మినప గారి

మినప గారె.

కారు మబ్బు లాంటి దేహం గల ఇనప గుండు ని 
కాదు కాదు మినప గుండు ని.

 వినండి నా గాధ 
నా హృదయంలోని వ్యధ. 

అతిధి గుమ్మం లోకి అడుగుపెడితే మర్యాద కోసం 
నా గుండె రెండుగా చీల్చి పీకల లోతు నీళ్లలో ముంచేసి 

కసికొద్ది నా పీక పిసికి పిసికి తోలు వలిచి 
పాలి పోయిన నా మొహాన్ని రో లు లో వేసి 

లేని ఓపిక అంతా తెచ్చుకుని నా రూపం మార్చి
పాల నురుగులా తయారుచేసి

అరచేతిలో చందమామలా చేసి 
మధ్యలో చూపుడువేలుతో నా గుండెకు చిల్లు పెట్టి 

సలసల మరిగే తైలంలో నా తనువు
రంగు మార్చేసి చిల్లు గారి అని పేరు పెట్టి 

వచ్చిన అతిధి చిల్ అయిపోయేలా 
ప్లేటు నిండా పేర్చి టేబుల్ మీద పెట్టి 

అతిధి వద్దండి బాబు అని చేతులు అడ్డం పెట్టే వరకు
వడ్డిస్తూనే ఉండడం మా గోదారోళ్ల పద్ధతి

ఇది నా గుండెల్లోనీ వ్యధ 
అయినా నా జన్మ అంటే నాకెంతో గర్వం. 

అకస్మాత్తుగా వచ్చిన అతిధికి 
ఏడాదికోమారు పై లోకం నుంచి వచ్చే
ఆ దేవతలకి 
నేనంటే ఎంతో ఇష్టం. 
అందుకే నా జన్మ సార్థకం. 

అల్లం చట్నీతో నాది తరతరాల అనుబంధం. 
బెల్లం పాకంతో విడదీయలేని బంధం. 

పేరు మార్చుకుని ఇడ్లీ పక్కన చేరి
పరాయి రాష్ట్రం వంటకం అయిపోయా 

నేను చిల్లు గారినే కాదు.
తల్లిలా మేలు చేసే ఉల్లితో చేరి 
 దిల్ కి పసందు చేస్తా.

మనసుపెట్టి చేస్తే మెంతి పెరుగులో మునిగిపో యి
ఆవిడ చేతిలో ఆవడనైపోయి 
మంచు ముక్కలా నోటిలో కరిగిపోతా.

ఒళ్ళు మర్చిపోయి తింటే 
కడుపులో బల్లెమై గుచ్చుతా 

ఇది నా గుండెలోని వ్యధ 
వినండి నా గాధ.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు. 
కాకినాడ 9 4 9 1 7 9 2279.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సామర్లకోట

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం