కాలమా నీకు జోహార్లు
కాలమా నీకు జోహార్లు
ఏ సమస్య లేకుండా సాఫీగా నడిచిపోతే జీవితం ఎందుకు అవుతుంది? జీవితమంటే సమస్యల పోరాటం. తెల్లారి లేస్తే ఏదో ఒక సమస్య. ఒక సమస్య సాఫీగా తీరిపోయిందనుకుంటే
మళ్లీ ఏదో ఒకటి . ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు. ఆ మార్పు మంచిదైతే చెప్పుకోవడానికి ఏముంది. చెడు జరిగింది కాబట్టే ఈ కథ
లంకంత కొంప ,నాలుగు తరాలకు సరిపడే డబ్బు ,భర్త పిల్లల డాక్టర్ , కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో స్థిరపడిపోయిన అమ్మాయి రమ , భాగ్యనగరంలో సొంత ఫ్లాట్ లో భార్యతో కాపురం ఉంటున్న కొడుకు అర్జున్. చేతిలో మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్లు సంగీత శాస్త్రంలో ప్రావీణ్యమే కాక పాక శాస్త్రం లో ప్రావీణ్యం. పేరులక్ష్మి రూపం మహాలక్ష్మి డాక్టర్ రామ శాస్త్రి గారికి ఇంటి ఇల్లాలు.మరి ఇంతకీ సమస్య ఏమిటి ?మూడు సంవత్సరాలుగా అనారోగ్యంగా ఉన్న డాక్టర్ రామశాస్త్రి గారు అకస్మాత్తుగా కన్నుమూశారు. ఈ హఠాత్పరిణామానికి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు.
పది రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఇంటి నిండా జనం ఉంటే
కొంత ధైర్యం ఉండేది. పిల్లలు సెలవు లేదంటూ ఎవరు ప్రదేశాలకు వాళ్ళు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లంకoత కొంపలో ఒంటరిగా జీవించడం ఎలాగా. ఇక్కడ సర్దుబాటు చేసుకోవాల్సిన ఆస్తి వ్యవహారాలు ఎన్నో.
అప్పటివరకు ఆ పట్టణంలో ఒక మంచి పిల్లల ఆసుపత్రి గా పేరు సంపాదించిన ఆ క్లినిక్ ఏమి చేయాలి ఇలాంటి సమస్యలతోటి సతమతం అయిపోతోంది ఆ ఇంటి మహాలక్ష్మి.
ఒకప్పుడు ఎలా ఉండేది ? డాక్టర్ రామశాస్త్రి గారిది లక్ష్మి గారిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. శాస్త్రి గారి ఎంత అర్ధరాత్రి వచ్చినా అంతవరకు భోజనం చేయకుండా కూర్చునే వారు లక్ష్మి గారు.డాక్టర్ కదా వీళ్ళకి టైం అంటూ ఉండదు.
ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పెళ్లయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు గవర్నమెంట్ వారి సర్వీస్ చేయకుండా ప్రైవేట్ ప్రాక్టీస్ తోటే మంచి పిల్లల డాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు డాక్టర్ రామశాస్త్రి గారు. డబ్బు కోసం ఎవరిని పీడించేవాడు కాదు . మంచి మర్యాద పాపం పుణ్యం తెలుసున్న వ్యక్తి. దూర ప్రదేశాల నుండి ఎవరైనా బంధువులు వైద్యానికి వస్తే తమ ఇంట్లోనే బస ఏర్పాటు చేసి రోగం తగ్గేవరకు ఉంచుకునేవారు.
కేవలం బంధువులతోటే కాకుండా ఇతర నర్సింగ్ హోమ్ లో పనిచేసే డాక్టర్లు అందరితోటి మంచి సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఆదివారం క్లినిక్ సెలవు కాబట్టి ఎవరో ఒకరు డాక్టర్లు సాయంకాలం పూట రామశాస్త్రి గారి ఇంటికి వచ్చేవారు. డాక్టర్ శాస్త్రి గారికి భార్య అంటే చాలా అభిమానం. పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. ఇంటి నిండా నౌకర్లు వంట మనిషి ఎప్పుడూ ఉండేవారు.
ఎంత డాక్టర్ వృత్తిలో ఉన్న కర్మను ఎవరూ తప్పించలేరు. ఉన్నట్టుండి ఒక రోజు తీవ్రమైన జ్వరం వచ్చి రెండు కాళ్ళు పడిపోయాయి.పాపం అప్పటినుంచి ఆయన వీల్ చైర్లో ఉండి వైద్యం చేసేవాడు. అలా ఒకరోజు గుండెపోటు వచ్చి శాస్త్రి గారు కాలం చేశారు.
పిల్లలు ఇద్దరు అమ్మ గొడవ పట్టించుకోలేదు. కనీసం తనతో పాటు తీసుకెళ్తానని కూడా అనలేదు. రామ శాస్త్రి గారి కొడుకు అర్జున్ భార్య ఎవరితోటి కలవదు. అత్తగారు అంటే అసలు ఇష్టం లేదు. అందుకనే పాపం కొడుకు తీసుకెళ్దాం అనుకున్నా రోజు ఎక్కడ గొడవలు అవుతాయని మౌనంగా ఉండిపోయాడు.
పోనీ కూతురుతో పాటు వెళ్తే మంచి ఆలోచన వచ్చింది లక్ష్మి గారికి. అదే విషయం కూతురిని సిగ్గు విడిచి అడిగింది. కూతురు అత్తమామలు కూడా అమెరికాలోనే ఉంటారు.
కానీ ఇప్పుడు అమ్మని తీసుకెడితే అక్కడ అత్తమామలు ఏమంటారుఏమోఇప్పటికేవాళ్లుఅయిందానికికానిదానికిమాటలతోహింసిస్తున్నారు అని ఆలోచిస్తోంది రమ .రమ పుట్టింటి వాళ్ళు అంటే వాళ్లకు అసలు ఇష్టం లేదు. కానీ అమ్మకు ఈ విషయం చెప్పడం ఎలాగా అని బాధపడుతో oది. అమ్మకి వెంటనే నో అని చెప్పడం ఇష్టం లేక నేను మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్తానమ్మ అంటూ మాట దాటేసింది. పరిస్థితి కొంతవరకు అర్థమైంది లక్ష్మీ గారికి.చేసేదిలేక ఆ ఊర్లోనే ఉండిపోయింది లక్ష్మి గారు.
పిల్లలంతా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లంతా ఖాళీ. తెలిసిన స్నేహితులు చాలామంది అప్పుడు రాలేకపోయిన వాళ్ళు పరామర్శ చేసి వెళ్తున్నారు. మళ్లీ కదంతా మామూలే. చేద్దాం అంటే పని ఏమీ లేదు. టీవీ చూద్దామంటే మనసు నిలవడం లేదు. ఎప్పుడు రామశాస్త్రి గారు ఆలోచనలే లక్ష్మి గారికి. పిల్లలు రోజుకు ఒకసారి ఫోన్ చేస్తున్నారు. కుశల ప్రశ్నలు అడిగి మళ్లీ రేపు చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తారు. ఎవరి బిజీ వాళ్ళది.
రామశాస్త్రి గారి కూతురు రమ అమెరికా వెళ్ళింది అనేమాట కానీ తల్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. ఒకవేళ అమెరికా తీసుకొచ్చిన ఆరు నెలల మించి ఉంచుకోవడానికి వీలు లేదు.
మళ్లీ ఆరు నెలల తర్వాత కథ మామూలే. ఇ న్నాళ్లు నాన్న ఉంటే తెలియలేదు. ఇప్పుడు అమ్మ సమస్యకి పరిష్కారం ఏమిటి. భర్తను సలహా అడిగితే అది మీ ఇంటి విషయం నేను ఎలా పరిష్కారం చెప్తాను అంటూ మాట దాటేసాడు. ఈ పెద్దమనిషి రామ శాస్త్రి గారు పోయినప్పుడు కనీసం చూడ్డానికి కూడా రాలేదు. అటువంటివాడు ఒకవేళ అమ్మను తీసుకుని వచ్చిన ఏమీ పట్టించుకోడు. భాగ్యనగర o లో ఉన్న తమ్ముడు అర్జున్ కి ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు.
పోనీ అమ్మకు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? అందరూ నవ్వుకుంటారు. మొహం మీద ఉమ్మేస్తారు. .అయినా తప్పదు ఈ వయసులో ఖచ్చితంగా అమ్మకి ఒక తోడు కావాలి. మనసులో బాధ పంచుకోవాలంటే ఇంకొక వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. అటువంటి వ్యక్తి ఎలా దొరుకుతాడు. దొరికితే మటుకు అమ్మ ఒప్పుకుంటుందా. రోజు ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటూ ఏడుస్తూ ఫోన్ చేస్తోంది. పోనీ ఈ విషయం చెప్తే. అటువంటి వ్యక్తిని ఎలాగా పట్టుకోవడం అంటూ ఆలోచించుకుంటూ రాత్రి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది.
ఇంతలో ఫోన్ రింగ్ అయింది. నేనమ్మా రమ ఇండియా నుంచి డాక్టర్ విజయకుమార్ ని మాట్లాడుతున్నాను. మీ అమ్మగారికి రెండు రోజుల నుంచి జ్వరం . పరీక్షలన్నీ చేయించాను. డెంగ్యూ ఫీవర్ అని తేలింది. హాస్పటల్లో అడ్మిషన్ చేస్తున్నాను. కంగారు పడాల్సిన పని ఏమీ లేదు అంటూ ఫోన్ పెట్టేసాడు.
డాక్టర్ విజయకుమార్ గారికి కూడా మూడు సంవత్సరాల క్రితమే భార్య పోయింది. అప్పటినుంచి ఒంటరిగా కాలక్షేపం చేస్తున్నాడు. డాక్టర్ రామ శాస్త్రి గారికి మంచి ప్రాణ స్నేహితుడు. తరచూ రామశాస్త్రి గారి ఇంటికి వచ్చి భోజనాలవి చేస్తుంటాడు. ఏ ఫంక్షన్ అయినా కచ్చితంగా అటెండ్ అవుతాడు. రామశాస్త్రి గారి డాక్టర్ అయినప్పటికీ ఫ్యామిలీ మెంబర్ లందరికీ వైద్యం చేసేది డాక్టర్ విజయకుమార్ గారే. ఆయన హస్తవాసి చాలా మంచిది.
లక్ష్మి గారినీ పది రోజులు హాస్పిటల్ లో ఉంచుకుని ఆరోగ్యం కుదురు పడిన తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు విజయ్ కుమార్ గారు.
ఇంత మంచి డాక్టర్ని పైగా రామ శాస్త్రి గారి ఫ్యామిలీ ఫ్రెండ్ అమ్మ గురించి బాగా తెలిసిన వ్యక్తినీ చేతిలో ఉంచుకుని వేరే వ్యక్తి గురించి వెతకడం ఎందుకు అనుకుని రమ లక్ష్మి గారికి ఫోన్ చేసి తన మనసులో ఉన్న మాట చెప్పింది. లక్ష్మీ గారు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుందాం అని చూశారుగాని కూతురు రమ మాత్రం గట్టిగా పట్టుబట్టింది. ఇందులో రమ స్వార్థం కూడా చాలా ఉంది. ఒకవేళ పెళ్లి చేయకపోతే అమ్మ ఒంటరిగా ఉండలేదు రెండోది తమ్ముడు దగ్గరికి వెళ్ళదు మూడోది అమెరికా వస్తే అత్తవారితో ప్రాబ్లం. ఒకసారి అమ్మ బాధ్యత ఒప్పుకుంటే జీవితాంతం చూడాలి ఇది రమ ఆలోచన.
రమ ఆలోచనకి అర్జున్ కూడా అంగీకారం తెలిపారు
రమ చెప్పిన మాటలు మొదట్లో తప్పుగా అనిపించినా లక్ష్మీ గారికి పిల్లల మనస్తత్వాలు అన్ని బాగా తెలుసున్న వ్యక్తి కాపట్టి పరిస్థితులు ఏవి ఆవిడకి తోడుగా నిలిచే సందర్భాలు లేక పైగా అవతల వ్యక్తి కూడా బాగా ఎరుగున్న వ్యక్తి. ఏ అలవాట్లు లేని వ్యక్తి. బాగా చదువుకున్నవాడు. అందగాడు. చాలా రోజులు ఆలోచించి వేరే దారి లేక పెళ్ళికి ఒప్పుకుంది.
పెళ్లి పెద్ద రమ డాక్టర్ విజయకుమార్ గారికి అన్ని విషయాలు వివరంగా చెప్పి పెళ్లికి ఒప్పించింది. మొదట్లో డాక్టర్ గారు విముఖత చూపిన ఆయన పరిస్థితి కూడా ఇంచుమించుగా లక్ష్మిగారి లాంటిదే. పిల్లలు ఇద్దరు అమెరికాలో ఎప్పుడో సెటిల్ అయిపోయా రు . ఇంటికి వెళ్తే పలకరించే నాధుడు లేడు. అయినా పాపం నౌకర్లని పెట్టుకుని అలాగే కాలక్షేపం చేస్తున్నాడు డాక్టర్ విజయకుమార్.
ఇలా ఆలోచన తోటి సంవత్సర కాలం గడిచింది. ఈలోగా వ్యవహారాలను చక్కబెట్టి లక్ష్మి గారు కూడా ఆ బాధల నుండి పూర్తిగా కాదుగాని కొంతవరకు ఉపశమనం పొందారు. ఉన్న ఆస్తిని మూడు భాగాలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. రమ బలవంతం మీద ఈ పెళ్లికి ఒప్పుకున్నారు కానీ ఎందుకో తప్పు చేస్తున్నావని భావన కలుగుతోంది. ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలంటే ఏదో కొత్త వ్యాపకం వెతుక్కోవాలి కానీ పెళ్లి ఒకటే పరిష్కారం కాదు అని ఈ మధ్య మాటిమాటికి అనిపిస్తోంది. రామ శాస్త్రి గారితో సుదీర్ఘమైన దాంపత్య జీవితం.
ఎప్పుడో తల్లిదండ్రులు కలిపిన బంధం. ఒకవేళ మనిషి చనిపోతే మటుకు ఆ బంధాన్ని మనసులో నుంచి ఎలా తుడిచి వేయాలి. ఆ జ్ఞాపకాలను ఎలా మర్చిపోవాలి ఒక్కసారి మూడవ వ్యక్తితో బంధం ఏర్పరచుకుంటే ఇంకా ఈ పిల్లలతోటి మనకి సంబంధం ఉండదు. ఇన్నేళ్లు పెంచి పెద్ద చేసిన పిల్లల్ని ఎలా మర్చిపోగలం. మళ్లీ కొత్త బాధ్యతలు కొత్త బంధాలు. కొత్తగా చేయి పట్టుకున్న వ్యక్తి ఎంతో కొంత తప్పకుండా ఆశిస్తాడు. అది ఏ రకమైన సంబంధమైనా కావచ్చు. ఒకవేళ శారీరక సంబంధం అయితే బాధ్యత ఒప్పుకున్న తర్వాత కాదనే హక్కు ఎక్కడుంటుంది.
పెళ్లి అనే బంధం కొన్ని అధికారాలు ఇస్తుంది. అవతల వ్యక్తికి ఉన్న రక్త సంబంధాలు అంత తేలికగా కొత్తమనిషితో సంబంధం బాంధవ్యాలు పెంచుకుంటారా లేదా అనేది ఒక కొత్త సమస్య. అలాగే అన్ని అనుకున్నట్లయితే తన కడుపున పుట్టిన పిల్లలు ఆ కొత్త వ్యక్తిని ఎలా ఆదరిస్తారు అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న అయినా ఈ వయసులో ఇన్ని అవసరమా అనుకుంటూ ఇల్లు ఫర్నిచర్ తో సహా అద్దెకి ఇచ్చేసి కావలసిన సామాన్లు సర్దుకుని ఎవరికీ చెప్ప పెట్టకుండా ఆ శరణాలయం లోకి అడుగుపెట్టింది. ఎన్నిసార్లు పిల్లలు ఫోను చేసిన తీయకపోవడంతో డాక్టర్ విజయ్ కుమార్ గారి ద్వారా విషయం తెలుసుకుని పిల్లలు పరుగు పరుగున ఆశ్రమానికి వచ్చినా వెనక్కి తిరిగి వెళ్లడానికి లక్ష్మి గారు ఒప్పుకోలేదు. పిల్లలు చేసేది లేక ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు.
ఒకప్పుడు సంఘంలో బాగా పేరు మోసిన డాక్టర్ గారి భార్య. ఇప్పుడు ఆశ్రమంలో అందరితో పాటే. కాల మహిమ. కాలానికి ఉన్న శక్తి దేనికి లేదు. ఎన్ని మార్పులు చేస్తుందో ఎన్ని మలుపులు తిప్పుతుందో ఎవరికి తెలుసు. అన్నింటినీ మౌనంగా భరించడమే మానవుడికి తెలుసు. కాలమా నీకు జోహార్లు.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి