నిశ్శబ్దమైన ప్రేమ
నిశ్శబ్దమైన ప్రేమ ఏ జన్మలో ని రుణానుబంధమో ఆ స్థావరంలో నాకు ఇంత చోటు కల్పించింది . ఆ స్థావరం నా ఉనికికి ఆధారమైంది. ఆ దుర్భేద్యమైన కోట చుట్టూ తిరుగుతూ చిమ్మ చీకటిలో గర్భస్థ నరకాలన్ని అనుభవిస్తూ ఎవరో తెలియని దాత అందించిన అమృతాన్ని చప్పరిస్తూ, ఎవరో అజ్ఞాత దాత ప్రసాదించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నెలకొకటి చొప్పున స్వీకరిస్తూ అలుపెరుగని సైనికుడి లాగా నిత్య సమరం చేస్తుంటే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు నీ లోకం వేరు అంటూ మాయాలోకం నుండి మన లోకంలోకి తీసుకొచ్చి పడేసి ఇదిగో నా రూపం అంటూ దేవుడు నన్ను చూపించి ఆనందపరిచాడు మా బంధువుల్ని, స్నేహితులని. నేను కడుపులో పడినప్పుడు నేను ఒక రకంగాను అమ్మ ఒక రకంగానూ బాధ అనుభవించి నరకాలన్నీ చూసాము. నవనాడులు బిగబట్టి పురిటి నొప్పులు భరించి ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ లోకంలోకి నన్ను తీసుకురావడం అమ్మకి నరకమే. అలా భూమి మీద పడ్డ నాకు ఇన్నాళ్లు అమృతo అందించిన అన్నపూర్ణ నాకు అమ్మ అయింది. అమ్మ నుంచి వచ్చినవే నాకు బంధుత్వాలన్నీ. నాకు తొలి బంధువు అమ్మ. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో పెరిగిన నేను అమ్మ ఒకరినొకరు చూసుకోలేదు. నా రూపం తెలియదు నా రంగు తెలియదు...