మగ మహారాజు

మగమహారాజు

ఇది మహానటుడు నటించిన సినిమా కాదు. నూరేళ్లు జీవితం గడపాల్సిన ఒక మహావీరుడి గాధ.

మగమహారాజు అంటే వంశమును నిలబెట్టే మహావీరుడు అందుకే గర్భవతులైన వారిని పండంటి మగ బిడ్డని కనాలని ఆశీర్వదిస్తారు. మగ పుట్టుకంటే అంత క్రేజీ.

మగ పిల్లలందరూ తలపై కిరీటాలు పెట్టుకుని పుట్టరు. జన్మ ఎవరికైనా ఒకటే. అందరూ ఆ తల్లి గర్భం నుంచి పుడతారు.
ఏమిటి మగ పిల్లల ప్రత్యేకత . పుత్రుడే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ అధికారం ఇంకెవ్వరికీ ఇవ్వలేదు.

మగపిల్లాడు పుట్టాడు అంటే అందరికళ్ళల్లోనూ సంతోషo.
వంశాన్ని ఉద్ధరించే ఒక అంకురం పుట్టిందని ఆనందo పడిపోతారు. ప్రత్యేకంగా ప్రేమగా పెంచుకుంటారు. తల తాకట్టు పెట్టి ఉన్నత విద్యలు చదివిస్తారు. అదృష్టం బాగుంటే చదువుకు తగిన ఉద్యోగం. మంచి జీతం. దేవుడిచ్చిన, వంశానుగతంగా వచ్చిన రూపం. డబ్బు హోదా . కార్లు బంగ్లాలు సంపాదిస్తారు

ఒక ఇంటి వాడిని చేయవల్సిన వయసు వస్తుంది.
 ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఈ రోజుల్లో చాలా సులభo
. కానీ ఒక జీవిత భాగస్వామి దొరకడం ప్రస్తుతం కష్టమైన పని .

భగీరథుడు గంగాదేవిని భూమికి తీసుకురావడానికి ఎంతకాలం తపస్సు చేశాడో తెలియదు గానీ ఒక మగవాడి జీవితంలోనికి
ఆడపిల్లను తీసుకురావాలంటే తల్లితండ్రులు ఇద్దరు నిత్యం తీవ్ర తపస్సు చేయాలి. తపస్సు చేసిన దేవత లాంటి అమ్మాయి దొరుకుతుందని అనుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం.

ప్రాచీన కాలంలో పెళ్లి సంబంధాలు కుదరచడానికి ప్రత్యేకంగా
పెళ్లిళ్ల పేరయ్యలు ఉండేవారు. ఇరు వర్గాల వారికి సయోధ్య కో కూర్చి సంబంధాలు కుదుర్చేవారు. నిజానికి పెళ్లి కుదరచడం అనేది ఒక పుణ్యకార్యం. ఒక వంశాన్ని నిలబట్టే అద్భుత కార్యం.
ఆనాటి సాహిత్యాలు చదివితే పెళ్లిళ్ల పేరయ్య ప్రస్తావన చాలా గ్రంథాల్లో కనబడుతుంది.

ఆధునిక కాలంలో పెళ్లిళ్ల పేరయ్యలు కనుమరుగైపోయి తల్లితండ్రులు సోషల్ మీడియా మీద ఆధారపడ వలసి వచ్చింది.
ఒక ఉద్యోగానికి అప్లై చేసుకున్నట్టుగా వరుడు లేదా వధువు వివరాలు అందులో రిజిస్టర్ చేసుకోవాలి. కొన్ని సంస్థలు దేశమంతటా శాఖలు పెట్టి నిర్ణీత ఫీజులు వసూలు చేసి వధూవరుల సమాచారాలు అందజేస్తుంటాయి  

మరి కొంతమందికి ఇది హాబీ. సమాజ సేవతో ఈ పనులు చేస్తుంటారు. ఇరుగుపొరుగు ద్వారా కూడా సంబంధాలు కలుస్తుంటాయి. శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కూడా సంబంధాలు దొరుకుతాయి. ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఆధారపడినప్పుడు నిత్యం వచ్చే ఫోన్ కాల్స్ కి ఓపిగ్గా సమాధానం చెప్పాలి. విషయం సూటిగా క్లుప్తంగా ఉండాలి.
ఈ బాధ్యతను ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకెవరు బిడ్డ బాగోగులు గురించి కష్టపడేది
తల్లి మాత్రమే.

పూర్వకాలంలో వివాహం కుదరచడానికి కులం గోత్రం వధూవరుల జాతకాలు పెద్దలు సేకరించిన వివరాలు తోటి
పెళ్లిళ్లు జరిగిపోయేవి. పెళ్లి చూపులు జరిగేవి గాని వధూవరుల
ప్రసక్తి తక్కువగా ఉండేది.

ఆధునిక కాలంలో పిల్లలే పెళ్లి పెద్దలు. పిల్లల అభిప్రాయం ప్రకారం పెద్దలు ముందుకు నడవాల్సి వస్తుంది. అబ్బాయికి అమ్మాయి అందం చందం పొడుగు చదువు ఉద్యోగం రంగు నచ్చాలి. తల్లిదండ్రులకు వంశo ,జాతకాలు నచ్చాలి. ఇలా గొంతెమ్మ కోరికలన్నీ తీరేటప్పటి కి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. 

జాతకం నచ్చలేదని అమ్మాయి రంగు బాగోలేదని ఆస్తిపాస్తులు 
లేవని ఇలాంటి చాంతాడు లాంటి వంకలతో దొరికిన సంబంధాలను వదులుకొని చివరికి వయసులో ఉండే నాజూకు తనం పోగొట్టుకుని బట్ట తలలు వచ్చి పొట్టలు పెరిగి తల్లితండ్రులకు అబ్బాయి పెళ్ళి ఒక సమస్యగా తయారయింది.

చివరికి మొదటి పెళ్లి అబ్బాయికి రెండవ పెళ్లి అమ్మాయిని కూడా చేసుకోవడానికి సిద్ధమయ్యే రోజులు కూడా వచ్చేసేయ్. ఈ రకమైన పరిస్థితి కొనసాగితే కొద్దిరోజులకి కులాంతర వివాహాలు కూడా పెరిగిపోతాయి. ఈ పరిస్థితి వలన తల్లితండ్రుల ఆరోగ్య పరిస్థితి కూడా దెబ్బతింటుంది.

ఈ రకమైన సమస్యకు కారణం ఏమిటో అని ఆలోచిస్తే ముఖ్యంగా ఒక మాదిరి ఆదాయ వనరులు ఉన్న వారిని
ప్రత్యేకంగా ఒక వృత్తిలో ఉన్న వారిని అమ్మాయిలు చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

కుటుంబం వంశగౌరవాలు మంచి చెడ్డలు ఎవరు ఆలోచించట్లేదు. నూరేళ్లు కలిసిమెలిసి జీవించవలసిన వ్యక్తి యొక్క మంచితనం గురించి ఎవరు ఆలోచించటం లేదు. అయితే పైకి కనిపించే మెరుగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మెరిసేదంతా బంగారం కాదు అని అందరికీ తెలుసు.

దానికి తోడు ఆడపిల్లల పుట్టుకమగ పిల్లలకు సమాన నిష్పత్తిలో ఉండడం లేదు. వైద్యశాస్త్ర విజ్ఞానం వెర్రి తలలు వేసి గర్భంలోనే ఆడపిల్లలను హత్య చేస్తున్నారు.

ఈ పరిస్థితుల వల్ల ఆడపిల్ల దొరకడం అంటే గగనం . ఇది నిజానికి ఒక సామాజిక సమస్య. కడుపులోనే పిండాలను హత్య చేస్తుంటే ఇంతకంటే సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేదు. కొద్దిరోజులకి ఆడపిల్ల మనకు కనబడదు. ప్రకృతి విరుద్ధమైన పని ఏదైనా సృష్టి వినాశనానికి దారి తీస్తుంది
ఒక మగవాడు జీవితానికి తోడు నీడ ఒక స్త్రీ. తోడు లేకుండా జీవించడం కష్టం. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కలకాలం ఉండరు. అన్నిటికీ మనసే ప్రధానం. కోరికలు వెంట పరుగులు తీసే మనసుని అదుపు చేసి వయసులో ఉండగానే తోడుని సంపాదించుకుని హాయిగా కాలక్షేపం చేయడమే నేటి యువతకు చాలా మంచిది. పదవీ విరమణ చేసేనాటికి బాధ్యతలు తీరి సుఖంగా కాలక్షేపం చేయవచ్చు. లేదంటే బాధ్యతలు తీర్చుకోవడానికి వయసు సహకరించదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం

ప్రాచీన కాలంలో మన తాతయ్యలు బామ్మలు ముని మనుమల పెళ్లిళ్లు దాకా జీవించేవారు. దాని కారణం వారు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం. బాల్య వివాహాలు కాకపోయినా ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చిన వయసులోనే పెళ్లి చేసుకుని హాయిగా కాలక్షేపం చేయడం చాలా మంచి విషయం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

సామర్లకోట

కుటుంబం