కెమెరా వెలుగులో పెళ్లి
మగ పెళ్లి వారి కారులు అందమైన అలంకరణతో కళ్యాణమండపం ముందు ఆగాయి. ముందు సీట్లో కూర్చున్న పెళ్ళికొడుకు, వెనకాల సీట్లో తల్లి తండ్రి, ఇలా మిగతా కార్లలో మిగిలిన పెళ్లి వారు దిగారు. ఆడపిల్ల వారు స్వాగతం పలకడానికి మేళతాళాలతో ముందుకు కదలి వచ్చారు.
అందరికంటే ముందుగా నలుగురు వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అక్కడికి చేరుకుని పెళ్ళికొడుకు దగ్గరికి పరిగెత్తారు. "సార్ రవి గారు కార్ డోర్ పట్టుకుని ఫోజు ఇవ్వండి" అంటూ పెళ్లి కూతురు తండ్రి రవికి సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. డోర్ పట్టుకుని ఒకటి, పెళ్ళికొడుకు చేతులు పట్టుకుని ఒకటి – రెండు స్నాప్స్ అయిపోయాయి.
ఇంక కాళ్లు కడిగే కార్యక్రమం. సూటు బూటు వేసుకున్న పెళ్ళికొడుకు బూటు విప్పకుండా, కాలికి వేసుకున్న బూట్లను తడిచేత్తోటి తుడిపించారు పెళ్లికూతురు తండ్రి చేత. "రవి గారు ఆ బూట్ల మీద చేయి వేయండి" – ఒక కెమెరా క్లిక్ మంది.
"రెడీ వన్ టూ త్రీ... రవి గారు దండ పట్టుకుని ఇలా చూడండి. పెళ్ళికొడుకు గారు మీరు క్రాస్ గా నిలబడండి" అంటూ సూచనలిస్తూ హడావుడిగా ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి వీడియో-ఫోటో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అసలే పైన ఎండ. పెళ్లి మేకప్పులు ఇంక చూసుకోండి పెళ్ళి వారి పరిస్థితి.
ఇదేమిటి మంత్రాలు ఎక్కడ వినపడట్లేదు? పంతులుగారు ఏరి అని చూస్తే పాపం ఆయన మంత్రాలు చదువుతున్నారు, కానీ ఆ మంత్రాలు గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇది ప్రతి పెళ్ళిలోనూ అలవాటైపోయింది కాబట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పంతులుగారు. ఆయన ఏం చదువుతున్నారు ఎవరికీ అక్కర్లేదు. మనసు అక్కడ లేదు. అలా పెళ్ళివారికి స్వాగత కార్యక్రమాలు అయ్యేటప్పటికి రెండు గంటలు పట్టింది.
పోనీలే, ఇప్పటికైనా అయిపోయిందని అనుకుంటే – "ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం... ఆడపిల్ల వారందరూ చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి, రెడీ వన్ టూ త్రీ" అంటూ గట్టిగా అరిచాడు. అసలే ఎండలో నిలబడి ఉన్నాడేమో పెళ్ళికొడుకు బాగా కోపం వచ్చింది. "అమ్మ, ఇంకా ఎంతసేపే?" అని తల్లి చెవిలో గొణిగాడు.
"ఉష్, ఎక్కువగా మాట్లాడకూడదు. ఎవరి సరదాలు వాళ్లకు ఉంటాయి. వాళ్లు ముందుగానే చెప్పారు, ప్రతి ఈవెంట్ చాలా సరదాగా చేస్తామని" అంది పెళ్లి కొడుకు తల్లి సుభద్ర.
సమయానికి సందర్భానికి తగినట్లుగా రాగయుక్తంగా సన్నాయి వాళ్ళ పాడే పాట ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇదివరకు పెళ్లిలలో సన్నాయి మేళం వాయించే కీర్తనలు చాలామంది ఆస్వాదించేవారు. తమకు కావలసినవి అడిగి పాడించుకునేవారు. ఇప్పుడు చాలా చోట్ల సన్నాయి మేళం ఉండట్లేదు. బ్యాండ్ మేళాలతో సరి పెట్టేస్తున్నారు. కానీ వీళ్ళు ఎవరో బాగా పేరు ఉన్నవాళ్లు అనుకుంటాను. ఎవరు విని ఆనందించకపోయినా తమకి వచ్చిన కీర్తనలు ఎంతో శ్రావ్యంగా పాడుతున్నారు.
మొత్తానికి పెళ్లి వారు లోపలికి తరలివచ్చారు. ఇరుపక్షాల వాళ్లు కలిసి నడిచి వస్తుంటే – "నెమ్మదిగా రండి, అంత స్పీడుగా వద్దు" అంటూ ఒకటే గోల వీడియో వాళ్ళు.
ఒకప్పుడు పెళ్లి తంతు అంతా పురోహితులు నడిపించేవారు. ఇప్పుడు వీడియో వాళ్ళు, ఫోటోగ్రాఫర్లు నడిపిస్తున్నారు.
మంచినీళ్లు గ్లాస్ అందించిన ఆడపిల్ల వారిని చూసి "హమ్మయ్య" అనుకున్నాడు పెళ్ళికొడుకు. "వద్దు బాబు అంటుంటే, ఈ సూట్ కుట్టించారు. నేను కట్టుకోను రా బాబు అంటే ఆమాత్రం హడావుడి ఉండాలి రా" అంది తల్లి.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఫోటోగ్రాఫర్ – "సార్, మంచినీళ్లు గ్లాస్ మూతి దగ్గర పెట్టుకోండి" అంటూ ఒక స్నాప్ లాగేసాడు. ఇంక చూసుకోండి అక్కడి నుంచి మగ పెళ్లి వారు కాఫీ తాగినా, భోజనం తిన్నా, టిఫిన్ తిన్నా – అబ్బా స్నాప్లే స్నాప్లు.
ఇంక ఆడపిల్ల తల్లి తండ్రి, అన్నయ్య, మావయ్య, అత్తయ్య, బాబయ్య, పిన్ని, తాతయ్య, బామ్మ ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెళ్లికూతురుని ఆశీర్వదిస్తూ – "ఎప్పుడూ ఫోటోలు తీసుకో"ని వాళ్ళ లాగా ఆ ఫోటోగ్రాఫర్ మీద ఎగబడ్డారు.
అప్పటికే పది గంటలు అయింది. ఇంతలో పంతులుగారు – "అయ్యా రవి గారు, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. స్నాతకం ప్రారంభించాలి" అంటూ తన కోపాన్ని కనబడనీయకుండా తొందరపెట్టాడు.
ఫోటోగ్రాఫర్ల కోసం, వీడియోల కోసం ఎన్ని లక్షల ఖర్చు పెట్టారో తెలియదు. కానీ అసలు మొత్తం వీడియో అలా నడుస్తూనే ఉంది. ఫోటోగ్రాఫర్ కి క్షణం తీరికలేదు. టిఫిన్ కూడా తిన్నాడా లేదా పాపం. ఈ ఫోటోలు కోసం కదా వారం రోజులు ముందు నుంచి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగడం. అది ఒకప్పుడు, ఇప్పుడు పెళ్లికి బ్యూటీ పార్లర్ కూడా వస్తోంది. సందర్భాన్ని బట్టి మేకప్. ఫోటోకి ఫోటోకు మధ్య టచ్ అప్ – ఇది ఎక్కువైపోయింది.
"పంతులుగారు, హోమoల్లో కొంచెం నెయ్యి పొయ్యండి, మంట సరిగ్గా రావటం లేదు. వీడియోలో సరిగా కనపడదండి" అనేసరికి పంతులుగారికి కోపం వచ్చి నెయ్యి గిన్నె ఎత్తిపోసేసాడు. యజ్ఞ యాగాదులలో వచ్చే మంట లాగా వచ్చేసింది.
కాశి యాత్రకి కలర్ ఫుల్ గొడుగు, మంచి పాలిష్ చేసిన పాము కోళ్ళు, రంగురంగుల గుడ్డతో కుట్టిన జోలె, కర్ర కూడా మెరిసిపోతుంది. అరగంటలో ముగిసిపోయే కాశీ యాత్ర రెండు గంటలు పట్టింది. బావమరిది వరస అయిన వాళ్ళందరూ గడ్డం పట్టుకుని బతిమాలడం కాదు, గడ్డం పగలగొట్టారు సరదాగా. ఒక్కొక్కరు వచ్చి బెల్లం ముక్క పట్టుకోవడం, ఫోటోకి పోజు ఇవ్వడం – అయ్యేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అయింది.
"ఏవండీ పంతులుగారు, కార్యక్రమాలు ఇంత ఆలస్యం ఏమిటి?" అని అడిగాను భోజనాలు బలదగ్గర పక్కన కూర్చుని.
"ఏం చెప్పమంటారండి! మేము ఇప్పుడు పేరుకు పంతులమే. ఫోటో పంతులు, వీడియో పంతులు అని ఇద్దరు చెప్పినట్టుగానే నడుస్తోంది ఇప్పుడు పెళ్లి. ఇంత చిన్న కార్యక్రమానికి ఇంత లేట్ చేశారు. మరి పెళ్లికి ఏం చేస్తారేమో!" అని అసలే షుగరు అంటూ ఆకులో పెట్టిన కాజా గబగబా నోట్లో పెట్టుకున్నాడు పాపం.
భోజనం చేస్తున్నంతసేపు వీడియో నడుస్తూనే ఉంది. ఇదివరకు భోజనాలు రకరకాల చలోక్తులతో నడిచేవి. ఇప్పుడు మాటల్లేవు. అంతా ఆ యంత్రం మీదే దృష్టి.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఫోటోగ్రాఫర్ – "రవి గారు, ఆ బూరిముక్క మీ వియ్యంకుడు గారి నోటి దగ్గర పెట్టండి. వన్ టూ త్రీ, ఒకసారి ఇలా చూడండి ఇద్దరూ" అంటూ ఒక స్నాప్ లాగేసాడు. పాపం పెళ్లికూతురు తండ్రి వండించిన పదార్థాలన్నీ వచ్చేయలేదా అని చూసుకోవడం మర్చిపోయి, వియ్యంకుల వరుస అయిన వాళ్ళ అందరి దగ్గరికి వెళ్లి బూరి ముక్క నోట్లో పెట్టి ఫోటోలు తీయించుకున్నాడు.
సాయంత్రం ఐదు గంటలకి ఎదురు సన్నాహాలు. "అందరూ రెడీగా ఉండాలి" అని పంతులుగారు గట్టిగా అరిచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
మగ పెళ్లి వారు విడిది ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మొదలుపెట్టాడు వీడియో వాడు. అక్కడి నుంచి అన్ని సూచనలే. మగ పెళ్లి వారికి బొట్టు పెట్టడం దగ్గరనుంచి పన్నీరు జల్లే వరకు రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు, వీడియోలు. దండలు వేయడం దగ్గర్నుంచి పానకం గ్లాస్ అందించే వరకు ఆడపిల్ల వారు రకరకాల ఫోజులు ఇచ్చి తృప్తిపడ్డారు.
పంతులుగారు చదువుతున్న శుభలేఖ మీద దృష్టి ఎవరికీ లేదు.
అలా ముగిసింది ఎదురు సన్నాహం. తర్వాత భోజనాలు. తర్వాత విశ్రాంతి. విశ్రాంతి గదుల్లో ఎక్కడా వీడియోలు కనపడలేదు. అది ఒకటి సుగుణం.
"ఇంకేముంది, పందిట్లో పెళ్లి అవుతుంది" అని సన్నాయి వాయిద్యం వాళ్లు పాట మొదలెట్టేటప్పటికీ పెళ్లి మొదలైంది. పెళ్లి మండపం మీద పెళ్ళికొడుకు, ఆడపిల్ల తల్లి తండ్రి, వీడియో-ఫోటోగ్రాఫర్ మాత్రమే కనబడ్డారు. పంతులుగారు తంతు నడిపిస్తున్నారు. ఫోటోగ్రాఫర్లు సూచనలు ఇస్తున్నారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు ఆచరిస్తున్నారు.
మేనమామ బుట్టలో పెళ్లికూతురుని తీసుకొస్తుంటే వీడియో వాడు వెంటపడి – "నెమ్మదిగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి" అంటూ అరుస్తున్నాడు. బుట్టలో 50 కేజీల బంగారం నెమ్మదిగా ఏమి వెడతాడు మేనమామ! అయినా వీడియో సరదా కోసం అడుగులు అడుగేసుకుంటూ అరగంటకు వేదిక మీద వచ్చాడు.
రావలసిన శుభ ఘడియ రానే వచ్చింది. "కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. నెత్తి మీద గట్టిగా చెయ్యి వేయండి." ఆ తర్వాత మంగళసూత్రధారణ, తలంబ్రాలు వరుస పెట్టి తంతులు, ఫోటోలు కోసం ఫోజులు ఒకటి రెండుసార్లు ప్రయత్నాలు, మళ్లీ మళ్లీ – రాని రోజు అంటూ సన్నాయి మేళం పాట కచేరి. పెళ్లి అయ్యేటప్పటికి తెల్లవారిపోయింది.
కెమెరా వెలుగుకి, వీడియో లైట్లు వెలుగుకి పెళ్లి వారి మొహం మాడిపోయింది. ఆ తర్వాత వచ్చిన వీడియోలో చూస్తే పంతులు గారి మంత్రాలు లేవు. సన్నాయి మేళం లేదు. ఏవో సినిమా పాటలు తప్పితే.
సుముహూర్తం సమయంలో గాలిలోకి ఎగిరిన తెల్లటి ఉండలు మాత్రం కనబడ్డాయి. తలంబ్రాలు సమయంలో ఎర్రటి గులాబీ రేకులు అందంగా కనబడ్డాయి. సందట్లో సడే మియా అన్నట్లు పెళ్లికూతురు, పెళ్ళికొడుకు మాటలు వినపడలేదు కానీ మాట్లాడుకున్నట్లుగా కనబడ్డారు.
వీడియోలో "నేను ఉన్నానా?" అని ఆడపిల్ల వారు, మగపిల్లవారు ఎవరికి వాళ్లే చూసి ఆనందపడ్డారు. వీడియోల పెళ్లయిపోయింది. ఇది మంత్రాల పెళ్లి కాదు . యంత్రాల పెళ్లి.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి