ఓహో పావురమా
అది నిజంగా భాగ్యనగరమే. ఆ రాజ్యానికి పట్టపురాణి మీద ప్రేమతో అందంగా నిర్మించబడిన ఆ నగరం, నాలుగు దిక్కులలో ఉన్న పల్లెలను కలుపుకుని సువిశాల నగరంగా మారింది.
పరిశ్రమలకు, కర్మాగారాలకు ఆశ్రయమిచ్చి కాలుష్యం మాట దేవుడెరుగు. పొట్టచేత పట్టుకుని, పట్టాపుచ్చుకుని పట్నం చేరిన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కార్పొరేట్ ఆఫీసుల్లో ఆశ్రయం ఇచ్చి కడుపు నింపే ఆ నగరం నిజంగా అక్షయపాత్ర.
రోజురోజుకీ నగరం పెరిగిపోతోంది. ఎర్రబస్సు ఎక్కి పట్నం చేరే జనాల సంగతి చెప్పక్కర్లేదు. “కనీస అవసరాలు నేను కల్పించలేను బాబోయ్, అయినా సరే కర్మాగారం పక్కనైనా ఉంటాం” అని బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు, డూప్లెక్స్ హౌసులు కట్టుకుని కాలక్షేపం చేసే జనమెంతో.
“మాకు గుండెల్లో ధైర్యం ఉంది, జేబులో డబ్బుంది, ఒంట్లో ఓపిక ఉంది. కూతవేటు దూరంలో కూత వేసే మెట్రోరైలు ఉంది” అంటూ, ఇంటి దగ్గరనుండి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీసుకైనా వెళ్లి వస్తామని దూరదూరంగా వెళ్లిపోయి, చెయ్యి చాస్తే ఆకాశం అందే బహుళ అంతస్తుల భవనాల్లో కాపురం చేస్తున్నారు.
మీట నొక్కితే పైకి మోసుకుపోయే యంత్రం ఉంది. “మాకు ఏమి భయం!” అంటూ ఆ అంతస్తుల్లో కాపురం చేస్తున్నారు. “కోటి రూపాయలైనా పరవాలేదు, ఉండడానికి ఓ గూడు కావాలి” అంటూ దొరికిన చోటల్లా అపార్ట్మెంట్ కొనుక్కుని ఇంటివాళ్లైపోతున్నారు. అలా నగరం నాలుగు మూలలకీ విస్తరించింది.
ఇక్కడ ఈ అపార్ట్మెంట్లలో ఎవరికి వారే యమునా తీరే. ఏ గదిలో ఎవరున్నారో తెలీదు. ఉదయం లేస్తే అన్నీ తాళాలు వేసి ఉంటాయి; రాత్రి చీకటి పడిన తర్వాత మాత్రమే తెరుచుకుంటాయి. కనపడితే అందరికీ మొహం మీద చిరునవ్వు కనిపిస్తుంది కానీ నోటి వెంట మాట రాదు.
తెల్లారితే పల్లెటూర్లో అందరినీ పలకరించడం అలవాటు ఉన్నవాళ్లకి ఇది కొత్తగా ఉంటుంది. అపార్ట్మెంట్లో అందరికీ వాచ్‌మన్ శ్రీమహావిష్ణువు లాంటివాడు. వాడికి ఉన్నవి రెండు చేతులే, చేసే పనులు లెక్కలేనన్ని. అన్ని సమాచారాలు వాచ్‌మన్ చేరవేస్తుంటాడు. అందరి జాతకాలు వాడి దగ్గరే!
ఆ అంతస్తుల భవనంలో యంత్రాలు మొరాయిస్తే వాళ్ల కష్టాలు దేవుడికే ఎరుక. ఎక్కడున్నవాళ్లు అక్కడే గప్‌చిప్.
అలాంటి పట్నానికి ఎర్రబస్సు ఎక్కి దిగే జనంతో పాటు, ఆకాశంలో ఎగురుతూ పైసా ఖర్చు లేకుండా పట్నం చేరుకుంటున్న శాంతికపోతాలు ఎక్కువైపోయాయి.
“మేము అపార్ట్మెంట్లో ఉండలేకపోతున్నాం బాబు, తప్పటం లేదు” అని మానవులు బాధపడుతుంటే, పచ్చటి అడవి తల్లి ఒడిలో దొరికిన పండుఫలమూ తింటూ, కనబడిన పుల్లముక్కలతో గూడు కట్టుకుని చెట్టు తల్లి మీద హాయిగా కాపురం చేసుకునే శాంతికపోతాలు — ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఆకాశంలో ఎగురుతూ, ఈ భాగ్యనగరంలోని బహుళ అంతస్తుల భవనాల మీద కాపురం పెడుతున్నాయి.
మాట వచ్చిన మనుషులలాగే ఈ పక్షులకు కూడా అడవి తల్లి అంటే బోర్ కొట్టిందేమో పాపం!
ఈ నగరంలో పక్షి ప్రేమికులు బస్తాల కొద్దీ చిరుధాన్యాలు కొనుక్కుని తమ డాబాల మీద విసిరి ఆ పావురాలని అందంగా ప్రేమిస్తుంటే, అడవి తల్లి నిత్యం రొద చేసే పక్షులు లేక, భయంకరంగా అరిచే పెద్ద పులులు సింహాలు లేక, అర్తనాదం చేసే జింకలు లేక నిశ్శబ్దమైపోయింది.
భయంకర జంతువులన్నీ ప్రభుత్వం అద్దాల గూడులో బంధించి, రుసుము వసూలు చేసి చూపిస్తోంది. రెక్కలు ఉన్న పక్షులన్నీ ఆకాశంలోకి ఎగిరి, కనబడిన చోటల్లా నగరంలో కాపురం పెడుతున్నాయి. పక్షి ప్రేమికులకు శాంతి, అపార్ట్మెంట్ వాసులకు అశాంతి కలుగుతోంది.
ఎంత కట్టుదిట్టం చేసినా సందు దొరికితే చాలు — లోపలికి దూసుకెళ్లి గదిలో గూడు కడేస్తాయి.
“అయ్యో అడవితల్లి, అన్నం పెట్టడం లేదా?” అని అడిగితే,
“కన్నతల్లిని నేను ఎందుకు అన్నం పెట్టకుండా ఉంటాను?” అని అడవితల్లి సమాధానం చెబుతోంది.
“మరి ఎందుకు పట్టణం వస్తున్నావ్?” అని అడిగితే,
“అక్కడ మేము ఆకాశంలోకి ఎగురుతూ పొట్ట పోషించుకోవాలి. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు పిలిచి మరీ కడుపు నింపుతున్నారు” అని పావురాలు ఆనందంగా సమాధానం చెబుతున్నాయి.
నిజమే. చాలా చోట్ల నగరవాసులు తమ మానసిక ఆనందం కొద్దీ రోజూ ఈ పావురాలకు ఆహారం పెడుతున్నారు. ఇది కొంతమంది తమకు ఆనందం ఇస్తుందని, మరి కొంతమంది పుణ్యకార్యమని అంటున్నారు.
“మరి బహుళ అంతస్తుల భవనంలో ఎందుకు కాపురం చేస్తున్నావ్?” అని అడిగితే,
“ఇక్కడ గూడు కట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది. అక్కడ అడవిలో ఎప్పుడూ భయం భయంగా ఉండేది. వేటగాళ్ల తుపాకీ దెబ్బలకు బలి కావాల్సి వస్తుంది, పెనుగాలులు వీచినప్పుడు గూడు పగిలిపోతుంది. దానికి తోడు అడవిని ఖాళీ చేసేశారు. ఇంకెక్కడ ఉంటాం?
ఇక్కడ ఎవడైనా దయతలచి నాలుగు గింజలు వేయకపోయినా, చెత్తబుట్టల్లో మాకు సరిపడా ఆహారం దొరుకుతుంది. నగరవాసులు తినేది తక్కువ, పారవేసేది ఎక్కువ. మాకు రోజూ రకరకాల రుచులు అలవాటు చేశారు ఈ నగరవాసులు. మా ప్రాణం ఇక్కడ హాయిగా ఉంది!” అని పావురాలు చెబుతున్నాయి.
“పూర్వం ఎన్నో ప్రేమసందేశాలు, శాంతిసందేశాలు, యుద్ధసందేశాలు మోసుకుపోయేవాళ్లం. ఇప్పుడు మీకు ఆధునిక సౌకర్యాలు వచ్చి మమ్మల్ని మర్చిపోయారు. కానీ మీకు మాకు ఎన్నో తరాలనుండి అవినాభావ సంబంధం ఉంది” అని పావురాలు చెబుతుంటే —
మన దగ్గర సమాధానం ఒక్కటే —
“ఆ పాటల్లో, సినిమాల్లో పావురాలు ఎగరేసే సన్నివేశాలు బాగానే ఉంటాయి కానీ, ఇంట్లో పావురం కూత మంచిది కాదని కొందరు చెబుతున్నారు!”
ఏది నిజమో, ఏది అబద్దమో తెలియదు. కానీ ఆ కూత వినడానికి కొంచెం ఇబ్బందికరమే అయినా, “నువ్వంటే ఎప్పుడూ ఇష్టమే” అంటాం మనం.
“ఇప్పుడు చంటి పిల్లలు విసర్జించే మలం కూడా మేము ముట్టుకోవడం లేదు. మాకు ఆధునిక సౌకర్యాలు వచ్చేశాయి. డైపర్లు వచ్చి మమ్మల్ని కాపాడాయి. అలాంటిది నువ్వు విసర్జించే మలం ఎవరు బాగు చేస్తారు మా ఇంట్లో?” అని ఆడవాళ్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
“పైగా నీ రెక్కలు చూడడానికి బాగానే ఉంటాయి కానీ వాటి నుండి జారిపడే ఈకలు ఇల్లంతా ఎగురుతుంటే ఏ మగాడు ఊరుకుంటాడు? దానికి తోడు వాసన! మేము ఫ్యాక్టరీల వాసనే భరిస్తామా? వాహన కాలుష్యమే పీలుస్తామా? మళ్లీ కొత్త బాధ!”
అని నగరవాసులు గళమెత్తుతున్నారు.
శాస్త్రజ్ఞులు కూడా “పావురాలతో జాగ్రత్త!” అంటూ పేపర్లలో హెచ్చరిస్తున్నారు. ఆ మాటలు చదివినప్పుడల్లా మనకు వణుకు పుడుతోంది.
కానీ,
ఆకాశంలో నువ్వు ఎగురుతుంటే ఎంత అందంగా ఉంటావో పావురమా!
మా చంటి పిల్లలు అన్నం తినమని మారం చేస్తే, నిన్ను చూపించి నాలుగు ముద్దులు పెట్టుకుంటూ రోజులు గడుపుతున్నాం. పిల్లలకు సెలవులు వచ్చాయి కదా అని ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళి, తిరిగి వచ్చి తలుపు తీస్తే — అబ్బా! వాసన భరించలేనిది. అడవిలో ఉన్నట్టు అనిపించింది.
ఆ మధ్య పేపర్లో చదివాను — ఈ భాగ్యనగరంలో ఆరు లక్షల పావురాలు ఉన్నాయని, వాటి సంఖ్య పదిలక్షలకు పెరిగే అవకాశం ఉందని. వాటి మూలంగా ప్రమాదం లేకుంటే అవి ఎక్కడ ఉంటే మనకేం బాధ? అపార్ట్మెంట్ లోపలికి వచ్చి కాపురం పెడితే సమస్య, బయట కాపురం చేస్తే మనకేం గండం లేదు.
చిన్నప్పుడు పంచతంత్ర కథల్లో పావురం, వేటగాడు కథలు చదువుకున్నాం. ఐకమత్యం విలువ నేర్పించాయి అవి. మరొక విషయం — జంట పావురాల్లో ఒకటి చనిపోతే, రెండోది మళ్లీ ఎవరితోనూ జతకట్టదట. చనిపోయే వరకు అలాగే ఉంటుందట.
ఏదేమైనా పావురమా —
నువ్వు అలా ఆకాశంలో అందంగా ఎగిరితేనే బాగుంటావు. నీకు అందమైన రెక్కలున్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపో.
పెద్ద పులులు, సింహాలకు అభయారణ్యాలు ఉన్నట్లే — పావురాలకూ ప్రభుత్వం ఒక గూడు కల్పించి, అపార్ట్మెంట్ వాసుల భయాన్ని తొలగిస్తుందని ఆశిద్దాం.
🕊️ — మధునాపంతుల చిట్టి సుబ్బారావు, కాకినాడ
📞 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి