అమ్మమ్మ గారి ఇల్లు


“రేపటి నుంచి నా కాలేజీకి సెలవులు!” అని ఉత్సాహంగా చెప్పాడు కిరణ్.

“రేపు నేను అమ్మమ్మగారి ఊరికి వెళ్లిపోతున్నా” అనగానే, కిరణ్ మాటలు విని నవ్విపోయింది తల్లి సంధ్య.


“కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్తా అనావు. అక్కడ ఏముంది రా? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా?” అని అంది సంధ్య.


“అవును అమ్మ! అమ్మమ్మ… కావాల్సినవన్నీ చేసిపెడుతుంది. ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది…” అని అమ్మమ్మ–తాతయ్యల గురించి చెప్పుకుంటూ ఆ రాత్రే నిద్రపోయాడు కిరణ్.


---


మరుసటి ఉదయం మొదటి బస్సులోనే కిరణ్‌ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలోని అమ్మమ్మగారి ఇంటికి పంపించాడు తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంకా ఆ ఊరిలోనే ఉంటాడు. వృద్ధాప్యం వచ్చినా చిన్నపాటి వ్యవసాయం కౌలుకి ఇచ్చి రోజులు గడుపుతుంటాడు.


పరంధామయ్యకి నలుగురు ఆడ పిల్లలు. మూడు అమ్మాయిలు హైదరాబాదులో ఉంటే, చిన్న కూతురు సంధ్య మాత్రం తునిలో ఉంది. సంధ్య భర్త రామారావు హంసవరం హైస్కూల్ హెడ్మాస్టర్. వారికి కిరణ్ ఒక్కరే కొడుకు.


ఇంటి ముందు ఆగిన ఆటోలోంచి దిగిన కిరణ్‌ను చూసి నవ్వుతూ ఎదురొచ్చింది అమ్మమ్మ సరస్వతి.

“ఏరా! పరీక్షలు బాగా రాసావా? అమ్మా, నాన్న బాగున్నారా?” అని అమ్మమ్మ–తాతయ్య పలకరించారు.


“అందరూ బాగానే ఉన్నారు!” అని ఉత్సాహంగా చెప్పిన కిరణ్, అమ్మమ్మ ముఖాన్ని గమనించాడు.

మునుపటిలా ముందుకు వచ్చి ఆలింగనం చేసుకోలేదు ఆమె. తాతయ్యలో కూడా పాత ఉత్సాహం కనిపించలేదు. ఆ ఇల్లు అంతా నిశ్శబ్దంగా అనిపించింది.


అమ్మమ్మ నడక కూడా సరిగా లేదు.

ఒకప్పుడు వంటగదిలో ఎప్పుడూ బిజీగా ఉండే అమ్మమ్మ… ఇప్పుడు కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చుంది.


“ఏరా, అన్నం తినేస్తావా?” అని అడిగింది సరస్వతమ్మ.

“అందరం కలిసి తినేద్దాం! అరిటాకులు కోసుకురానా?” అని చెప్పి బయటికి వెళ్లాడు కిరణ్.


అరటి తోట… ఒకప్పుడు పచ్చగా కళకళలాడేది. ఇప్పుడు క్షీణించిపోయింది.

పశువులతో నిండే పాక… నిర్మానుష్యంగా ఉంది.

బూజులు వేలాడుతున్నాయి.

ఆ దృశ్యాలు చూసి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వచ్చి కిరణ్ మనసు బాధతో నిండిపోయింది.


అరిటాకులు తీసుకుని వంటింటికి వచ్చేసరికి టేబుల్‌పై క్యారేజీ లోని పదార్థాలు విప్పుతూ కనిపించింది అమ్మమ్మ.

ఒకప్పుడు గచ్చు వసారాలో అందరూ కలిసి తినే రోజుల జ్ఞాపకాలు వచ్చి మనసు ముదిరిపోయింది.


“కాళ్లు నొప్పులురా… కింద కూర్చోలేకపోతున్నాం,” అని అరిటాకులో క్యారేజీ పదార్థాలు వడ్డించింది అమ్మమ్మ.


ఒకప్పుడు అరిటాకు నిండా పదార్థాలే.

ఇప్పుడు ఆకులో బోల్డంత ఖాళీ.


“ఏం తిన్నా పడట్లేదురా! బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి వండే శక్తి లేదు. అందుకే క్యారేజీ పెట్టించుకున్నాం,” అని మెల్లగా చెప్పింది సరస్వతమ్మ.


తాతయ్య–అమ్మమ్మ ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేయడం కూడా కిరణ్‌కు కొత్తగా అనిపించింది.


భోజనం అయ్యాక తాతయ్య ఆకులు బయట వేయగా, అమ్మమ్మ నడవలేకపోయినా చేతులు కడిగి తిరిగి కూర్చుంది.

తర్వాత ఇద్దరూ చెరో మంచం ఎక్కారు.

“రారా, నువ్వు నా పక్కనే ఇక్కడే పడుకో,” అని చోటు ఇచ్చింది అమ్మమ్మ.


కిరణ్ కొద్దిగా ఒడిలో చెయ్యి వేయగానే… ఎముకలు మాత్రమే తగిలినట్లుగా అనిపించింది.

ఇంటి పైకప్పు కూడా బూజులతో నిండింది.


“మేము వయసైపోయాం రా. ఇప్పుడు ఎవరు మాట వినిపించుకోవడం లేదు…” అని నెమ్మదిగా చెప్పింది అమ్మమ్మ.


కిరణ్ సాయంత్రం స్నేహితులను చూడటానికి బయటికి వెళ్లాడు.

ఊరు మొత్తం మారిపోయింది.

రంగురంగుల షాపులు, రద్దీ, కొత్త బిల్డింగ్‌లు…

చిన్నప్పుడు ప్రశాంతంగా ఉండే వీధుల్లో ఇప్పుడు పట్టణం వాతావరణం.


స్నేహితులే ఉన్నా… ఆప్యాయత మాత్రం కనిపించలేదు. అందరూ ఏఐ గురించి మాట్లాడుతుంటే, కిరణ్‌కు ఏదో ఖాళీగా అనిపించింది.


ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పుల్కాలు చేసి పెట్టింది అమ్మమ్మ.

తాతయ్య–అమ్మమ్మ మందులు వేసుకుని కిరణ్ పక్కనే కూర్చున్నారు.

వారి వయసు, బలహీనత, ఒంటరితనం చూసి కిరణ్ మనసు ముడుచుకుంది.


“నలుగురు పిల్లలు ఉండి… ఇలా ఒంటరిగా? ఏదైనా అత్యవసరం వస్తే?” అని మనసులోనే బాధపడిపోయాడు.


ఒక రోజు కిరణ్ అడిగాడు:

“అమ్మమ్మ… తాతయ్య… నేను ఇంటికి వెళ్తున్నాను. మీరూ నాతో వస్తారా? అక్కడే ఉంటాం.”


“లేదురా! మాకు అలవాటు అయిన ఇల్లు, అలవాటు ఊరు, అలవాటు మనుషులు… వేరే ఊర్లలో మేముండలేం. మా వయసు అయిపోయింది. ఏదైనా జరిగితే అద్దె ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలుసు,” అని చెప్పారు.


కిరణ్ మౌనమయ్యాడు.


తరువాతి రోజు, కిరణ్ వారి ఇంటికి ప్రతిరోజూ క్యారేజీ పంపేలా ఏర్పాటు చేశాడు.

ఊరిలో బాగా తెలిసిన వ్యక్తిని రాత్రింబగళ్లు సహాయం కోసం పెట్టాడు.

తాతయ్యకి ఉన్న బ్యాంకు పనులన్నీ పూర్తి చేసి, ఈ సంగతి తన కుటుంబ సభ్యులందరికీ చెప్పాడు.


ప్రతి వారం గ్రూప్ కాల్‌లో తాతయ్య–అమ్మమ్మతో అందరూ మాట్లాడేలా ఏర్పాటు చేసి, తన ఊరికి బయలుదేరి వెళ్లిపోయాడు.


కొద్ది రోజులకు అమ్మమ్మ, సంధ్యతో ఫోన్‌లో మాట్లాడుతూ,

“నీ కొడుకు చాలా మంచి వాడు అమ్మాయి! మా పరిస్థితులు చూసి మంచి ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు. క్యారేజీ సమయానికి వస్తోంది. మాకు తెలిసిన పనివాడిని పెట్టాడు… బాగానే చూసుకుంటున్నాడు,” అని సంతోషంగా చెప్పింది.


అదంతా విని కిరణ్ మనసులో అనుకున్నాడు—


“తాత్కాలిక పరిష్కారం చేశాను. కానీ చిన్న చిన్న సహాయాలకే పెద్దవాళ్లు ఎంత సంతోషపడతారో!

అసలు బాధ్యత మాత్రం… పిల్లలదే.”


రచన

మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు, కాకినాడ

9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం