దసరా
మానవ జీవితానికి పండుగలు అంటే ఒక వరం. స్నేహితులు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండే రోజు పండుగ రోజు. ఒత్తిడితో నలిగిపోతున్న మానవ జీవితం ఆ ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతుంది. అన్ని మతాల వారు ఈ పండుగలు జరుపుకుంటారు. ఎవరి మతానుసారం వారికి ప్రత్యేకమైన పండుగలు ఉంటాయి. ముస్లిం మతస్తులకి రంజాన్ ప్రత్యేకమైన పండగ. అలాగే క్రైస్తవ సోదరులకు క్రీస్తు జన్మదినం అయిన క్రిస్మస్ ఒక పండుగ. హిందూమతస్తులకి ఉగాది మొదలు ప్రతినెలా ఏదో ఒక పండగ జరుపుకుంటారు. ఇది కాకుండా అమ్మవారి జాతరలు కూడా ఒక పండగలా చేసుకుంటారు.
మొన్నటి వరకు గణేష్ నిమజ్జోత్సవాలు ఆనందంగా జరుపుకున్నాము. ఇక దసరా ఉత్సవాల సందడి మొదలైంది. మార్కెట్లో దసరా తగ్గింపు ధరల హోరు ప్రారంభమైంది. ప్రయాణాల సందడి మొదలైంది.
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. దీన్నే దసరా పండుగ అంటారు. శరన్నవరాత్రులు అని కూడా అంటారు. శరదృతువులో వచ్చే పండుగ దసరా. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి భగవంతుడు వివిధ రూపాల్లో అవతారాలు ఎత్తేవాడు. మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి త్రిమూర్తులు సృష్టించిన శక్తి స్వరూపం దుర్గామాత.
శివుడు నుండి త్రిశూలం, ఇంద్రుడు నుండి వజ్రాయుధం, విష్ణుమూర్తి నుండి సుదర్శన చక్రం పొంది 18 బాహువులను కలిగిన శక్తి స్వరూపం. సింహాన్ని వాహనంగా కలిగి ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తారు. దుర్గాదేవి అవతారం తోటి మొదలైన నవరాత్రి ఉత్సవాలు నవమి నాడు మహిషాసుర మర్దని, దశమి నాడు రాజరాజేశ్వరి దేవి అవతారంతో దేవి దర్శనమిస్తుంది.
ఈ తొమ్మిది రోజులు ఆయా అవతారమూర్తికి ఇష్టమైన నైవేద్యములతో పాటు ప్రత్యేక పూజలు కూడా జరుపుతారు. దేవి మహిషాసురుడనే రాక్షసుడితో తొమ్మిది రోజులు పాటు యుద్ధం చేసి సంహరించి లోకాలను రక్షిస్తుంది. అందుకే పదో రోజు సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండగ జరుపుతారు.
విజయదశమినాడు చేసే జమ్మి చెట్టు పూజ చాలా ప్రత్యేకమైనది. జమ్మి చెట్టును పూజిస్తే పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. విజయదశమినాడు ఆయుధ పూజలు, వాహన పూజలు కూడా జరుపుతారు.
దసరా పండుగకి ప్రతి మనిషి బాల్యానికి ఒక ప్రత్యేక సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూరి పాఠశాలలో చదివిన పిల్లలకి ఆ అనుభవం మరిచిపోలేని ముఖ్యమైన జ్ఞాపకం. ఆ రోజుల్లో పిల్లలందరినీ దసరా పాటలు పాడిస్తూ ఇంటింటికి పిల్లల్ని త్రిప్పుతూ గురువులు బహుమానాలు పొందేవారు. పిల్లలందరికీ పప్పు బెల్లాలు పంచిపెట్టేవారు.
అలనాటి దసరా పద్యాలలో — "ఏ దయా మీ దయ మా మీద లేదు, ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు" అంటూ పాడే పిల్లల పాటలు ఎంతో మధురానుభూతిని కలిగించేవి. పిల్లలు విల్లంబులు ధరించి, బహుమానాలు ఇచ్చిన వారి మీద విల్లంబులు సంధించి పూలు ఆకులు చల్లేవారు. ఆ విల్లంబుల్ని "గిలకలు"నేవారు. ఇది దసరాకు సంబంధించిన బంగారు అనుభూతి.
ఇక దసరా ఉత్సవాల్లో ముఖ్యమైంది బొమ్మల కొలువు. వివిధ రకాల బొమ్మలను తొమ్మిది రకాల మెట్లపై అలంకరించి పేరంటం జరుపుకుంటారు. పిల్లలకి ఇది సంతోషకరమైన విషయం.
దసరా పండుగ విషయంలో మరొక ముఖ్యమైన అనుభవం దసరా మామూళ్లు. అన్ని రకాల కింద స్థాయి ఉద్యోగులు దసరాకి మామూళ్లు అడుగుతారు. ఇది ఇటీవల కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఈ ఆచారం ఎలా వచ్చిందో తెలియదు. ఇటీవల కాలంలో పదోపరకతో సరిపెట్టుకోవటం లేదు.
ఇలా పది రోజులు పాటు సాగిన దసరా పండుగ నిమజ్జనోత్సవంతో ముగిస్తుంది. ఈరోజుల్లో నిమజ్జోత్సవాల్లో బాణసంచాలు, పగటివేషగాళ్ళు, హోరెత్తించే స్పీకర్లు — వీధులన్నీ సందడిగా ఉంటాయి. ఈ కలియుగంలో సమాజంలో ఉన్న చెడులన్నీ పోయి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఈ పండగలు జరుపుకోవాలని ఆశిద్దాం
✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
📍 కాకినాడ
📞 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి