గాజుల గానం
హృదయం లోకి తొంగి చూస్తే వట్టి గాజు ముక్క అయినా, అవి అతివల చేతులకు అద్భుత సౌందర్యం ఇచ్చే ఆభరణం. అవి వెలకట్టలేని ఆభరణం — ఒక స్త్రీ సౌభాగ్యానికి గుర్తు. ఆడపిల్లగా పుట్టిన రోజు మొదలు, సౌభాగ్య స్త్రీగా జీవితం చాలించే వరకూ చేతికి అందమైన అలంకారం. ఆధునిక అలంకారాలు ఎన్ని ఉన్నప్పటికీ గాజులు ధరించడం అన్నది ఒక భావోద్వేగం, ఒక శుభప్రదమైన అలంకారం. ధనిక–పేద భేదం లేకుండా అందరికీ గాజులు ఉంటాయి; హిందూ సాంప్రదాయంలో వాటికి ఎనలేని మక్కువ.
శైశవ దశలో ఉన్నప్పుడు, ఆడ–మగ తారతమ్యం లేకుండా అందరికీ నల్ల గాజులు తొడుగుతారు — పరుల దృష్టిని మార్చడానికీ, శిశువుకు రక్షణకోసం. అక్కడి నుంచే మొదలైన ఈ గాజులు స్త్రీని ప్రతి సందర్భంలోనూ ఆనందింప చేస్తూనే ఉంటాయి. గాజులు ధరించడం అనేది ఒక సాంప్రదాయం, ఒక భావోద్వేగం, ఒక నమ్మకం.
గాజుల్లో రకరకాలు ఎన్ని ఉన్నప్పటికీ అన్ని సందర్భాల్లోనూ అందం ఇచ్చేది మట్టి గాజులు మాత్రమే. చేతినిండుగా గాజులు ధరించే సాంప్రదాయం నుంచి ఒక బంగారు గాజు మాత్రమే ధరించే అలవాటుకి స్త్రీ మారిపోయింది. అప్పట్లో స్త్రీ ఒక గృహిణిగా ఇంటిపట్టునుండేది. కాలక్రమేణా రకరకాల వృత్తుల్లో ముందుకు దూసుకుపోతూ, వృత్తిలో సౌకర్యం కోసం ఈ మట్టి గాజులను వాడడం తగ్గిపోయింది.
అంతేకాదు, రకరకాల అలంకరణలతో మురిసిపోయే స్త్రీ ఇప్పుడు గాజులు ధరించకపోయినా సంతోషపడుతుంది. ఒకప్పుడు ఏ దుస్తులు వేసుకున్నా చేతికి సంబంధించిన గాజుల అలంకరణలో మార్పు ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు — దుస్తులకు సరిపోయే గాజులు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యరీత్యా, జాతకం ప్రకారం కూడా కొంతమంది లోహపు గాజులను వాడుతారు.
పూర్వకాలంలో ప్రతివారం జరిగే సంతలలో, తిరునాళ్లలో గాజుల దుకాణాలు ఉండేవి. గాజులు అమ్మేవాళ్లు ప్రత్యేకంగా వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన దుకాణాలు వచ్చినప్పటికీ, కొన్ని పల్లెటూర్లలో ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది — అది ఒక అందమైన అనుభవం. సన్నని దారానికి రెండు కొసలకు గాజుల గుత్తులు కట్టి, ఆ దారాలు భుజం మీద సమంగా వేసుకుని గ్రామాలకు వెళ్లి అమ్మకాలు చేసేవారు.
గాజుల మూట భుజాన వేసుకుని వచ్చే ఆ అమ్మకదారుని సాదరంగా ఆహ్వానించి, చాప వేసి కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న స్త్రీలు రెండు చేతులు ముందుకు చేస్తే, నచ్చిన గాజులను వాళ్లకు తొడగడం ఒక అందమైన అనుభవం. దానికి కొన్నివార నియమాలు కూడా ఉండేవి — ఉదాహరణకు శుక్రవారం, మంగళవారం గాజులు కొనకపోవడం. గాజులకు సంబంధించి కొన్ని అపశబ్దాలు పలకకూడదనే పెద్దల మాటలు.
స్త్రీ చేతి నుండి వచ్చే గాజుల శబ్దం ఒక అందమైన సంగీతరాగం లాంటిది. ఒక స్త్రీ వస్తోందంటే ముందుగా గాజుల శబ్దమే వినిపించేది. ఈ శబ్దం అనేక సంకేతాలకు అర్థం; ఆ అర్థం స్త్రీ–పురుష సంబంధానుసారం మారుతూ ఉంటుంది. కొత్త గాజులు కొనిస్తే, చేతులకు తొడుకుని ప్రతి కదలికలో వచ్చే శబ్దం విని మురిసిపోయే చిన్నారుల ఆనందం అమూల్యం.
పెళ్లికూతురు అలంకారంలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. గోరింటాకు పెట్టిన చేతులకు ఎర్రగాజులు తొడుక్కుంటే పెళ్లికూతురికి కొత్త అందం చేరుతుంది. అమ్మగా మారే ముందు జరిగే సీమంత మహోత్సవానికి గాజులే ప్రధాన అతిథి. చేతినిండుగా ధరించిన రంగురంగుల గాజులు దృష్టిదోషాన్ని పోగొడతాయని పెద్దల నమ్మకం. వాత, పిత్త, కఫ దోషాలను తగ్గిస్తూ నాడీవ్యవస్థను సమతుల్యం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
గాజులు ఒక వారసత్వ సంపద, ఒక తీపి జ్ఞాపకం. అమ్మమ్మ చేతి బంగారు గాజులు అమ్మాయి చేతికి కూడా మెరుస్తూ పాత జ్ఞాపకాలు చెబుతుంటాయి.
ఏది ఏమైనా, హిందూ సాంప్రదాయంలో గాజుల స్థానం హిమాలయ శిఖరం అంత ఎత్తయినదే అని చెప్పొచ్చు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి