అమ్మ @వినాయక చవితి

అమ్మ @ వినాయక చవితి 

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే

ప్రపంచంలో ఏ శుభకార్యం జరిగిన ముందుగా గణపతి ఆరాధన తోటే మొదలవుతుంది . ఇది శాస్త్రం చెప్పిన విషయం.సృష్టికర్త అయిన బ్రహ్మకు కానీ సృష్టిని పరిపాలించే ప్రభువు విష్ణుమూర్తికి కానీ సృష్టి స్థితి లయకారుడు ఈశ్వరుడుకి కానీ తొలి పూజ అందుకునే అధికారం లేదు. ముందుగా గణపతి ఆరాధన చేయనిదే ఏ పూజ ప్రారంభించలేము.

గణపతి పార్వతీ పరమేశ్వరుల ప్రథమ పుత్రుడు. గణాలకు అధిపతి. విఘ్నాలను పారద్రోలేవాడు. ఇలా గణపతి గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. భాద్ర పద శుద్ధ చవితి నాడు ప్రతి ఇంట్లో గణపతి పూజ చేసుకుంటాం.

వినాయక చవితి ముఖ్యంగా పిల్లలు పెద్దలు ముదుసలి వారు అనే తారతమ్యం లేకుండా అందరూ చేసుకునే పండగ. మన హిందూ సాంప్రదాయంలో అన్ని వ్రతాలు కుటుంబమంతా కలిసి చేసుకోరు. కొన్ని వ్రతాలు ముఖ్యంగా స్త్రీలకే ఉద్దేశించబడినవి.
వినాయక వ్రతానికి అటువంటి తారతమ్యం లేదు.

మన ఇంటిలో జరిగే ఏ శుభకార్యామైనా పండుగ అయినా వ్రతమైనా సక్రమంగా నడిపించవలసిన బాధ్యత ముఖ్యంగా ఆ ఇంటి యజమానురాలుదే. ఇంటి యజమానురాలంటే ఇంకెవరు మన అమ్మ లేదా మన భార్య. 
 

పండగొస్తుందంటే ముందుగానే ప్రణాళికాబద్ధంగా దానికి సంబంధించిన పనులన్నీ చేసుకుంటూ పోతుంది. అమ్మ లో నాకు అమ్మ తనమే కాకుండా ప్రణాళికా రచన చేసే శాస్త్రవేత్త, ఆర్థిక ప్రణాళికలు వేసే ఆర్థిక శాస్త్రవేత్త ,ఒక గురువు, ఒక వ్యూహరచనచేసేసైన్యాధికారి,యజమాని,సహనశీలి కనపడతాడు. పిల్లలందరినీ సు శిక్షుతులై న సైనికులుగా తయారు చేసేది అమ్మే కదా. అందులో వినాయక చవితి పిల్లల విద్యాభివృద్ధికి సంబంధించిన పండగ.

మన తెలుగు వారికి పండగ అంటే ముందుగా ఇంటి శుభ్రత తోటి
పనులు ప్రారంభమవుతాయి. వినాయక చవితి ముందు రోజు
పాలవెల్లి కొనుక్కోవడం అలంకరణ పత్రి తెచ్చుకోవడం వినాయక ప్రతిమ చేసుకోవడం లేదా బజార్ నుండి తెచ్చుకోవడం ఇలాంటి పనులతో అమ్మ సతమత అవుతూ ఉంటుంది.

బజార్లు రకరకాల పూజా సామాగ్రి అలంకరణ సామాగ్రి
తో కళకళలాడుతూ ఉంటాయి. రేట్లు ఆకాశాన్నింటితే మన ఆర్థిక శాస్త్రవేత్త అంటే అమ్మ బడ్జెట్లో అన్ని అందంగా సమకూర్చుతుంది.

వినాయకుడికి ఏకవింశతిపత్ర పూజ ప్రశస్తనీయం. సాధారణంగా పల్లెటూరులో తోటల్లో ఈ పత్రి దొరికేది. పిల్లలందరూ తొలి రోజు మధ్యాహ్నం పత్రి సేకరణ కోసం పరుగులెత్తేవారు. అందమైన తోటలన్ని అంతరించిపోయిపచ్చదనం కరువైపోయి ప్యాకెట్లలో దొరికే ఆకులని పత్రిగా అమ్ముతుంటే కొనుక్కునే స్థితికి మనం వెళ్లిపోయాo.

ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టి మావిడాకుల తోరణాలతో గుమ్మాలను అలంకరించితే పండుగ కళ వచ్చినట్లే. 
ఆ పనులన్నీ అమ్మ చేతుల మీద జరగవలసిందే.

గణేశుడు ఆరాధనకు ఆ కాలంలో ప్రకృతిలో లభించే పండ్లు ఆకులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి దేవుడిని షోడశోపచారములు చేసి పూజించిన గణేష్ మహారాజ్ కి పాలవెల్లి అంటే కర్రలతో చేసిన నలుచదరపు ఆకారాన్ని వేలాడగట్టి దానికి వెలగపండు బ త్తా య కాయ మొక్కజొన్న పొత్తు జామకాయలతో అలంకరిస్తారు. 

పాలవెల్లి కట్టడంలో అంతరార్థం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పాలవెల్లి అంటే ముక్కోటి దేవతలతో సమానమని ,పాలపుంతని, గణేష్ మహారాజ్ ఛత్రమని అనేక రకములైన అర్థములతో చెబుతారు.

ఇక వినాయక ప్రతిమ విషయానికొస్తే మట్టి ప్రతిమ సర్వ శ్రేష్టమైనది. కొంతమంది ఇంటిలోనే మట్టి ప్రతిమ తయారు చేస్తారు. చాలామందికి ఇది అద్భుతమైన కళ .నవరాత్రులు అయిన తర్వాత చెరువుల్లో కాలువల్లో నిమజ్జనం చేసినప్పుడు మట్టి తొందరగా నీటిలో కలిసిపోతుంది. రంగురంగుల బొమ్మలలో ఉపయోగించిన రసాయనాల వల్ల నీటిలో ఉండే జీవరాసులు చాలా చనిపోతాయి. పుణ్యం బదులుగా పాపం వస్తుంది. 

తొలిరోజు పనులతో అలసిపోయినా అమ్మకి కంటిమీదకు నుకు రాకపోగా వాచీలో డేటు మారిన వెంటనే మంచం దిగి పండగ పనులు మొదలుపెడు తుంది. అటు రోజు వారీగా చేసే వంట తో పాటు ప్రత్యేక నైవేద్యం ఉండ్రాళ్ళు ఇంకా ఇంకా తినుబండారాలు.
పిల్లలు ఏది కోరితే అది . ఏకచత్రాధిపత్యంగా వంటింటి సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆ మహారాణికి తన సామ్రాజ్యంలో ని ప్రజల క్షేమమే ముఖ్యం.
 అలా అలా అన్ని సమయానికి సమకూర్చి పిల్లలకు అభ్యంగన స్నానం చేయించి మడి బట్టలు కట్టి పూజకు తయారు చేస్తుంది.

 ఈలోగా పిల్లలు అమ్మా ఆకలి అంటే ఒక సైన్యాధికారిగా పూజ
 అయిన తర్వాతే టిఫిన్ అంటూ కట్టడిచేస్తుంది. 
పిల్లలకి అమ్మ చెప్పినది శాసనం. గణపతి పూజా విధాన పుస్తకం శ్రీవారి చేతికి ఇచ్చి పూజ ప్రారంభం చేయిస్తుంది. అమ్మ నువ్వు కూడా రా అని పిల్లల అరిస్తే పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టించి కథాక్షతలు నెత్తి మీద జల్లుకుంటుంది. పిల్లల పుస్తకాలను వినాయకుడి దగ్గర ఉంచి వినాయకుడి ఆశీర్వాదం కోరుకుంటుంది.
 పిండి వంటలతో కుటుంబం అందరికి భోజనం పెట్టి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మది అన్నపూర్ణ అవతారం. అందరికంటే ఆఖరిన మిగిలిన దానితో సంతృప్తి పడి తన పనిలో నిమగ్నం అవుతుంది. పండగ ఒత్తిడితో అలసిపోయిన శరీరం సంతృప్తి పడిన మనసుతో నడవలో గడప మీద తల పెట్టుకుని విశ్రాంతి.

ఏ శుభకార్యమైన అమ్మదే బాధ్యత. నాన్న ఆర్థిక అధికారి మాత్రమే. అందుకే నూరు శాతం బాధ్యత అమ్మ తీసుకుంటుంది.

ప్రతి ఇంటిలోని అమ్మ కథ ఇదే. అమ్మకి తన కుటుంబం ముఖ్యం.
పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యం జరిగినా అమ్మ 
అవిశ్రాంత సైనికుడిలా తన బాధ్యతని సక్రమంగా నిర్వహించి ఊపిరి పీల్చుకుంటుంది. 

ఆ ఇంటిలో ఉండే ఆడపిల్ల అమ్మను అనుకరిస్తుంది. అమ్మ అడుగుజాడల్లో నడుస్తుంది. ఆ పెళ్లి అయ్యి తను వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమానురాలుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగల ఉత్తమమైన శిక్షణ అమ్మ దగ్గర నుండి పొందుతుంది. అందుకే అమ్మ మార్గదర్శి. 

సుమారు 50 సంవత్సరముల క్రితం ఉమ్మడి కుటుంబంలో సుమారుగా 20 మంది పిల్లలు ఉండే ఆ లంకంత కొంపలో 
వినాయక చవితి రోజు, అంతకు ముందు రోజు మా అమ్మ సీతమ్మ మా పిన్ని సత్యవతి గార్లు పడ్డ శ్రమ పిల్లలు చేత పూజ చేయించే విధానం ఒక్కసారి గుర్తుకు వచ్చి ఇలా మీ ముందుకు 
అమ్మల శ్రమకి అక్షర రూపం ఇచ్చాను.. ఆర్థిక భరోసా ఉన్న కుటుంబాలైతే పరవాలేదు. రూపాయలు ఖర్చు పెడితే శ్రమ తగ్గిపోతుంది. ఆ కాలంలో పరిస్థితుల అటువంటివి కావు . ఆ ఇద్దరు మాతృమూర్తులకి వారి సహనానికి ఓపికకి నా శతకోటి వందనాలు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట