వేసవి అల్లుడు


వేసవికాలం వచ్చిందంటే ఆ ఊరి అగ్రహారo ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్టయ్యేది. ప్రతి ఏటా సెలవులకు వచ్చిన పిల్లల అరుపులు, కేకలు, నవ్వులు—వీటన్నిటితో ఇళ్లన్నీ ఉలిక్కిపడేవి. అమ్మమ్మ గారి ఊరికి వచ్చిన పిల్లలు ఊరికే ఉంటారా? తోటలూ, దొడ్లూ, పొలాలూ—వాళ్లకు ఆటస్థలాలే. ఎక్కడ చూసినా వాళ్లే, వాళ్ల సందడే.


కానీ ఆ అగ్రహారంలో ఒక ఇంటి సందడి మాత్రం కొంచెం ప్రత్యేకం. పిల్లల గోలతో పాటు, భాగ్యనగరం నుంచి ప్రతి వేసవికీ వచ్చే అల్లుడు గారి సందడి కూడా అక్కడ కలిసిపోయేది. వేసవి అంటే పిల్లల సెలవులే కాదు—ఆ ఇంటికి అల్లుడు రావడంతో పండగలా ఉండేది.


పిల్లలకైతే పాఠశాల సెలవులు ఇస్తారు. మరి అల్లుడు గారికి? అప్పటి రోజులు కాబట్టి నెలరోజులు సెలవు పెట్టుకుని, బ్యాంకు గుమ్మం దాటి అత్తగారింటి గడప తొక్కేవాడు సదరు అల్లుడు అచ్యుతరావు. భాగ్యనగరం నుంచి ఆ ఊరు రావడం అంటే ప్రయాణం కాదు—ఒక తపన. పన్నెండు గంటలు బస్సులో కూర్చుని, కాకినాడలో దిగి, అక్కడి నుంచి ఇంకో బస్సు, ఇంకో మార్గం. అష్టకష్టాలు పడి ఊరికి చేరేవాడు.


అది అత్తగారి ఊరే కాదు—తను పుట్టి పెరిగిన ఊరు కూడా అదే. మట్టి వాసన, నీటి రుచి, మనుషుల పలకరింపులు—అన్నీ అతనికి తెలిసినవే. అందుకే ఆ ఊరంటే అచ్యుతరావుకి అపారమైన అభిమానం.


ఆ ఇంటి యజమానులు రామారావు, కృష్ణారావులు—అచ్యుతరావుకి వేలు విడిచిన మేనమామలు. పన్నెండుమంది పిల్లలతో కళకళలాడే ఆ ఉమ్మడి కుటుంబంలో, కావాలనే ఆడపిల్లని పెళ్లి చేసుకున్నాడు అచ్యుతరావు. ఆ పిల్లలతో అతను పెద్దవాడిలా కాదు—పిల్లాడిలానే కలిసిపోయేవాడు.


అందుకే “అల్లుడు వస్తున్నాడు” అంటే ఆ ఇంట్లో ఎక్కడా భయం లేదు. అదొక పండగ వార్త.


అతను ఉన్నంతకాలం కాలం నడకనే మరిచిపోయేది ఆ కుటుంబం.ఉండేది హైదరాబాద్ అయినా, ఊరిలో అడుగుపెట్టిన క్షణమే అచ్యుతరావు మారిపోయేవాడు. లుంగీ, పంచి, బనియన్—అవి అతని పల్లె రూపానికి గుర్తులు. ఉత్సాహం అతని మాటల్లో, ఉల్లాసం అతని నడకలో కనిపించేది. చూడ్డానికి సునీల్ గవాస్కర్‌లా—సాధాసీదా ముఖం, నిండైన కాయం. క్రికెట్ బ్యాట్స్మెన్ అవునో కాదో తెలియదు గానీ, మంచి తిండి పుష్టి కలవాడు.


రామారావు, కృష్ణారావులది పెద్ద సంపన్న కుటుంబం కాదు. ఒకరు ఆయుర్వేద వైద్యులు, మరొకరు పంచాయతీ బోర్డు గుమస్తా. పెద్దలు ఇచ్చిన మూడు ఎకరాల పొలం, ఒక ఎకరం మావిడి తోట, పెద్ద ఇల్లు, రెండు మూడు పశువులు—ఇవే వాళ్ల ఆస్తిపాస్తులు. కానీ ఆస్తులకన్నా వాళ్లకు ఉన్నది గౌరవం, పలుకుబడి. సహాయం అడిగితే మాట ముందుకు రాకముందే చేయి ముందుకు వచ్చేది. మధ్యతరగతి కుటుంబమే అయినా, అనుబంధం–ఆప్యాయతల్లో మాత్రం పెద్ద ఇళ్లవాళ్లు.


అలాంటి ఇంట్లోకి భార్యను వెంటబెట్టుకుని వేసవికాలం మొదలవుతూనే అడుగుపెట్టాడు అచ్యుతరావు. ప్రతిరోజు ఎలా ఉన్నా, అతను వచ్చిన రోజు మాత్రం ఆ ఇంట్లో వెలుగు ఎక్కువగా ఉండేది. రక్తసంబంధం ఉన్న అల్లుడు కాబట్టి మాటల్లో వెటకారం, పనుల్లో వేళాకోళం—ఇంటి వాతావరణమే మారిపోయేది.


తెల్లవారుతుంటే పల్లెలో కోళ్లు కూయకముందే అచ్యుతరావు లేచేవాడు. అత్తగారు పెద్ద గ్లాసులో వేడి వేడి కాఫీ ఇచ్చేది—మొదటి డోస్.


“ఇదిగో నాయనా… ముందుగా ఇది తాగు అని అత్తగారు నవ్వుతూ చెప్పేది. అప్పట్లో ఉదయపు టిఫిన్ అనే మాటే లేదు. కాఫీయే అల్పాహారం. మరో రెండు డోసులు కూడా ఒక గంట వ్యవధిలో 


ఆ తర్వాత చెంబు పుచ్చుకుని తోట వైపు నడక. అల్లుడు గారి మర్యాద కోసం చెంబుడు నీళ్లు పట్టుకుని బుల్లి బావమరిది కూడా వెంట వెళ్లేవాడు. అప్పట్లో శంక తీర్చుకోవాలంటే తోటలే గతి. తిరిగి వచ్చి దొడ్లోని బావి దగ్గర స్నానం అయ్యేసరికి నడవలో ఉన్న గంటల గడియారం పది గంటలు కొట్టేది.


ఇక భోజన సమయానికి ఆ ఇల్లు మినీ సంతర్పణగా మారేది. పిల్లలు, పెద్దలు, బంధువులు కలిపి రోజూ ఇరవై విస్తర్లు లేచేవి.


“అల్లుడు గారు… ఇంకొంచెం పప్పు వెయ్యనా ?” “వద్దులే అత్తయ్య… అయినా వేస్తే మాత్రం తినేస్తా,” అని నవ్వేవాడు అచ్యుతరావు. వేసవికాలం కదా—పప్పు, మామిడికాయ బద్దలు, తీపి పులుసు, అప్పడాలు, వడియాలు, వంకాయ కూర, గడ్డ పెరుగు, మామిడి పండు. కూరలు మారినా ఈ పదార్థాలే కథానాయకులు. పట్నవాసపు తిండికి అలవాటుపడ్డ అచ్యుతరావు మొదటి బంతిలో కూర్చుని, ఆఖరి బంతి వాళ్లతోనే లేచేవాడు.


ఉక్కపోత వేసవిలో, మర్యాదలతో నిండిపోయిన కడుపుతో ఇంకేముంది—అల్లుడు గారి బాధ వర్ణనాతీతం. తడితువ్వాలు ఒంటి మీద వేసుకుని నడవలో నడుము వాల్చి పడుకున్న అల్లుడు గారిని చూసి నవ్వు ఆపుకోలేకపోయేవారు.


పక్కనే ఉన్న బావమరుదులకు కాలు–చేయి అప్పగించి అరగంట కునుకు తీసేసరికి వీధిలో ఒక డబ్బా చప్పుడు, పిల్లల గోల వినిపించేది.


ఆ డబ్బా చప్పుడు అచ్యుతరావుకి తెలిసిన శబ్దమే. ప్రతిరోజూ అదే సమయానికి వచ్చే ఐస్‌ఫ్రూట్ సాయిబు తన రాకను చెప్పే సంకేతం అది.


“సాయిబూ… ఈసారి పిల్లలందరికీ పెద్ద పీస్‌లు ఇవ్వాలి,” అని అచ్యుతరావు ఆజ్ఞలిచ్చినట్టు చెప్పేవాడు. అప్పట్లో ఐస్‌ఫ్రూట్ ఐదు పైసలు. బ్యాంకులో పనిచేసే అచ్యుతరావు జేబులో తెచ్చుకున్న కొత్త అయిదు పైసల బిళ్లలను ఒక గుప్పెడు సాయిబు చేతిలో పోసి, పిల్లలందరికీ ఆనందాన్ని పంచేవాడు.


ఇది ప్రతి ఏటా వేసవికాలంలో జరిగే పండగే. పిల్లలంటే అతనికి అంత మమకారం. పాలు తాగే పసిగుడ్డుతో కూడా కలిసిపోయే మనసు అతనిది. “అల్లుడు వచ్చిన తర్వాత పిల్లలు మమ్మల్ని వేధించట్లేదు” అనేది అచ్యుతరావు అత్తగారు.


పట్నవాసానికి, పల్లెటూరికి ఆహార సమయాల్లో మార్పులు ఉన్నప్పటికీ మధ్యాహ్నపు కునుకు తర్వాత టీ పడకపోతే తోచదు పల్లెటూరు వాళ్లకి. అలాంటి అలవాట్లకు అలవాటు పడిన అచ్యుతరావు టీ చుక్క గొంతులో పోసుకుని అరుగు మీదకు చేరేవాడు—మేనమామలతో సహా. కాలక్షేపం కబుర్లతో కాదు, పేక ముక్కలతో. “ఎక్కడైనా తమ్ముడు గాని, పేకాట దగ్గర తమ్ముడు కాడు” అనే సామెతను నిజం చేస్తూ ఓడిపోయిన వాళ్ల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేవారు. ఆ అరుగు నవ్వులతో, జోకులతో పెద్ద సందడిగా ఉండేది.


ఇంతలో లోపలి నుంచి బుల్లి బావమరిది పరుగు పెట్టుకుంటూ వచ్చి, “బావ… అమ్మ పిలుస్తోంది” అనేసరికి ఆ పిలుపు ఎందుకో అచ్యుతరావుకి ముందుగానే అర్థమయ్యేది. తొలిరోజు మధ్యాహ్నం కునుకు తీయకుండా అత్తగారు రుబ్బురోలు దగ్గర కష్టపడుతున్న దృశ్యం కళ్ల ముందు మెదిలింది. ఇంకేముంది—లుంగీ సర్దుకుని వసారా లోకి వెళ్లేసరికి ప్లేట్లో అప్పటికే వేడి వేడిగా ఉన్న దోశలు, అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి ఆహ్వానం పలికేవి. అత్తగారు పెనం మీద అట్లు వేస్తూనే ఉంది.


అచ్యుతరావు దోశ ముక్కలు విరిచి నోట్లో పెట్టుకుంటూనే ఉన్నాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఇంతలో పిల్లలు క్రికెట్ బ్యాట్ పట్టుకుని బావగారి వైపు చూసేసరికి తన బాధ్యత గుర్తొచ్చింది అచ్యుతరావుకి.


“అరేయ్… పిచ్ రెడీనా? అంపైర్ ఎవడు?” అని నవ్వుతూ అడిగాడు.


“బావే అంపైర్… బావే బ్యాట్స్‌మన్!” అని పిల్లలు ఒకేసారి కేక పెట్టారు.


అంతే—పిల్లల ఉత్సాహం రెట్టింపు అయింది. వేప చెట్టు కిందే పిచ్. రెండు ఇటుకలే వికెట్లు. ఒకటి చిన్న మామిడికాయ చెట్టు—అది స్లిప్ ఫీల్డర్. ఇంకో వైపు తాటి చెట్టు—అది బౌండరీ. బంతి పొలంలోకి వెళ్తే అవుట్, బావిలో పడితే డైరెక్ట్ సిక్స్—అది పిల్లల సొంత రూల్.


అచ్యుతరావు బ్యాట్ పట్టుకున్నాడు అంటే ఆట సరదాగా ఉండదని అందరికీ తెలుసు.


“బావా… నన్ను బ్యాటింగ్‌కి పంపుతావా?” “నువ్వా? ముందు బంతి పట్టుకోడం నేర్చుకోరా బాబు!” “అయితే నువ్వే మా టీమ్ కెప్టెన్!” “సరే సరే… కానీ ఓడితే ఏడవకూడదు,” అని నవ్వాడు అచ్యుతరావు. బంతి విసిరేది ఎవరైనా సరే—ఆడేది మాత్రం పిల్లలంతా అతని చుట్టూనే. ఒక్కో షాట్‌కి ఒక్కో కేక. ఒక్కో మిస్‌కి ఒక్కో నవ్వు.


తానే ఔట్ అయినా, “అదేంటి… నో బాల్ కదా!” అని పిల్లలతో వాదించేవాడు.


ఎండ మండిపోతున్నా ఎవరికీ పట్టించుకోవాలనే తాపత్రయం లేదు. చెమటతో చొక్కా తడిసిపోయినా, కళ్లల్లో మాత్రం వేసవి సెలవుల ఆనందమే.


ఆట అయిపోయేసరికి అందరూ అలసిపోయి అరుగుల మీద వాలిపోయారు. అత్తగారు లోపల నుంచి మజ్జిగ గ్లాసులు పంపించింది. ఆ మజ్జిగ రుచి ఇప్పటికీ అచ్యుతరావుకి గుర్తుండిపోయింది—ఉప్పు కాస్త ఎక్కువ, అల్లం వాసన కాస్త తక్కువ.


సాయంత్రం అయ్యేసరికి ఊరు మళ్లీ మరో రూపం తీసుకునేది. వీధిలోకి ఆవులు వచ్చేవి. పిల్లలు వాటి తోకలతో ఆడుకునేవారు. పెద్దలు అరుగుల మీద కూర్చుని రాజకీయాల నుంచి వర్షాల వరకూ అన్నీ చర్చించేవారు. అచ్యుతరావు మాత్రం మేనమామల మధ్య కూర్చుని పట్నం కబుర్లు చెప్పేవాడు—బ్యాంకు పని, బస్సుల రద్దీ, సినిమా థియేటర్లు.


వాళ్లు వింటూ, “అయినా ఊరు బావుంటుందిరా…” అని ఒకే మాట అనేవారు.


అచ్యుతరావు నవ్వుతూ, “బావుంటుంది మామయ్య… అందుకే ప్రతి వేసవికీ ఇక్కడికి వస్తున్నాను,” అన్నాడు.


రాత్రి భోజనం అయ్యాక పిల్లలు చుట్టూ చేరి కథలు అడిగేవారు. రామాయణం కాదు, మహాభారతం కాదు—అచ్యుతరావు చెప్పేది పట్నం కథలు. లిఫ్టులు, ట్రాఫిక్ సిగ్నల్స్, పెద్ద పెద్ద భవనాలు. పిల్లల కళ్లూ పెద్దవైపోయేవి. మేనమామలు మాత్రం నవ్వుతూ, “ఇవన్నీ బాగానే ఉంటాయి… కానీ మన ఊరు లాంటిది ఎక్కడా ఉండదు” అనేవారు.


అలా రోజులు గడిచిపోయేవి.


అలాంటి సరదా కుటుంబంలో సమస్యలూ ఉండేవి. సమస్యల్లో ఉన్న పిల్లలను ఉత్సాహపరిచి చదువులో ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ అందరికీ ఒక రోల్ మోడల్‌లా ఉండేవాడు అచ్యుతరావు. చుట్టలు తాగే మామగారికి రాకూడని జబ్బు వచ్చి మంచం ఎక్కితే, హైదరాబాద్ తీసుకెళ్లి పెద్ద కొడుకులా ఆదుకున్నాడు. కానీ జబ్బు ముదిరిపోవడంతో మామగారు చేయి దాటిపోవడంతో కుటుంబ బాధ్యత తన భుజాలపై వేసుకుని పిల్లలందరినీ గట్టెక్కించాడు. ఆ బాధ్యతలను నెరవేర్చడంలో ఎన్నో అవమానాలు ఎదురైనా ముందుకు సాగాడు. “అల్లుడు అంటే అలకపానుపు ఎక్కేవాడు కాదు—అవసరమైతే బాధ్యతలు భుజాన మోయవలసినవాడు” అని తన జీవితంతోనే చూపించాడు.


వేసవి ముగింపు దగ్గర పడితే పిల్లల ముఖాల్లో మార్పులు కనిపించేవి. అల్లుడు తిరిగి భాగ్యనగరం వెళ్లే రోజు దగ్గర పడుతోందని అందరికీ అర్థమయ్యేది.


ఆ రోజు తెల్లవారుజామునే ఆ ఇల్లు మౌనంగా లేచింది. సాధారణంగా ఉండే నవ్వులు, కేకలు లేవు. అత్తగారు వంటింట్లో ఉన్నా పెనం మీద అట్లు పడలేదు.


“ఇంత త్వరగా లేవాలా నాయనా?” అని అత్తగారు అడిగింది, కళ్ళు తుడుచుకుంటూ. “ఏమి చేయాలి అత్తయ్య… బస్సు మిస్ అయితే మళ్లీ ఇంకో రోజు ఆగిపోవాలి,” అన్నాడు అచ్యుతరావు.


పిల్లలు అరుగుల దగ్గర గుంపుగా నిలబడ్డారు. “బావా… ఈసారి నిజంగా వస్తావా?” “వస్తాను రా… నేను చెప్పింది ఎప్పుడైనా మాట తప్పానా?” “అయితే మా కోసం బ్యాట్ తీసుకురావాలి.” “తప్పకుండా. ఈసారి నిజమైన లెదర్ బాల్ కూడా,” అని నవ్వాడు.


బావమరిది మెల్లగా అడిగాడు, “బావ… మళ్లీ ఇలాగే ఉంటుందా మన వేసవి?”


అచ్యుతరావు క్షణం మౌనంగా ఉండి, “ఇలాగే ఉంటుంది రా… మనం ఉన్నంతకాలం,” అన్నాడు.


బస్సు వచ్చే సమయం దగ్గర పడింది 


అత్తగారు చివరగా దగ్గరకు వచ్చి, “నాయనా… నువ్వు అల్లుడు లా అనిపించవు మాకు ఇంటికి పెద్ద కొడుకులా బాధ్యతలన్నీ తీర్చావు,” అంది కన్నీళ్లు పెట్టుకుంటూ


అచ్యుతరావు కాళ్లకు నమస్కరించి, “మీ ఆశీర్వాదమే అత్తయ్య… అదే నాకు బలం,” అన్నాడు.


బస్సు కదిలింది. పిల్లలు పరిగెత్తుకుంటూ వెనకపడ్డారు. “బావా… చేతులు ఊపు!”


అచ్యుతరావు చిరునవ్వుతో చేతులు ఊపాడు. కళ్ళు మాత్రం చెప్పలేని మాటలు చెప్పాయి.


బస్సు మలుపు తిరిగిన తర్వాత కూడా ఆ ఇల్లు కొద్దిసేపు అలా నిలబడిపోయింది.


అచ్యుతరావుకి తెలుసు—ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ వేసవి… మళ్లీ వచ్చే ఏడాది వరకూ జ్ఞాపకాలుగానే మిగిలిపోతాయని.


కానీ ప్రతి వేసవికీ ఒకే నమ్మకం— “అల్లుడు మళ్లీ వస్తాడు.”


ఆ నమ్మకంతోనే ఆ ఇల్లు, ఆ పిల్లలు, మరో వేసవి కోసం ఎదురుచూస్తూ ఉండేవారు.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం