మానవత్వం



ఇవాళ పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసానో! ఒక్క బేరం రాలేదు.
"పోనీ ఇంటికి వెళ్ళిపోదాం" అనుకుంటే, ఇంటి దగ్గర ఎదురుచూసే అప్పుల వాళ్లకి, ఇంటి యజమానికి ఏం సమాధానం చెప్పాలి! అని పోచయ్య తనలో తాను మధనపడుతూ, ఏం చేయాలో తోచక, ఆటో స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ, సందు తిరిగేటప్పటికీ...
పెద్ద చప్పుడు, "అమ్మా!" అని గట్టిగా కేక వినబడింది.

ఏం జరిగిందో చూసే లోపల చుట్టూ జనం గుమిగూడారు.
రోడ్డుమీద సుమారు నలభై ఏళ్ళు ఉంటాయేమో అనిపించే వ్యక్తి, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే మోటార్‌సైకిల్, హెల్మెట్ పడి ఉంది. ఎవరో "యాక్సిడెంట్!" అని గట్టిగా అరుస్తున్నారు.
ఒక క్షణం పోచయ్యకి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి.

"ఇదేమిటిరా భగవంతుడా! ఇదొక ప్రాబ్లం. ఈ రోజంతా ఇలా ఉంది ఏంటి? పైసా సంపాదన లేదు, గాని మళ్లీ కొత్త సమస్య వచ్చి పడింది!"

"ఇప్పుడు ఆటో దిగితే జనం గట్టిగా కొడతారు, తిడతారు, పోలీస్ కేసు పెడతారు. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెడితే జరిగేది అందరికీ తెలుసు. కోర్టులు చుట్టూ తిరగాలి." అని భయపడుతూ తనలో తానే బాధపడుతూ, ఒకసారి రోడ్డు మీదకు చూశాడు.
అంతమంది జనం చుట్టూ మూగి ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదు.
కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు. "పోలీస్ కేస్ అవుతుందని భయం అందరికీ!"
"అసలు ఈ వ్యక్తి బతికున్నాడా? చనిపోతే మరీ ప్రాబ్లం అవుతుంది. జైలు శిక్ష తప్పదు!" అనుకుంటూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు.
ఏ తల్లి కన్న బిడ్డ ఇలా రక్తపు మడుగులో అనాధలాగా పడి ఉన్నాడు. వదిలేసి వెళ్ళడం ఎలా సాధ్యం? ఎంతమంది ఎదురు చూస్తుంటారో పాపం ఈ వ్యక్తి కోసం!

ఆ వ్యక్తిని దగ్గరగా వచ్చి చూశాడు. నోటి వద్ద చిన్నగా శబ్దం వినిపించింది — "నీళ్లు..." అన్నట్టు.

పొచయ్యకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆ వ్యక్తి కళ్లలో ప్రాణం ఇంకా మిగిలి ఉంది. చెమటలు పట్టిన చేతితో, ఆటోలో ఉన్న నీళ్ల బాటిల్ తీసుకుని దిగాడు. జనం ఇంకా వెనక్కి తగ్గి చూస్తున్నారు. ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
అయినా ధైర్యం చేసి, బాటిల్లో నీళ్లు తీసి మొహం తుడిచాడు. కొన్ని నీళ్లు తాగించాడు. నీళ్లు తాగిన వెంటనే ఆ వ్యక్తి కళ్లెత్తి చూశాడు. వెంటనే 108కి ఫోన్ చేసి, అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
ఇప్పుడు జనాల్లో కొద్దిగా కదలిక వచ్చింది. ఒకతను అన్నాడు –
"అయినా నువ్వే స్పీడ్‌గా వచ్చావు. నువ్వు చూసుకోవాల్సింది."
పొచయ్య ఊపిరి పీల్చుకున్నాడు –

"అవును అన్నా, నా తప్పే. కానీ ప్రాణం పోయే లోపు ఏదైనా చేయాలి కదా. ఎవరో మనిషి కదా! చచ్చిపోతే మనమే మనుషులం ఎలా అనిపిస్తుంది?"
"ముందు హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి కదా? అంబులెన్స్ ఇంకా రాలేదు ఏమిటి!" అంటూ కంగారు పడుతున్నాడు.
అక్కడే నిలబడ్డ ఓ స్కూటీవాడు పొచయ్య భుజాన్ని తట్టి –
"బాగా చెప్పావు అన్నా. ఈ రోజుల్లో నీలా స్పందించేవాళ్లు లేరు."

ఒక కానిస్టేబుల్ వచ్చి అడిగాడు –
"ఘటన ఎలా జరిగిందీ చెప్పగలవా?"
పొచయ్య నిజం చెప్పాడు –

"నిజంగా నా స్పీడ్ ఎక్కువైంది సార్. కానీ నేనే ముందుగా దిగిపోయి నీళ్లు ఇచ్చా. ప్రాణం బతికితేనే తప్పు తేల్చుకోవచ్చు కదా సార్."

అతని మాటల్లో నిజాయితీ కనిపించింది కానిస్టేబుల్‌కు. అతను పేరు అడిగాడు –
"పేరు చెప్పు బాబు!"
"పొచయ్య సార్. ఆటో డ్రైవర్‌ని. మొన్ననే బాడ్జి కూడా రిన్యూ చేయించాను." అన్నాడు.
ఇంతలో అంబులెన్స్ వచ్చింది. బాధితుడిని ఎక్కించి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. హెడ్ కానిస్టేబుల్ బండి మీద ఫాలో అవుతూ అక్కడికి చేరాడు.
వైద్యులు చూసి చెప్పారు –
"తలకు బాగా దెబ్బ తగిలింది. ఇది మా వల్ల అయ్యే పని కాదు. ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. మేమే అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం."
ఆ మాటలు విని పొచయ్యకి చెమటలు పట్టాయి.
"ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఖర్చు భరించలేను. కానీ తీసుకెళ్లకపోతే ప్రాణం పోతుంది. చూస్తూ చూస్తూ ప్రాణం పోతే ఎలా?" అని తల పట్టుకున్నాడు.
ఇంతలో ఆ బాధితుని ఫోన్ మోగింది. పోచయ్య భయపడుతూ ఫోన్ ఎత్తి అవతల వాళ్లకి విషయం చెప్పాడు. అదృష్టవశాత్తూ ఫోన్ బాధితుడి ఇంటి వాళ్ల నుండి వచ్చింది. 
కాసేపట్లో వాళ్లు హాస్పిటల్‌కు చేరుకున్నారు. విషయం విని, ఎలాంటి విచారణ చేయకుండా, సమయానికి ప్రాణం కాపాడినందుకు రెండు చేతులు జోడించి నమస్కరించి, కొంత సొమ్ము చేతిలో పెట్టారు.

పక్కన నిలబడి ఉన్న ఓ జర్నలిస్టు ఫొటోలు తీసి, రేపటి పేపర్లో కథనంగా రాయాలని ఆశతో వెళ్లిపోయాడు.

బాధితుడి బంధువులు కానిస్టేబుల్‌తో మాట్లాడి –
"కేసు పెట్టే ఆలోచన లేదు. ప్రాణం కాపాడాడు అంతే మా కోసం దేవుడిలా." అని పంపేశారు.

మరునాడు దినపత్రికలో, సోషల్ మీడియాల్లో "ఆటో డ్రైవర్ మానవత్వం" గురించి కథనాలు వెలువడ్డాయి. ఆటో డ్రైవర్ పోచయ్య పాపులర్ అయిపోయాడు.

ఆ వ్యక్తిని సకాలంలో హాస్పిటల్‌కి తీసుకెళ్లారని, లేదంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది అని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు పదేపదే చెప్పడంతో, బంధువులు మాటిమాటికి పోచయ్యని "దేవుడు పంపిన మనిషి" అని భావించారు.

నిజమే. యాక్సిడెంట్ అయిన వ్యక్తి కూడా ఒక దేవాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నిక్కచ్చిగా పనిచేస్తూ, దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తూ, పదిమందికి తలలో నాలికలా ఉండే వ్యక్తి. అటువంటి వాడికి ఆపద వచ్చినప్పుడు దేవుడే దిగి వస్తాడు.
అది వాస్తవం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట