నిశ్శబ్దమైన ప్రేమ

నిశ్శబ్దమైన ప్రేమ

ఏ జన్మలో ని రుణానుబంధమో ఆ స్థావరంలో నాకు ఇంత చోటు కల్పించింది . ఆ స్థావరం నా ఉనికికి ఆధారమైంది. ఆ దుర్భేద్యమైన కోట చుట్టూ తిరుగుతూ చిమ్మ చీకటిలో గర్భస్థ నరకాలన్ని అనుభవిస్తూ ఎవరో తెలియని దాత అందించిన అమృతాన్ని చప్పరిస్తూ, ఎవరో అజ్ఞాత దాత ప్రసాదించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నెలకొకటి చొప్పున స్వీకరిస్తూ అలుపెరుగని సైనికుడి లాగా నిత్య సమరం చేస్తుంటే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నీ లోకం వేరు అంటూ మాయాలోకం నుండి మన లోకంలోకి తీసుకొచ్చి పడేసి ఇదిగో నా రూపం అంటూ దేవుడు నన్ను చూపించి ఆనందపరిచాడు మా బంధువుల్ని, స్నేహితులని. 

నేను కడుపులో పడినప్పుడు నేను ఒక రకంగాను అమ్మ ఒక రకంగానూ బాధ అనుభవించి నరకాలన్నీ చూసాము. నవనాడులు బిగబట్టి పురిటి నొప్పులు భరించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలోకి నన్ను తీసుకురావడం అమ్మకి నరకమే.

అలా భూమి మీద పడ్డ నాకు ఇన్నాళ్లు అమృతo అందించిన అన్నపూర్ణ నాకు అమ్మ అయింది. అమ్మ నుంచి వచ్చినవే నాకు బంధుత్వాలన్నీ. నాకు తొలి బంధువు అమ్మ.  
తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగిన నేను అమ్మ ఒకరినొకరు చూసుకోలేదు. నా రూపం తెలియదు నా రంగు తెలియదు. పసిబిడ్డగా మంచం మీద పక్కన చేరినప్పుడు మాత్రమే నన్ను చూసింది. కోరుకున్న విధంగా బిడ్డ పుట్టకపోయినా కొండంత ఆనందంతో నన్ను బిడ్డగా స్వీకరించింది.

ఒంట్లో ఉన్న రక్తం ఖర్చయిపోతున్న, దేవుడిచ్చిన అందం తరిగిపోతున్న ప్రేమతో రక్తాన్ని చనుబాలుగా మార్చి నాకు ప్రాణం కాపాడింది. నువ్వు ఇప్పుడు ఇద్దరు కోసం తినాలి అని అంటే ఇప్పుడు నేను బ్రతక వలసింది నాకోసం కాదు నా బిడ్డ కోసం అంటూ అడ్డమైన తిళ్ళు తినడం మానేసి నోరు కట్టుకొని నియమం పాటిస్తూ పచ్చి బాలింతరాలు అయింది. 

పచ్చి బాలింతరాలు ఒళ్ళు అలసిపోయి పక్కనున్న పసివాడు పక్క తడిపిన అది గంగాజలo గా భావించి తెల్లవార్లు అందులో ఆనందం అనుభవిస్తూ ఉండిపోయేది. 

రోడ్డుమీద నడిచి వెళ్తూ పక్కన మలవిసర్జన చేస్తున్న వారిని చూసి వారికేసి అసహ్యంగా చూసే అమ్మ నా మలమూత్రాలకి కేర్ టేకర్ గా అవతారం ఎత్తింది. 

నేను ఈ లోకంలోకి అడుగుపెట్టిన రోజే అమ్మ తన హృదయాన్ని పూర్తిగా నాకు అంకితం చేసింది. నా ముద్దుల మాటలు వినాలని ఉత్కంఠగా ఎదురు చూసింది. నేను మొట్టమొదటగా నవ్వినప్పుడు, అది ఆమె జీవితం గెలిచిన క్షణం అయింది.
నాకు నడక రావడానికి ముందే అమ్మ తన చేతుల్ని నా అడుగులుగా మార్చుకుంది. నా చేతిని పట్టుకుని, ప్రతి అక్షరం నేర్పింది. నా కన్నీళ్లు ఆరిపోవడానికి, నా హృదయాన్ని మోహింపజేయడానికి ఆమె ప్రతి ప్రయత్నం నాకు ఆనందాన్నిచ్చింది.

రాత్రి నన్ను కౌగిలించుకుని పడుకుంటే గాని ఆమెకి నిద్ర పట్టేది. నాకు చిన్న గాయమైనా, ఆమె కన్నీటి వర్షం కురిపించేది. నేను బలహీనంగా ఉన్న ప్రతిసారీ తన బలాన్ని నాలో నింపేది.

నేను కౌమారదశలోకి అడుగుపెట్టిన కొద్దీ, నా ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. చిన్నప్పుడు అమ్మ ఒడిలో
 రోద నతో ఏడ్చే నేను, ఇప్పుడు అలజడితో, ఆవేశంతో ఎదుగుతున్నాను.
నా మానసిక సంఘర్షణను తల్లి నిశ్శబ్దంగా గమనించింది. నేను చిరాకుగా మాట్లాడిన ప్రతిసారీ ఆమె హృదయం చెదిరిపోయింది. కానీ నా కోపాన్ని ప్రేమగా మాట్లాడి పోగొట్టింది
నేను కొత్త స్నేహితులను వెతుక్కుంటూ, అమ్మ ఒడిని విడిచి, బయట ప్రపంచాన్ని అన్వేషిస్తున్నాను. కానీ ఇంటికి వచ్చాక, నా బండి మీద పడి ఉన్న ధూళిని చూసి, "నీవు నడిచిన మార్గం సురక్షితమేనా?" అని విచారం వ్యక్తం చేసింది.
నేను తప్పులు చేసినా, సర్దిచెప్పింది. నా విజయాలకు కేరింతలు కొట్టింది. నా ఓటమికి వెన్నుతట్టింది. నాకు దూరమైన నా చిన్ననాటి మిత్రుడికన్నా, నా తల్లి ప్రేమ నాతో శాశ్వతంగా ఉంది.

నేను యువకుడిగా ఎదిగిన తర్వాత, నా ప్రపంచం మరింత వెదుకులాటలో మునిగిపోయింది. నా కలలు, నా లక్ష్యాలు, నా మి త్ర బంధాలు – ఇవన్నీ నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పాయి.

తల్లితో నేను మాట్లాడే సమయం తగ్గింది. అమ్మను చిన్నప్పుడు రోజు వందసార్లు పలకరించే నేను, ఇప్పుడు వారానికి ఒకసారి మాట్లాడటం కూడా మర్చిపోతున్నాను.

అమ్మ నా బట్టలను అందంగా ఉతికి ఉంచినా, నేను వాటిని గమనించలేకపోయాను. ఆమె వండిన అన్నం నా కోసం వేడిగా ఉన్నా, నేను ఫోన్‌లో మునిగిపోయి ఆస్వాదించలేకపోయాను.

ఒకరోజు రాత్రి నేను ఆలస్యంగా ఇంటికొచ్చినప్పుడు, తలుపు తెరిచి చూసిన అమ్మ కళ్ళలో అలసట, ఆందోళన, ప్రేమ అన్నీ కలిసిపోయి కనిపించాయి.

"ఎందుకింత ఆలస్యం?" అని అడిగినా, నా ముఖం చూడగానే కన్నీళ్లు వెనక్కి తీసుకుంది. నా పొరపాట్లను ఎప్పుడూ పెద్దవి చేయలేదు. నా కష్టం చూసి మనసు కరిగించుకుంది.

నా జీవితంలోని ఏ దశలో అయినా, అమ్మ ప్రేమ ఎప్పుడూ నన్ను వదలలేదు. నా బాల్యంలో ఆమె చేతులు నా కుర్చీగా మారాయి. నా కౌమారదశలో ఆమె ఓడలా మారి నా తుపాన్లను తట్టుకుంది. నా యవ్వనంలో ఆమె నిశ్శబ్దంగా నా వెన్నెలవెలుగై మారింది.
ఏదైనా ఉన్నప్పుడు నా కోసం ఆరాటపడేది అమ్మే. ఏదీ లేకపోయినా, నా కోసం త్యజించేది అమ్మే. నా విజయాన్ని చూసి గర్వపడేది అమ్మే. నా ఓటమిని చూసి తల వంచేది అమ్మే.
నా మాటల్లో తేడా వచ్చినా, నా ప్రేమలో లోటు కనిపించినా, తల్లి ప్రేమ మాత్రం ఎప్పటికీ మారలేదు.

కాలంతో పాటు మారే అనుబంధాల మధ్య, మారని ఏకైక ప్రేమ తల్లి ప్రేమ. కొడుకు బాల్యం, కౌమారదశ, యవ్వనం, వివాహం – జీవితంలో ఎన్నో మలుపులు తిరిగినా, తల్లి ప్రేమ మాత్రం అదే స్థిరత్వంతో నిలిచి ఉంటుంది.

కొడుకు పెళ్లయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించినా, తల్లి ప్రేమ ఓ నీడలా, ఓ దీవిగా అతనిని కాపాడుతూనే ఉంటుంది. తన ప్రేమను వ్యక్తపరిచే విధానం మారవచ్చు, కానీ ఆ ప్రేమ తీరని తృప్తిగా, అనుభూతిగా కొనసాగుతూనే ఉంటుంది.
ఎప్పుడో చిన్నప్పుడు తాను తల్లిని వదిలి ఎక్కడికైనా వెళ్తే, వెనక్కి వచ్చి ఆమె ఒడిలో పడిపోయే కొడుకు – ఇప్పుడు పెరిగిపోయాడు, తన కుటుంబం ఏర్పరుచుకున్నాడు. కానీ ఎప్పుడైనా, ఎక్కడైనా తల్లి ప్రేమ కోసం తన మనసు తపిస్తూనే ఉంటుంది.

కొడుకు పెళ్లయిన తర్వాత కొత్త జీవితం ప్రారంభించినా, అతనికి భార్యతో సరైన అనుబంధం ఉండకపోవడం అనేది సాధారణం. ఈరోజుల్లో కొడుకు భార్యలు అత్తగారితో అంత ప్రేమగా ఉండటం కనిపించడం తక్కువగా ఉంది. కానీ తల్లి ప్రేమ మౌనంగా ఉండి, తన కొడుకుతో ఉన్న అనుబంధాన్ని మరిచి పోదు.
కొడుకు పెరిగి తన కుటుంబం ఏర్పరుచుకున్నా, తల్లి హృదయంలో ఎప్పటికీ ఆయన ప్రేమ నిలిచి ఉంటుంది. తన మనసులోని భావాలను తనకు తెలియని చోట తల్లి నిశ్శబ్దంగా అనుభూతి చెందుతుంది.

ఇది తల్లి ప్రేమ – నిశ్శబ్దమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ

అంటూ అబ్బా ఎంత అద్భుతంగా వచ్చిందీ వాక్యం అనుకున్నాడు రచయిత రవి శంకర్. ఇది ఒక రకంగా అనుభవమే. ఒక్కసారిగా తల్లి గుర్తుకొచ్చింది రవి శంకర్ కి . కేవలం నామీద ప్రేమ కొద్ది ఇప్పటికీ మౌనంగా ఉంటోంది. ఆమె మౌనo లో ఎన్నో త్యాగాలు. అది చేతకానితనం కాదు అని నాకు తెలుసు. ప్రశ్నించే అధికారం ఆమెకి ఉందని తెలుసు. 

అయినా మౌనంగా ఉండడానికి కారణం పరువు మర్యాద ఆమె కళ్ళ ముందు కనబడుతున్నాయని నాకు తెలుసు. ఎవరిని నిందించకుండా తనలో తాను కుమిలిపోతూ కేవలం కొడుకు కోసమే కాలం వెళ్ళదీస్తున్న తల్లి వేదన నాకు తెలుసు అని మౌనంగా రోదిస్తూ ఉండిపోయాడు రచయిత రవిశంకర్.

ఈ రకమైన సమస్యలకి పరిష్కారం చూపించవలసిన రచయిత మౌనంగా ఉండి పోయాడు. అత్త గారిని ఒక రాక్షసి భావించి దూరంగా ఉంచే కోడలు ఉన్నంతకాలం ఏ రచయిత పరిష్కార మార్గం చూపించలేడు. నేర్పుతో ఓర్పుతో సంసారాన్ని సరిదిద్దుకోలేని కోడలు ఉన్నంతకాలం ఈ వ్యవస్థ ఇలా కొనసాగుతూనే ఉంటుంది.

రచన :మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం