ఫ్రెండ్ రిక్వెస్ట్
ఉదయం కాఫీ చేతిలో పెట్టుకుని ముఖపుస్తకం తెరిచిన రామారావుకు ఒక కొత్త నోటిఫికేషన్ కనిపించింది.
పేరు – సంధ్య.
సాధారణ చిరునవ్వుతో ఉన్న ఫోటో.
ఫ్రెండ్ రిక్వెస్ట్.
“ఎవరో?” అనుకుంటూ ఒక క్షణం ఆగాడు.
తెలుసున్న వాళ్లు కాదు.
పాత స్నేహితులు అసలే కాదు.
పైగా ఆడపిల్ల. నాతో స్నేహం ఎందుకు?
నా గురించి ఆమెకి ఏం తెలుసు?
ప్రొఫైల్లో తన వివరాలన్నీ కరెక్ట్‌గానే ఇచ్చాడు రామారావు.
వాటిని చూస్తే నాతో స్నేహం చేసే వయసు ఆమెది కాదు అనిపించింది.
అయినా నాతోనే స్నేహం ఎందుకు?
ఒక్కటే కారణం గుర్తొచ్చింది.
నేను పెద్ద రచయితను కాదు.
కానీ మనసును తాకే చిన్న చిన్న కథలు ముఖపుస్తకంలో వ్రాస్తూ ఉంటాను.
ఇది నా అభిప్రాయం కాదు.
ముఖపుస్తకంలోని కథాపాఠకులు వెలిబుచ్చే మాటల ద్వారా తెలుసుకున్న సత్యం.
ఒక వ్యక్తిగా కాదు…
రచయితగా నాతో స్నేహం చేద్దామనుకుంటుందేమో అనుకున్నాడు రామారావు.
పరస్పర స్నేహితులు కూడా చాలామందే ఉన్నారు.
“సరే… భయం లేదు” అనుకుంటూ
అంగీకారం తెలుపుతూ బటన్ నొక్కాడు.
అంతే.
ఆ రోజు సాయంత్రం ఒక మెసేజ్ వచ్చింది.
“నమస్తే… మీ కథలు చాలా బాగుంటాయి.”
రామారావు ఆశ్చర్యపోయాడు.
ఫేస్‌బుక్‌లో రాసే ఈ చిన్న కథలు
ఇలా పరిచయాలకు దారి తీస్తాయని ఊహించలేదు.
“ధన్యవాదాలు” అని సాదాసీదాగా సమాధానం ఇచ్చాడు.
అలా మాటలు మొదలయ్యాయి.
పుస్తకాలు…
పాటలు…
పాత సినిమాలు…
గ్రామాలు…
జ్ఞాపకాలు…
ఎప్పుడూ ముఖాముఖీ కలవలేదు.
అయినా మాటల్లో ఒక ఆత్మీయత.
ఒక రోజు సంధ్య మెసేజ్ చేసింది—
“ఈ మధ్య నాన్న ఆరోగ్యం బాగాలేదు…
మీ కథలు, మీ మాటలు నాకు ధైర్యం ఇస్తున్నాయి.”
అప్పుడు రామారావుకు అర్థమైంది.
ఇది కేవలం ఫేస్‌బుక్ కాదు.
ఇది ఒక వినే మనసు.
నెలలు గడిచాయి.
ఫ్రెండ్ లిస్ట్‌లో వందల మంది.
కానీ సంధ్య మెసేజ్ వస్తే మాత్రం
అది ప్రత్యేకంగా కనిపించేది.
ఒక రోజు అకస్మాత్తుగా—
మెసేజ్ లేదు.
రోజు గడిచింది.
వారం అయింది.
నెల దాటింది.
రామారావు ఏమీ అడగలేదు.
కొన్ని స్నేహాలు ప్రశ్నలు అడగవు.
మౌనాన్నే గౌరవిస్తాయి.
ఆరు నెలల తర్వాత
ఒక చిన్న మెసేజ్—
“నాన్న లేరు…”
ఆ రెండు మాటల్లోనే
ఆమె మనసు ఎంత విరిగిపోయిందో అర్థమైంది.
నాన్న అనే వ్యక్తి
ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత ముఖ్యమో
అందరికీ తెలుసు.
ఆ లోటు
ఎవరూ పూడ్చలేనిది.
రామారావు ఫోన్ పక్కన పెట్టి
కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు.
పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేం.
కానీ గాయపడిన మనసును
మాటలతో కొంతవరకు ఓదార్చవచ్చు.
రచయితగా
రకరకాల పాత్రల చేత మాటలు పలికించిన వాడిని.
కానీ ఈ క్షణంలో
నిజమైన స్నేహితుడైతే
వెళ్లి పక్కన కూర్చొని ఓదార్చేవాడిని.
ఫేస్‌బుక్ స్నేహితుడిగా
ఆమె మనసుకు అండగా నిలవడానికి
తన దగ్గర ఉన్నది ఒక్కటే—
మాట.
అప్పుడే అతనికి అర్థమైంది.
ఫేస్‌బుక్ ఫ్రెండ్ అంటే
లైక్ కొట్టడం కాదు…
కామెంట్ పెట్టడం కాదు…
అవసరమైనప్పుడు
మనిషిలా ఉండగలగడమే.
ఆ రోజు నుంచి
ఫేస్‌బుక్ అతనికి
ఒక సోషల్ మీడియా కాదు…
మనసుల మధ్య ఉన్న
ఒక చిన్న వంతెన అయింది.
అసలు స్నేహం అంటే
ఎంతసేపు మాట్లాడామన్నది కాదు.
ఎంత దగ్గరగా ఉన్నామన్నదీ కాదు.
మనిషి బలహీనంగా ఉన్న క్షణంలో
తన మాటలతో
కొంచెం వెలుగు నింపగలిగితే
అదే స్నేహం.
అందుకే—
ఫేస్‌బుక్‌లో పరిచయమైన మనుషులు
నిజజీవితంలో కలవకపోయినా
కొన్ని మాటలు…
కొన్ని మౌనాలు…
మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి.
స్క్రీన్‌ల మధ్య మొదలైన ఈ స్నేహాలు
మనసుల మధ్య కొనసాగితే
అదే నిజమైన సోషల్ మీడియా.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి