మదిని దోచిన బొమ్మ
నల్లటి శరీరం, కమలాల వంటి కళ్ళు. ఆ కళ్ళల్లో కృపారసం. చేతిలో వేణువు, తల మీద పరిసర్పిత పింఛం. ఎప్పుడూ నవ్వుతూ విరాజిల్లే మొహం. ఇది పోతన గారి శ్రీకృష్ణుడి వర్ణన. ఆ వర్ణన చదువుతుంటేనే మన మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడిని మనం చూడలేకపోయినా వెన్నదొంగగా, రాధాకృష్ణుడిగా, అల్లరి కృష్ణుడిగా చిత్రపటంలో చూసినప్పుడు మనసు పదేపదే ఆ ముగ్ధమోహన రూపాన్ని చూడాలని అనిపిస్తుంది.
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమకాలీకులుగా పెరిగిన ఆ యాదవులు ఎంతటి అదృష్టవంతులో అనిపిస్తుంది. నిజమే, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో స్నేహితులుగా మెలిగిన యాదవులు చాలా ధన్యాత్ములు. అంటే భగవంతుని పక్కనే ఉండి తమ స్నేహితుడే భగవంతుడు అని తెలియని వాళ్లు. అంత అందమైన పరమాత్మను చూడడానికి ఆ కాలంలో ప్రజలు వీధుల్లో బారులు తీరి ఉండేవారట.
మనం ఈ కాలంలో అందమైన శ్రీకృష్ణుడి చిత్రపటం కానీ, బొమ్మ కానీ రోడ్డుమీద కనబడితే ఒకసారి అటు చూడకుండా ఉండలేము. చెరసాలలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ, సంకెళ్లతో మన మనసును బంధించి ఆ బొమ్మని ఎంత ఖరీదైనదైనా కొని మన ఇంటికి తీసుకువెళ్లేలా చేస్తాడు. అది శ్రీకృష్ణ పరమాత్మ సమ్మోహనాస్త్రం. ఒక్కడే కాదు, పదహారు వేల మంది గోపికల మనసు దోచిన వాడే. మన మనసు ఒక లెక్కా?
ఎప్పటినుంచో శ్రీకృష్ణుడి బొమ్మతో మా ఇంటిని అలంకరించాలని తీరని కోరిక. రోడ్డుమీద ప్రయాణం చేస్తూ రోడ్డుకు ఆ పక్కన ఎన్నో బొమ్మలు కనబడినప్పుడల్లా వాటిని చూసి కొనాలని అనుకోవడమే కానీ, ఆగి బేరమాడిన సందర్భాలు లేవు. అంటే దేనికైనా సమయం రావాలి అని అంటారు పెద్దలు. అయితే ఆ బొమ్మలన్నీ నీలిమేఘ వర్ణంలో మెరిసిపోతూ మనసును దోచిన వాటిని దాటిపోతూ వెళ్ళిపోతూ ఉండేవాళ్లం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ సమయం వచ్చినప్పుడే ఆ కోరిక ఫలిస్తుంది.
మొన్న మార్చి నెలలో భాగ్యనగరం వెళ్లి, కూకట్పల్లి లోని బట్టల షాపు నుండి మా అమ్మాయి, మా శ్రీమతి తిరిగి వస్తుంటే ఈ బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కృష్ణుడు వాళ్ళ మనసులు దోచేశాడు. ముందుగా అది కంచు లోహంతో చేసిన విగ్రహమని అనుకున్నారు. కానీ తీరా చూస్తే, ఎముకలు విరిగినప్పుడు అతికే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ చేసిన బొమ్మ. చూడడానికి ఆ బొమ్మ చాలా అందంగా—నుదుటిపై కస్తూరి, ఛాతిపై కౌస్తుభ రత్నం, ముక్కు ముత్యం లాగా మెరిసిపోతూ, అరచేతులు వేణువును పట్టుకుని ఉండగా చేతులు కంకణాలతో మెరిసిపోతూ, గోమాత పక్కన నిలబడిన ఆ బొమ్మను తయారుచేసిన బ్రహ్మగారు చెప్పిన ధరకే కొనుగోలు చేసి నాకు చరవాణిలో సమాచారం అందించారు.
నా మనసు ఎంతో సంతోషపడింది. ఇంత తక్కువ రేటుకు దొరికినందుకు ఎంతో సంతోషించాం. అయితే ఆ ఉత్సాహంలో మా అమ్మాయి అది విగ్రహమని అనుకుంది కాబోలు. రెండు చక్రాల బండిలో ముందు చంటి పిల్లను నిలబెట్టుకుని వచ్చినట్లు, ఆ బొమ్మను నిలబెట్టుకుని ఒక చేత్తో పట్టుకుని హుషారుగా ఇంటికి వచ్చింది. ఒక్కసారి ఇంటిదగ్గర బండి ఆపి బొమ్మను దించేటప్పటికీ బొమ్మ పైభాగం ఒక చేతిలోకి, మెడ నుండి కిందభాగం రెండవ చేతిలోకి వచ్చాయి. అలాగే మా అమ్మాయి, శ్రీమతి కళ్ళల్లో నీళ్లు కూడా తెప్పించేసాయి. ఒకపక్క సెంటిమెంట్, ఒకపక్క డబ్బు పోయిందనే బాధ—కాసేపు కుటుంబ సభ్యులందరినీ అయోమయానికి గురి చేసేసాయి.
పోనీ మళ్ళీ వెళ్లి బొమ్మ వాడికి చూపించి “తప్పు నీదే” అని నిలదీద్దాం అంటే, రోడ్డు పక్కన బొమ్మలమ్మేవాడు వాడు ఏ రోడ్డు మీద ఉంటాడో ఎవరికి తెలుసు! ఇలా అయోమయంలో ఉండగా చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో ఫెవికాల్ ఉండగా, “మీకెందుకు బెంగ?” అనుకుంటూ ఒక చిన్నపాటి శస్త్ర చికిత్స చేసాము. ఆ శ్రీకృష్ణ పరమాత్మ మా బాధ చూడలేక ఏదో మాయ చేసి మా కన్నీళ్లు తుడిచేశాడు.
ఆ మరునాడే మా కాకినాడ ప్రయాణం. నాలుగు చక్రాల వాహనంలో గతుకుల రోడ్డు కుదుపులకు ఏమవుతుందో అని కించిత్ భయమున్న ఆ బొమ్మను, శీతాకాలంలో చలికి వణుకుతున్న పిల్లవాడికి దుప్పటి కప్పినట్టు రెండు మూడు దుప్పట్లు గట్టిగా కప్పి, వెనకాల సీట్లో నిలబెట్టి, ఒకరు పట్టుకుని కూర్చుని కాకినాడ తీసుకొచ్చి మా హాల్లో అందంగా అలంకరించుకున్నాము.
కాదు కాదు… ఆ పరమాత్ముడు వచ్చిన తర్వాతే మా హాలుకు అందం వచ్చింది. ఇది మా కృష్ణుడి కథ. మధ్యలో మా మనవరాలు వచ్చిన పెద్ద కృష్ణుడిని ముట్టుకోలేదు. ఇంకో బుల్లి కృష్ణుడితో మాత్రం ఆడుకునేది. ఎందుకంటే అది వచ్చిందంటే చాలు, కనుచూపుమేరలో దాని చేతికందే బొమ్మలు మిద్దెల మీద దాక్కుంటాయి.
ఇంతకీ చెప్పే మాట ఏమిటంటే, ఆ బుల్లి కృష్ణుడు లోహపు కృష్ణుడు. అదే మా నిర్భయం. లేదంటే అంతా శ్రీకృష్ణార్పణం.
ఇది మా కృష్ణుడు కథ.
✍️ రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
📍 కాకినాడ
📞 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి