మేము ఎందుకు ప్రత్యేకం
మేము ఎందుకు ప్రత్యేకం!
అమ్మా ! ఇన్నాళ్ళు నీకు బంగారు కొండ ని. భారత ప్రజలకి కొండంత అండని. ఆపరేషన్ సింధూరిలో శత్రువులపై విజయం సాధించి అసువులు బాసిన వీర సైనికుడిని. ఒక చిత్రకారుడుకి స్ఫూర్తినిచ్చి బొమ్మగా మిగిలిపోయాను. నీ కంట్లో కన్నీళ్లు జీవనదిలా ప్రవహించడానికి కారణమయ్యేను. భరతమాత ముద్దుబిడ్డ గా గుప్పెడు మట్టిలో కలిసిపోయాను.
జాతీయ పతాకం కౌగిలించుకున్న నన్ను చూసి దేశమంతా కన్నీరు కార్చింది నీతో పాటుగా. జాలితో కాదు గౌరవంతో. ఎందుకు నేనంటే అంత ప్రత్యేకం. నేను దేశ ప్రధానిని కాదు రాష్ట్రపతిని కూడా కాదు. ఇంతకుముందు వార్తల్లో లేను. కాశ్మీర్ సరిహద్దుల్లో దేశాన్ని కాపలా కాసే సామాన్య సైనికుడిని. అయినా నేను ఎందుకు ప్రత్యేకం?
మనం పుట్టినప్పుడే మరణం కూడా మనతో పాటు పుడుతుంది
ఎప్పుడూ కాటు వేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది . చనిపోతామని తెలిసే మేము దేశ రక్షణకి సిద్ధమవుతాం. చావు అంటే భయం లేకుండా ముందుకు నడిచే వీర సైనికులo కాబట్టే
మేము ప్రత్యేకo. తల మీద టోపీ కాళ్లకు ఇనప బూట్లు భుజానికి వేలాడుతున్న తుపాకీ ప్రత్యేకమైన బట్టలు ఇవన్నీ మాకు ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపునిస్తాయి.
తల మీద పెట్టుకున్న టోపీ అందరికీ ఎండకి వానకి రక్షణ ఇస్తే మా తల మీదనున్న టోపీ దేశ రక్షణకి మా ధీర సంకల్పాన్ని గుర్తుచేస్తుంది. చిన్నప్పుడు స్కూల్ నుండి ఇంటికి రాగానే నా కళ్ళు నీకోసం వెతుక్కునేవి. ఇప్పుడు శత్రువుల ఆచూకీ కోసం వెతుకుతుంటాయి .
చిన్నప్పుడు పరీక్షల కోసం ఆ గుడ్డి దీపాల వెలుగులో రాత్రి చదువుతుంటే "ఎక్కువసేపు మేల్కొని ఉండకు తెల్లవారుజామునే లేచి చదువుకో అని తొందరగా పడుకోబెట్టడానికి ప్రయత్నం చేసేదానివి.
కానీ ఇప్పుడు మాకు దేశ రక్షణలో రాత్రి పగలు తేడా అనేది లేదు. కంటిమీద కునుకు ఉండదు. దేశ ప్రజల రక్షణే మా కర్తవ్యం.
దీపావళి రోజున అందరూ బాణసంచా కాల్చుకుంటూ ఉంటే చెవుల్లో దూది పెట్టే దానివి. భయపడకు అని భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకునే దానివి. ఇప్పుడు ప్రతిరోజు మాకు దీపావళి పండగే. బాంబుల శబ్దం చెవులలో మారుమోగుతూనే ఉంటుంది.
మాది క్రమశిక్షణ కలిగిన జీవితం. ప్రతిరోజు ఉదయం రేడియోలో వినిపించే వందేమాతరం గీతం విలువ నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు వందేమాతరం తోటే మా ఉదయం ప్రారంభం అవుతుంది.
ఉప్పొంగిపోయే వరదలు, ఏకధాటిగా కురిసే వానలో, ప్రకృతి ప్రళయంలో అందరూ ఎవరింట్లో వాళ్ళు తలుపులు మూసుకుని బిగించుకుని కూర్చుంటే మేము మీకు అండగా ఉంటామని అభయం ఇచ్చి సురక్షిత ప్రదేశాలకి తరలించి ప్రజలను కాపాడుతాం. అప్పుడది మీకు ఆపన్న హస్తం. అది శత్రువుల పాలిటి భస్మాసుర హస్తం కూడా. చిన్నప్పుడు రక్తం చూస్తేనే భయపడిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏనాడూ రక్తం కళ్ల చూడకుండా పొద్దు పోదు. మీ భద్రత కోసం మేము రక్తాన్ని చిందిస్తున్నాము. మా చేతులన్నీ రక్తంతో తడిసి పోయి ఉంటే
ఎంతైనా మా వృత్తి మా జన్మకి సార్ధకత ఇచ్చింది.అందరి హృదయాల్లో సైనికుడు అంటే గౌరవం నిలిచిపోయింది .
డిగ్రీలు లేకపోయినా మా గుండె బలం కండబలం తల్లిదండ్రుల వారసత్వ బలం ఒక ఉద్యోగిగా నిలబెట్టింది. నా స్నేహితులు ఎంతోమంది ఎన్నో డిగ్రీలు సంపాదించి నిరుద్యోగులు గానే మిగిలిపోయారు.
చిన్నప్పుడు ఏ కాలానికి తగినట్లుగా ఆ కాలానికి సరిపడే విధంగా నా చర్మాన్ని రకరకాల పూతలు పూసి కాపాడేవు. ఇప్పుడు ఎండల్లో వానల్లో మంచు తుఫానులో మా కాపురం అయినా రంగు మారలేదు నా చర్మం. అన్నింటికీ తట్టుకునే గుండె ధైర్యం ఈ ఉద్యోగం నాకు ఇచ్చింది. గుండెలో ధైర్యం ఉంటే ఒంటికి ఆరోగ్యం.
ప్రతిరోజు మేము ప్రయాణించేది అందమైన రోడ్లమీద కాదు. గుట్టలు, కొండలు , అడుగు వేస్తే జారిపోయే మంచు కొండలు వీటి మీద మా గమనం ఎప్పుడూ ముందుకే. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చిన్నప్పుడు చూసుకుని నడవరా! అంటూ చెప్పుకుంటూ వచ్చేదానివి. ఇప్పుడు ఆచితూచి అడుగు వేసే ప్రసక్తి లేదు. అవి ముళ్ళ పొదలైనా ముందుకు సాగవలసిందే. లేదంటే శత్రువు ఒక అడుగు ముందుకు వేసి కోటలో పాగా వేస్తాడు. ఇప్పుడు మేము వేసుకున్న బూట్లకి మాతృభూమి ధూళి అలంకారం.
ప్రతిరోజు శత్రువుల రక్తాన్నే కాదు మా రక్తాన్ని మేము కూడా చూస్తూ ఉంటాం . చిన్నప్పుడు దెబ్బ తగిలి రక్తం వస్తే రోజంతా తలుచుకుని తలుచుకుని ఏడుస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ఏడ్చిన ఊరుకోబెట్టే వాళ్ళు లేరు. ఎందుకు ఆగిపోయావని ఉరిమి చూసేవాళ్ళు తప్పితే!
చిన్నప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం అంటే చాక్లెట్లు తినవచ్చని సరదా పడుతుండే వాళ్ళం. ఏడాదికి రెండుసార్లు మాత్రమే జెండాకు వందనం చేసేవాళ్ళం. దాని విలువ ఇప్పుడు ఈ సైన్యం లోకి వచ్చిన తర్వాత బాగా తెలిసింది. ఒకప్పుడు విదేశీయుల నుండి దేశాన్ని కాపాడడానికి ప్రాణాలర్పించిన వారందరి త్యాగ ఫలితం ఈ మువ్వన్నెల జెండా అని తెలిసింది. అందుకే ప్రతిరోజు జెండాకు వందనం. ఆఖరి యాత్రలో నా వెంట ఉండేది ఆ మువ్వన్నెల జెండా.
ప్రతి సైనికుడు శరీరం యుద్ధభూమికి అంకితం గా మారిన దేవాలయం. దేశభద్రతకి యజ్ఞం గా నిలిచిన దీక్షా గృహం. ఇంతకంటే నా గురించి నీకేం చెప్పాలి. మేము దేశ ప్రజలందరి కంటే విభిన్నం. దేశ రక్షణ మాకు ముఖ్యం. యుద్ధంలో వీరమరణం పొందిన ఈ జవాను తల్లిగా నువ్వు బ్రతికున్నంత కాలము నీ కన్నీళ్లు ఆగకపోయినా నువ్వు మటుకు వీరమాతగా చరిత్ర పుటలలో నిలిచిపోతావు.
ఆఖరిగా ఒక మాట ప్రమాదమని తెలిసిన సైన్యంలో పనిచేయడానికి ఒప్పుకున్న నీ త్యాగానికి నా జోహారు. నీలాగే ఎందరో తల్లులు అందరికీ వందనాలు.
వయసులో ఉండగా ఏదో రోగం లేదా ఏదో ఒక ప్రమాదంలో నేను చనిపోతే నువ్వు బాధపడాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తిని నేను. నువ్వు గర్వపడాలి. బాధపడకు . జైహింద్.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి