ఆమె స్వరo _ ఊరికి వరం
"ఏమ్మా మల్లి, ఇంత ఆలస్యమైంది?" అని అడిగాడు పొలానికి క్యారేజీ తీసుకువచ్చిన తన కూతుర్ని రామారెడ్డి.
"ఏం లేదు నాన్న, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాను."
"నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చావా! దారిలో పాటలు పాడుకుంటూ వచ్చావా?" అని అడిగాడు రామారెడ్డి.
ఎందుకంటే ప్రతిరోజు రామారెడ్డికి ఇది మామూలే. రెండు మూడు సార్లు కూతురి ఇంకా రావటం లేదని ఎదురు వెళ్లేసరికి చెట్టు మీద ఉన్న కోయిలని, పాకలో ఉన్న పశువుని, పొలం గట్టు మీద ఉన్న చెట్లని, చేలో ఉన్న పంటని చూస్తూ ఏదో పాటలు పాడుకుంటూ అడుగులు వేస్తూ వస్తోంది మల్లి.
"ఏమ్మా, ఎప్పుడు ఆ పాటలేనా? తొందరగా రా! ఆకలేస్తుంది," అంటూ కేకలేశాడు రామారెడ్డి.
చిన్నప్పటి నుంచి రేడియో పట్టుకుని వదలదు మల్లి. ఎవరి ఇంటికి వెళ్ళని మల్లి ఈమధ్య తరచూ పక్కింటి వాళ్లింటికి వెళ్లి ఏదో పాటల ప్రోగ్రాం చూడడం మొదలుపెట్టిందని రామారెడ్డికి భార్య చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
"ఏంటో ఈ పిల్లకి అలవాటు ఎలా వచ్చిందో!" చిన్నప్పటినుంచి ఊర్లో జరిగే గణపతి, నవరాత్రి ఉత్సవాల పందిళ్లలోనూ, శ్రీరామనవమి, శివరాత్రి జాతరలోనూ ఏదో భక్తి గీతాలు పాడుతూ ఉంటుంది.
"ఇవి ఎక్కడ నేర్చుకున్నావ్ అమ్మ?" అంటే—"అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ నేర్పింది" అని చెప్పింది.
రామారెడ్డికి మల్లి ఒక్కగానొక్క కూతురు. చిన్నప్పటినుంచి గారాబంగా పెంచి ఊర్లో ఉన్న హై స్కూల్ వరకు చదివించాడు రామారెడ్డి. ఆడపిల్లని పై చదువులకు పంపడానికి రామారెడ్డికి ఇష్టం లేదు. దానికి తోడు ఆ ఊరి నుంచి కాలేజీకి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు దూరం వెళ్ళాలి. ఆ ఊరికి బస్సు లేదు. సరైన రోడ్డు సౌకర్యం లేదు.
వర్షాకాలం వస్తే ఆ రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంటుంది. మగపిల్లలైతే సైకిల్ మీద వెళ్లి చదువుకుంటారు. ఆడపిల్లల చదువు అక్కడితో ఆగిపోవాల్సి వస్తుంది. అందులో ఎంతోమంది తెలివైన పిల్లలు ఉన్నా బస్సు సౌకర్యం లేక చదువుకోడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
ఎవరికైనా ఏదైనా రోగం వస్తే అర్జంట్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. ఆ సమయానికి ఆటో గాని, రిక్షా గాని ఆ ఊర్లో దొరకవు. పక్క ఊరునుంచి రావాలి. కొన్ని సార్లు సరైన వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు.
తన కూతురు మల్లికి కూడా ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలనే తొందరలో ఉన్నాడు రామారెడ్డి.
మొదట్లో ఎంతో అమాయకంగా ఉండే మల్లి, క్రమేపీ అమ్మమ్మ చెప్పిన పాటలే కాకుండా రేడియోలో వచ్చే పాటలు, టీవీలో వచ్చే పాటలు నేర్చుకుని పాడడం ప్రారంభించింది.
ఆ ఊరిలో జరిగే రాములవారి కళ్యాణంలో మల్లి పాడిన పాట విని ఆ ఊరి హై స్కూల్ హెడ్‌మాస్టర్ శంకరం,
"నీ గొంతు చాలా బాగుంది అమ్మ! చాలా శ్రావ్యంగా ఉంది. నువ్వు పాడిన పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తున్నాయి. తప్పనిసరిగా నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి టీవీలో జరగబోయే పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొనాలి," అని చెప్పాడు.
"ఈ పాటల పోటీకి కొత్త సిరీస్ ప్రారంభించేటప్పుడు మన పక్క ఊర్లో మూడు నెలల్లో ఆడిషన్ జరుగుతుంది. నిన్ను నేను తీసుకెళ్తాను," అంటూ ప్రోత్సహించాడు.
శంకరమాస్టర్ ప్రోత్సాహంతో రాత్రి పగలు తేడా లేకుండా పాటలు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది మల్లి.
గురువు లేని విద్య ఎలా ఉంటుంది? తప్పులేమిటో, ఒప్పులేమిటో తెలియదు. కానీ మాస్టర్ సలహా ఇచ్చి ఊరుకోకుండా, పక్క టౌన్‌లో తనకు తెలుసు ఉన్న సంగీత మాస్టారు దగ్గర మల్లిని జాయిన్ చేశాడు.
అయితే మల్లి తండ్రి,
"మాస్టారు, ఆడపిల్లను అక్కడ ఉంచడానికి నాకు ఇష్టం లేదండి," అన్నాడు.
"లేదు నాన్న, నేను అక్కడ ఉండను. ప్రతిరోజూ ఇంటి దగ్గర నుంచే వెళ్లి వస్తాను," అంది మల్లి.
"మీరు ఏమీ భయపడకండి. నా జాగ్రత్తలు నాకు తెలుసు. నాకు ప్రపంచం గురించి కూడా తెలుసు," అంది ధైర్యంగా.
అలా తండ్రికి ధైర్యం చెప్పి ఉదయం లేచి క్యారేజీ పట్టుకుని ఐదు కిలోమీటర్లు కష్టపడి చేరుకుని, అక్కడి నుంచి బస్సు ఎక్కి మాస్టారు ఇంటికి వెళ్లి పాఠాలు చెప్పించుకుని సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేది.
మంచి శ్రావ్యమైన గొంతు, నేర్చుకోవాలనే ఉత్సాహం, పట్టుదల మల్లిలో గమనించిన సంగీత మాస్టారు చాలా శ్రద్ధగా బోధించడం ప్రారంభించారు.
మూడు నెలల తర్వాత పక్క టౌన్‌లో జరిగిన ఆడిషన్ టెస్ట్‌కి మల్లితో పాటు హెడ్‌మాస్టర్ శంకరం కూడా వెళ్లాడు.
ఇసుక వేస్తే రాలనంత జనం! అందరూ ఇంచుమించు మల్లి వయసు వాళ్లే. సంగీతం బాగా నేర్చుకున్నంత మాత్రాన పోటీలో నెగ్గుతారనే గ్యారెంటీ ఉండదు. ఆ సమయంలో వాళ్లు పాట ఎలా పాడారన్నదే ముఖ్యం.
పది రోజుల తర్వాత మల్లి ఆడిషన్ టెస్ట్‌లో సెలెక్ట్ అయ్యిందని, పాటల పోటీలకు రావాలని కబురు వచ్చింది. ఇంకేముంది! పాటల పోటీలో నెగ్గినంత ఆనందపడింది మల్లి.
ప్రతిరోజూ రాత్రి పగలు లేకుండా అదే ధ్యాస—పాడిన పాటే నేర్చుకోవడం. ఎలాగైనా ఈ పోటీలో నెగ్గాలని పట్టుదలతో బాగా ప్రాక్టీస్ చేసింది.
అలా మూడు రౌండ్లలో విజయం సాధించి ఆఖరి రౌండ్‌లో పాడడానికి సిద్ధపడింది మల్లి.
సినిమాలకు సంగీత స్వరాలు సమకూర్చే ఒక పెద్దాయన మరియు ఆ రాష్ట్ర మంత్రి గారు కూడా న్యాయ నిర్ణేతలుగా వచ్చారు.
మొదటిసారి అంత పెద్ద మహానగరంలో పాట పాడడానికి స్టేజీ ఎక్కిన మల్లిని అందరూ విచిత్రంగా చూశారు.
చూడడానికి నల్లగా, పెద్ద పెద్ద కళ్లతో, పళ్ళు ఎత్తుగా, ఒక పల్లెటూరునుంచి వచ్చిన పిల్లలా బట్టలు కట్టుకుని వచ్చిన మల్లిని చూసి—"ఈ అమ్మాయి ఇన్ని రౌండ్లు దాటి ఎలా వచ్చింది?" అని అనుకున్నారు ప్రేక్షకులు.
ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్లందరూ సంగీతం నేర్చుకున్నవాళ్లు. "ఈ అమ్మాయికి సంగీతం కూడా రాదు, పల్లెటూరునుంచి వచ్చింది," అనుకున్నారు.
కానీ ఒక మంచి చలనచిత్రంలోని శ్రావ్యమైన పాటను, సంగీత ప్రధానమైన పాటను, సాహిత్యం విలువలు కలిగిన పాటను మల్లి పాడుతుంటే హాల్లో నిశ్శబ్దం రాజ్యమేలింది.
అందరూ ఎంతో ఆనందంతో మల్లిని చూడడం ప్రారంభించారు. కళ్ళు మూసుకుని ఎంతో తన్మయత్వంతో రాగయుక్తంగా పాడిన పాట విని ప్రేక్షకులు—"అప్పుడే అయిపోయిందా!" అని అనుకున్నారు.
న్యాయనిర్ణేతలతో సహా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు.కళ్ల వెంట నీళ్లు వచ్చేశాయి మల్లికి. మొదటి విజేతగా మల్లిని ప్రకటించారు.
తన స్పందన తెలియజేస్తూ మల్లి తన ఊరి గురించి, ఊరిలోని రోడ్ల గురించి, ఆడపిల్లలు పడుతున్న కష్టాలు గురించి, తను ఏ విధంగా కష్టపడి పాటలు నేర్చుకున్నదీ వివరించి ఏడుస్తూ—"మా ఊరికి బస్సు సౌకర్యం కల్పించండి," అని మంత్రిగారిని నేరుగా అడిగేసింది.
ఇంత పెద్ద వేదిక మీద, ఇన్ని వేల మంది ప్రేక్షకుల మధ్య, ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చూస్తున్న సమయంలో అలా అడిగేసరికి మంత్రిగారు వెంటనే మల్లిని వివరాలు అడిగి తెలుసుకుని ఆ డిపో మేనేజర్‌తో మాట్లాడి ఆ ఊరికి బస్సు సౌకర్యం కల్పించారు.
మల్లి పాటతో ఒక సామాజిక ప్రయోజనం సిద్ధించిందని ఆ ఊరి ప్రజలు ఎంతో సంతోషించారు. బస్సు చూసి మురిసిపోయారు. పండగ చేసుకున్నారు.
ఇంతవరకు ఆ మల్లి అడవిలో సువాసనలు వెదజల్లేది. ఇప్పుడు ఎక్కడ చూసినా మల్లిమాటే!
ఇంతవరకు ఆ ఊరు గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆ ఊరు వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్‌లోకి ఎక్కింది. పేపర్లలో ఫ్రంట్ పేజీలో కనబడింది. టీవీ వార్తల్లోకి వచ్చింది.
ఆ ఊరి వాళ్లు రోజూ మల్లిని తలుచుకోకుండా ఉండలేకపోయారు.
ఆ తర్వాత కొద్ది రోజులకే మల్లికి పెళ్లి అయింది. సరాగాలు పాడే మల్లి శ్రీమతిగా మారిపోయింది.
ఆ ఊరునుంచి అత్తవారింటికి వెళ్లిపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
✍️ రచన: మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
📍 కాకినాడ
📞 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి