కైలాస వీచికలు
కైలాస వీచికలు.
ఉదయం నుంచి కైలాస పర్వతం అంతా హడావుడిగా ఉంది. ఆరోజు ఏమిటి ప్రత్యేకత . మహా శివుడి పుట్టినరోజు. శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. లోకానికి మహాశివరాత్రి.
మరి అటువంటి శుభ సమయంలో పార్వతి దేవి హడావుడిగా కైలాస పర్వతం అంతా తిరుగుతూ శివుడు గురించి వెతుకుతోంది.
తన నేత్రాలని పత్తికాయలా చేసుకుని వెతుకుతున్న ఆ త్రినేత్రుడు జాడ ఎక్కడా కనపడలేదు. ఏమిటి స్వామి! ఎ క్కడ కనపడటం లేదు అనుకుంటూ ఆందోళన పడుతుండగా దూరం నుంచి శివుడు వస్తూ కనబడ్డాడు.
పార్వతి దేవి : స్వామి ఎక్కడికి వెళ్ళిపోయారు ?మీ గురించి ఏ లోకమని వెతకను ?చాలా ఆందోళన పడ్డాను !అంటూ కోపంగా పలికింది.
శివుడు: పార్వతి ఈరోజు ఏమిటో నీకు గుర్తు లేదా! నా పుట్టినరోజు మన కళ్యాణం జరిగిన రోజు అట్లాంటి పవిత్రమైన రోజున భక్తులందరూ నా గురించి అభిషేకాలు పూజలు ఉపవాసాలు కళ్యాణాలు ఎక్కడ ఖాళీ లేదు భూలోకంలో. ఈరోజుకి అంత పవిత్రత ఉంది.
అందుకే జన్మానికో శివరాత్రి అంటారు. వాళ్లంత భక్తితో నా అర్చనలు చేస్తుంటే నేను ఈ కైలాసంలో ఎలా ఉండగలను. శివాలయంలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో భక్తులు నా దర్శనం కోసం వేచి ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు శివారాధన చేస్తున్నారు. కొంతమంది దేవాలయాల్లో కొంతమంది ఇంటిదగ్గర శివలింగానికి అర్చనలు అభిషేకాలు చేస్తున్నారు. అలాంటి భక్తులను నేను అనుగ్రహించడానికి భూలోకమంతా ఒకసారి తిరిగి వచ్చాను. ఇంతమంది భక్తులను చూస్తుంటే నాకు కైలాసం రావాలని అనిపించలేదు.
పార్వతి దేవి: అయితే నేను మీకు గుర్తు లేనా ! ఆ భక్తుల గురించి నన్ను కూడా మర్చిపోయారా! అని కోపంగా అడిగింది.
శివుడు: లేదు పార్వతి . మనం లోకానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళం. బిడ్డలు ఆర్తితో అర్చనలు చేస్తుంటే అనుగ్రహించకుండా ఎలా ఉంటాం? . అంతే కాదు నీవు నాలో సగం. ఎప్పుడూ నాతో పాటే ఉంటావు. అందుచేత నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళను . అర్ధనారీశ్వరుడుని పార్వతీ పరమేశ్వరుడిని. ఈ సృష్టిలో ఏ భార్యకి లేని అదృష్టం నీకు కలిగింది. నువ్వు ఎప్పుడూ నాతో పాటే ఉంటావు . నాలోనే ఉంటావు. అన్నాడు శివుడు. ఇంతకీ నన్ను వెతుకుతున్న కారణం ఏమిటి? చెప్పు అని అడిగాడు శివుడు.
పార్వతి: ఏముంది ఈరోజు మీ పుట్టినరోజు మరియు మన కళ్యాణం జరిగిన రోజు కదా శుభ్రంగా తలంటి చక్కగా అలంకరణ చేద్దామని కోరిక. చంటి పిల్లాడు మట్టిలో ఆడుకుంటున్నట్లు ఎప్పుడు ఆ స్మశానo లో ఉండే బూడిద ఒంటికి రాసుకుంటూ ఉంటారు. మీ శరీరం అసలు రంగు తెలియటం లేదు నాకు అంది పార్వతి.
శివుడు: చూడు పార్వతి కోటాను కోట్ల మంది భక్తులు పంచామృతములు తోటి, రకరకాల ఫలములతో, విభూతితో గంగాజలంతో నారికేళ జలంతో పంచదార చెరుకు రసం వంటి తియ్యటి పదార్థాలతో ఉదయం నుంచి అభిషేకాలు చేస్తూనే ఉన్నారు. అలంకరణలు చేస్తూనే ఉన్నారు. మనం లోకానికి తల్లిదండ్రులు మన బిడ్డలే మనకు సేవలు చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మనం చేసుకుని దేదీ లేదు.
అయినా నా అలంకరణకి ఇప్పుడు ఏం తక్కువ? తలపైన ఎప్పుడు ప్రకాశించే నెలవంక, ఎప్పుడు స్వచ్ఛంగా ఉండే విష్ణు పది, పులి చర్మం, నాగాభరణం, మెడలో ఎముకలు పుర్రెలు ఒంటికి చితా భస్మం పూసుకుని సాక్షాత్తు ఒక మహాయోగిలా ఉంటాను కదా! ఇంత కంట అలంకరణ ఇంకేం కావాలి . నువ్వు ఇందాక బూడిద గురించి మాట్లాడావు కదా. ఈ చరాచర సృష్టిలో ప్రతి జీవికి పుట్టుకతో పాటే మరణం కూడా పుడుతుంది.
అయితే ప్రతి జీవి మరణం గురించి ఆందోళన పడుతూనే ఉంటాడు. అది ఎప్పుడొస్తుందో ఎవరికి తెలియదు. చివరికి మరణించిన తర్వాత గుప్పెడు బూడిదగా మారిపోతారు. ఆ మరణాన్ని ఎవరు తప్పించలేరు కానీ. నిత్యం ఆ మరణం గురించి భయపడుతున్న భక్తులకి ధైర్యం చెప్పడానికి చివరికి మీరు నా దగ్గరికి చేరుతారు అని చెప్పడానికి నేను ఆ భస్మాన్ని ఒంటికి ధరిస్తాను అన్నాడు శివుడు.
పార్వతి దేవి : బాగుంది అయితే కాస్తంత నోరు తీపి చేస్తాను రండి స్వామి లోపలికి అంది పార్వతీదేవి. భూలోకంలో మన భక్తులు పుట్టినరోజు నాడు పెండ్లి రోజు నాడు తీపి వస్తువులు తింటారు కదా అంది పార్వతి. కాస్తంత పుట్ట తేనె తీసుకుందురు గాని రండి అంది పార్వతి.
శివుడు: భూలోకంలో నా భక్తులందరూ ఇవాళ ఉపవాసాలు ఉంటున్నారు. అటువంటి సమయంలో నేను కడుపునిండా పుట్ట తేనె తాగితే వాళ్లేమనుకుంటారు చెప్పు. పైగా నేను అభిషేక ప్రియుడ్ని. అభిషేకములతోటే నాకు కడుపు నిండిపోతుంది అన్నాడు శివుడు.
పార్వతి దేవి: బాగానే ఉంది ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయించేస్తున్నారు. మీకు సేవలు చేసుకునే భాగ్యం కల్పించడం లేదు అంది నిష్టూరంగా.. మీ తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ చెప్పి మీ మీద ఫిర్యాదు చేస్తాను అని అనేసి గబుక్కున నాలిక కరుచుకుంది పార్వతి దేవి.
శివుడు: నాకైతే మామగారు ఉన్నారు కానీ మా తల్లిదండ్రులను ఎప్పుడైనా చూసావా !అని అడిగాడు శివుడు పార్వతిని. నేను ఎప్పుడు పుట్టానో ఎవరికీ తెలియదు. కాలానికి లొంగనివాడని. సృష్టికి మూల కారణమైన వాడిని. నేను స్వయంభవుడిని.సదా శివుడిని అంటే ఎల్లప్పుడూ ఉండేవాడిని. కల్మషం లేని వాడిని. సమస్త ప్రాణికోటిని సృష్టించి మరల నాలో ఐక్యం చేసుకునేవాడిని. జ్ఞానాన్ని ప్రసాదించే వాడిని. అయినా నా తల్లిదండ్రులు నాకు తెలియక పోయినప్పటికీ లోకానికి తల్లి అయిన నువ్వు నాకు తల్లి లాంటి దానివే అన్నాడు శివుడు.
పార్వతి దేవి : స్వామి లోకంలోని భక్తులు రకరకాల దేవతలను ప్రార్థిస్తారు. అయితే నిన్ను మాత్రం శివతాండవ స్తోత్రం తో స్తుతిస్తారు. రుద్రుడని, భస్మాంగరుడని పిలుస్తారు ఎందుకు?
అని అడిగింది పార్వతి దేవి.
శివుడు: చూడు పార్వతి ఈ సృష్టి ఉత్పత్తి, స్థితి ,లయం అనే మూడు శక్తులతో నడుస్తోంది. నేను ఆ త్రిగుణాలతో ముడిపడిన వాడిని. భక్తులు నన్ను ప్రేమతో పూజిస్తారు. భయం పోగొట్టడమే కూడా కాకుండా వారికి భయం కలిగించడం కూడా నాకు తెలుసు. నేను సృష్టికి మూలమైన వాడినే కాకుండా లయానికి మూలమైన వాడిని కూడా . అందుకే రుద్రుడు అంటారు భస్మాంగరుడు అంటారు.
పార్వతి దేవి: ఏ దేవతను చూసినా సువాసనలు పుష్పాలు విలాసవంతమైన ఆభరణాలతో అలంకరణ చేసుకుంటారు కదా మరి మీరు మాత్రమే పు ర్రెలను ఎముకలను ధరించి శ్మ శానవాసిగా ఉంటారు ఎందుకు?
శివుడు: పార్వతి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవన్నీ కూడా నా భక్తులే. శరణార్థులను రక్షించడం నా ధర్మం. నన్ను నమ్ముకున్న వారికి ఆశ్రయం కల్పించడం నా బాధ్యత అని చెప్పాడు శివుడు.
పార్వతి: మీరు సృష్టి స్థితి లయకారులు కదా !సమస్త సృష్టి మీ నుండి ఉద్భవించింది కదా !మీరు కోరుకుంటే క్షణంలో మీరు దేన్నైనా సృష్టించగలరు. అలాంటిది మీరు భిక్షాటన ఎందుకు చేస్తున్నారు అని అడిగింది పార్వతి.
శివుడు : పార్వతి నేను భిక్షాటన చేస్తున్నానని అనుకోవద్దు
లోకానికి ఒక సందేశాన్ని ఇస్తున్నాను. సంపదలోనే జీవితం ఉండదు. సత్యాన్ని మాత్రమే నమ్ముతూ మాయావాదం వదలమని చెప్పడానికే అలా ఉంటాను అన్నాడు శివుడు. నిరాడంబరత్వానికి, నిర్మలత్వానికి నేను ప్రతీకని.
పార్వతి :స్వామి మీరు శాంతస్వరూపులుగా ఉంటూ ఒక్కసారి క్రోధంతో త్రిపురాసురులను సంహరించారు మరియు రుద్ర తాండవం చేశారు ఎందుకు అని అడిగింది పార్వతి.
శివుడు: శాంతి అనేది ధర్మాన్ని కాపాడినప్పుడు పవిత్రంగా ఉంటుంది. లోకంలో అధర్మం పెరిగినప్పుడు అశాంతి పెరుగుతుంది. అటువంటి సమయంలోనే తాండవం చేయవలసిందే. త్రిపురాసురులు లోకాన్ని నాశనం చేద్దామని ప్రయత్నిస్తున్నప్పుడు నేను ధర్మాన్ని నిలబెట్టడానికి రుద్రతాండవం చేశాను అన్నాడు శివుడు.
పార్వతి : స్వామి మీరు శివ తాండవం చేసే సమయంలో మహా క్రోధంగా ఉంటారు. భక్తులు ఆర్తనాదాలు వింటూనే కరిగిపోతారు ఏమిటి ద్వంద ప్రవృత్తి అని అడిగింది పార్వతి.
శివుడు: భక్తులే నా ప్రాణం. వారి ప్రార్థనలు విని కరిగిపోతాను. ధర్మాన్ని రక్షిస్తాను. అధర్మాన్ని శిక్షిస్తాను. సృష్టిని పుట్టించే వాడిని నేనే .అధర్మం పెరిగినప్పుడు నాలో లయo చేసుకునేవాడిని నేనే అన్నాడు శివుడు.
పార్వతి దేవి: భక్తులందరూ మిమ్మల్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు కదా ! మరి అన్ని పేర్లు ఎందుకు ఒక నామం సరిపోదా అని అడిగింది.
శివుడు: పార్వతి నా తత్వం ఒక్కటే కానీ స్వరూపాలు అనేకం నీలాగే నాకు కూడా సహస్రనామాలు ఉన్నాయి.. భక్తుల అవసరాలుకు అనుగుణంగా కనిపిస్తాను . అందుకే నాకు భిన్నమైన పేర్లు అర్థాలను కలిగి ఉంటాయి. కొన్ని నామాల రహస్యాలు చెప్తాను విను అన్నాడు.
బ్రహ్మ విష్ణువు దేవతలు కూడా నన్ను పూజిస్తారు కాబట్టి మహాదేవుడు అంటారు. దేవతలకే దేవుడిని అని అర్థం. కొందరు రుద్రుడు అంటారు. భక్తుల రోదనలు తుడిచేవాడిని కాబట్టి రుద్రుడునయ్యాను. భక్తులకు శుభాలను కలిగించే వాడిని కాబట్టి శంభుడునయ్యా ను. భక్తుల ప్రార్థనలకు కరిగిపోయేవాడిని కాబట్టి భోళా శంకరుడునయ్యను.
మూడు లోకాలపై దృష్టి ఉంచేవాడిని కాబట్టి త్రినేత్రుడిని . మరి మూడు కళ్ళు మీకెందుకు అని అడిగితే రెండు కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూడడానికి మూడో కన్ను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ధర్మం కాపాడుతుంది అవసరమైతే లోకాన్ని నాశనం చేస్తుంది. క్షీరసాగర మధనంలో పుట్టిన కాలకూట విషాన్ని గొంతులో ధరించి నీలకంఠుడైనాను. గంగను తలపై ధరించాను కాబట్టి గంగాధరుడిని అయ్యాను. మరి పశుపతి అని కూడా పిలుస్తారు నన్ను. పశు అంటే జీవులని అర్థం. ఆ జీవులను పరిపాలించే వాడిని కాబట్టి పశుపతిని అన్నాడు శివుడు. కాలచక్ర గమనంలో అనేక జీవులు పుడుతుంటాయి మరణిస్తుంటాయి . కానీ నేను ఎప్పటికీ ఒకలాగే ఉంటాను. కాలం నా అధీనంలో ఉంటుంది. కాలానికి నేను లొంగను. అందుకే మహాకాలుడు అంటారు.
పార్వతి దేవి ఇవాళ మీ చరిత్ర వినడంతో నా జన్మ ధన్యమైపోయింది. అంతా బాగానే ఉంది . లింగోద్భవ కాలం అంటే ఏమిటి అని అడిగింది పార్వతి .
ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి ఒక వివాదం వచ్చింది.
ఎవరికి వారే తాము గొప్పవారమని చెప్పుకుంటూ వచ్చారు. వారు లేకపోతే సృష్టి లేదనే స్థితికి వచ్చారు. ఆ సమయంలో వారికి నా అసలైన రూపం చూపించడానికి నేను ఆకాశమంత ఎత్తైన అగ్నిస్తంభంగా మారిపోయాను. బ్రహ్మగారు నా తలపై బాగాన్ని చూడటానికి హంస రూపంలో పైకి ఎగిరాడు. విష్ణుమూర్తి వరాహరూపంలో నా పాదం చూడటానికి పాతాళానికి వెళ్ళాడు. కానీ వాళ్ళిద్దరూ ఎవరు నా తుది మొదలు కనుక్కోలేకపోయారు. అప్పటినుంచి వారి గర్వం పోయి లింగ రూపంలో ఆరాధించసాగారు. దానిని లింగోద్భవ సమయం అంటారు. అందుకే భక్తులు శివరాత్రి నాడు జాగరణ చేస్తారు. ఈ కాలంలో నన్ను ప్రార్థించిన వారికి పాపాలు అన్ని నశించిపోతాయి అంటూ చెప్పాడు శివుడు.
ఇంతలో అష్టదిక్పాలకులు సమస్త దేవతలు బ్రహ్మ విష్ణువు దక్ష ప్రజాపతి కూడా వచ్చి శివ దర్శనార్థం వేచి ఉన్నారని ద్వార పాలకులు వచ్చి చెప్పారు శివపార్వతులకి. శివాజ్ఞతో లోపలికి ప్రవేశించిన వారందరిని ఉచిత ఆసనం అలంకరింపజేసి కుశల ప్రశ్నలు వేసిన పరమశివుడు నవ్వి మీరు పెళ్లి వారిగా వచ్చారు కదా అన్నాడు.అవునన్నారు వారు. పదండి కల్యాణానికి వేళయింది లోక కళ్యాణం కోసం, భక్తులను తరింప చేయడానికి మీ శివపార్వతుల కళ్యాణం ప్రతి ఏటా ఈ శివరాత్రి నాడు జరిపించడం ఆనవాయితీ అంటూ శివపార్వతులిద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు గా చేయడానికి ఆ వచ్చిన వారు ఆడపిల్ల వారు మగ పెళ్లి వారిగా మారిపోయారు.
శివుడు నవ్వి నాకు ఇప్పుడున్నఈ అలంకరణ మీదే మక్కువ ఎక్కువ. మీ అమ్మగారి అలంకరణ ఎలా ఉంటుందో మా హయగ్రీవుడు చెప్పాడు కదా ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి అన్నాడు శివుడు. పార్వతీ పరమేశ్వరుడు వధూవరులుగా పెండ్లి పీటలు ఎక్కారు. సమస్త లోకాల ప్రజానీకం ఆహుతులుగా వచ్చారు. ఎవరి కొడుకు ఎవరి మనవడు అని గోత్రనామాలు గురించి చెప్పడం మొదలు పెడుతూ పురోహితులు పరమశివ గోత్రం అని సదాశివుడు మహానటే శ్వరుడు ఉమామహేశ్వరుడు అంటూ వరుడు పేరు వరుడు తండ్రి, తాతగార్లు గురించి చెబుతుంటే పార్వతి దేవి గోత్ర ప్రవరలతో కళ్యాణం కమనీయంగా జరిగింది
ఆకాశం నుండి పుష్ప వర్షాలు కురిసే యి.
దేవతల ఆశీర్వదించారు. సమస్త ప్రజానీకం ఈ కళ్యాణం చూసి ఆనందించారట. ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రంతో లోకమంతా మార్మోగిపోయింది. శ్రీరామచంద్రుడికి పుట్టినరోజు నాడే కళ్యాణం చేస్తారు. మరికొన్నిచోట్ల పరమశివుడికి లింగోద్భవ కాలం నాడే కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తుంది ట.
జన్మానికి ఒక శివరాత్రి అన్నట్లు ఈ రోజున భక్తులందరూ శివారాధనలో ఉండి అర్చనలు అభిషేకాలతో ఆ ముక్కంటిని సంతోషపరిచి లింగోద్భవ కాలం వరకు జాగరణ చేసి ప్రతి శివరాత్రి నాడు పునీతులు అవుతున్నారు.
రచన మధు నా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి