సతులాల చూడరే

 సతులారా చూడరే


  సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమిl

  సకలాయ నడిరేయ కలిగే శ్రీకృష్ణుడు 


అంటూ అన్నమయ్య తన కీర్తనల్లో శ్రీకృష్ణుడి పుట్టుక గురించి

స్తుతించారు.

శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి పరమాత్మ జన్మించాడు. అదే మనకి శ్రీ కృష్ణాష్టమి.

చెరసాలలో దేవకి వసుదేవుల కుమారుడుగా జన్మించి రేపల్లెలో నందుని ఇంటిలో యశోదమ్మ ఒడిలో పెరిగి నంద కుమారుడుగా చలామణి అయ్యాడు


ఈ కీర్తనలో పసిపాపగా ఉన్న పరమాత్ముడు ఏ రకంగా ఉన్నాడో మనకి కళ్ళకు కట్టినట్టు చెబుతాడు అన్నమయ్య. సాధారణంగా పసిపిల్లలు పుట్టినప్పుడు కళ్ళు మూసుకుని గుప్పెట్లు మూసుకుని నిద్రలో గడుపుతారు. అయితే ఇక్కడ పుట్టింది సాక్షాత్తు పరమాత్మ. 

ఆయన చతుర్భుజాలు శంకు చక్రాలు ఒంటినిండా సకల ఆభరణాలు ,తల మీద కిరీటం ధరించి పుట్టాడుట మహానుభావుడు. వాగ్గేయ కారులంతా కారణజన్ములు. లేదంటే పసిపాపడగా ఉన్న పరమాత్మ ని ఇలా వర్ణించడం సాధ్యం కాదు.

ఆదిశేషుడు అవతారమైన బలరాముడు రోహిణి దేవి కడుపున పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడు శివుడు నారదుడి లాంటి మునులు దేవతలు దేవకీదేవి బంధించబడిన కారాగారం వద్దకు వచ్చి పరమాత్మా!దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తుతూ వచ్చావు. ఇప్పుడు మానవ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడిగా దేవకీదేవి కడుపున జన్మించి ఈ భూమి భారాన్ని తగ్గించు మహాత్మా అని ప్రార్థిస్తారు. ఆ తర్వాత పరమాత్మ జననం జరిగింది. 


ఆ పుట్టిన పసి బాలుడు ఎలా ఉన్నాడు అనే విషయం గురించి అన్నమయ్య వర్ణించిన విధానం ఇంతకుముందు తెలుసుకున్నాం. అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ చెరసాలలో దేవకి వసుదేవులకు జన్మించి నేటి వెంకటేశ్వర స్వామిగా పూజింపబడుతున్నాడు అంటాడు అన్నమయ్య. 


ఇంక ఈ పద్యం ఎవరు రాశారో తెలియదు కానీ చిన్నప్పుడు మనం అందరూ చదువుకున్నాం. చిన్ని కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే చేతిలో వెన్న ముద్ద మెడలో చెంగల్వ పూదండ ధరించి నడుముకి బంగారు మొలతాడు ,పట్టు వస్త్రం కట్టుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని ఉంటాడట మహానుభావుడు. 

ఇదే అలంకరణ మన చిన్నపిల్లలకి మన ఇండ్లలో కూడా చేస్తుంటాం. ఇలా అలంకరణ చేసి ఉన్న ఫోటోలు చూడగానే ఒక రకమైన తీయటి అనుబంధం మనకి కృష్ణుడితో కలుగుతుంది . అంటే మన ఇంట్లో ఉండే పిల్లవాడిలా.


అలాగే ఇంకో కవి వర్ణనలో నుదుటన కస్తూరి తిలకం దిద్దుకునేవాడని , వక్షస్థలం మీద కౌస్తుభ మణిని ధరించేవాడని, ముక్కుకి మంచి ముత్యాన్ని, చేతిలో వేణువుని పట్టుకుని చేతులకు కంకణాలు ధరించేవాడని, దేహమంతా హరి చందనం పూసుకునేవాడని, కంఠము నందు ముత్యాల హారం ధరించి ఎప్పుడూ గోపికా స్త్రీల తో కూడి ఉండేవారని చెబుతారు 


సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులతో భాగవత రచనకు పూనుకున్న మహాకవి పోతన గారు ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకృష్ణుని రూపం గురించి చెప్తూ నల్లని వాడు పద్మనయనములు కలవాడిగా వర్ణించారు.

అన్నమయ్య ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు

అంటూ స్తుతించాడు.


ఇలా పరమాత్మ అలంకరణ గురించి రకరకాలుగా వర్ణించిన మనము ఆ ముగ్ధ మోహన రూపాన్ని ఫోటోలో చూడగానే పరవశలైపోతాము. పదేపదే చూడాలని అనుకుంటాం. 

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ అవతారం ఎత్తిన విష్ణుమూర్తి

పసిప్రాయం నుండి తన లీలలు చూపించి రేపల్లెవాసుల్ని ఆశ్చర్యపరిచాడు.

పాలు తాగే వయసులో కృష్ణుడిని చంపడానికి మేనమామ కంసుడు పంపించిన పూతన అనే రాక్షసిని రొమ్ము పీల్చి

సంహరించాడు. ఇక్కడ భగవంతుడు మాయ మనం గమనించాలి. సాధారణంగా చంటి పిల్లలకి తల్లి దగ్గర తప్పితే

ఇతర స్త్రీల దగ్గర ఎవరూ పాలు ఇప్పించడానికి ఇష్టపడరు.

ఆ రాక్షస సంహారం జరగాలి కాబట్టి పరమాత్మ తన మాయతో అందరి కళ్ళు కప్పి ఆ అపరిచిత స్త్రీకి పాలు ఇవ్వడానికి యశోదకు ఆ ఆలోచన పుట్టించాడని చెప్పవచ్చు.


ఆ అల్లరి కృష్ణయ్య ఆగడాలు భరించలేక తల్లి యశోద ఆ బాలకృష్ణున్ని ఒక రోలుకి కట్టిపడేసింది. ఎవరికి సాధ్యo పరమాత్మ ని కట్టిపడేయడం. చివరికా రోలు లాగుకుంటూ ఆ అల్లరి కృష్ణుడు మద్ది చెట్ల మధ్యలోకి దూరి శాపం కారణంగా చెట్ల రూపంలోఉన్న గంధర్వులకి శాప విమోచనం కలిగిస్తాడు.


పసిప్రాయంలో శ్రీకృష్ణ లీలలు వినడానికి మనకు చాలా ఆనందంగా ఉంటాయి. అవి మనకి అల్లరి కృష్ణుడి ఆగడాలుగా

అనిపించిన దాని వెనుక ఉన్న అంతరార్థం ఆ పరమాత్మ ఒక్కడికే తెలుసు. సాధారణంగా చిన్నపిల్లలు పసిప్రాయంలో మట్టి తింటుంటారు. అలాగే కృష్ణుడిని యశోద నోరు తెరిచి

చూపించమని అడగగా తన నోటిలో విశ్వమంతా చూపించి

తల్లిని చరితార్ధరాలు ని చేశాడు.


శ్రీకృష్ణ పరమాత్మకు వేణుగానం అంటే చాలా ఇష్టం. ఎల్లప్పుడూ వేణు గానం చేస్తూ గోవులను మేపుకుంటూ ఆ రేపల్లె వాసులని ఆనందపరిచేవాడు.


శ్రీకృష్ణుడుని నందనందనుడు దేవకి నందనుడు యశోద కృష్ణుడు నల్లనయ్య రకరకాల పేర్లతో పిలిచేవారు. కాళింది మడుగులో కాళీయుడు అనే విష సర్పం మీద నృత్యం చేసి గర్వమణి చి తాండవ కృష్ణుడు అయ్యాడు.

ప్రళయ కాల సమయంలో గోవర్ధనగిరి ని చిటికెన వేలుతో పైకెత్తి 

రేపల్లెవాసులందరినీ దాని కిందకు చేర్చి కాపాడి గోవర్ధనగిరిధారి

గా పేరుగాంచాడు.


కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడి రథసారథి గా నిలిచి

చింతాక్రాంతుడు యుద్ధవిముకుడైన అర్జునునికి భగవద్గీతను

 బోధించి జగత్తుకి గురువు అయ్యాడు.


కంసుడు లాంటి రాక్షసులను సంహరించి, పరమ ధర్మపరులైన పాండవుల పక్షాన నిలిచి ద్రౌపది వస్త్రాపహరణం లో ద్రౌపది మానం కాపాడి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను సంహరించి ధర్మరాజుకి రాజ్యాన్ని అప్పగించి యాదవుల వినాశనానికి పరోక్షంగా సహాయపడి దేవతలు మునుల కోరిక ప్రకారం అవతార సమాప్తి చేస్తాడు మహానుభావుడు. జరగబోయేది జరుగుతుంది జరగవలసింది కూడా అన్నీ తెలిసినవాడు ఈ పరమాత్మ. ఏమీ తెలియని వాళ్ళ మౌనంగా ఉంటాడు. చివరికి చెప్పిన సత్యం కర్మను ఎవరూ తప్పించలేరు. ఎప్పుడూ పరమాత్మతో తిరిగే యాదవులకు కూడా ఆ కర్మ తప్పలేదు.


శ్రీకృష్ణుడు కేవలం పౌరాణిక పాత్ర కాదు. ఆయన మన హృదయంలో నివసించే సత్యం, ధర్మం, కరుణ, ఆనంద స్వరూపం.


అయన లీలలు మనకి చెబుతున్న సందేశం — జీవితం ఆటలాగే ఉన్నా, ఆ ఆటలో ధర్మం తప్పక పాటించాలి.


దుష్టుని శిక్షించడం, శిష్టుని రక్షించడం ఆయన స్వభావం. కానీ మన లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే నిజమైన “కంసులను” జయించమని సూచించే గురువు కూడా ఆయనే.


శ్రీకృష్ణాష్టమి నాడు మనం చేసే ఉపవాసం, జాగరణం, భజనలు — ఇవన్నీ ఆయన రూపానందం పొందడానికి కాదు, ఆయన బోధనలను మన జీవితంలో స్థిరపరచుకోవడానికి కావాలి.


కృష్ణుడి చిత్తంలో ఎల్లప్పుడూ ఉన్నది “భక్తుని హితం” — భక్తుడి చిత్తంలో ఎల్లప్పుడూ ఉండాలి “కృష్ణస్మరణం”.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట