నా కోసం రెండు అడుగులు


ఒరేయ్ ప్రసాదు… అమలాపురానికి బస్సు రిజర్వేషన్ చేయించు. ఇప్పటినుంచి చేయించుకోపోతే టికెట్లు దొరకవు. ఆఖరి సమయంలో వేలకు వేలు పోసి కొనుక్కోవాలి… అన్నాడు రామారావు ఉదయం లేస్తూనే.


“ఇంకా నెలరోజులు టైం ఉంది కదా నాన్న! అయినా అందరం ఇక్కడే ఉన్నాం. పండగ ఇక్కడే చేసుకుందాం,” అన్నాడు ప్రసాద్.


“లేదురా… పండగ అంటే మన ఊర్లోనే. ఆ సందడే వేరు,” అంటూ, “నేను అలా బజారుకు వెళ్లి వస్తాను,” అని చెప్పి బయలుదేరాడు రామారావు.


“ఇంత పొద్దున్నే షాపులు తీయరు నాన్న,” అంటూ, “అయినా ఇప్పుడు బజారుకెందుకు?” అని అడిగాడు ప్రసాదు.


“నేను పండగ బట్టలు కొనుక్కోవాలి రా. లేదంటే నా బట్టలు కుట్టి ఇవ్వరు,” అన్నాడు రామారావు.


“అదేమిటండీ! ఇంట్లో పిల్లలకి ఎవరికి ముందుగానే బట్టలు కొనలేదు. మీరు మాత్రం ఇలా కంగారు పడిపోతున్నారు,” అన్న భార్య సుమతి మాటలకు నవ్వుతూ, రామారావు బజారుకి వెళ్లి తిరిగి వచ్చి కొనుక్కున్న గుడ్డ ముక్కలని అందరికీ ఆనందంగా చూపించాడు.


“ఇదేమిటండీ ఈ బట్టలు! అరవై ఏళ్లు దాటిన తర్వాత ఈ పువ్వుల చొక్కాలు ఏం బాగుంటాయి మీకు? ఊరంతా నవ్వుతారు, ఇవి వేసుకుంటే,” అంది సుమతి.ఆ మాటలకు సమాధానం చెప్పకుండా రామారావు టైలర్ దగ్గరికి వెళ్లిపోయాడు.


రామారావు కోనసీమలోని ఒక పల్లెటూర్లో టీచరుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత చాలాకాలం ఆ ఊర్లోనే ఉన్నాడు. ఇటీవల ఆరోగ్యం సహకరించక భాగ్యనగర్‌లోని కొడుకు ఇంటికి చేరాడు. అయినా పండగలకి, పబ్బాలకి తప్పనిసరిగా కొడుకు కుటుంబంతో సహా సొంత ఊరికి వెళ్లి అక్కడే గడిపి వచ్చేవాడు.

తండ్రి అప్పగించిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఎంతో పొదుపుగా జీవితాన్ని గడిపిన వ్యక్తి రామారావు. ఎప్పుడూ పండగకి బట్టలు కొనుక్కోమంటే, “నాకెందుకు కొత్త బట్టలు?” అంటూ సర్వీస్‌లో ఉన్నంతకాలం ఇష్టం చూపేవాడు కాదు. జీవితాన్ని అనుభవించవలసిన సమయంలో సాదాసీదాగా గడిపిన వ్యక్తిలో ఇప్పుడు ఇంత మార్పు ఎందుకు వచ్చిందో అనుకుంది సుమతి.


చిన్నపిల్లల్లాగా ఉబలాటపడుతూ మూడు పండుగలకి మూడు జతల బట్టలు కుట్టించుకుని, పిల్లల్ని వెంట తీసుకుని సొంత ఊరికి వెళ్లాడు. బట్టలతోనే ఆగకుండా తలకు రంగు వేయించుకుని, కుర్రాడిలా కనిపించడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇవన్నీ చూసి సుమతి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంది.


భోగి పండుగనాడు ఉదయం లేచి, అందరికంటే ముందుగా తలంటు పోసుకుని, చిన్నపిల్లలతో పోటీపడి భోగి దండలు మంటలో వేసి, ఎగిసిపడుతున్న మంటలను చూసి చప్పట్లు కొట్టి గంతులేశాడు.


ఎప్పుడూ ఆరోగ్య సూత్రాలు వల్లించే రామారావు, పండగనాడు పదార్థాలు మారు అడుగుతూ తృప్తిగా భోజనం చేయడం చూసి సుమతి ఆశ్చర్యపోయింది.


మరునాడు మధ్యాహ్నం రామారావు సుమతి దగ్గరకు వచ్చి, “బయటికి వెళ్దాం… తయారవు,” అన్నాడు.

“ఎక్కడికి కండి? నాకు ఇంట్లో బోల్డంత పని ఉంది,” అంది సుమతి.

“పని ఉంటే కోడలు చూసుకుంటుందిలే. మనం బయటికి వెళ్దాం,” అన్న రామారావు మాటలకు, జీవితంలో ఇద్దరూ కలిసి బయటికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువగా గుర్తొచ్చాయి సుమతికి. ఏదైనా ప్రత్యేకమైన పని అనుకుని అతనితో బయలుదేరింది.

రామారావు నేరుగా బండిని సినిమా హాలు ముందు ఆపి, టికెట్లు తీసుకుని లోపలకు వెళ్లాడు. చిన్నపిల్లాడిలా సినిమాలోని డైలాగులకు చప్పట్లు కొట్టాడు.


అలా ఊర్లో ఉన్న వారిని పలకరిస్తూ, నవ్వుతూ, ఆనందంగా ఆ పండగ మూడు రోజులు హాయిగా గడిపేశాడు రామారావు.

ఇంట్లో ఉన్నవాళ్లకు రామారావులోని ఈ విపరీత మార్పు నచ్చలేదనుకుంటా, చెప్పడానికి ధైర్యం చాలక మౌనంగా ఉండిపోయారు. కానీ మనసుకి అత్యంత సన్నిహితురాలైన భార్య సుమతి ఒకరోజు రాత్రి ఉండబట్టలేక అడిగింది.


“ఏంటండీ మీలోని ఈ మార్పు? మీకు ఆనందం కలిగిస్తుంది గానీ, చూసేవాళ్లకి కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఎప్పుడూ మీరు ఇలా లేరు. ఎంతో గౌరవంగా, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ కాలక్షేపం చేశారు ఇన్నాళ్లు. మరి ఇప్పుడు ఏమైంది?”


సుమతి మాటలకు కోపగించుకోకుండా రామారావు అన్నాడు.

“చూడు సుమతి… ఇన్నాళ్లు నేను నా కోసం బతకలేదు. కుటుంబం కోసం బతికాను. అమ్మ చనిపోయిన తర్వాత కుటుంబానికి పెద్దవాడినై నాన్న బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.


 చెల్లెళ్లు చిన్నవాళ్లు. వాళ్ల చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు, పుణ్యాలు, పండగలు—అన్నీ నా చేతుల మీదుగానే జరిగాయి.

ఆ తర్వాత నా పెళ్లి, కుటుంబ బాధ్యతలు… ఇవన్నీ నేను జీవితాన్ని అనుభవించవలసిన సమయంలో నన్ను వెనక్కి లాగేశాయి. నా గురించి ఆలోచించుకోవడానికి ఎప్పుడూ సమయం దొరకలేదు. ఒకవేళ ఆలోచించినా, ఏదో ఒక బాధ్యత నన్ను భయపెట్టేది.


ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. జీవితంలో రకరకాల దశల్లో అనుభవించవలసిన ఆనందాన్ని ఇప్పుడు అనుభవించాలని నిర్ణయించుకున్నాను. మిగిలిన జీవితం మన చేతుల్లో లేదు. ఉన్న జీవితాన్ని ఇలాగే గడుపుతాను. తీరని కోరికలను తీర్చుకుంటాను.


మన తరం మన గురించి బతికేది కాదు. బాధ్యతలు వదిలేసి తిరుగుతున్నాడని ఎవరైనా అనుకుంటారని భయపడేదాన్ని. అప్పట్లో బాధ్యతలు మోసే మనకి మన జీవితం, మన పరిస్థితులు, మన సంపాదన—మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదు.


సీనియర్ సిటిజన్ అంటే ఇలాగే ఉండాలనేది ఎక్కడైనా ఉందా? మనకూ కోరికలు ఉంటాయి కదా! అలాగే నన్ను నమ్ముకుని వచ్చిన నీ కోరికలు కూడా తీర్చలేకపోయాను…”

అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


“…అలాగే నన్ను నమ్ముకుని వచ్చిన నీ జీవితానికి నేను ఇప్పుడు న్యాయం చేయాలనుకున్నాను సుమతి,” అని మెల్లగా అన్నాడు.

“ఇన్నాళ్లు అందరి కోసమే నడిచాను. ఇప్పుడు రెండు అడుగులు నా కోసం వేస్తే తప్పేంటి? నవ్వొస్తే నవ్వుకోనివ్వు. పిల్లల్లా ఆనందపడితే పడనివ్వు. ఈ వయసులో కూడా గుండెల్లో చిన్న కోరిక మిగిలి ఉంటే దాన్ని చంపేయాలా?”


సుమతి మాటలేమీ మాట్లాడలేకపోయింది. కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ బాధ్యతలతోనే కనిపించిన భర్త, ఈ రోజు తన మనసు తెరిచి చెప్పుకుంటుంటే కొత్తగా కనిపించాడు.


“తప్పు లేదు అండీ… మీ ఆనందమే నాకు కావాలి. కానీ కొంచెం భయమేసింది. అంతే,” అని నిదానంగా అంది.

రామారావు నవ్వాడు. ఆ నవ్వులో పిల్లాడి అమాయకత్వం ఉంది.

“భయం ఉండటం సహజమే సుమతి. కానీ భయంతోనే జీవితం గడిపేస్తే, చివరికి మిగిలేది అలసటే.”

ఆ రాత్రి సుమతి చాలా సేపు నిద్రపోలేదు. రామారావు పక్కనే నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఏదో తృప్తి. బాధ్యతల భారాన్ని కాస్త దించుకున్న మనిషి ముఖం అలా ఉంటుందేమో అనుకుంది.


మరుసటి రోజు ఉదయం మళ్లీ చురుకుగా లేచాడు రామారావు.

“ఏమిటండీ… ఇవాళ ఎక్కడికి?” అని అడిగింది సుమతి.

“పక్క ఊర్లో జాతర అట. వెళ్లి చూసి వస్తాను,” అన్నాడు చిరునవ్వుతో.

సుమతి ఈసారి ఏమీ అనలేదు. వంటింట్లోకి వెళ్లి అతనికి ఇష్టమైన కాఫీ పెట్టింది.

“వచ్చేటప్పుడు మీకు నచ్చిన చొక్కా ఇంకోటి తెచ్చుకోండి” అంది.

రామారావు ఆశ్చర్యంగా చూసి నవ్వాడు.


ఆ నవ్వులో ఒక కొత్త జీవితం మొదలైన శబ్దం వినిపించింది.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 

కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మాతృత్వం ప్రతి హృదయానికి వెలుగు

సామర్లకోట

కుటుంబం