ఆ నాలుగు చుక్కలు



ఇంకా కాంతమ్మ రాలేదు ఏమిటి ? రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చేసేదే! ఏమైంది అబ్బా అనుకుంటూ మాటిమాటికీ వీధిలోకి తొంగి చూస్తున్న సుజాతకి వాడిపోయిన మొహంతో దూరం నుంచి వస్తున్న కాంతమ్మ కనబడింది. 


సుజాతను చూస్తూనే రాత్రి మా చంటోడు నిద్రపోలేదు తెల్లవార్లు పీకుతూనే ఉన్నాడు. నా దగ్గర పాలు లేవని తెలుసు. పోత పాలు పడుతుంటే విరోచనాలు అవుతున్నాయి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కాంతమ్మ. 


భగవంతుడు సృష్టి చాలా విచిత్రంగా ఉంటుంది. కాంతమ్మ కొడుకు కంట సుజాత కొడుకు రెండు నెలల పెద్ద. సుజాత కొడుకు రెండు గుక్కలు తాగి పక్కకు తిరిగి పడుకుంటాడు. ఒకపక్క అతివృష్టి మరొకపక్క అనావృష్టి. ఇద్దరినీ సృష్టించింది దేవుడే. అయినా ఎవరి అదృష్టం వారిది. విజ్ఞాన శాస్త్రం ఎంత బాగా అభివృద్ధి చెందిన తల్లిపాలు మించిన బిడ్డకి ఏ ఆహారము లేదంటారు డాక్టర్లు. తల్లిదగ్గర పాలు లేక కొన్ని కుటుంబాలు బాధపడుతుంటే ఉన్న పాలు బిడ్డకు పంచి ఇవ్వడానికి అందం చెడిపోతుందని ఉద్దేశంతో కొంతమంది కావాలని పోత పాలు అలవాటు చేస్తున్నారు కొంతమంది తల్లులు.


కాంతమ్మ మాటలు వినేసరికి ఒక బిడ్డకు తల్లిగా సుజాత హృదయం చలించిపోయింది. ఆ చిన్ని బొజ్జ కి తల్లి ఇచ్చే నాలుగు చుక్కలే ఆధారం. ఆ నాలుగు చుక్కలు తల్లి దగ్గర లేకపోతే ఆ చంటి పాప ఏడ్చే ఏడుపు హృదయ విదారకంగా ఉంటుంది. ఇది బజారులో దొరికే వస్తువు కాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆ నాలుగు చుక్కలు లేక పిల్లలు అల్లాడిపోతున్నారు.  


మనం తెల్లవారు లేస్తే ఎంతోమంది ఎన్నో రకాలు సహాయం చేస్తుంటాము. కానీ రకమైన సహాయం చేయడానికి తన లాంటి వాళ్లకు మాత్రమే అవకాశం ఉంది అని సుజాత అనుకుని భయపడుతూ తన మనసులోని మాటని అత్తగారికి చెప్పింది.

సుజాత అత్తగారు రమణమ్మ మూతి మూడు వంకర్లు తిప్పి నీకెందుకు వచ్చిన పని ! నీ పిల్లాడి సంగతి నువ్వు చూసుకో ! ఊరందర్నీ మనం ఉద్ధరించగలమా! ఎవరి కర్మ కొద్ది వాళ్లకు వస్తుంటే ఫలితాలు. నువ్వేమీ ఉద్ధరించక్కర్లేదని కసిరి కొట్టింది. అయినా అత్తగారి మనస్తత్వం తెలిసిన సుజాత ఏమి బాధపడకుండా భర్త అభిప్రాయం కూడా తెలుస్తుంది. భర్త అభిప్రాయంలో కూడా పెద్దగా మార్పు ఏమి లేదు. ఎటు వచ్చి విషయాన్ని సున్నితంగా చెప్పాడు. కావాలంటే కాంతమ్మ జీతం పెంచు అంతేగాని నువ్వు ఇంత త్యాగం చేయడం నాకు ఇష్టం లేదన్నాడు సుజాత భర్త రామారావు. 


ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ముందుకు వెళ్లి సహాయం చేసే తన భర్త తన అభిప్రాయాన్ని బలపరుస్తాడు అనుకుంది పాపం సుజాత. 


ఇలాంటి సహాయం తనలాంటి తల్లులు మాత్రమే చేయగలరు. ఎవరికి ఈ అవకాశం లేదు. డబ్బుతో తీరే సమస్య కాదు ఇది. పైగా చంటి బిడ్డ ఆకలి విలువ తల్లికి మాత్రమే తెలుస్తుంది. నేను ఏమి తప్పు పని చేయడం లేదు. ఒక ప్రాణం కాపాడుతున్నాను అనుకుని కాంతమ్మకి బిడ్డను తీసుకురమ్మని కబురు చేసింది. 


కాంతమ్మ బిడ్డను చూడగానే సుజాత గుండె చెరువైపోయింది. మొహం అంతా పాలి పోయి శరీరం అంతా ఎండిపోయి ఎముకలు బయటకు వచ్చి గుడ్లు బయటకు వచ్చి సోమాలియాలో ఉండే పిల్లల్లా ఉన్నాడు కాంతమ్మ కొడుకు. సుజాత ఒడి లోకి తీసుకొని కొంగు కప్పగానే ఆ బిడ్డ దొరకని వస్తువు ఏదో దొరికినప్పుడు ఎంత ఆత్రంగా ఉంటాడో అంత గబగబా నాలుగు చుక్కలు తాగి అలసటగా అలా పడుకున్నాడు. ప్రతిరోజు ఇలా మూడు పూట్ల నాలుగు చుక్కలు పాలు తాగి కాంతమ్మ కొడుకు కాస్త ఒళ్ళు చేశాడు నాలుగు నెలలు అయ్యేసరికి. 


ఈలోగా సుజాత అత్తగారు ప్రతిరోజు ఏదో సూటిపోటు మాటలు అంటూనే ఉంది. అయినా ఎవరేమనుకున్నా తన పని మాత్రం మానలేదు సుజాత. సుజాత భర్త రామారావు కోపం వచ్చి భార్యతో ముభావంగా ఉండడం మొదలుపెట్టాడు. కాంతమ్మ మటుకు ప్రతిరోజు సుజాతకి కృతజ్ఞతలు చెబుతూనే ఉంది. అయినా ఒకరి కోపతాపాలకి బాధపడకుండా మరొకరి కృతజ్ఞతలకు పొంగిపోకుండా తన పని కానిస్తూనే ఉంది సుజాత. 


కేవలం ఒక చంటి బిడ్డ ఆకలి తీర్చుకోడానికి చేస్తున్న పని ఆ నోట ఈ నోట అంగన్వాడీ కేంద్రానికి తెలిసింది. ఒక తల్లి మరొకరి ఆకలి తీర్చడం కోసం చేస్తున్న పని యూట్యూబ్ వాళ్ళకి వార్తాపత్రికలకి ఒక అంశంగా మారింది. సుజాత చేస్తున్న త్యాగం యూట్యూబ్ ప్రేక్షకులను పెంచింది. వార్తాపత్రికల్లో చదివిన ఈ వార్త చాలామందికి ప్రేరణగా నిలిచింది. ఇంకేముంది ఎక్కడ సుజాత కనపడిన ప్రత్యేకంగా సుజాతను చూడడం మొదలు పెట్టారు జనం. కొన్ని వార్తాపత్రికలు ఇంటర్వ్యూలు కోసం ఎగబడ్డాయి. 


ప్రజల్లో వస్తున్న ఈ స్పందన చూసి జిల్లా కలెక్టర్ ఒక ప్రత్యేకమైన దానం చేసి ఒక బిడ్డ ప్రాణం కాపాడిన తల్లిగా సుజాతను కొనియాడారు. 


ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన ఫోటోల్లో ప్రతి దాంట్లోనూ తన పక్కనే నిలబడిన అత్తగారిని భర్తని చూసి నవ్వుకుంది సుజాత.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట