చిట్టి తల్లి
పిల్లలు దేవుడు చల్లనివారే అంటూ ఎక్కడో దూరంగా పాట విన పడుతుంది. నిజమే పిల్లలు దేవుడు ఒక్కరే అసలు దేవుడు పిల్లల్ని ఎందుకు పుట్టించాడు అంటే మన ఆనందంగా ఉండడానికి . పిల్లలు ఉన్న ఇల్లు ఎంత సందడిగా ఉంటుంది. ఇంకా చంటి పిల్లలు ఉంటే అసలు చెప్ప అక్కర్లేదు.
మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇటీవల కాలంలో మా మనవరాలు పుట్టడం తో మరోమారు ఆ అనుభూతుల్ని అనుభవించడానికి భగవంతుడు అవకాశం కల్పించాడు.
మా చిట్టి తల్లి కి మరో బుల్లి తల్లి. నా బుల్లి తల్లి రాకతో మా ఇల్లు స్వరూపమే మారిపోయింది. నడుముకు బెల్టు చెవులకు గుడ్డా కాళ్లకు ప్లాస్టిక్ చెప్పు తో నా చిట్టి తల్లి రూపం మారిపోయింది. చంటి దాని ఏడుపుతో ఇల్లంతా మార్మోగిపోతోంది . గుట్టలుగా ఉన్నా మా ఆవిడ పాత చీరలు ముక్కలుగా మారిపోయి ప్రతి గదిలోనూ కనపడుతున్నాయి. పట్టుమని పది రోజులు కూడా ఎప్పుడు మా ఇంట్లో ఉండని మా అత్తయ్య గారు ఆరోగ్యం బాగా లేకపోయినా తన టెంపరరీ అడ్రస్ సామర్లకోటకు మార్చి చంటి దానితో బిజీ అయిపోయింది. అసలు చంటి పిల్లల్ని పెంచడం కూడా ఒక కళే. ఆమె అలనాటి సుధీర్ఘ అనుభవంతో నా చిట్టి తల్లి ని ,చంటి దాని కూడా కంటికి రెప్పలా చూసుకునేది. ముత్త అమ్మమ్మ గా ఆమె జీవితం మరో మారు ధన్యమైంది.వర్క్ ఫ్రం హోం లో ఉన్న మా అల్లుడు అన్నీ తానై ఇద్దరిని చూసిన విధానం మర్చిపోలేనిది.. ఇక మా ఆవిడ ఇంటా బయట పనులతో బిజీ బిజీ.. నా చిట్టి తల్లికి పెట్టే పథ్యం కూరలు గురించి మా ఆవిడ రాత్రంతా ఆలోచిస్తూ ఉండేది. నేను మా ఆవిడ తాత అమ్మమ్మ లాగా కొత్త పాత్రలోకి మారి పోయాము.
మా పనిమనిషి కి ప్రమోషన్ వచ్చి చంటి దానికి స్నానం చేయించే పనికి కుదిరింది . అమెజాన్ వారి ఉయ్యాల గోద్రెజ్ వారి దోమతెర చిన్న దానికి పెద్ద దానికి మందులు సీసాలు పాత గుడ్డలు సాంబ్రాణి వే సే కుండ విసిన కర్ర జల్లెడ స్నానం చేయించే పీటలతో గది కొత్త రూపు సంతరించుకుంది. రోజంతా స్నానం గురించి కబుర్లు పోలిక గురించి కబుర్లతో ఎక్కడ సమయం తెలియడం లేదు . కాయపు ఉండలు పాత చింతకాయ పచ్చడి బీరకాయ సొరకాయ శొంఠి పొడి డబ్బాలతో నా వంటిల్లు కొత్త వాసనలతో నిండిపోయింది. ఒక జీవి రాకతో ఎన్ని మార్పులు ఎంత హడావిడి. నేను బ్యాంకు వెళ్లేవరకు పిల్లతో ఆటలు ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూపులు. అదో వింత అనుభూతి ఆ అనుభూతిని మాటల్లో వ్యక్తం చేయలేను.
ఇక మా అబ్బాయి అవినాష్ రోజు కాకినాడ హాస్పిటల్ కి క్యారేజీలు మోస్తూ మేనకోడ లిని వదల లేక ఏడుస్తూ విధి నిర్వహణ తప్పక కొత్త కాపురానికిమద్రాసు వెళ్ళిపోయాడు.
• మా కోడలు శ్వేతకి ముందుగానే పిల్లకి పండు పాప అని ముద్దు పేరు ఖరారు చేసింది. పాప నిజంగానే పండే.
ఇక మా పిల్ల పిల్లల పెంపకం గురించి అంతర్జాలంలో కోచింగ్ తీసుకుంటోంది .చంటి దాని మామూలు ఏడుపు కూడాకూడా నెట్లో కారణం వెతుకుతోంది. ప్రతినెలా వచ్చే పుట్టిన తేదీ కి రకరకాల ఫోజులు తో వాళ్ళకి ఫోటోలు తీస్తూ కాలక్షేపం చేస్తోంది. ఈ తరం వారికి ఇదో రకమైన ఆనందం. రోజు బీరకాయ సొరకాయతో నాలుక చచ్చిపోయి వెరైటీ పెట్టండి అంటూ రాగాలు తీస్తోంది. మా అత్తగారు మాత్రం చూసి చూడకుండా పత్యం మారుస్తున్న వాళ్ళ అమ్మ మాత్రం లక్ష్మణ గీత దాటడం లేదు. పిల్ల మీద ప్రేమ లేక కాదు చంటిపిల్లకు తేడా చేస్తుందని.
ఇలా రెండు నెలలు గడి చేయి. బారసాల కి ముహూర్తాలు పెట్టి పంపించారు వియ్యాలవారు. మూడో నెలలోనే వారికి ఆనవాయితీ. మా వియ్యాల వారికి ఇద్దరూ మగపిల్లలే. ఈ పిల్లే ఆడపడుచు. మా బావ గారు రోజు whatsup call lo మనవరాలు ఆట పాటలు చూసి మురిసిపోతున్నారు.
అల్లుడు, కూతురు పేరు ఖరారు చేయడానికి కుస్తీ పడుతున్నారు. పేరు ఇంకా లీక్ అవ్వలేదు. నేను మా ఆవిడ బారసాల ఏర్పాట్లు డెకరేషన్ లు ఇన్విటేషన్ లిస్టు సామాన్ల లిస్టు హోటల్ గది బుకింగ్ తో బిజీ బిజీ. క్యాటరింగ్ ఇవ్వడమా వంట వండించడం మా అని తర్జనభర్జన . కరోనా కారణంగా వంట చేయించడానికి నిర్ణయం. హోమాలు జపాలు దానాలు కోపాలు తాపాలు బంధువుల రాకపోకలుతో నామకరణ మహోత్సవం ప్రారంభమైంది. సుబ్రహ్మణ్య స్వామి వారు అమ్మవారి పేరుతో కలిపి కొల్లూరు చాంతాడులా ఉన్న పేరుని పంతులుగారు గుక్క తిప్పు కోకుండా చదివారు.
మా అత్తగారు మా పెద్ద బావమరిది ఇద్దరు దగ్గరుండి వంట వడ్డన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.మా కొత్త కోడలు శ్వేత హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ అత్తగారికి చేదోడువాదోడుగా ఉండి తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించింది. వీడియో వాడు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతూ చంటిపిల్ల ఫోజులకు , తనకు రానీ విద్యను ప్రదర్శించడానికి తంటాలు పడుతున్నాడు. మామిడికాయ పప్పు పులుసు వంకాయ కూర కందా బచ్చలి బూర్లు పులిహార తాపేశ్వరం కాజా తో విందుభోజనం ముగిసింది. ఆఖరి బ్యాచ్ వారికి వర్షం కొంచెం చికాకు చేసిన వరుణ దేవుడి ఆనందభాష్పాలు అని సరి పెట్టుకున్నాము.
రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
సామర్లకోట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి