జ్ఞాపకాలు
ఊరంటే ఒక బడి, తపాలా కార్యాలయం, పంచాయతీ కార్యాలయం ముఖ్యంగా ఉంటాయి. గోడ మీద ఎర్ర డబ్బా తగిలించి ఉన్న కార్యాలయానికి ప్రతిరోజు ఏదో ఒక పని మీద వెళుతూనే ఉండేవాళ్ళం. క్షేమ సమాచారం పంపడానికి అదొక్కటే ఆధారం. ముఖ్యంగా అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రజా సేవలో మునిగి తేలిపోయేవాళ్ళు. ఒకరు పోస్ట్ మాస్టారు రెండవది పోస్ట్ మాన్ గారు.
"మాస్టారు, హైదరాబాద్ ట్రంకాల్ ఒకటి బుక్ చేయాలండి!" అని అడిగితే
"నెంబర్ చెప్పండి..." అని అనేవారు పోస్టుమాస్టారు.
ఆ మాటల్లో ఒద్దిక ఉండేది, ఆ స్వరం ఓ అధికారి మాదిరిగా ఉండేది కాదు.
ఒక ట్రంకాల్ కాల్ బుక్ చేస్తే...
పోస్టాఫీసు ముందు కుర్చీలు ఉండేవి, ఒక పట్టరాని ఆశతో కూర్చొని ఉండేవాళ్లం.
అరగంట...ఒక్క గంట... ఏ టైమ్ అన్నా వచ్చే గ్యారంటీ లేదు.
"లైన్ బిజీ", "కనెక్ట్ కాలేదు", "రిపీట్ చేయాలి"... ఇవన్నీ మామూలే.
కాల్ కలిస్తే – అదో గోల్డెన్ ఛాన్స్!
ఒకవేళ ముంబైలో ఉన్న అక్కతో మాట్లాడాలి అనుకుంటే,
"బాగున్నావా? పిల్లలు బాగున్నారా?" అన్న రెండు ప్రశ్నలకే కాల్ అయిపోతుండేది.
కాస్త ఎక్కువ మాట్లాడారంటే, "హలో! హలో! వినిపించట్లేదు!" అని మళ్లీ లైన్ కట్ అయిపోయేది.
ఎవరి కాల్ అయినా, ఇంట్లో అందరూ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయేవాళ్లం. ఎందుకంటే – ఓ మాట కూడా మిస్ అవ్వకూడదు.
అప్పట్లో ఫోన్ ఉండేది కొద్దిమంది ఇంట్లోనే.
అది కూడా ఓ విశేషమే! టేబుల్ మీద ఉండే డయల్ ఫోన్,
అది ఒక స్టేటస్!
ఇప్పుడేమైందో తెలుసా?
ఆ ఫోన్ టేబుల్ మీద నుంచి జేబులోకి వచ్చేసింది.
స్మార్ట్‌ఫోన్ అయింది.
వాయిస్ కాదు, వీడియో కాల్ వచ్చింది.
ట్రంకాల్ కాల్ కాదు, అంతర్జాతీయ కాల్ కూడా ఒక్క బటన్‌కే సిద్ధంగా ఉంది.
అదీ కాకుండా, అందులో కెమెరా ఉంది, గడియారం ఉంది, లెక్కపెట్టే ప్యాడ్ ఉంది –
ఆ రకంగా ఒక రకమైన అనుబంధం తంతి తపాలా కార్యాలయంతో తెగిపోయింది.
ఒకప్పుడు మనకు ముఖ్యమైన సమాచారం చేరాలంటే టెలిగ్రామ్ ఉండేది.
బోర్డు మీద "టెలిగ్రామ్" అనే పదం మెరుపులా కనిపించేది.
ఆ పసుపు రంగు కవరులో ఉన్న తెల్ల కాగితం… చదవకముందు చేతులు వణికేవి.
ఎందుకంటే, తక్షణ సమాచారమే అని చెప్పేవారు – కానీ అందులో ఎక్కువగా వుండేది మరణవార్తలే!
టెలిగ్రామ్ చదివే వరకూ గుండె ఆగినట్టే ఉండేది.
పోస్టుమాస్టారు, డెలివరీ బోయ్ – వాళ్ళ ముఖంలో ఎమోషన్ కనిపించేది.
టెలిగ్రామ్ తీసుకునే వారికి ఓ అనుభూతి – ఏదో ఒక గుండెచప్పుడు.
ఇప్పుడేమైందో?
టెలిగ్రామ్ కనుమరుగు అయిపోయింది
సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లోకి వచ్చి, మన చేతుల్ని మించిన వేగంతో పరిగెడుతోంది.
మనసు తేరుకునేలోపే సమాచారం చేతికి అందుతోంది.
అయితే – ఆ ట్రంకాల్ కాల్ ఎదురుచూపు,
టెలిగ్రామ్ తెరిచే ముందు గుండె ఊపిరి,
అవి మాత్రం ఇప్పుడు ఉండవు.
అవి మాత్రమే జీవనానుభవంగా మిగిలిపోయాయి.
ఓ తరం జీవితం... కొన్ని కాలాల టెలిఫోన్ బెల్స్ మధ్య తిరిగింది.
మరొక తరం... నిశ్శబ్ద నోటిఫికేషన్ల మధ్య పరిగెడుతోంది.
పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. కార్డు ముక్క రాసే వాళ్ళు లేరు. గ్రీటింగ్స్ పంపేవాళ్ళు లేరు. ఇంగ్లాండ్ కవర్ అంటే చాలామందికి తెలియదు. దాని అవసరం ఎవరికీ లేదు ఇప్పుడు. ప్రేమికుల ఉత్తరాలు చదివే పల్లెటూరి పోస్ట్ మాస్టర్ లేరు.
నెల మొదటి వారంలో పోస్ట్ మాన్ గారి గురించి ఎక్కువ ఎదురు చూసే వాళ్ళు ఉండేవారు. మూలన ఉన్న ముసలమ్మ జీవితం పోస్ట్ మెన్ తెచ్చే మనీ ఆర్డర్ తోటే గడిచేది. కాలం మారింది. అంతరిక్షంలో తిరిగే ఉపగ్రహాల పుణ్యమా అని ఈ భూమి మీద ఉండే గ్రహాలకి ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయం వచ్చింది. ఇంకేముంది పాతకాలం మనీ ఆర్డర్ కాలగర్భంలో కలిసిపోయింది.
ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ముఖ్యమైన ఉత్తరాలు మాత్రమే రిజిస్టర్ పోస్టు . రిజిస్టర్ పోస్ట్ వచ్చిందంటే ఏదో ముఖ్యమైన సమాచారం తెచ్చిందని ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. ఎకనాలెడ్జిమెంట్ కార్డు తో సహా వచ్చిందంటే అతి ముఖ్యమైంది అని అర్థం. దాని తర్వాత స్పీడ్ యుగానికి సరిపోయే విధంగా స్పీడ్ పోస్ట్ వచ్చింది. ఇవాళ పిడుగు లాంటి వార్త సెప్టెంబర్ ఒకటి నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ మరి ఉండదట
ఇప్పుడు కాలం స్పీడ్ పోస్ట్ కాలం కాదు. అది డిజిటల్ యుగం.
స్పీడ్ పోస్ట్ ని కూడా అధిగమించి
వాట్సప్ మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, ఓటీపీలు, నోటిఫికేషన్లూ,
గగనతలాల్లో తిరిగే శబ్ద రహిత సమాచార రేఖలదే
ఈ కాలం
కానీ... మన హృదయాల గది కోనల్లో ఇంకా మిగిలే వుంటుంది
ఆ తపాలా పెట్టె మీద ఎర్ర రంగు,
పోస్టుమాస్టారి ముసురైన చిరునవ్వు,
ట్రంకాల్ కాల్ కోసం ఎదురుచూసే ఆ కుర్చీ,
మనీ ఆర్డర్ తీసుకొని ఆనందంగా వెళ్తున్న ముసలమ్మ ముఖంలో కనిపించే హాయీ.
సాంకేతికత ఎంత ఎదిగినా,
ఒక ఊరి జీవన గమనంలో
తపాలా కార్యాలయం వేసిన ముద్ర – మాయ కాదు.
అది ఒక జ్ఞాపకం కాదు – అది మన కథలో ఓ అధ్యాయం.
ఇక రిజిస్టర్డ్ పోస్టూ, మనీ ఆర్డరూ, గ్రీటింగ్స్ కార్డులూ నిశ్శబ్దంగా నశించిపోతున్నాయంటే బాధపడేది ఒక తరం మాత్రమే.
ఎందుకంటే వాటితో తీయటి అనుభవాల రుచి తెలిసిన వాళ్ళం
మనమే కాబట్టి.
బాధపడడం ఎందుకు ఎన్నో మార్పులు వచ్చాయి మార్పు అభివృద్ధికి చిహ్నమని సరిపెట్టుకోవడమే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి