సీసా తో జీవితం

 సీసా తో జీవితం 


మన జీవితానికి "సీసాకి " విడదీయరాని బంధం ఉంది. నిత్యం అనేకసార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాo. మన ఇంట్లో ఎక్కడ చూసినా ఈ సీసాలు కనబడుతుంటాయి. సీసా అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి.


 వంటింట్లో నూనె సీసాలు, గూట్లో కొబ్బరి నూనె సీసాలు రిఫ్రిజిరేటర్ లో మంచినీళ్ల సీసాలు ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ సీసాలు , హాల్లో అందానికి ఖాళీ సీసాలో వేసిన మొక్కలు, చెత్త పుట్టలో వాడి పడేసిన సీసాలు వాటి పేరు ఎందుకు ? ఇలా ఎక్కడపడితే అక్కడ కాళ్లకు తగులుతూ సీసాలు కనబడుతూనే ఉంటాయి.


రంగురంగుల సీసాలు ఒకరికి ప్రాణదాత అయితే మరొకరికి సరదా తీర్చేవి, ఇంకొకరికి పట్టెడు అన్నం పెట్టేవిగా ఉంటాయి. మాతృత్వం మరిచిపోయిన అమ్మ, లేదంటే అమ్మ పాలు రుచి చూసే అదృష్టం లేని పసిబిడ్డకి మరో అమ్మ ఆ పాలసీసా. వేళకి కడుపు నింపుతుంది. అప్పటివరకు గుక్క పట్టి ఏడుస్తున్న ఆ పసిబిడ్డ ఆ పాల సీసాని నోట్లో పెట్టగానే టక్కున ఏడుపు ఆపేస్తాడు. వాడికది అమృతంతో సమానం. 


బుడిబుడి నడకలు నేర్చుకుంటూ భుజాన్న బ్యాగు తగిలించుకుని పాఠశాలకు వెళ్లే బుజ్జిగాడికి ఒక అందమైన ప్లాస్టిక్ వాటర్ బాటిల్. అవసరానికి దాహం తీర్చే సాధనం. ఒకప్పుడు పాఠశాలలో మట్టి కుండ దాని పక్కన ఒక సత్తు గ్లాసు ఇవే మన అవసరానికి ఉపయోగపడేవి. కాలం మారింది. ఎవరి బాటిల్ వారిదే. ఇక్కడ కూడా మంచినీళ్లు సీసా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇంక పెద్దవాళ్లు ప్రయాణాల్లో మంచినీళ్లు కూడా సీసాలో నింపుకొని పట్టుకు వెళ్లడం చాలా సాధారణంగా జరిగే విషయం. 


ఇంకా మూడువందల అరవై ఐదు రోజులు ఏ కాలమైనా సరే అంగట్లో రంగురంగుల సీసాలో ఉన్న చల్లటి పానీయాన్ని అందరూ ఇష్టపడతారు. సీసాలో పోసిన ద్రవం రోడ్డు మీద వెళ్లే మన మనసు దోచుకుంటేయి. ఇంక యువత అయితే ఆ కోక్ సీసాలు అంటే ముచ్చట పడిపోతారు. కాలేజీలో అడుగుపెట్టిన తర్వాత సరదా కోసము, అనుభవం కోసం స్నేహితుడు బలవంతం కోసం ఆ సీసా పట్టుకుంటారు.


మనసు కోతి లాంటిది. కోతి పనులు చేస్తూ ఉంటుంది. ఆ వయసు కూడా అటువంటిదే. ఆ వయసులోనే ప్రేమ అంటూ అమ్మాయిలు వెంటపడే వాళ్లు చీ కొడితే విస్కీ బాటిల్ పట్టుకుంటారు. 


సరదా కోసం సాయంత్రం గడపడానికి కోసం పబ్బులు, క్లబ్లులు చేరే జనం. పెగ్గులు మీద పెగ్గులు సీసాలు ఖాళీ చేసే జనo ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం.


ఒకరికి నిషా ఇచ్చేది సీసా.మరొకరికి బ్రతుకు దారి చూపించేది ఖాళీ సీసా. సీసాలు కోసం జేబులు ఖాళీ అయ్యేది కొందరికి.సీసాలో అమ్మితేనే డొక్కా నిండేది మరికొందరికి.ఒకరికి జల్సా మరొకరి జీవనాధారం.


 రోజూ సీసాలు ఖాళీ చేస్తే కానీ తోచదు కొందరికి ఊరంతా తిరిగి సీసాలు ఏరితే కానీ పూట గడవదు మరి

కొoదరికి.


గుండెల్లోని వెతలు తీర్చు కోవడానికి సీసా ఖాళీ చేస్తారు కొందరు.గూడు లోని గువ్వల బువ్వ కోసం సీసాలతోటే జీవితం మరికొందరికి.


చెత్త లో పడేసిన సీసా బహుళ కంపెనీకి చేరి రంగు రంగుల ద్రవం నింపుకుని దుకాణo లో మళ్లీ మెరుపు.ఎన్ని సీసాలు ఏరిన సీసాల అబ్బాయి బ్రతుకంతా నలుపే.తరాలు మారినా తలరాతలు అంతే.ఏ గల్లీ చూసినా అవే బ్రతుకు చిత్రాలు చోద్యం చూసే వారే కానీ తోడు గా నిలిచే కర్ణుడు ఏడి.భుజం తట్టి ముందుకు నడిపించే సంఘమేది.

బ్రతుకు చిత్రం మార్చే భగవంతుడే రావాలి తప్ప.

బ్రతుకంతా తాగి తాగి ఒళ్ళు గుల్ల చేసుకున్న జనం ఒంట్లోకి మళ్లీ శక్తి చేకూర్చే ఉప్పునీళ్ళని ఎక్కించేది సెలైన్ బాటిల్. కడుపు నీరు పట్టి ఉబ్బిపోయి మొహం తెల్ల పడిపోయి ఒంట్లో రక్తం చుక్క మచ్చుకి కూడా కనపడకపోతే ఇక మనం ఆధారపడేది రక్తం సీసా మీద. ఇంకా ఆఖరి ఘడియలు సమీపించే ముందు గుర్తుకొచ్చేది గంగాజలం ఉన్న సీసా.


ఇలా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక్కో సీసా ఒక్కో అర్థాన్ని పుచ్చుకుంటుంది.

ఒకరిది పాలసీసా అయితే, మరొకరిదిది నీటి సీసా. ఇంకొకరిదిది మద్యం సీసా, మందు సీసా. ఒక్కొక్క సీసా ఒక్కొక్క జీవితం. ఏ సీసా చేతిలో ఉందో, ఆ జీవితం దానికి తగినదే.


సీసా లో ఉన్నదాన్నే మనం గ్రహిస్తాం. ఎవరికైతే అది అవసరం, అతడికి అది అవసరమైన శక్తి. కొన్నిసార్లు జీవితంలో మన చేతిలో ఉండే సీసా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది కూడా.

కాబట్టి…

సీసా అంటే కేవలం గాజు గాని, ప్లాస్టిక్ గాని కాదు… అది మన జీవన ప్రతిబింబం. మన అవసరాలు, అలవాట్లు, ఆశలు, ఆశ్రితాలు అన్నీ ఆ సీసాలోనే కనిపిస్తాయి.

ఇకనుంచి సీసా కనిపిస్తే – అది నీటి సీసా కావొచ్చు, మందు సీసా కావొచ్చు, తల్లి పాల సీసా కావొచ్చు – ఒక్కసారి ఆలోచించండి…

ఈ సీసాలో నేను ఎవర్ని చూస్తున్నాను? నాకు ఇది ఏ అర్థాన్ని గుర్తు చేస్తోంది?

జీవితం కూడా ఒక్క సీసా లాంటిదే – లోపల ఏమున్నదోనని ఎవరూ చూడరు,

కానీ తాగేది మాత్రం మనమే 


.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట