పూర్వాశ్రమ తల్లి
పూర్వాశ్రమ తల్లి
"ఏమండీ! మన కోడలు సీతమ్మ ప్రతిరోజు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటోంది. రెండు మూడు సార్లు పిలిస్తే గాని పలకటం లేదు. అలా వెర్రిదాని లాగా ఆలోచిస్తూ ఉండిపోతోంది. ఏమిటో దాన్ని చూస్తే భయంగా ఉంది," అంది కామాక్షమ్మ తన భర్త రామారావుతో కోడలు గురించి చెబుతూ.
"ఎలా ఉంటుంది చెట్టంత కొడుకు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకుడై పిల్లాపాపలతో సంతోషంగా ఉంటాడు అనుకున్నాం. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ఎంతమందికి వస్తుంది అంతటి అదృష్టం!
ఇంజనీరు కానీ డాక్టర్ కానీ చదివిద్దాం అనుకున్నాం, కానీ వాడు వేద విద్య నేర్చుకుంటానన్నాడు. సరే అన్నాము. వేద పండితుడై మనకు దగ్గరగా ఉంటాడు అనుకున్నాం.
కానీ దైవానుగ్రహం వేరే విధంగా ఉంది. హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థకి అధిపతిగా నిలబెడుతోంది. వచ్చే నెలలోనే సన్యాసాశ్రమ దీక్ష ప్రారంభానికి ముహూర్తం పెట్టారు. అదే సీతమ్మ దిగులు," అన్నాడు సీతమ్మ మావగారు రామారావు.
అనంతశర్మ తండ్రి చిన్నప్పుడే చనిపోతే, కోడల్ని మనవడిని తన దగ్గరే ఉంచుకుని చూస్తుంటాడు రామారావు.
ఇదంతా దూరం నుంచి వింటున్న సీతమ్మకి ఒక్కసారి గత సంవత్సరం జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది.
ఉన్నట్టుండి ఆ ఆధ్యాత్మిక సంస్థ నుండి వచ్చిన ఫోనుకి సంతోషపడాలో, దుఃఖపడాలో తెలియలేదు సీతమ్మకి.
“అనంతశర్మ ఏంటి అంత పెద్ద పీఠానికి అధిపతిగా సెలెక్ట్ చేయడం ఏమిటి? భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడే పెద్ద అధిపతిగా నియమించబడటం — కలా, నిజమా?” అనిపించింది.
దైవ నిర్ణయం — సరే. నవ మాసాలు మోసి కని, పెంచి, విద్యాబుద్ధులు చెప్పించి, ఒక ఇంటి వాడిని చేద్దాం అనుకుంటే, భారతదేశములో సనాతన ధర్మం నిలబట్టే, ధర్మం బోధించే ఒక మఠాధిపతిగా చేయడానికి మనసు ఎలా ఒప్పుతుంది?
ఉన్న ఒక బిడ్డని వదులుకోవడం అంటే మాటలా! అయినా మన ఇష్టమేముంది?
దానికి తోడు అనంతశర్మకీ కూడా ఇష్టమే కాబోలు. వెళ్ళనని బెట్టు చేయట్లేదు. సాధారణంగా వయసులో ఉండే పిల్లలు చెప్పే “అమ్మ మీద బెంగ” అనే మాటలు అనటం లేదు.
అంటే దైవం అందుకోసమే పుట్టించిందా వీడిని?
ఆ మాట విన్నప్పట్నుంచి అందరూ నన్ను అదృష్టవంతురాలు అంటున్నారు. ఏమిటో నా అదృష్టం — ఉన్న ఒక కొడుకుని సమాజానికి అంకితం చేయడమా!
---
ఎన్నో నోములు, వ్రతాలు చేస్తేనే పుట్టాడు వీడు. చిన్నప్పటినుంచి ఎంతో గారాబంగా పెంచాను.
ప్రాథమిక విద్య వరకు పాఠశాలకి ఎత్తుకుని తీసుకెళ్లి దింపి వచ్చాను. ఆ తర్వాత వైదిక విద్య.
ఉదయం సాయంకాలం గురువుగారి దగ్గర పాఠాలు చెప్పించుకుని తిరిగి వచ్చేంతవరకు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసేదాన్ని.
గుండు మీద చిన్న పిలక, ఒంటిమీద కప్పుకున్న కండువా, మొహం మీద విభూది, పిండి కట్లు, గోచి పోసి కట్టుకున్న పంచ — నోరు తిరగని అక్షరాలతో మంత్రాలు చదువుతుంటే బుల్లి వేద పండితుడిలాగా ముద్దొచ్చేవాడు.
మంత్రాలు సరిగా రావటం లేదని తిట్టొద్దు అని గురువుగారికి పదేపదే సార్లు చెప్పొచ్చాను. అన్నీ తెలిసిన గురువుగారు నా మాతృ ప్రేమ చూసి ముసిముసిగా నవ్వుకున్నారు.
వయసు పెరిగేకొద్దీ వేద విద్యలో చురుకుగా మారుతున్నాడు అనంతశర్మ అని చెప్పిన గురువుగారి మాటలకు ఉప్పొంగిపోయాను.
వేద విద్య పోటీ పరీక్షలు కని ఆ పెద్ద సంస్థకు తీసుకెళ్లినప్పుడు అనంతశర్మను చూసి అక్కడ ఉన్న పెద్దాయన ముచ్చట పడిపోయారు.
తల్లిదండ్రుల గురించి, అడ్రస్ గురించి అడిగి తెలుసుకున్నారు అని గురువుగారు చెప్పిన మాటలకి సీతమ్మ అప్పుడు పొంగిపోయింది.
కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసి వణికిపోయింది.
---
అంటే — వచ్చే నెల నుంచి అనంతశర్మకి నాకు సంబంధం ఏముంటుంది?
నన్ను ‘అమ్మ’ అని పిలవడు. సమాజంలో అందరూ అమ్మలే నాతో పాటుగా అనంతశర్మకి.
కొడుకుగా దగ్గర తీసుకోవడానికి లేదు. అసలు కొడుకు ఏమిటి — నేను పెట్టిన అనంతశర్మ పేరు మారిపోతుంది. వేషం మారిపోతుంది.
రేపటి నుంచి అనంతశర్మ ఒక సన్యాసి — కుటుంబం, బంధం, ధనం, రూపం, పేరు అన్నీ వదిలి బ్రహ్మంలో లీనమవుతాడు...
భారతదేశంలోని ప్రజలందరి లాగే నాకు కూడా అనంతశర్మ దైవ స్వరూపుడు — ధర్మాన్ని బోధించే వ్యక్తి మాత్రమే.
“మా అనంతుడు ఇక మఠాధిపతి అవుతాడు… సన్యాసి అవుతాడు… ఇక నన్ను అమ్మా అని పిలిచే వాడే ఉండడా?”
ఉదయాన్నే లేచి నా చిన్ని తండ్రి బాగోగులు చూసే అదృష్టం ఇక రాదుగా.
ఏ పండగొచ్చినా వాడితోటే నాకు ఆనందం. ఇక ముందు ఆనందాన్ని ఎవరు తోటి పంచుకోను.
చిన్నప్పుడు రకరకాల బట్టలు కట్టి మురిసిపోయేదాన్ని.
ఇప్పుడు మనసుకు నచ్చిన బట్టలు కట్టుకోవడానికి వాడికి వీల్లేదు పాపం.
పరుపు మీద పడుకున్న చలికి తట్టుకోలేకపోయేవాడు బిడ్డ — అలాంటిది ఇప్పుడు ప్రతిరోజు నేల మీద పడుకోవాలి.
చన్నీటి స్నానం చేయాలి. ఇవన్నీ ఎలా తట్టుకుంటాడు?
ఆకలికి తట్టుకోలేడు. ఇప్పుడు మనసుకు నచ్చిన ఆహార పదార్థాలు తినడానికి వీల్లేదు.
ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద బాధ్యత, త్యాగం.
ఇంత చిన్న వయసులో శాస్త్రం చెప్పిన పరిధిలో నడవాలి.
నాకున్నది ఒక్క కొడుకు — నా వంశానికి వాడే ఆధారం. పిల్లాపాపలతో సంతోషంగా చూసే అదృష్టం నాకు లేదు.
ఇకమీదట నేను చూసేది కేవలం సన్యాసి రూపం…
“పుత్రులనేవాళ్లు పున్నామ నరకం నుండి తప్పిస్తారని కదా మగ పిల్లలను కోరుకుంటారు అందరూ, మరి నాకు మగపిల్లాడి ఉండి నా గతి ఏమిటి? నా ఉత్తరక్రియలు?” — అంటూ మాట పూర్తి చేయకుండానే పెద్దగా రోదిస్తూ మంచం మీద వాలిపోయింది సీతమ్మ.
ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా సీతమ్మ గుండెల్లో ఎవరో పిడికిలి పెట్టినట్టుంది.
కళ్ళల్లో నీరు ఉబికి వస్తోంది. ఆకాశం వైపు చూసి —
“దేవుడా! నువ్వు ఎంత పెద్ద పరీక్ష వేసావు! బిడ్డను నాకివ్వడం నీ ఇష్టం, తీసుకోవడం నీ ఇష్టం, కానీ ఈ మధ్యలో ఉన్న తల్లి మనసుని ఎవరు అర్థం చేసుకుంటారు?” అంటూ మూగగా ఏడ్చింది.
ప్రపంచంలోని ఎవరు బాధలతోటి సంబంధం లేకుండా బాలభానుడు డ్యూటీలోకి వచ్చేసాడు ఆ మర్నాడు.
సూర్యోదయం పసిడి కాంతులతో ఆ పరిసరాల్ని ముంచెత్తుతోంది.
ఆ రోజు మఠం ముందర గాలిలో వేదఘోష, పూర్ణకుంభాలు, చందనపు సువాసనలు పరుచుకున్నాయి.
అన్ని వైపులా నారికేళ వృక్షాలు తలదించుకున్నట్టుగా ఆ వాతావరణం గంభీరంగా ఉంది.
అనంతశర్మ సన్యాసదీక్షకు ఏర్పాటైన యజ్ఞశాలలో పెద్ద పెద్ద పండితులు, మఠాధిపతులు కూర్చున్నారు.
ధ్వనించే శంఖనాదం, వేదమంత్రాల మధ్య సీతమ్మ సాదాసీదా తెల్ల చీర కట్టుకుని అక్కడికి వచ్చింది.
అడుగులు వేసే కొద్దీ గుండెల్లో గజగజలాడుతున్న ఆందోళన మరింత పెరిగింది.
అవిడ కళ్ల ముందు బల్లమీద కూర్చున్న తన బిడ్డ — ఇప్పుడు “శ్రీ ఆనందానంద స్వామి” — కనిపించాడు.
తల గుండు చేయించుకుని కాషాయ వస్త్రం ధరించాడు. మునుపటిలా ముద్దొచ్చే ఆ చిరునవ్వు లేదు; దానికంటే గంభీరమైన శాంతి.
గురువుల సమక్షంలో అగ్నిహోత్రం ముందు కూర్చున్నాడు.
సీతమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి.
“ఇదేనా నా అనంతశర్మ… నిన్నటి వరకు ‘అమ్మా’ అని పిలిచిన నా బిడ్డ, నేడు లోకం అంతటికీ తల్లి అయిన ధర్మమాత కొడుకు అయ్యాడు…” అని మనసులో అనుకుంది.
యజ్ఞము మధ్యలో ప్రధాన గురువు మంత్రం జపిస్తూ అన్నాడు —
“ఈ క్షణం నుండి, ఈ బాలుడు గృహ సంబంధాలను విడిచిపెట్టి సన్యాసాశ్రమం స్వీకరించుచున్నాడు. ఇతని తల్లి తండ్రులు ఈ శరీరానికి దాతలు; కాని ఇకపై ఇతడు సర్వజనానికీ ఆత్మదాత.”
ఆ మాట విన్న సీతమ్మ గుండెల్లో ఏదో చీలినట్టయింది.
కానీ వెంటనే ఆలోచించింది —
“దైవం ఈ పుణ్యకార్యం కోసం నన్ను ఎన్నుకుంది. తల్లి అవడం పుణ్యం, కాని త్యాగంతో కూడిన తల్లి అవడం అంతకన్నా గొప్ప పుణ్యం.”
వేదఘోషల నడుమ అనంతశర్మ గురువుల పాదాలు తాకి నమస్కరించాడు.
ఆ తరువాత తన తల్లిని ఒక క్షణం చూసాడు. అనంతశర్మను ఇంత దగ్గరగా చూడడం ఇదే ఆఖరిసారేమో.
ఇకముందు చూడాలంటే చుట్టూ ఎంతోమంది భక్తులు ఉంటారు. ప్రత్యేకమైన అనుమతి కూడా తీసుకోవాలి.
కానీ అమ్మగా తను ఏమీ మాట్లాడదు. కేవలం ఒక భక్తురాలుగా మాత్రమే మాట్లాడతాడు. బంధాలు, బంధుత్వాలు ఉండవు.
అని సీతమ్మ అనుకుని ఒక్కసారి ప్రేమగా చూసింది అనంతశర్మ వైపు — కాదు కాదు, శ్రీ శ్రీ ఆనందానంద స్వామి వైపు.అంతే గబగబా అడుగులు వేసుకుంటూ, మధ్య మధ్యలో వెనకకు తిరిగి చూస్తూ స్వామి తన వైపు ఏమైనా చూస్తున్నాడేమో అని ఆశగా చూసింది.
కానీ చుట్టూ పత్రికల వాళ్లు, టీవీ వాళ్లు, వచ్చిన అతిథులు తో బిజీగా ఉన్నాడు స్వామి.
“అవును, ఇప్పుడు ఆ ప్రపంచమే వేరు, నేను కూడా వేరు. నేనిప్పుడు పూర్వాశ్రమంలోని తల్లిని. ఇప్పుడు ఆయనది కొత్త జన్మ…” అనుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుని ముందుకు సాగుతోంది.
ఇది దేవుడిచ్చిన అవకాశం. మానవ మాత్రురాలుగా నేను కేవలం ఒక వేద పండితుడిగా మాత్రమే తీర్చిదిద్ద కలిగి ఉండేదని కానీ ప్రపంచానికి ధర్మాన్ని బోధించే ఒక మఠాధిపతిగా మారేడు అంటే కేవలం అది భగవత్ సంకల్పం. ఎంతమందికి వస్తుంది ఇలాంటి అదృష్టం అని మనసులో అనుకుని ముందుకు సాగుతోంది
“ఈ స్వామి పూర్వాశ్రమంలోని తల్లిదండ్రులు చాలా పుణ్యవంతులు, త్యాగమూర్తులు. వాళ్లు చేసిన త్యాగం నిజంగా కొనియాడ తగినది…” అంటూ ప్రస్తుత మఠాధిపతి చెబుతున్న ఉపన్యాసం చెవులకు వినబడుతుంటే ఇంకా దుఃఖం పెరిగిపోయింది సీతమ్మకి.
అలా ఏడుస్తున్న సీతమ్మను చూస్తూనే పత్రికల వాళ్ళు, టీవీ వాళ్ళు వెంట పడ్డారు.
“నా బిడ్డ పుట్టినప్పుడు నేను ఒకదానినే తల్లిని. ఇప్పుడు నా బిడ్డకి — కాదు కాదు, కాబోయే మఠాధిపతికి లోకంలో ఎంతోమంది తల్లులు. అన్నింటికన్నా పెద్ద తల్లికి నేను కన్న బిడ్డను అప్పజెప్పేసి వెళ్ళిపోతున్నాను. నాకు ఇప్పుడు దిగులు లేదు…” అంటూ ఏడుస్తూ సీతమ్మ కారు ఎక్కింది.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి