ఫోటోలు

ఫోటోలు

ప్రతి మనిషి యొక్క బాహ్య సౌందర్యo నిగ్గు తేల్చేది
 నిలువు టద్దం.అద్దం కేసి మనం చూస్తున్నంత సేపు మన ప్రతిబింబం కనబడుతుంది. మనం పక్కకు తప్పుకోగానే అద్దం తెల్ల మొహం వేస్తుంది. అద్దం దగ్గరికి మనం వెళ్ళినప్పుడే మన ప్రతిబింబం మనం చూసుకోగలం.

అలా కాకుండా మనం నిత్యజీవితంలోని ప్రతి చర్య శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఒక జ్ఞాపికల మిగిలిపోయేలా చేసేది ఛాయాచిత్రం. ఒక అందమైన పెట్టె కాంతిని మన మీద ప్రసరింపచేసి మన ప్రతిబింబాన్ని అందంగా తయారు చేసి మన చేతిలో పెడుతుంది. అదే ఫోటో. అద్దంలోని ప్రతిబింబం క్షణికమైనది. ఛాయాచిత్రం శాశ్వతమైనది.

తొలి రోజుల్లో ఫోటో తీయించుకోవడం అంటే ఫోటో స్టూడియో కి కంపల్సరిగా వెళ్ళవలసి వచ్చేది. ఒక అందమైన గది, పెద్ద స్టాండ్ తో కెమెరా ,నల్లటి రీలు ఇవి ఉంటే గాని ఆ ఫోటో రెండు మూడు రోజులు కాని బయటకు వచ్చేది కాదు . ఇప్పుడు రీలు పోయి కాంతితో నడిచే కెమెరాలు వచ్చేసాయి.ఇప్పుడు ఛాయా చిత్రకళ రంగంలో కూడా అత్యాధునిక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి వారి చేతుల్లోనూ మన ఇంట్లోనే బుల్లి కెమెరా ఉంటుంది.మాటలు రాని చంటిపిల్ల కూడా ఫోటోలు తీస్తానంటోంది. 

మన బుల్లి కెమెరా పాపం రోజు ఎన్ని సెల్ఫీలు తీస్తుందో. తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ఒక బాత్రూంలో తప్ప ప్రతి చోటా సెల్ఫీలే. ఇంక చంటి పిల్లలు ఉంటే చెప్పక్కర్లేదు.చంటి పిల్లలు పుట్టింది మొదలు ఫోటోలు సంగతి చెప్పక్కర్లేదు.ప్రయాణాల్లో బస్టాండ్లో రైల్వే స్టేషన్లో వాకింగ్లో ప్లే గ్రౌండ్లో స్కూల్లో వంటింట్లో సైక్లింగ్లో రైతు బజార్లో కిరాణా షాప్ లో బట్టల షాపులో బంగారం షాపులో ఒకటేమిటి ఫోటోలకి అర్థం లేకుండా పోయింది.
రోజు తినే టిఫిన్ కి మనం వండుకునే వంటిల్లుకి తొడుక్కునే బట్టలకి గోడ మీద బల్లులుకి మంచం మీద ఉన్న నల్లులికి వంటింట్లో తిరిగే బొద్దింకలకి కాఫీలో పడ్డ ఈగలకి బలం కోసం తాగే బాదంపాలకి అబ్బబ్బ అన్ని ఫోటోలే. వీడియోలు. కాదేది కవితకు అనర్హం అన్నట్లు అసలు ఇది ఫోటోతీయకూడదు ఇది తీయచ్చు అనే సంగతే మర్చిపోయాం. ఆఖరికి శవం దహనం చేస్తుంటే కూడా ఫోటోలు తీసేస్తున్నారండి. పిండాకూడును కూడా వదలడం లేదు.

అందమైన సన్నివేశాన్ని దాచుకోవడంలో తప్పులేదు.
 అయిందా నినీ కానిదానిని ఫోటోలో బంధించేయడం వాట్సాప్ లో పెట్టేయడం దానికి ఒక కామెంట్ విసిరేయడం. ఇది నేటి యువతకు మానసిక ఆనందం. . ఇది ఒక రకమైన వ్యసనం. అయితే ఈ వ్యసనం ఎంతగా మారిపోయింది అంటే ఫోటోలో అందంగా కనిపించడానికి మన శరీరంతో పాటు మన ఇంటిని కూడా అందంగా అలంకరించడo కూడా తప్పనిసరిగా చేస్తున్నారు.
 ఆ వేడుక జరిగే స్థలాన్ని అందంగా అలంకరించడం కూడా ఒక కళ. ఈ కళకి మరల ప్రత్యేకమైన నిపుణులు ఉన్నారు.
 ఇటీవల కాలంలో పెళ్లి ఖర్చులలో భారీ ఖర్చు. సినిమాలను తలపించేస్తున్నాయి ఆ కళ్యాణ మండపాలు. చాలా ఆశ్చర్యంగా ఉంది అంత నిపుణుత ఎలా సంపాదించారు మన వాళ్లు వారిని మనం కచ్చితంగా అభినందించాలి. వారి పనితనాన్ని మనం మెచ్చుకోవాలి. ఆ పెళ్లి జరిగిన మూడు గంటలసేపు మనం లి ఏదో లోకంలో ఉంటాం. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతాం. అంతవరకు మామూలుగా ఉన్న ఆ వేదిక ఒక్కసారిగా ఇంద్రలోకాన్ని మరిపిస్తుంది. ఎలా నేర్చుకున్నారో ఇంత పనితనం. నిజంగా వీరు అభినందనీయులు. 

అయితే ఈ పెళ్లి ఛాయాచిత్రాలలో ఆ వేదిక చాలా అందంగా కనబడుతుంది మనసుకి ఆనందానిస్తుంది. అందుకోసమే ఇన్ని లక్షల ఖర్చు పెడుతున్నారు. ఎంతసేపు చూస్తాం ఫోటోలు అనే విషయం పక్కన పెడితే తాత్కాలిక ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

పెళ్ళికొడుకు చేసిన దగ్గర నుంచి మొదలవుతుంది ఫోటోలు సందడి. వీడియోలు హడావుడి. పెళ్ళికొడుకు స్నానం చేయడానికి అందమైన ఇత్తడి గిన్నెలు అటక మీద నుంచి దింపి తోమి పువ్వులతో అలంకరించి అందమైన ప్రదేశం చూసి పువ్వుల మండపం కట్టి అతిథులంతా ఆ గిన్నెలతో పెళ్ళికొడుకు స్నానాలు. వేల ఫొటోస్ .సరదాలు తీరేవరకు పెళ్ళికొడుకుని నీళ్ళతో ముంచేస్తారు. ఏమి సరదాగా ఏమిటో. మర్నాడు పెళ్లి చన్నీటి స్నానం ఒళ్ళు బరువు చేసేస్తుంది. జలుబు చేసేస్తుంది. తట్టుకోలేకపోతే జ్వరం కూడా వస్తుంది. ఇవన్నీ వీడియోలు కోసమే. అంతరార్థం ఏమీ లేదు. ఇంత స్నానం చేసిన తర్వాత కూడా మళ్లీ వేడి నీళ్లతో తలంటు. చన్నీళ్లు వేడి నీళ్లు . పాపం పెళ్ళికొడుకు అ లిసిపోతాడు.

సరే ఆ మధ్య ఒక పెళ్లిలో ఒక ఆవిడ ఫోటోలో అందంగా కనిపించడం కోసం ఆడవారికి ఒకే రకమైన చీరలు మగవారికి ఒకే రకమైన బట్టలు కూడా కొన్నారు. ఇంక మన పెళ్లిలో ఆడవాళ్లు ఫోటోలు అందంగా కనిపించడం కోసం ఎక్కడి నుంచి పట్టుకొస్తారో వడ్డాణాలు ఆ కాసుల పేర్లు ఆ చెవి జుకాలుతళ తళ మెరిసిపోతుంటారు. డూప్లికేట్లతో. 
 అసలా ఆభరణాలను డూప్లికేట్లో కలిపి ఎక్కడ పడేస్తారో అని నా భయం. ఈమధ్య ఎవరు మొగుళ్లను బంగారం కొనమని వేధించడం లేదు. యూట్యూబ్లో మెరిసిపోయే వస్తువుల్ని చీరలు చూసి ముచ్చట పడిపోతున్నారు. ఇంకేముంది ఫ్లిప్కార్ట్ ఉంది కదా. కాష్ ఆన్ డెలివరీ వచ్చాక కట్టచ్చు లే అని ధీమా. రిటర్న్ ఫెసిలిటీ. తీరా సైజు సరిపోలేదనో కలర్ బాగోలేదని తిప్పి పంపేసి మళ్ళీ బుక్ చేసి నది పెళ్లిలోగా అందుతుందో లేదో అని బెంగ. 

ఇక మగవారిని ఎక్కడలేని అధునాతన దుస్తులు తెచ్చి కట్టుకోమంటారు. మనకు సౌకర్యంగా ఉండేవి మనకు సరిపడే బట్టలు మనం కట్టుకోవాలి. జుట్టుకు రంగేసుకుని బాన పొట్ట వేసుకొని ఎక్కడ లేని కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మన ఫోటో చూసి మనకే అసహ్యం వేస్తుంది. రంగులు వయస్సును వెక్కిరిస్తాయి. రెడీ అయ్యి కెమెరా క్లిక్ వినిపించగానే కెమెరాలో తొంగి తొంగి చూసి ఫోటో చూసి మురిసిపోతుంటారు. ఫోటోలు ఎప్పుడు వస్తాయని ప్రాణం తింటుంటారు.

ఇంకా చంటి పిల్లలకి ఎక్కడలేని పట్టు పరికిణీలు సిల్క్ లాల్చీ పైజామాలు ఆ పిల్లలు ఒకటే ఏడుపు ఆ బట్టలను తట్టుకోలేక. పిల్లలు ఏడిస్తే తల్లులు మూతులు ముడుచుకుని కూర్చుంటారు. ఇంత అలంకరణ చేసిన తర్వాత పసిపిల్లలు ఫోటోలు ఎటో చూస్తారు లేకపోతే నిద్రపోతారు.  

పూర్వకాలంలో పెళ్లిలో ఆ పెళ్లి జరిగినంత సేపు ఆ బ్రహ్మగారు చెప్పినట్లు మనo వినేవాళ్ళం. ఆ కొద్ది గంటలు ఆయనే మనకు రాజు. ఆ వేదికకి ఆయనే సామ్రాజ్యాధినేత. పెళ్లంటే మంత్ర ప్రమాణంగా చేసే శాస్త్రబద్ధమైన క్రియ. ఇద్దరు వ్యక్తుల జీవితానికి సంబంధించింది. ముహూర్త ప్రాధాన్యమైనది. ఆ శుభ సమయంలో కలిసిన మనసులు చూపులు శాశ్వతంగా ఉండిపోవాలని ప్రమాణాలు చేయిస్తారు. అన్నింటికీ అగ్నిదేవుడు సాక్షి. 

ఆ పరమ పవిత్రమైన సన్నివేశాన్ని శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఛాయాచిత్రo తీయించుకోవడం తప్పుకాదు.
ఈ రోజుల్లో బ్రహ్మగారి పక్కనే ఛాయా చిత్రగ్రాహకుడు పెళ్లి వేదిక నాక్రమించేస్తున్నాడు. ఇప్పుడే ఆయన మనకు మహారాజు. పెళ్లి మండపమే కాదు పెళ్ళికొడుకు చేసిన దగ్గర్నుంచి మన ఇల్లు కళ్యాణ మండపం పెళ్ళికొడుకు బంధువులు పెళ్లికూతురు బంధువులు అందరూ ఆయన కనుసన్నలలో మెలగాలి. చెప్పినట్లు నటించాలి. రాని నవ్వు తెచ్చుకోవాలి. రకరకాల అభినయాలు. ఎలాగోలాగా నటించేస్తాం ఆ కాస్త సేపు
సరే ముహూర్తం దగ్గర పడుతోంది బాబూ పెళ్ళికొడుకుని స్నాతకం దగ్గరికి తీసుకురండి అని బ్రహ్మగారు గోలపెడుతుంటే పెళ్లి వారిలో కదులు మెదులు ఉండదు. పెళ్లి కొడుకు తల్లి తయారవ్వలేదు అనో ఫోటోగ్రాఫర్ కి లైటింగ్ లేదనో కెమెరాకి చార్జింగ్ లేదనో పెళ్ళి వారు పెళ్లి నడక నడుస్తారు.
 పంతులుగారు చెప్పి చెప్పి ఆయన కూడా ఇంకా చేసేది లేక ఓడిపోయి మంత్రాలు కొన్ని దాటేస్తున్నారు. క్రియ జరిపించేస్తున్నారు. చెప్పవలసిన పెద్దలు కూడా ఫోటోల్లో పిచ్చెక్కిపోతుంటే దీని నడిపించే వాళ్ళు ఎవరు. ఇలాగే ప్రతి చోట శుభ ముహూర్తం సమయంలో రకరకాలు వెర్రిలు ముద్దు పెట్టుకోడాలు వేదిక మీద కౌగిలించుకోవడం కన్నీళ్లు కార్చడం ఈ వెర్రిలకు అర్థం ఉండట్లేదు. పంతులుగారు ఒక్క నిమిషం ఆగండి అంటూ శుభముహూర్తం సమయం దగ్గర పడుతున్న ఆ రకరకాల యాంగిల్ లో ఫోటోలు తీయడానికి ఈ ఫోటోగ్రాఫర్లు పంతులు గారిని చేతులు కట్టేస్తున్నారు.మూతులు నొక్కేస్తున్నారు. 
ఇంకా వీడియోలలో కనబడడం కోసం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చుట్టూరా ఆడ మగ పెళ్ళి వారు నిలబడి ఆహుతులు ఎవరికి సుముహూర్తం కనబడడoలేదు. ఈ బాధలు పడలేక కొంతమంది లైవ్ ఇచ్చేస్తున్నారు. ఇంకా మంగళసూత్ర ధారణ ఆ మంగళసూత్రం పట్టుకుని ఆ పెళ్లికూతురు అదోరకమైన నవ్వు నవ్వడం కన్నీళ్లు కార్చడం ఈ వెర్రి చేష్టలుఎక్కువైపోయాయి.. అవి ఆనందభాష్పాలు కూడా కార్చవలసిన సమయం కాదు. ఆ సమయంలో పెళ్లికూతురు అంటే ఒద్దికగా సిగ్గుపడుతూ ఉండాలి. సిగ్గు పెళ్లికూతురికి అందం. కన్నీళ్లు దేనికి. ఇవన్నీ సినిమా ప్రభావాలు. అంటే మనం నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము.

ఇక తలంబ్రాలు అంటే చెప్పక్కర్లేదు. ఫోటోలో వీడియోలో అందంగా కనబడడం కోసం చేసే తాపత్రయాలు ఒకటి కాదు. అకస్మాత్తుగా ఏదో పెద్ద శబ్దం. తెల్లని రేకులు గాల్లో ఎగురుతూ ఉంటాయి. పంతులు గారి మొహం నిండా అంటుకుంటాయి. పెళ్లికూతురు పెళ్ళికొడుకు తలలు మెరిసిపోతాయి. రకరకాల రంగుల్లో చిన్న చిన్న గోళీలు అవి కూడా తలంబ్రాలు బియ్యంలాగా నాట్యం చేస్తాయి. రంగుల కోసమే చూస్తున్నాం.
అసలు రంగులు తర్వాత బయటపడుతున్నాయి.

ఇంకా ఆ తర్వాత ఆడపిల్ల వారు మగ పెళ్లి వారు ఇంట్లో పని వాళ్ళ దగ్గర నుంచి దొడ్లో పనిచేసే వంట బ్రాహ్మల వరకు ఆ కొత్త జంట తోటి ఫోటోలే ఫోటోలు. అసలే పెళ్లి మేకప్ నిద్రలు ఉండవు
శ్రమ డబ్బు ఖర్చు రకరకాల ప్లానింగ్లు దానికి తోడు కెమెరా లైట్లు కళ్యాణ మండపం లైట్లు ఒంట్లో వేడి ఇంక పాపం ఆ దంపతుల సంగతి చెప్పక్కర్లేదు. కనబడిన వాళ్ల తో ఫోటోలు.
 ఇవి కాకుండా పెళ్లి ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ లు పెళ్లయిన తర్వాత వెడ్డింగ్ షూట్ లు. పెళ్లిలో పెళ్లి వారు సరదాగా మాట్లాడుకోవడం లేదు. భోజనాల దగ్గర చలోక్తులు లేవు. పాటలు లేవు పద్యాలు లేవు.డాన్సులు గంతులు పెళ్లి ఫోటోలు ఇవి తప్ప వేరే ఆనందం లేదు.ఇవి ఎక్కువైపోతున్నాయి ఈ మధ్యన. ఏది ఎక్కువగా చేసినా బాగుండదు. అతి మర్యాద అనర్ధదాయకo.

వీళ్ళ ఫొటో సరదా పాడుగాను. క్షణం క్షణం ఫోటోల మయo. ఆ వీడియోలలో వేదమంత్రాలు ఎక్కడ వినపడవు. ఎడిటింగ్లో మాయమైపోతాయి. పిచ్చిపిచ్చి పాటలు .ఏమిటోఅంతా తొందర గందరగోళం. గజిబిజి. ఫోటోలు తోటి వీడియోలు తోటే సరిపోతుంది. పెళ్లికి వచ్చిన వారిని పలకరించడం ఉండదు. భోజనాల క్యాటరింగ్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటున్నారు
వాడు ఏం పెడుతున్నాడు మనం ఏం తింటున్నామో. పెళ్లయిన తర్వాత అందరూ ఆరోగ్యాలు బాగుంటే అప్పుడు అనుకోవాలి.

ఏమిటో ఆధునిక పెళ్లిళ్లు భోజనాలు ఫోటోలు వీడియోలు అలంకరణలు దాండియాలు మనం కూడా ఉత్తరాదిలోకి వెళ్ళిపోతున్నాం. సరదాలు పేరు చెప్పి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు

దేనికైనా కొంత పరిమితి ఉండాలి. పరిమితి హద్దులు దాటిపోతోంది. హద్దులు దాటిన ఏ చర్యనైనా అడ్డుకోవాల్సింది ఎవరు. ఆ సంఘంలో నేను కూడా ఉన్నాను. అందుకే నా వంతు బాధ్యతగా మీకు తెలియని విషయం కాదు కానీ మళ్లీ గుర్తు చేశానంతే. ఈ గ్రూపులలో ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోకండి. ఫోటోలు తీసుకోవడం తప్పుకాదు. వివాహంలోని తంతులకు అడ్డం కారాదు. అవి యధావిధిగా అనుకున్న ముహూర్త సమయానికి జరిగిపోవాలి. లేకపోతే ముహూర్తం ఎందుకు. ఎప్పుడు మనందరం రెడీ అయ్యి మేకప్పులు చేసుకుని అందరం స్తిమితంగా కూర్చుంటామో అప్పుడే పెళ్లి చేసుకోవచ్చు. మీరు ఆలోచించండి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
         కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం