అతిధి

అతిధి 

అతిధి రాగానే సాదరంగా ఆహ్వానిస్తాo
ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ల చెంబు అందిస్తాo

భుజం మీద తుండు అందిస్తాo
లోపలికి ఆహ్వానించి కుర్చీ వేపు చేయి చూపిస్తాo

నవ్వుతూ కుశల ప్రశ్నలు వేసి
కాఫీ గ్లాసు అందిస్తాo

పవర్ కట్ ను మరిపించేలా తాటాకు విసనకర్రతో విసురుతూ
మాటామంతి మంచి చెడ్డ
ఉభయకుశలోపరి.

మధ్యలో ఓ గ్లాసు మజ్జిగ.
మళ్లీ కబుర్ల ప్రవాహం
అనుబంధాల ప్రహసనం

బంధువులందరి వాకబు
స్నేహితుల గురించి సమాచారo

పిల్లల చదువు సంధ్య.
కష్టం సుఖం కన్నీళ్లు
ఇట్టే జరిగిపోతుంది కాలం

కాళ్ళు కడుక్కోండి వేళయింది అంటూ వంటింట్లోనుంచి ఆహ్వానం.
మడి కట్టు కోవడానికి ఎర్రటి పట్టు పంచ సిద్ధం

తాతల నాటి టేకు కర్ర పీట
పీట ఎదురు గుండా పరిచిన తోటలోని అరటి ఆకు

ఆకు పక్కనే మర చెంబుతో నీళ్ళు
వడ్డన ఆరంభం.

తాతలనాటి మామిడి చెట్టు కాయ
వేయించిన కందిపప్పు.
వెరసి పప్పు మామిడికాయ.

కోనసీమ కొబ్బరి పచ్చడి
అరటికాయ కూర
అరటి దూట పచ్చడి

కోనసీమ అరటిపండు
పంటి కింద గుమ్మడి వడియం.

తీపి ముక్కల పులుసు
మధ్యలో దుంప తగిలితే అదుర్స్

రుచికోసం కొత్తావకాయ లు
మారు అడిగితే మహదానందం.
కొసరి కొసరి వడ్డన.

గడ్డపెరుగు లోకి చెరుకు రసం మామిడి పండు.
ఆప్యాయతతో పెట్టిన భోజనం
అనుభూతి మిగిల్చే భోజనం

చెరగని జ్ఞాపకం లా అతిధి మర్యాద
మడి విప్పి వచ్చేసరికి
నడవలో పట్టెమంచం
కాస్తంత కునుకు తీయండి అంటూ ఆహ్వానం.

చల్లగా బయటనుంచి వచ్చే గాలి.
పట్టుపరుపులు అక్కర్లేదు 
చల్లదనం కోసం ఏ సి అక్కర్లేదు.
మది అంతా మధురమైన ఆలోచనలు.
మనసు ఎక్కడికో పారిపోయింది.

లేచే సరికి సాయంత్రం అయ్యింది.
ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చేసరికి
మళ్లీ మర్యాదల పర్వం ప్రారంభమైంది

ఎదురుగా టీపాయ్ మీద పొగలు కక్కే టీ
ప్లేట్లో కమ్మటి వాసన తో జంతికలు చేగోడీలు
పూతరేకులు కొబ్బరి ఉండలు.
రుచి చూడండి అంటూ మర్యాదలు

ఎక్కడ దొరుకుతాయి ఇటువంటి ఆప్యాయతలు ఆదరణలు
మా పల్లెటూర్లో తప్పితే.
మా మనసులు విశాలం
మాయా మర్మం లేని చంటి బిడ్డలం
చుట్టం వస్తే మొహాలు చూసుకోo
అతిథిదేవోభవ అనుకొని సాదరంగా ఆహ్వానిస్తాం.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
         కాకినాడ 
9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం