సీతమ్మ అన్నదానం


ఉదయం పదకొండు గంటలు అయింది. ఆ నగరంలో ప్రముఖ కూడలి ఉన్న గుడి ముందు ఇద్దరు బిచ్చగాళ్లు కూర్చుని ఉన్నారు. ఇంతలో గుడి తలుపులు మూసేసి పూజారి గారు బయటకు వచ్చి, "ఏరా ఇంకా వెళ్ళలేదా?" అని అడిగారు. ఎందుకంటే ఉదయం–సాయంకాలం గుడిమెట్ల మీద ఆ ఇద్దరు బిచ్చగాళ్లు సుమారు ఇరవై సంవత్సరాల నుండి భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నారు.


ఉదయం–సాయంకాలం గుడి దగ్గర బిక్షాటన చేసుకుని, గుడి కట్టేసిన తర్వాత ఎదురుగా ఉన్న చెట్టు దగ్గర, రాత్రి పూట పక్కనే ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్ల మీద పడుకుంటారు. ఆ నగరంలో అనేక దేవాలయాలు ఉన్నప్పటికీ వాళ్లు వేరే గుడి దగ్గరకు వెళ్లలేరు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ప్రమాదవశాత్తు కాళ్లు ఒక యాక్సిడెంట్‌లో పోయాయి.


ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన మీద మూడు చక్రాల బండి వాళ్ళకి ఆధారం. పూజారి గారు అడిగిన ప్రశ్నకి "లేదండి" అంటూ సమాధానమిచ్చి, ఏదో నసుగుతూ కనబడ్డారు బిచ్చగాళ్లు.


రోజు పదకొండు గంటలకే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ బిచ్చగాళ్లు. ఇవాళ ఇంకా ఎందుకు అక్కడ ఉన్నారని అప్పుడు తట్టింది పూజారి గారికి. విషయం అర్థమైంది రా! మీరు ఎవరి గురించి ఎదురు చూస్తున్నారో! ఆ అమ్మగారి గురించే కదా… అవునన్నట్లుగా తల ఊపారు.


"ఓహో, అయితే ఇవాళ సంతర్పణ భోజనం అన్నమాట!" అంటూ నవ్వుకుంటూ, ఆమె చాలా పుణ్యాత్మురాలు రా! దేవుడు ఆవిడని ఎప్పటికీ చల్లగా చూడాలి రా! అంటూ చేతిలో ఉన్న ప్రసాదాన్ని వాళ్ళిద్దరికీ ఇచ్చి వెళ్లిపోయారు పూజారి గారు.


ఇంతకీ ఎవరా ఆ అమ్మగారు? ప్రతిరోజు ఎంతోమంది భక్తులు గుడికి వస్తుంటారు. ఆవిడని అంతలా గుర్తు పెట్టుకోవడం కారణం ఏమిటి అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది.


ఆ అమ్మగారి పేరు సీతమ్మ. ఆమె భర్త రామారావు పక్కనున్న హైస్కూల్లో టీచర్‌గా పని చేస్తుంటాడు. పిల్లల చదువు కోసం నగరంలో కాపురం ఉంటూ చుట్టుపక్కల వాళ్లతో స్నేహంగా మెలుగుతూ, ఇద్దరు పిల్లలతో గుట్టుగా సంసారాన్ని సాగిస్తూ ఉంటారు ఆ దంపతులు.


ఆవిడకి దైవభక్తి అంటే చాలా ఎక్కువ. ప్రతి ఉదయం తెల్లవారుజామునే లేచి రెండు గంటల సేపు పూజ చేస్తే గాని ఆమెకి తోచదు. సనాతన ధర్మo అంటే చాలా ఇష్టం. ఎక్కువసేపు దైవారాధనలోనే గడుపుతూ ఉంటుంది.


అయినా తన కుటుంబ బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అన్యోన్యమైన దాంపత్యం. భర్త రామారావు కూడా పూజలు–పునస్కారాలు చేయకపోయినా, ఉన్నంతలో పదిమందికి సాయం చేయాలనే సంకల్పం కలవాడు.


ఒక రోజు, ఉన్నట్టుండి సీతమ్మ ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ గారు చెప్పిన భయంకరమైన వ్యాధి పేరు విని ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. ఉన్న డబ్బు కాస్త వైద్యానికి ఖర్చు పెడితే రేపు పిల్లల పెళ్లి, చదువు, సంధ్యలు ఎలాగని ఆలోచించి, భర్త ఎంత చెప్పినా వినకుండా, వైద్యం చేయించుకోవడానికి ఒప్పుకోకుండా, ఆయుర్వేద వైద్యం ప్రారంభించింది సీతమ్మ.


ఆ రోజు నుంచి సీతమ్మ దినచర్య పూర్తిగా మారిపోయింది. ఇదివరకు పర్వదినాల్లో మాత్రమే గుడికి వెళ్లే సీతమ్మ, ప్రతిరోజు గుడికి వెళ్లడం అలవాటు చేసుకుంది. ప్రతిరోజు ఆ గుడిలో జరిగే భజన కార్యక్రమానికి వెళ్లి రావడం అలవాటుగా మారింది. విచిత్రం ఏమిటంటే ఆ భజనలో పాల్గొని, పాతికేళ్ల యువకుల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధులు వరకు ఉన్నారు. అందులో సీతమ్మ గారి స్నేహితులు చాలా మంది ఉన్నారు.


అలా రోజు గుడికి వెళ్లే సీతమ్మకు, రోజు ఆ గుడి ముందట ఎంతోమంది బిక్షగాళ్లు ఉన్నా, చాలా రోజుల నుంచి ఆ గుడి ముంగిట కూర్చున్న ఆ కాళ్లు లేని వాళ్ళని చూసి జాలి కలిగింది.


ఆ గుడికి వచ్చే భక్తులు చేసే దానధర్మాలు వీళ్ళ జీవనాధారం. ప్రతిరోజు ఒకే సంఖ్యలో భక్తులు గుడికి రారు. ఒక రోజు తక్కువ, ఒక రోజు ఎక్కువ వస్తారు. అయినా ప్రతిరోజు గుడికి వచ్చే భక్తులందరూ దానధర్మాలు చేయరు. అటువంటి సమయంలో వీళ్ళ పరిస్థితి ఏమిటి, మరి ఆలోచన వచ్చింది సీతమ్మకి.


"ప్రతిరోజు భజన చేస్తున్నాము. గుడిలో కొబ్బరికాయలు కొడుతున్నాము. ఇవన్నీ ఎందుకు? మన కోరికలు తీరడానికి దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి అంతే కదా!" అయితే, దేవుడి మెచ్చే కార్యక్రమం ఏదో ఒకటి చేయాలని సంకల్పించి, వారానికి ఒక రోజు, ఆ తనకు ఇష్టమైన గురువారం రోజున, ఆ ఇద్దరికీ కడుపునిండా భోజనం పెట్టాలని నిర్ణయించుకుంది.


అప్పటినుంచి ప్రతిగురువారం ఉదయం లేచి యథావిధిగా తన దినచర్య పూర్తి చేసుకుని, అన్నం, పప్పు, కూర, సాంబారు, చపాతి, ఒక స్వీట్, పెరుగు తయారు చేసి, విడివిడిగా రెండు ప్యాకెట్లు కట్టి, ప్రతిగురువారం ఆ ఇద్దరికీ పెట్టడం అలవాటు చేసుకుంది. ఎండైనా, వానైనా, తుఫాను వచ్చినా, ప్రతి గురువారం వాళ్ళ కడుపు నింపడం ఆమెకు ముఖ్యమైన, ఎంతో తృప్తినిచ్చే పని.


ఒక్కొక్క రోజు ఆరోగ్యం సహకరించకపోతే, బయట ఉండే హోటల్స్ నుంచి వాళ్ళకి భోజనం తెప్పించి పెట్టడం అలవాటు చేసుకుంది. ఆమె భర్త రామారావు కూడా ఆమె చేస్తున్న పనిలో సంతృప్తి చూసి, సీతమ్మకి మరింత ప్రోత్సాహం ఇచ్చేవాడు. సుమారుగా ఇది మొదలుపెట్టి ఇరవై సంవత్సరాలు అయింది.


ఇలా సీతమ్మ గురించి ఆలోచనలో పడిన ఆ బిచ్చగాళ్ళకి దూరంగా ఒక బండి గుడి వైపు వస్తూ కనబడింది. ఆ నల్ల రంగు హోండా యాక్టివా గుడి ముందు బిచ్చగాళ్ల దగ్గర ఆగింది. ప్రతి గురువారం వచ్చే అమ్మగారిదే ఆ మోటార్ సైకిల్. కానీ ఆ బండి నుంచి దిగిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు.


"అది ఏమిటి? మరి ఆ అమ్మగారు ఏమయ్యారు?" అనుకుంటున్నారు ఇద్దరు బిచ్చగాళ్లు. ఆ వచ్చిన అమ్మాయికి సుమారు ఇరవై ఏళ్లు ఉంటాయేమో! బండి దిగి, డిక్కీ లో ఉన్న రెండు పొట్లాలు తీసి, ఆ బిచ్చగాళ్లు ఇద్దరికీ చెరొకటి ఇచ్చింది.


"అమ్మా, మరి ఆ అమ్మగారు?" అని అడిగారు ఇద్దరు బిచ్చగాళ్లు.

"ఆవిడ మా అమ్మ. క్రితం గురువారం మీకు ప్యాకెట్లు ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత గుండెల్లో నొప్పి వచ్చి చనిపోయింది. మరి మీరు ఇంత బాధలో ఎందుకు ఇలా వచ్చారు?" అని అడిగారు.

"లేదండి, ఇది ఆమె చివరి కోరిక. ఎన్ని సమస్యలున్నా, ప్రతి గురువారం మీకు ఇద్దరికీ భోజనం పెట్టకుండా ఉండవద్దని ఒక ఉత్తరం రాసి పెట్టింది. ఇది ఆమెకి అత్యంత తృప్తినిచ్చే పని అని, దీన్ని ఎప్పటికీ ఆపవద్దని వ్రాసింది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది ఆ అమ్మాయి.


దేవుడి దృష్టిలో డబ్బులు ఉన్నవాళ్లు, లేని వాళ్లు అందరూ సమానులే. గుడిలోకి వెళ్లే భక్తులు తమ కోరికలు తీరడానికి భగవంతుడికి కానుకలను సమర్పిస్తుంటారు. గుడి బయట కూర్చున్న బిచ్చగాళ్లు ఎప్పుడూ గుడిలోకి వెళ్లరు. ఎందుకంటే భగవంతుడు భక్తుల రూపంలో వచ్చి, ఆ బిచ్చగాళ్ళకు సాయం చేస్తూ ఉంటాడు.


భక్తులే ఆ బిచ్చగాళ్ళకు భగవంతుడు లాంటి వాళ్ళు. అలాంటి సాయం చేసిన సీతమ్మ నిజంగా వాళ్లకు దేవుడే. సీతమ్మ గారి కథ విని ఆ భజన సంఘంలో కూడా ప్రతిరోజు ఒకరు ఆ ఇద్దరు బిచ్చగాళ్లకు అన్నం పెట్టడం అలవాటు చేసుకున్నారు.


రచన: మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ

9491792279


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

కుటుంబం

సామర్లకోట