సాంబయ్య


శివరాత్రి పండుగ శివ శివ అంటూ గజగజ వణికించే చలిని కూడా తీసుకుని వెళ్లిపోయింది. ఒక్కసారిగా భానుడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టాడు.


మనిషి నిలువునా నిలబడితే మునిగిపోయేంత లోతుగా ఉండి ఎప్పుడూ నీళ్లతో ఉండే ఆ ఊరికి ఈ ఊరికి మధ్య ఉండే పెద్ద కాలువకి నీళ్లు ఇవ్వడం ఆపేసారు గవర్నమెంట్ వారు. ఈ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని ఆర్థర్ కాటన్ బ్యారేజీ ముద్దుబిడ్డ. పంటల కాలం అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కాలువ నీటితో పనిలేదు. సాధారణంగా గవర్నమెంట్ వారు ఈ వేసవికాలంలో కాలువలకు నీరు ఆపేసి మరమ్మత్తులు చేస్తారు.


మామూలుగా పంటల కాలంలో ఆ పచ్చటి పొలాలకు ఇరవై నాలుగు గంటలు నీళ్లు సరఫరా చేసే ఆ పెద్ద కాలువ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తాలూకాలోని ఒక కుగ్రామం వెళ్ళాలంటే ఆ పెద్ద కాలువ దాటవాల్సిందే.


ఆ పెద్ద కాలువ ఆ పక్క ఈ పక్క పెద్ద గట్లు ఉండి, ఆ గట్లు వెంబడి రకరకాల పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. కాలువ దాటాలంటే చెక్కలతో తయారుచేసిన ఒక బల్లకట్టు ఆధారం.


ఆ బల్లకట్టు నడుపుతూ సాంబయ్య కుటుంబం తరతరాల నుంచి అదే వృత్తిలో జీవిస్తూ ఉండేవారు.


సాధారణంగా ఉదయం ఐదు గంటల నుంచి చీకటి పడే వరకు ఆ బల్లకట్టును నడిపే సాంబయ్య, అర్ధరాత్రి అపరాత్రి ఎవరికి అవసరం వచ్చినా నిద్రలోంచి లేచి వచ్చి ఆ కాలువను దాటిస్తుండేవాడు. దానికి తోడు సాంబయ్య ఉండేది ఆ పెద్ద కాలువ పక్కనుండే గుడిసెలోనే.


ఆ ఊరిలో ప్రధానమైన వృత్తి వ్యవసాయం. అయినా ఉపాధ్యాయులు, డాక్టర్లు, లాయర్లు కూడా సొంత ఊరిలో ఉండి పక్కనున్న టౌన్ కి వెళ్లి సాయంకాలానికి తిరిగి వచ్చేవారు. సాంబయ్య ఆ ఊరి ప్రజల తలలో నాలికలా ఉండి, పంట వచ్చినప్పుడు రైతులు ఇచ్చే ధాన్యంతో జీవితం గడుపుతూ ఉండేవాడు.


రోజు బల్లకట్టు మీద ప్రయాణించే వాళ్లతో చాలా ఆప్యాయంగా మెలిగేవాడు. అలాగే రిక్షాలు దాటించడానికి సహాయం చేసి, అప్పట్లో వాళ్లు ఇచ్చే రూపాయి రెండు రూపాయలతో సంతృప్తిపడి సాయంకాలానికి పదోపరక సంపాదించుకునేవాడు.


ఎప్పుడూ నీటిలో తేలియాడే ఆ బల్లకట్టు నడపడానికి గవర్నమెంట్ వారికి ప్రతి ఏటా కొంచెం సొమ్ము చెల్లించవలసి వచ్చేది సాంబయ్య. మామూలుగా గోదావరి నది దాటడానికి మోటారుతో నడిపే పంటి ఉపయోగిస్తారు. ఈ పంటి నడపడానికి కూడా గవర్నమెంట్ వారు వేలం పాట పెట్టి అత్యధిక పాటదారుడికి ఆ పంటి నడిపే అధికారం ఏడాది కాలం పాటు ఇస్తారు. అయితే ఆ పాటదారుడు అప్పటికప్పుడు ప్రయాణికుల దగ్గర నుంచి ప్రతిరోజు సొమ్ము వసూలు చేస్తాడు.


అయితే సాంబయ్యకి ప్రతిరోజు అలా వచ్చే ఆదాయం లేదు. కానీ ఏడాదికి ఒకసారి రైతులు ఇచ్చే ధాన్యమే అతని జీవనాధారం. ఇది గోదావరి నది కాదు — పెద్ద కాలువ. ఆ గట్టు నుంచి ఈ గట్టు దాటడానికి ఐదు నిమిషాలు పట్టిన ఆ ఊరి వారికి ఆ ఊరు దాటాలంటే వేరే దారి లేదు. ప్రతి ఏడాది వేసవికాలంలోనూ ఈ బల్లకట్టు ఉండదు. అప్పుడు కాలువల్లో నీళ్లు ఉండవు కాబట్టి కాలువ దిగి వెళ్లిపోతుంటారు ప్రయాణికులు.


ఈ పని తప్ప వేరే పని చేయలేని సాంబయ్యకి ఇప్పుడు ఒక దిగులు పట్టుకుంది. ఆ పెద్ద కాలువ మీద పెద్ద వంతెన నిర్మించాలని తలపెట్టారు. వేసవకాలం పూర్తయ్యేసరికి ఈ వంతెన పనులు పూర్తవాలని ఆ కాంట్రాక్టర్ తొందరపడిపోతున్నాడు. అప్పటికే దేశంలో ఎన్నికల వాతావరణం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించలేదు కానీ పార్టీలు హడావిడిగా ఉన్నాయి.


ఒకవేళ ఎలక్షన్ కోడ్ కానీ పెడితే బిల్లులు రావని కాంట్రాక్టర్ హడావిడిగా నిర్మాణ సామగ్రి అంతా కాలువ దగ్గర షెడ్ వేసి ఆ షెడ్‌లోకి చేర్చాడు.


మళ్లీ కాలువకు నీళ్లు వదిలే సమయానికి ఇంక బల్లకట్టుతో పని ఉండదు. వంతెన పూర్తయిపోతుంది. ఆ ఊరి నుంచి ఊరికి ప్రయాణం సులువు అయిపోతుంది. ఆ గ్రామ ప్రజలకు చాలా సంతోషంగా ఉంది కానీ సాంబయ్యకి ఇక ముందు తన జీవనాధారం ఏమిటో ఎటు పాలిపోకుండా ఉంది.


ఎవరు ఏ సమయంలో వచ్చి నిద్ర లేపిన ఆ కాలువ దాటించేవాడిని. ఎవరి దగ్గర బాధ పెట్టి డబ్బులు తీసుకోలేదు. ఎంతోమంది తల్లులు ప్రసవ వేదన పడుతుంటే పక్క ఊరు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రాత్రిపూట కూడా నిద్రలేచి సహాయం చేసేవాడిని. "భగవంతుడు ఏమిటి నా జీవనాధారం పోగొడుతున్నాడు?" అంటూ ఆలోచించుకుంటూ తిండి తినక చిక్కి శల్యమైపోయాడు సాంబయ్య.


రోజు ఉదయం పూట అదే బల్లకట్టు మీద ప్రయాణం చేసే లాయర్ విశ్వనాథం సాంబయ్యను చూసి —

"ఏరా సాంబయ్య! అలా ఉన్నావ్ ఏంటి? బాగా పాడైపోయావు! ఒంట్లో బాగాలేదా?" — అంటూ ప్రశ్నించాడు.


ఆ ఆప్యాయమైన పలకరింపుకి సాంబయ్యకి ఒక్కసారి కళ్ల వెంబటే నీళ్లు వచ్చి తన గుండెలోని బాధనంతా లాయర్ విశ్వనాథం గారికి చెప్పాడు.


పల్లెటూరు కదా — ప్రతి ఒక్కరి స్థితిగతులు ఆ ఊరిలో ఉండే ప్రజలకు బాగా తెలుస్తుంది. సాంబయ్య గురించి తెలిసిన లాయర్ విశ్వనాథంకి నిజమే రేపటి నుంచి వీడు ఎలా బతుకుతాడు? ఈ కాలువ మీద ఆధారపడి జీవించాడు ఇన్నాళ్లు! ఇప్పుడు ఉన్నట్టుండి ఏ రకమైన పని చేయగలడు? — అని ఆలోచించాడు విశ్వనాథం.


ఆ పెద్ద కాలువ మీద వారధి కట్టడానికి ముందు ఆ పక్క రెండు కిలోమీటర్లు, ఈ పక్క రెండు కిలోమీటర్లు రోడ్డు వెడల్పు చేయడమే కాకుండా రోడ్డు పక్కన ఉండే ఇళ్లను కూడా ఖాళీ చేయించాలి. అందులో కొన్ని పూరిపాకలైతే, మరికొన్ని పక్కా ఇళ్ళు. ఎన్నో ఏళ్ల నుంచి వందల కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి. సాంబయ్య కూడా అక్కడ ఒక పూరిపాక కట్టుకుని నివసిస్తున్నాడు.


ఇప్పుడు ఈ వారధి కట్టడానికి ముందు వాళ్లందరిని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ప్రభుత్వం ఊరికి దూరంగా ఎక్కడో స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చినా, ఆ ప్రజలు ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. అలా అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లే స్తోమత వాళ్లకు లేదు. అది అక్కడ ఉన్న సమస్య.


లాయర్‌గా విశేషమైన అనుభవం ఉన్న విశ್ವనాథ్‌గారికి ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది. దీనితో సాంబయ్య సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆలోచించాడు. వెంటనే ఒకరోజు రాత్రి ప్రతిపక్ష నాయకుడిని పిలిచి, ఆ గుడిసెల వాళ్ళందరినీ సమావేశపరిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయించి కోర్టు స్టే తెచ్చుకున్నాడు. ఈ సమావేశానికి మీడియావాళ్లను ఆహ్వానించాడు.


ఇంకేముంది — ఒక కాలువ మీద నిర్మించే వారధి వార్తల్లోకి ఎక్కింది. అంతవరకు ఆ ఊరు గురించి తెలియని ప్రపంచం సోషల్ మీడియాలో రోజు ఆ ఊరి వార్తల వైపు మొగ్గుచూపింది. ఎవరి అభిప్రాయాలతో వాళ్లు ఆ ఊరి గురించి తెలియకపోయినా కామెంట్లు పెట్టడం ప్రారంభించారు. ఎప్పుడూ ఆ ఊరు వెళ్ళని ప్రతిపక్ష నాయకుడు ఆ నిర్వాసితుల గురించి ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభించి వార్తల్లోకి ఎక్కాడు.


అంతవరకు చెట్టు కింద ప్లీడర్‌లో ఉన్న లాయర్ విశ్వనాథం ఇంటర్వ్యూలు కోసం అన్ని చానల్స్ ఎగబడ్డాయి. అలా విశ్వనాథం పేరు మారిమోగిపోయింది.


ఆ పెద్ద కాలువ మీద నిర్మించే వారధి పనులు కోర్టు స్టేతో ఆగిపోయాయి. ఒకసారి కోర్టుకెళ్లిన కేసు ఎప్పటికీ తేలుతుందో ఎవరికీ తెలియదు. అందుకే కాంట్రాక్టర్ తెచ్చిన సరుకు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. సాంబయ్య సమస్య పక్కకు పోయి వేరే సమస్య ముందుకు వచ్చింది.


ఈలోగా ఎన్నికల తేదీ ప్రకటించడం, అధికార పక్షం తరుపున పోటీ చేసే అభ్యర్థి నిర్వాసితులకు ఊరి మధ్యలో స్థలం ఇస్తామని, ఇల్లు కట్టించి ఇస్తామని లోపాయికారీగా ఒప్పందం కుదుర్చుకుని ఓట్లు వేయించుకున్నాడు. అధికార పక్షం అధికారంలోకి వచ్చింది. కోర్టులో ఉన్న కేసు సంగతి అలాగే ఉండిపోయింది. వంతెన నిర్మాణం గురించి ఊసే లేదు.


వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలం మొదలైంది. పెద్ద కాలువ నిండుగా నీళ్లు రావడంతో ఆ కాలవ దాటడానికి సాంబయ్య బల్లకట్టు మళ్లీ ఆధారమైంది. సాంబయ్యకు మంచే జరిగింది కానీ ఊరికి నష్టం జరిగింది.


అయితే లాయర్ విశ్వనాథం మరియు ప్రతిపక్ష నాయకుడు ఆ నిర్వాసితుల గురించి ఎందుకు అంతగా పోరాడారో తర్వాత అర్థమైంది ఊరి జనానికి. ఆ రోడ్డు పక్కన ఉండే స్థలాల్లో లాయర్ విశ్వనాథానికి, ప్రతిపక్ష నాయకుడికి కూడా ఒక్కొక్కరికి రెండేసి ఇళ్లు ఉన్నట్లు తెలుసుకున్నారు.


ఇవేమీ తెలియని సాంబయ్య దృష్టిలో లాయర్ విశ్వనాథం ఒక దేవుడిగా మిగిలిపోయాడు.


ఇవాళ దేశంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు స్వార్థం కోసం వాడుకునే వాళ్లు ఎందరో. బాధితులని పావులుగా వాడుకుని స్వలాభం పొందే వాళ్ళు ఎంతోమంది.


రచన : మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు

కాకినాడ — 9491792279


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం