వాచ్ మెన్
మధ్యాహ్నం రెండు గంటలు అయింది. ఆకాశం అంతా దట్టంగా నల్ల మబ్బు పట్టి, ఒకటే ఈదురు గాలులు.
"ఏమిటి వర్షం వస్తుందా?" అనుకుంటూ సుమతి కుర్చీలోంచి లేచి, మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకు రావడానికి వెళ్లింది.
మేడ మీద ఆరవేసిన బట్టలు తీసుకుని లిఫ్ట్‌లో నాలుగో ఫ్లోర్‌కి వస్తుండగా, చేతిలో సెల్‌ఫోన్ రింగ్ అయ్యింది.
"హలో!" అనగానే...
"సుమతి! పిల్లలు ఇంటికి వచ్చారా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయా? ఫ్రిజ్‌లో పాలు ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు ఉన్నాయా? పిల్లలకు తినడానికి ఏమైనా ఉన్నాయా?" అంటూ కంగారుగా ప్రశ్న మీద ప్రశ్నలు అడుగుతున్నాడు సుమతి భర్త సుధాకర్.
"ఏంటండీ? మీరు ఇలాంటివి ఎప్పుడూ అడగరు కదా! నేనే కదా బజార్ నుంచి తెచ్చుకుంటాను," అంటూ నిష్టూరంగా మాట్లాడిన భార్య మాటలకు కోపం తెచ్చుకోకుండా...
"నువ్వు టీవీ చూడటం లేదా? రేపు మన విశాఖపట్నానికి చాలా ప్రమాదకరమైన తుఫాను వస్తోంది. సిటీ చాలా హడావుడిగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా తుఫాను ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రేపు అన్ని స్కూళ్లకూ, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కార్యాలయాలకూ సెలవు ప్రకటించారు. రేపు మా బ్యాంకు కూడా సెలవు. నేను ఈరోజు తొందరగా వచ్చేస్తాను. ఒకసారి అన్ని చెక్ చేసుకుని చెప్పు. మళ్లీ రేపు పిల్లలు ఇబ్బంది పడతారు," అని ఫోన్ పెట్టేసాడు.
తుఫాన్ అనగానే సుమతికి ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చిన్నప్పుడు దివిసీమకు వచ్చిన తుఫాను గుర్తుకొచ్చింది. అప్పుడు సుమతికి 10 ఏళ్లు. సుమతి వాళ్ల నాన్నగారు కృష్ణా జిల్లాలో ఒక పల్లెటూర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. 10 ఎకరాల పొలం, పాడిపంటగలిగిన కుటుంబం. తుఫాను రోజుల్లో సుమతి వాళ్ల నాన్నగారు ఎంతోమంది బాధితులకు ఆశ్రయం ఇచ్చి, నాలుగు రోజులపాటు ఇంట్లోనే ఉంచుకుని అన్నం వండి, వడ్డించి పెట్టేవారు.
ఆ అనుభవం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది సుమతికి. వెంటనే వంటింట్లోకి వెళ్లి కావలసిన సామాన్ల లిస్టు రాసి భర్తకు వాట్సాప్‌లో పెట్టి, ఫోన్ చేసింది.
సాయంకాలం అయిదు గంటలకంటే ముందే సుమతి భర్త పిల్లలతో, అత్తమామలతో కలిసి ఇంటికి వచ్చేసారు. వారు విశాలాక్షినగర్‌లో ఉన్న రేణుక విహార్ అపార్ట్‌మెంట్‌లో, ప్లాట్ నెం.402లో కాపురం ఉంటున్నారు.
అప్పటికే సన్నని జల్లు ప్రారంభమైంది. గాలి తీవ్రత పెరిగింది. కిటికీ తలుపులు గట్టిగా కొట్టుకుంటున్నాయి. సుధాకర్ గారు కిటికీలు బిగించేసి, సుమతిని గబగబ వంట చేయమని పురమాయించి, కొవ్వొత్తులు, అగ్గిపెట్టి, బ్యాటరీ లైట్లు, గొడుగులు అందుబాటులో పెట్టారు. బజార్ నుంచి తెచ్చిన సామాన్లన్నీ ఫ్రిజ్‌లో పెట్టి, వీధి తలుపులు కూడా బిగించేసి భయభయంగా హాల్లో కూర్చున్నాడు.
ఈ అపార్ట్‌మెంట్ బాగా డౌన్‌లో ఉంది. దానికి తోడు కట్టి పది సంవత్సరాలే అయినాయి. రేపు ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటి? అనే ఆలోచనలతో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు.
ఇంతలో వంటింటి నుండి సుమతి,
"భోజనాలు రెడీ!" అని కేక వేసింది.
అందరూ కలిసి భోజనం చేసి గదులకెళ్లిపోయారు. వర్షం జోరు పెరిగింది. మంచం మీద పడుకున్నా, నిద్ర పట్టట్లేదు సుధాకర్‌కు. భయం, ఆందోళనలు, పిడుగుల మోగింపు. సెల్‌ఫోన్‌కు ఒక కాల్ కూడా రాలేదు. టవర్లు పడిపోయాయేమో. "వాచ్‌మెన్ రాములు గుర్తుకొస్తున్నాడు... పాపం, ముగ్గురు పిల్లలతో ఏమై ఉండాడో?" అని ఆలోచించాడు.
పైగా, మూడు నెలల చంటి పాప కూడా ఉంది. సెల్‌ఫోన్ పనిచేయకపోవడంతో కిటికీ తీసి బయటకు చూశాడు. గాలి లోపలికి రివ్వున దూసుకొచ్చింది. కిటికీ తలుపులు బిగించి, భార్యను లేపి విషయం చెప్పాడు.
"నిజమేనండి. పాపం ముగ్గురు పిల్లలతో ఏం బాధ పడుతున్నాడో! నేనూ వస్తా, ఒకసారి వెళ్లి చూద్దాం," అంది సుమతి.
ఇద్దరూ గొడుగు, బ్యాటరీ లైట్ తీసుకుని లిఫ్ట్ దగ్గరకు వెళ్లారు. లిఫ్ట్ పనిచేయడం లేదు.
"అయ్యో, కరెంట్ లేదు కదా!" అనుకుని మెట్లుగా దిగసాగారు. వర్షపు జల్లులతో మెట్లు జారిపోతున్నాయి. నెమ్మదిగా మెట్లేస్తూ గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరారు. చుట్టూ చీకటి. మెట్ల దగ్గర నుంచి వాచ్‌మెన్ క్వార్టర్స్ వరకు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి తలుపు తట్టారు.
లోపల దీపం వెలుగుతోంది.
"ఎవరు?" అంటూ రాములు తలుపు తీశాడు.
గాలి లోపలికి చొరబడి, దీపం ఆరిపోయింది. మంచం మీద రాములు భార్య, పిల్లల్ని దుప్పట్లో కప్పుకుని కూర్చుని ఉన్నారు. చల్లగాలికి చంటి పాప ఏడుపు ప్రారంభించింది. పైనుంచి కూడా నీళ్లు కారుతున్నట్టుగా ఉంది.
ఆ దృశ్యం చూసి సుధాకర్ గారికి కళ్లలో నీళ్లు వచ్చాయి.
"అన్నం తిన్నారా?" అని ప్రశ్నించాడు. ఎవరూ మాట్లాడలేదు. ఆ మౌనంలోనే సమాధానం ఉంది.
"రాములూ, పద... పిల్లలను తీసుకెళ్లి మన ఫ్లాట్‌కి వెళ్లిపోదాం!" అని చెప్పి, గొడుగులు వేసి, జాగ్రత్తగా మెట్లెక్కించి, ఫ్లాట్‌కి తీసుకెళ్లాడు.
ఇంతలో సుమతి హాలును ఖాళీ చేసి, బీరువాలో పెట్టిన దుప్పట్లు, చాపలు పరచి, తల తుడుచుకోండి అంటూ తువాళ్లు ఇచ్చింది.
"ఈ బట్టలు వేసుకోండి," అంటూ పిల్లల పాత బట్టలు, చీర, షర్ట్లు ఇచ్చింది.
వణికిపోతున్న రాములు భార్య, పిల్లలు బట్టలు మార్చుకుని కొంత స్థిమితపడ్డారు. చాపల మీద నడుం వాల్చారు. సుమతి వంటింట్లోకి వెళ్లి, గబగబా వండి, కడుపునిండా తినిపించింది.
రాములు కళ్లలో నీళ్లు తిరిగాయి. "ఇప్పటివరకు ఈ అపార్ట్‌మెంట్‌లో ఎవ్వరూ పట్టించుకోలేదు. 30 ప్లాట్లు ఉన్నా, ఎవరూ బయటికి రాలేదు. అవసరమైతే పిలుస్తారు, కానీ సాయం చేయడంలో ఒక్కరూ లేరు," అనుకుంటూ, సుధాకర్ కాళ్ల మీద పడ్డాడు.
పెద్దవాళ్లకు ఆ రాత్రి నిద్ర రాలేదు. పిల్లలు మాత్రం అనవసరమైన భయం తెలియకుండా నిద్రపోయారు.
తెల్లవారింది. వర్షం ఆగలేదు. గాలి తీవ్రత అలాగే ఉంది.
ఇంతలో బయట నుండి పెద్ద శబ్దం!
"ఎమిటా?" అని కిటికీలోంచి తొంగిచూశాడు సుధాకర్. పాపం, వాచ్‌మెన్ క్వార్టర్ కుప్పకూలిపోయింది.
రాములు ప్రతి మీటింగ్‌లో చెబుతూ ఉండేవాడు – పైకప్పు నుంచి నీళ్లు కారుతున్నాయని. ఎవరూ పట్టించుకోలేదు.
"నిన్న రాత్రి ఈ కుటుంబం అక్కడే ఉండి ఉంటే... ఏం జరిగి ఉండేది!" అనుకుని ఒళ్ళు జలదరించింది సుధాకర్‌కి.
ఆ ఐదు ప్రాణాలు తుఫానుకి బలి అయ్యేవి.
రెండు మూడు రోజులు గడిచాయి. తుఫాను తగ్గింది. నగరం మామూలు పరిస్థితికి వచ్చింది.
వాచ్‌మెన్‌కు ఉన్న కొద్దిపాటి సామాను, మంచం – తుక్కుతుక్కు అయ్యాయి. ప్రెసిడెంట్ గారి కారు కూడా పాడైంది.
వాచ్‌మెన్ కుటుంబాన్ని కాపాడినందుకు, సుధాకర్ గారిని అన్ని ప్లాట్ ఓనర్లు అభినందించారు. కానీ...
"రాములు రేపటి నుంచి ఎక్కడ ఉంటాడు?" అని ఎవ్వరూ మాట్లాడలేదు.
చేసేదేమీ లేక, కట్టుబట్టలతో పిల్లల్ని తీసుకుని తన ఊరికి వెళ్లిపోయాడు రాములు.
కారు పాడైపోయిన ప్రెసిడెంట్ గారి ముఖంలో బాధ లేదు. ఆయన ధైర్యం అందరికీ తెలిసిందే. ఇన్సూరెన్స్ వాళ్లు వచ్చి ఫోటోలు తీశారు. ప్రభుత్వ లెక్కల్లో తుఫానుకు పాడైన ఇళ్లలో వాచ్‌మెన్ క్వార్టర్ కూడా ఉంది. కొద్దిరోజుల్లో ప్రభుత్వం ఇచ్చిన సహాయం అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ఖాతాలోకి చేరింది. ప్రెసిడెంట్ కారుకి వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు ఆయన ఖాతాలోకి పోయింది.
అంతే. రాత్రి పగలు కాపలాకాసే వాచ్‌మెన్ నోట్లోకి తుఫాను గాలిదుమ్మే మిగిలింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
---
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి