భగీరథ ప్రయత్నం

భగీరథ ప్రయత్నం.

"ఏమమ్మా సీతమ్మ మీ వాడికి ఇంకా సంబంధం చూడడం లేదా! 
అని అడిగింది పక్కింటి కాంతమ్మ. 

లేదమ్మా! మా వాడు అప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నాడు! అంది సీతమ్మ. కాంతమ్మకు తెలుసు సీతమ్మ కొడుకుకి సంబంధాలు ఎక్కడా కుదరట్లేదు అని.

సీతమ్మకు ఒక్కడే కొడుకు. పేరు ప్రవీణ్. ఆరడుగుల అందగాడు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాడు. ఉద్యోగం వచ్చి నాలుగేళ్లయింది. క్యాంపస్ సెలక్షన్ అని ఎగిరి గంతేసుకుని జాయిన్ అయిపోయాడు పాపం. ప్రవీణ్ ని పెళ్లి చేసుకోమంటే జీతం నా ఒక్కడికే చాలటం లేదు అని వాయిదాలు వేసినా సీతమ్మ తన ప్రయత్నాలన్నీ గట్టిగా చేస్తూనే ఉంది. 

ప్రవీణ్ ఉద్యోగంలో చేరగానే ముందుగా ఒకరోజు స్టూడియోకి తీసుకెళ్లి అందమైన ఫోటో తీయించి వివాహ వేదికలో ఫీజులు కట్టేసి ప్రవీణ్ వివరాలను నమోదు చేసేసింది. ఇంకేముంది రోజుకో ఫోన్. పిల్ల తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్తూ ఆఖరికి ప్యాకేజీ దగ్గరకు వచ్చేటప్పటికి నీరు కారిపోయి ఫోన్ పెట్టేసి మళ్లీ ఏ కబురు ఉండేది కాదు వాళ్ల దగ్గర నుంచి.

చాలా రోజులు ఎదురు చూసిన తర్వాత సీతమ్మ మళ్లీ ఫోన్ చేస్తే అబ్బాయి జాతకం నచ్చలేదండి! అని మొహం మీద 
చెప్పే సేవారు. కొన్ని జాతకం బాగోలేదని ,కొన్ని చదువు సరిపోదని , కొన్ని ఈడు జోడు బాగోలేదని, పెళ్ళికొడుకు రంగు తక్కువ ని ఇలా సాకులు చెప్పుకుంటూ వచ్చేవారు ఆడపిల్లవారు.  

పెళ్లి సంబంధం గురించి ఏదైనా ఫోన్ వస్తే ఎంతో ఆశతో మాట్లాడి నిరాశతో ఫోన్ పెట్టేసేది సీతమ్మ. రాను రాను సీతమ్మకి బెంగ ఎక్కువైంది. తను చనిపోయేలోగా వీడికి పెళ్లి చేయగలనా! ఒంటరివాడైపోతాడేమో! అంటూ తనలో తాను బాధపడుతూ ఉండేది. వివాహ వేదిక సభ్యత్వం ప్రతి ఏటా రెన్యువల్ చేస్తూనే ఉంది సీతమ్మ. తెలుసున్న బంధువులందరికీ ఫోన్ చేసి చెప్తూనే ఉంది . బంధువులు ఎవరైనా సరే పెళ్లికి పిలిస్తే తప్పనిసరిగా వెళ్లి పెళ్లికూతురుల కోసం ఆశగా వెతుకుతూ ఉండేది.

  పెళ్లి కావలసిన పిల్లలు చాలామంది వచ్చారు. అయితే ఎప్పటిలాగే షరా మామూలే. అదే పాట. ప్యాకేజీ పాట. ఒక కులం గురించి అడగలేదు గోత్రం గురించి అడగలేదు వంశం గురించి అడగలేదు జాతకాలు ప్యాకేజీలు నప్పాలండి అoటు చెప్పుకొచ్చారు పిల్ల తల్లిదండ్రులు. కొంతమంది అమెరికా సంబంధం అయితేనే చేద్దామనుకుంటున్నాం అoటు కచ్చితంగా చెప్పేసారు.

మాకు పలానా గురువుగారు అంటేనే బాగా నమ్మకం. ఆయన చెప్తేనే ఏ సంబంధానికి అయినా ముందుకు వెళ్తాం అంటూ ఏదో ఒక అంశాన్ని పెద్దది చేసి దానికి ఓ పేరు పెట్టి పెళ్ళికొడుకుకి ఆ దోషం ఉందని చెబుతూ ఫోన్ పెట్టేసేవారు. నిజానికి కొన్ని నక్షత్రాలకి కొన్ని రాశులకి ఆ దోషం ఉన్న పరవాలేదని చాలా మంచి మంచి పండితులు చెప్పిన పట్టించుకునేవారు కాదు. ఎవరి నమ్మకం వాళ్ళది. 

మానవ ప్రయత్నాలు అన్ని చేసినా ఫలించకపోవడంతో ఇంకా కనపడిన గుడులు గోపురాలు గుట్టలు చెట్లు పుట్టలకి మొక్కడం ప్రారంభించింది సీతమ్మ. వీరభద్ర స్వామికి కళ్యాణం, ఏడు శనివారాల మొక్కు వెంకటేశ్వర స్వామికి ప్రతి సోమవారం శివుడికి అభిషేకం ఇలా మొక్కని దేవుడు లేడు. 

చివరికి వీధుల్లోకి వచ్చే కొండరాజుల్ని కూడా కూర్చోబెట్టి పెళ్లి గురించి ప్రశ్నలు వేస్తూ ఉండేది సీతమ్మ. కళ్యాణం జరగాలంటే ఈ గూడు మారిపోవాలని చెబితే అద్దె ఎక్కువైనా పక్క వీధిలోనీ పెద్ద ఇంట్లోకి మారిపోయింది సీతమ్మ. పంజరంలో ఉన్న చిలక సీతారాముల బొమ్మ ఉన్న కార్డు తీస్తే ఆనందపడిపోయింది సీతమ్మ. సీతారాముల బొమ్మ వచ్చింది కదా వెంటనే పెళ్లి అవుతుంది అని ఆశ పడింది. కానీ అందులో గుడిలో సీతారాముల కళ్యాణం చేయించమని ఉంది. అయినా ఎంతో ఆశతో ఆ మొక్కు కూడా తీర్చేసింది.

ఒకసారి ఒక మధ్యవర్తి తీసుకొచ్చిన పెళ్లికూతురు ఫోటో నచ్చింది సీతమ్మకి ప్రవీణ్ కి కూడా. చివరికి ఆ మధ్యవర్తి భయపడుతూ భయపడుతూ ఆ పిల్ల భర్త పెళ్లయిన మొదటి సంవత్సరమే యాక్సిడెంట్లో చనిపోయాడని పిల్లలు ఎవరూ లేరని అమ్మాయి చదువుకుందని మెల్ల మెల్లగా వివరాలు చెప్పాడు. మాకు అటువంటి సంబంధం తీసుకొస్తావా అంటూ గట్టు గట్టిగా అరిచింది సీతమ్మ. ఆ పిల్ల జాతకంలో ఏదైనా దోషo ఉందేమో అందుకే అలా చనిపోయాడు ఆ పిల్లవాడు అంటూ లేనీ పోనీ అభాండాలు వేసింది సీతమ్మ. మధ్యవర్తికి కోపం వచ్చి అమ్మ లేనిపోని మాటలు పుట్టించవద్దు నేను బాగా ఎరుగున్న సంబంధం అందుకే చెప్పాను అన్నా సీతమ్మ ఒప్పుకోలేదు.

అన్ని బాగున్నా ప్రవీణ్ కి పెళ్లి పెద్ద ప్యాకేజీ లేకపోవడం వల్లనే జరగడం లేదని అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత అర్థమైంది. పోనీ ఎక్కువ జీతం వేసి వివరాలు మార్చేస్తే ఛీ అటువంటి తప్పుడు పని చేయకూడదు. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు అంత తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు. పిల్లలకు ముందుగానే తెలిసిపోతుంది అనుకుంది సీతమ్మ. 

రోజురోజుకీ ప్రవీణ్ కు వయసు పెరుగుతుంటే సీతమ్మకి బెంగ ఎక్కువై ఆరోగ్యం కూడా పాడవుతూ వచ్చింది. వీడికి అసలు పెళ్లి యోగం ఉందో లేదో ! . అసలు మా కుటుంబాల్లో ఎవరికి పెళ్లి గురించి ఇంత కష్టపడలేదు అనుకుని తనలో తాను మధన పడ సాగింది.  
హోటల్ తిండి మూలాన పొట్ట వచ్చి జుట్టు ఊడిపోయి పెద్దవాళ్ల తయారైపోతున్నాడు ప్రవీణ్. తన రూపం అద్దంలో చూసుకుంటే తనలో వచ్చిన మార్పు కి కూడా ప్రవీణ్ కి బెంగ ఎక్కువైంది. దానికి తోడు బెంగపెట్టుకున్న సీతమ్మని ఎలా ఓదార్చాలో అర్థం కావట్లేదు ప్రవీణ్ కి. 

అవును ఇప్పుడు మగ పిల్లల పెళ్లి చాలా సమస్యగా తయారయింది. మగపిల్లాడు పుడితే ఇంట్లో అందరూ చాలా ఆనందించేవారు ఒకప్పుడు. వంశోద్ధారకుడు పుట్టాడని. మగమహారాజు అనేవారు. ఈ రాజు గారికి కిరీటాలు ఏవి లేవు గాని తోడు తీసుకురావడం చాలా కష్టమైపోతోంది ప్రస్తుతం. ప్రతి తల్లిదండ్రుల సమస్య ఇదే.  

చదువుకున్న అమ్మాయిలు ఎక్కువగా ఉండడం ,ఎక్కువగా జీతాలు తెచ్చుకోవడం ,స్వతంత్రంగా బతకాలని ఆలోచనలు, మగ పిల్లలకి సరైన నిష్పత్తిలో ఆడపిల్లలు లేకపోవడం, ఇలా అన్ని సమస్యలే మగమహారాజులకి. ఇవన్నీ ప్రవీణ్ పెళ్లి అవకపోవడానికి కూడా కారణాలే. ఈ కాలం మగ పిల్లల్లాగా.

కొద్దిరోజులకి సీతమ్మలో నిరుత్సాహం పెరిగిపోయి బెంగతో మంచం పట్టేసింది. ఇప్పుడు వీడు చూస్తే పెళ్ళికొడుకులా లేడు. సుమారు నలభై ఏళ్ళు వచ్చేసేయి. ఇంత వయసు వాడికి ఇంక పిల్లలు దొరకడం కష్టమే. ఏం చేయాలి?   

ఒక్కసారిగా ఎందుకో అప్పుడు రెండో పెళ్లి అమ్మాయి సంబంధం తీసుకొచ్చిన మధ్యవర్తి గుర్తుకొచ్చాడు. అప్పుడు ఆలోచించుకోకుండా వద్దని చెప్పేసాను. ఇప్పుడు వీడికేమో సంబంధాలేవి కుదరటం లేదు. వయసు కూడా ముదిరిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక అడుగు కిందకు దిగితే తప్పేముంది. అయినా అవతల పిల్ల కాపురం చేసింది ఎన్నాళ్ళు?. ఏడాది కూడా లేదు. ఏదో పాప కర్మo మూలంగా అలా జరుగుతుంటాయి. ఎవరైనా ఏమైనా అనుకుంటారని కుటుంబానికి చెడ్డపేరు వస్తుందని రకరకాలుగా చెప్పుకుంటారని ఈ పెళ్లి సంబంధం వద్దని చెప్పింది సీతమ్మ ఇంతకుముందు. ఒకరోజు చెప్పుకుంటారు రెండు రోజులు చెప్పుకుంటారు మళ్లీ ఆ సంగతే మర్చిపోతారు. ఎవరి గురించో ఆలోచిస్తే తన కొడుకు జీవితం పాడైపోతుంది. వంటరివాడైపోతాడు. ఏదైనా ఈ సంబంధం వదులుకోకూడదు అని నిశ్చయించుకు0ది సీతమ్మ.

 ఈ విషయాలన్నీ ప్రవీణ్ తోటి సిగ్గు పడకుండా చెప్పింది. ప్రవీణ్ చాలా రోజులు ఆలోచించి మనం కావాలని అనుకునే వాళ్ళు ఇంతవరకు ఎవరు దొరకలేదు. వీళ్ళు ఒక్కళ్ళే వచ్చారు అనుకుని బాగా ఆలోచించుకుని సీతమ్మ బెంగ తీర్చేశాడు ప్రవీణ్.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం