి ఉద్యోగి. ఒకప్పుడు సబ్ స్టాఫ్ అనేవారు. ఇప్పుడు మెసెంజర్ అంటున్నారు. ఆధునిక కాలంలో అన్నీ పోయి అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిపోయాడు ఆ క్రింది స్థాయి ఉద్యోగి. జీతభత్యాలు మాట దేవుడెరుగు మేనేజర్ గారు లేకపోయినా ఆ కార్యాలయం నడుస్తుందేమో కానీ ఈ ఉద్యోగులు లేకుండా ఇక్కడ పైలు అక్కడికి వెళ్ళదు. ఎక్కడ పనులు అక్కడే . అంత ప్రధానమైన వ్యక్తి. 

అందరికంటే ముందుగా కార్యాలయం తాళాలు తీసుకుని అద్దంలా తుడిచేసి అన్ని డస్కుల దగ్గర మంచినీళ్ల బాటిల్ పెట్టి ఎకౌంటెంట్ గారు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ బడుగు ఉద్యోగి. అక్కడ నుంచి అటు కస్టమర్లకి ఇటు ఉద్యోగస్తులకు ఏమి కావాలంటే అవన్నీ సమకూరుస్తూ కస్టమర్లకి సహాయం చేస్తూ మేనేజర్ గారు పిలిచినప్పుడల్లా వెళ్లి అటెండ్ అవుతూ ఫీల్డ్ ఆఫీసర్ గారికి లోన్ల రికవరీ కి సహాయం చేస్తూ అకౌంటెంట్ గారికి పాత రికార్డులన్నీ తెచ్చిస్తూ ఒకటేమిటి మధ్యాహ్నం లంచ్ తెచ్చుకోని వాళ్లకి లంచ్ సమకూరుస్తూ అందరికీ తలలో నాలుకలా ఉంటాడు ఆ ఉద్యోగి. ఏ ప్రత్యేకమైన పని వచ్చిన కష్టం ఆ ఉద్యోగిదే. అలా అందరూ జలగలా రక్తం తాగేస్తుంటే నీరసపడిపోయి రాత్రి ఎప్పటికో ఇంటికి చేరుతాడు. మళ్లీ ఉదయం విధి నిర్వహణ మామూలే.

దానికి తోడు చురుకైన తెలివైన కుర్రవాళ్ళు ఉంటే ఇంకేముంద
అన్ని పనులకి వాళ్ళనే వాడుకుంటారు. ఇది ప్రతి చోట జరిగేదే.

అలా జీవన పోరాటంలో బాధపడుతున్న ఆ క్రింది స్థాయి ఉద్యోగికి ప్రత్యేకమైన పని అప్పగించబడింది. మామూలు పనితో పాటు. ఆ బ్రాంచ్ మేనేజర్ గారు చెప్పినట్లు ఒక శుభ ముహూర్తంలో ఆడిటర్ గారు వచ్చారు. ఈ క్రింది స్థాయి ఉద్యోగికి పరిచయం ప్రత్యేకంగా అక్కర్లేదు. కారణం ఆడిటర్ గారు ఆ కార్యాలయంలో అడుగుపెట్టేటప్పటికీ ఆ కార్యాలయాన్ని శుభ్రం చేస్తూ కనపడిన మొట్టమొదట వ్యక్తి. నమస్కారం పెట్టి పేరు గోత్రనామాలు చెప్పుకున్నాడు. మంచినీళ్ల బాటిల్ అందించాడు. గౌరవంగా కుర్చీ దులిపి కూర్చోబెట్టాడు. చేతిలోని సూట్ కేస్ అందుకుని ఒక మూలగా పెట్టాడు. తన బాధ్యత ఏమిటి అంటే వెంటనే తన యజమానికి కబురు అందించాడు. మాటిమాటికి వాచి చూసుకుంటున్న ఆడిటర్ గారికి మేనేజర్ గారు రికవరీ కి వెళ్లారు అండి. దారిలో ఉన్నారు వచ్చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. ఆడిటర్ గారికి ఇవన్నీ సర్వసాధారణం. ఆయన సర్వాంతర్యామి. అన్నీ తెలిసిన వ్యక్తి. కాఫీ తాగుతారా అంటూ ఆప్యాయంగా కాఫీ కప్పు అందించాడు. ఇంతలో మేనేజర్ గారు ఆయాస పడుతూ చమటలు కక్కుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి అందరి పరిచయాలు అయిపోయాయి. చేయవలసిన పనులు చూడవలసిన రికార్డు ఆడిట్ ఎంత ముఖ్యమో చెప్పుకుంటూ వచ్చారు ఆడిటర్ గారు. తొలి రోజు అలా గడిచిపోయింది.

ఆ క్రింది స్థాయి ఉద్యోగికి మామూలు పనితో పాటు ఈ ప్రత్యేకమైన పని కూడా నెత్తి మీద పడింది. అయినా ఈ పని ఏమీ కొత్త కాదు. ప్రతిసారి ఆడిటర్లు వస్తూనే ఉంటారు. ఆ క్రింది స్థాయి ఉద్యోగి కష్టపడుతూనే ఉంటాడు. చేసే పనిలో ఏమి మార్పు ఉండదు. అకౌంట్ లో నెలాఖరకు పడే జీతoల్లో కూడా ఏ మార్పు ఉండదు. అయినా బ్రతకడానికి ఏదో ఒక దారి కావాలి కదా. అందుకుని ఆ కార్యాలయాన్ని తన కన్నతల్లిలా నమ్ముకుని కష్టించి పని చేస్తున్నాడు ఆ క్రింది స్థాయి ఉద్యోగి. 

మరునాటి నుంచి ఉదయం కార్యాలయం తెరిచి అంతా శుభ్రం చేసుకుని మేనేజర్ గారితో పాటు హోటల్ రూమ్ కి వెళ్లి ఆడిటర్ గారిని తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్ పెట్టి కాఫీ ఇచ్చి ఇంక అక్కడి నుంచి ఆడిటర్ గారు చెప్పిన రికార్డు తీయడంలో, ఆడిటర్ గారికి సహాయం చేయడంలో మునిగిపో యాడు. ఎప్పుడూ ఆడిటర్ గారు పిలుస్తారో తెలీక గబగబా నాలుగు ఇడ్లీలు లోపల పెట్టుకుని ఆ తింటున్న పదార్థం యొక్క రుచిని కూడా అనుభవించలేక ఎవరో తరుముకుని వస్తున్నట్లుగా బ్రేక్ ఫాస్ట్ అయిందనిపించి ఆ వేడి వేడి కాఫీ నాలుగు గుక్కలు తాగి బయటకు వచ్చేటప్పటికి కార్యాలయం యొక్క సాధారణ కార్యకలాపాలు మొదలయ్యాయి. 

ఇంకేముంది ఆ పద్మవ్యూహంలోకి అడుగు పెట్టాడు మన వీరుడు. ఆ పద్మవ్యూహంలోకి వెళ్లిన తర్వాత బయటకు విదిలించుకుని రావడం అంటే మాటలు కాదు. ఎవరి మాట వినకపోతే వాళ్లకే కోపం. అందరికీ అర్జెంట్లే. అందరికీ ఆడిట్ హడావుడి. 

ఏదైనా అంటే రికార్డు దొరకట్లేదు అంటే మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది కబురు. మీరు రికార్డులు సరిగా పెట్టుకోవడం లేదంటూ ఆయన ఆడిట్ టెన్షన్లో ఒక మాటకి పది మాటలు మాట్లాడతాడు. అందరూ అలా ఉండరు. కొంతమంది మాటలే అలా ఉంటాయి. అనుభవం ఉన్న యజమానికి ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలో బాగా తెలుస్తుంది. అదే ఆయన టాలెంట్. కంగారు పడకు సాయంకాలం నేను కూడా సహాయం చేస్తాను. మొన్ననే కదా చూశాం దొరుకుతుంది వాళ్ళు అలాగే అంటారు అని ఊరుకో పెడతాడు క్రింది స్థాయి ఉద్యోగిని. ఆ క్రింది స్థాయి ఉద్యోగి అల్ప సంతోషి. 

ఒకపక్క తన చిన్న మెదడులో ఎన్నో ఆ ఆఫీసుకు సంబంధించిన సమస్యలున్న చాలా పెద్ద వీరుడిలా పాత రికార్డులు కూడా దొరకబట్టి కళ్ళల్లోనూ ముక్కులోను దుమ్ముపోతున్న లెక్కచేయకుండా దెబ్బలు తగిలిన బాధపడకుండా ఎవరికీ చెప్పకుండా అలా రాత్రి పగలు కష్టపడి కష్టపడి తన విధి నిర్వహణ పూర్తి చేస్తాడు. ఇంతలో లంచ్ టైం అవుతుంది. 

ఆ లంచ్ లో ప్రత్యేకమైన వంటకాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని దూరమైన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి పట్టుకొచ్చి ఆప్యాయంగా వడ్డిస్తాడు. తన కడుపు నింపేటప్పటికీ సాయంకాలం నాలుగు గంటలు అవుతుంది. టీ తాగే సమయం అయిపోయింది అంటూ పరిగెట్టుకుంటూ వెళ్లి అక్కడ దొరికే మంచి స్నాక్స్ తీసుకుని ఆడిటర్ గారికి పెట్టి మళ్లీ విధి నిర్వహణలో మునిగిపోతాడు. అలా రాత్రి 11 గంటల వరకు ఆ కార్యాలయంలోనే జీవితం గడిచిపోతుంది. రాత్రి ఆడిటర్ గారిని హోటల్ రూములో దించి ఇంటికి వెళ్లేటప్పుడు డేట్ మారిపోతుంది. ప్రతిరోజు హడావుడే. ప్రతిరోజు ఒత్తిడి. ఎప్పటివో పాత రికార్డులు లోన్ ఫైల్ ఎకౌంటు ఓపెనింగ్ లు ఓచర్లు ఒకటేమిటి సమస్తం అన్ని వెతికి పట్టుకుని ఒక గజదొంగను పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోతాడు మన క్రింది స్థాయి ఉద్యోగి.

అలా సుమారు నెలరోజులపాటు రాత్రి పగలు పనిచేసి ఆ బ్రాంచ్ రేటింగ్ పెంచడానికి పరోక్షంగా సహాయం చేస్తాడు మన ఉద్యోగి. ఆడిటర్ గారు వెళ్లే ముందు పెట్టిన మీటింగ్లో యజమానిని
ఉద్యోగుల టీం వర్క్ ని బాగా పొగుడుతారు. ఆ టీం లో మన క్రింది స్థాయి ఉద్యోగి కూడా ఒక మెంబర్ అయినందుకు పొంగిపోతాడు. కానీ ప్రత్యేకమైన ప్రశంసలు మటుకు ఎవరు ఇవ్వకపోయినా తన బాధ్యత తాను కచ్చితంగా నిర్వర్తిస్తాడు. ప్రమోషన్ మీద బదిలీ అయిన బ్రాంచ్ మేనేజర్ గారు ఉద్యోగస్తులు ఒక స్వీట్ ముక్క తినిపిస్తారు కానీ ఒక ప్రత్యేకమైన అభినందన ఆ క్రింది స్థాయి ఉద్యోగికి ఉండదు . ఎవరో కొద్దిమంది ఉంటారు. కానీ ప్రతి పండగకి తన కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు పంపుతూనే ఉంటాడు ఆ క్రింది స్థాయి ఉద్యోగి. ఒకప్పుడు ఒళ్ళు వంచుకోకుండా పనిచేసిన టెంపరరీ ఉద్యోగులని పెర్మనెంట్ చేయడానికి ఎంతోమంది కార్మిక నాయకులు నడుం కట్టారు. ఒక మంచి పని చేసే వారిని ఎప్పుడూ అభినందించేవారు. ఇప్పుడు కాలం మారింది క్రింది స్థాయి ఉద్యోగులు పర్మినెంట్ ఉద్యోగులుగా ఎవరిని తీసుకోవడం లేదు. ఆ వ్యవస్థ మారిపోయింది. 

ఆ కార్యాలయంలో నిజమైన కార్మికుడు ఎవరు అంటే నేను ఎప్పటికీ ఆ క్రింది స్థాయి ఉద్యోగి అని నేను చెప్తాను. ఆ ఉద్యోగులకు అందరికీ నమస్కారం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట