ఆనాటి అతిధి
ఆ జీవన విధానం వేరు. ఆ తరం పద్ధతులు వేరు. ఆ ఆప్యాయతలు వేరు. అనుబంధాలు వేరు.
తరం మారుతున్న కొద్దీ ఆ అతిధి మర్యాదలు మరుగున పడిపోతున్నాయి.
ఒకప్పుడు ఇంటి ముందు రిక్షా ఆగిందంటే, రిక్షాలోంచి దిగుతున్న అతిధిని చూసి ఎదురు వెళ్లి స్వాగతం చెప్పేవారు.
“రండి రండి” అంటూ ప్రేమపూర్వకమైన ఆహ్వానం.
అప్పట్లో సాంకేతికంగా అభివృద్ధి చెందిన రోజులు కావు. సమాచారం కొరకు ఉత్తరాల మీద ఆధారపడి ఉండేవారు.
మరీ ముఖ్య అవసరాల కోసం టెలిగ్రామ్. ఉత్తరం రాస్తే నాలుగు రోజులు కానీ వచ్చేది కాదు.
అతిధి చెప్పా పెట్టకుండా వచ్చిన —
“ఏదో పని ఉండి ఊర్లోకి వచ్చాను, మిమ్మల్ని చూసి పోదామని రావడం జరిగిందంటూ” —
తన ముందస్తు కబురు చెప్పకుండా వచ్చినందుకు సంజాయిషీ చెప్పుకునేవాడు అతిధి.
అతిధి తన దగ్గర బంధువు కావచ్చు, లేదంటే దూరపు బంధువు, లేదంటే స్నేహితుడు అయినా ఒకే రకమైన ఆహ్వానం.
అతిధి మర్యాదలో భాగంగా ముందుగా గుమ్మo ల్లోనే ఒక బకెట్‌తో నీళ్లు, చెంబు రెడీగా ఉండేవి.
పల్లెటూర్లో అప్పటి జీవన విధానానికి అనుకూలంగా ఇళ్లు ఉండేవి కాబట్టి ఆ రకమైన సౌకర్యం కల్పించగలిగేవారు.
వచ్చిన అతిధి సరాసరి ఇంట్లోకి వచ్చేయకుండా, కాళ్లు కడుక్కుని రావడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు.
తర్వాత భుజం మీద వేసుకుని రెడీగా ఉంచుకున్న తుండు గుడ్డని అందించి, కుర్చీ వైపు చేయి చూపించే వారు.
కుర్చీలో కూలబడిన తర్వాత, కుశల ప్రశ్నలు అయిన తర్వాత కప్పు కాఫీ అందించడంతో అతిధి మర్యాదల పర్వం మొదలయ్యేది.
నడవలో వేసిన కుర్చీలో ప్రకృతి గాలి కొంత మర్యాద చేస్తున్నప్పటికీ,
ఆ యజమాని తన మర్యాద పోగొట్టుకోకుండా ఉండడానికి తాటాకుల విసనకర్రతో విసురుతూ,
“మా ఊర్లో అస్తమాను కరెంటు తీసేస్తాడు” అంటూ ప్రభుత్వాన్ని తిడుతూ కబుర్లపర్వం మొదలుపెట్టేవారు.
ఆ కబుర్లలో బంధువులు గురించి, స్నేహితులు గురించి, ఊరి గురించి, ఉద్యోగాల గురించి,కాసేపు ప్రభుత్వం గురించి, వర్తమాన రాజకీయాల గురించి, వాతావరణం గురించి,
పొలం గురించి, కష్టాలు, కన్నీళ్లు, ఆరోగ్య గురించి, జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ అతిధి సమయాన్ని సద్వినియోగం చేసేవారు.
అంటే ఏదో ఒక పని ఉండి ఆ ఊరు వచ్చిన అభిమానంతో మాత్రమే ఆ గడప తొక్కిన ఆ అతిధి సమయాన్ని
అనుబంధాలు, ఆప్యాయతలతో గడిపేలా చేసేవారు.
మధ్యలో ఒక గ్లాసు కమ్మటి మజ్జిగ.
అది కేవలం పానీయం కాదు — ఆ తరం ప్రేమను, మమకారాన్ని గుర్తుచేసే రుచి.
ఈలోపు ఆత్మా రాముడు “నా సమయం అయిపోయింది” అంటూ లోపల నుంచి గగ్గోలు పెడుతుంటే,
“వంట అయిపోయింది! కాళ్లు కడుక్కొని మడి కట్టుకొని రండి!” అంటూ వంటింట్లోంచి ఆ ఇంటి ఇల్లాలు ఆత్మీయమైన పిలుపు.
బట్టలు మార్చుకుని, కాళ్లు కడుక్కుని, యజమానందించిన ఎర్రటి పట్టు పంచ కట్టుకుంటే, ఆప్యాయంగా ఇంటి యజమాని వంటింట్లోకి తీసుకెళ్లేవాడు.
వంటింట్లో నేల మీద వాల్చి రెడీగా ఉన్న తాతల్నాటి టేకు పీట చూపించేవారు కూర్చోడానికి.
ఆ టేకు పీట ఎదురుగుండా పరిచి ఉన్న పచ్చటి అరిటాకు.
పీట పక్కన తాతలనాటి ఇత్తడి మరచెంబుతో నీళ్లు రెడీగా ఉండేవి.
ఆకు వేసి మంచినీళ్లు పెట్టడం — అది ఒక పద్ధతి.
ఆకులోని పదార్థాలన్నీ పెరట్లోని కూరగాయలతో తయారు చేసేవి ఉండేవా రోజుల్లో.
తాతలనాటి మామిడి చెట్టు కాయి, వేయించిన కందిపప్పు వెరసి మామిడికాయ పప్పు. కోనసీమ అంటేనే కొబ్బరి — ఆ కొబ్బరితో పచ్చడి.
ఎక్కడ చూసినా అరటి తోటలే — అరటికాయ కూర, అరటిదూట పచ్చడి, అరటిపండు.
పంటి కిందకి గుమ్మడి వడియం, తీపి ముక్కల పులుసు, మధ్యలో చిలకడదుంప తగులుతుంటే పులుసు అదుర్స్.
కొత్త ఆవకాయ, గడ్డ పెరుగు, మామిడిపండు, ఆప్యాయతతో కూడిన కొసరి కొసరి వడ్డింపు,
వద్దని చెయ్యి అడ్డం పెట్టినా బలవంతంగా మారువొడ్డింపు.
నోట మాట రాక, పొట్ట కేసి చేయి చూపించితేనే మర్యాద ఆపేవారు.
స్వచ్ఛమైన సరుకు, అందులో చేయితిరిగిన గృహిణి చేత వంట — ఇంకేం కావాలి!
ఆ వంట అమృతం. ఆ రోజుల్లో నాలిక అదృష్టం చేసుకుని ఉండేది.
ఆప్యాయతతో పెట్టిన భోజనం. అనుభూతి మిగిల్చిన భోజనం.
చెరగని జ్ఞాపకంలా అతిధి మర్యాదకు మురిసిపోతూ చెయ్యి కడుక్కుని వచ్చేసరికి,
పల్లెల్లో ఆకు వక్క సున్నం భుక్తాయాసాన్ని తగ్గించడానికి ఎదురు చూస్తూ ఉండేవి.
తాంబూలం వేసుకోవడం ఒక కళ. ఆ కళను పోషించి, మడి విప్పి వచ్చేటప్పటికి
నడవలో మంచం వేసి “కాసేపు పడుకోండి” అంటూ మంచం చూపించి తదుపరి మర్యాదకు శ్రీకారం చుట్టేవారు.
అలసి సొలసిన శరీరం, ఆపై చల్లటి గాలి, కడుపునిండుగా కమ్మని భోజనం — ఇంకేముంది!
కమ్మటి నిద్రలోకి మునిగిపోయేవాడు అతిధి.
పట్టుపరుపుల ప్రసక్తి లేదు. ఫ్యాన్, ఏసీ గొడవ లేదు.
అంతా సహజసిద్ధమైన గాలి. మనసు ఎక్కడికో పారిపోయేది.
లేచేటప్పటికీ పొద్దు వాలుతూ ఉండేది.
మొహం కడుక్కుని వచ్చేటప్పటికి ఎదురుగా టీపాయ్ మీద పొగలు కక్కుతూ టీ,
దాని పక్కనే ప్లేట్లో చెగోడీలు, పూతరేకులు, కొబ్బరి ఉండలు —
అతిధి మర్యాద కోసం ఎదురు చూస్తూ ఉండేవి
చేగోడీ కొరుకుతూ, టీ చుక్క చప్పరిస్తూ మళ్లీ కాసేపు ముచ్చట్లు.
“బస్సుకు టైం అయిపోతుంది” అంటూ చేతి సంచి తీసుకుని, బట్టలేసుకుని బయలుదేరుతుంటే,
కన్నీటి చెమర్చిన కళ్లతో “అందరినీ అడిగినట్లు చెప్పండి” అనే మాటలతో వీడ్కోలు —
ఆనాటి అతిధి మర్యాదలో భాగాలు.
ఇప్పుడు కాలం మారింది.
ముందుగానే ఫోన్ చేసి వస్తేనే సౌకర్యం.
“ఏ సమయానికి వస్తారు?” అని అడిగే నూతన మర్యాదలు.
ఇంట్లో కాఫీ కప్పు వేయడం కంటే, కేఫ్‌లో కలవడం ఎక్కువగా మారింది.
వీడియో కాల్‌లలో కుశల ప్రశ్నలు, వాట్సాప్‌లో “సందేశం పంపించాను కదా!” అన్న సంతృప్తి.
కానీ ఆ ఆప్యాయత? ఆ మమకారం?
ఆ వంటింటి వాసన? ఆ అరిటాకు మీద ప్రేమ?
అవి ఇప్పుడు కేవలం జ్ఞాపకాల గదిలో నిలిచిపోయాయి.
కానీ ఆ జ్ఞాపకాల్లోనే మన మనిషితనం ఇంకా బతికే ఉంది.
ఎప్పుడో ఆ రోజుల్లో మనం మనుషుల్ని ఆహ్వానించేవాళ్ళం,
ఇప్పుడేమో మెసేజ్‌లు పంపుతున్నాం —
కానీ ఆప్యాయత మాత్రం...
ఇప్పటికీ మన హృదయాల అంచుల్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉంది.
“అతిథి దేవోభవ” — ఒక కాలపు జీవన విధానం మాత్రమే కాదు,
మనసుల మధ్య దూరం తగ్గించిన మానవతా సూత్రము కూడా
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి