ఆవకాయ ముద్ద_ఒక బంధం
అమ్మా, నీకు ఏం తినాలి ఉందో చెప్పు! ఈ మూడు నెలలలో నీకు కావాల్సింది వండి పెడతాను. మళ్లీ పురుడు వస్తే ఐదు నెలల వరకు తినడం కుదరదు కదా… అని అడిగింది సీతమ్మ, పురిటికి పుట్టింటికి తీసుకువచ్చిన తన కూతురు భారతిని.
పెద్దాపురం చేంతాడు లాంటి కోరికల చిట్టా చెప్పింది భారతి. రోజుకో వెరైటీ—ఆ చిట్టాలో టిక్కు పెట్టుకుంటూ చేస్తూనే ఉంది సీతమ్మ.
అయితే ఆ కోరికల చిట్టాలో ఒక కోరిక పేరు చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది.
“ఇదేమి కోరికే తల్లి! వాడిని ఇప్పుడు ఎక్కడ తీసుకురాను నేను? వాడు ఉండేదేమో గోదావరి జిల్లా. మనం ఉండేది తెలంగాణ రాష్ట్రం. బావుంది నీకోసం పనిగట్టుకుని ఇక్కడికి రావాలా వాడు?” అంటూ నవ్వుతూ అడిగింది.
“ఏమో, నాకు తెలీదు. నాకు అది తినాలని ఉంది. అది రోజూ నేను తింటాను. కానీ ఆ చేతిముద్దలో ఏదో అమృతం ఉంది,” అంది భారతి.
ఇంతకీ ఆ కోరిక ఏమిటని ఆత్రంగా చిట్టా చూశాడు భారతి తండ్రి సుబ్బారావు. ఆ కోరిక పేరు చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు.
“మావయ్య చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద!”
“నేను నీకు ఆవకాయ అన్నంలో కలిపి నోట్లో పెడతాను,” అన్నాడు సుబ్బారావు.
“లేదు నాన్న. మావయ్య ఆవకాయ బాగా కలుపుతాడు. ఆ కలుపుతున్న విధానం చూస్తూనే నాకు నోరూరిపోతుంది,” అంది భారతి.
చిన్నప్పుడు వేసవి సెలవులకు వెళ్ళినప్పుడు మావయ్య ఆవకాయ ముద్దలు కలిపి ఎంతో ప్రేమగా పెట్టేవాడు మాకు అందరికీ. నా పెళ్లయిన తర్వాత వేసవికాలం అమ్మమ్మగారి ఊరు వెళ్లడం మానేశాం. కానీ అంతకు ముందు చిన్నతనంలో సెలవులు వస్తే అక్కడే ఉండేవాళ్ళం కదా.
ప్రతిరోజూ ఇదే పని మావయ్యకి—అని తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది భారతి.
తాతయ్య కోప్పడుతుండేవాడు.
“ప్రతిరోజూ ఆవకాయ ఏంటి రా! చిన్నపిల్లలకి వేడి చేస్తుంది,” అని.
తాతయ్యకు భయం ఎక్కువ. దానికి తోడు ఆయన వైద్యం చేసేవారు. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో ఎక్కడా రాజీ పడేవాడు కాదు.
అందులో అమ్మమ్మ చేతితో పెట్టిన ఆవకాయ—చెరువులోని కలవ పువ్వులాగా ఎర్రగా, నూనెలో తేలుతూ, మంచి సువాసనతో ఉండేది. తెల్లగా ఉన్న అన్నంలో ఎర్రగా ఉన్న ఆవకాయ వేసి, అసలే నూనెలో తేలుతూ ఉన్నదానికి మరికొంచెం పప్పు నూనె పోసి అలా కలుపుతూనే ఉండేవాడు మావయ్య.
కొంతసేపటికి ప్రతి అన్నపు మెతుకుకి ఆవకాయ బాగా పట్టేది. ప్రతి మెతుకు రుచిగానే ఉండేది.
పిల్లలందరినీ చుట్టూరా కూర్చోబెట్టుకుని, తలో ముద్ద ప్రేమతో పేరుపేరునా పిలుస్తూ పెట్టేవాడు. ఆ ముద్ద నములుతూ ఉంటే, అమ్మమ్మ చేతిలో అమృతం ఆవకాయ కుండలో పోసిందేమో అనుకునేవాళ్ళం.
ఆవకాయ అనగానే ఆంధ్రుల గుండెల్లో ఏదో తీపి జ్ఞాపకం మేల్కొంటుంది. అది కేవలం ఒక పచ్చడి కాదు; తరం తరం గా కొనసాగుతున్న రుచి, సంప్రదాయం, కుటుంబ బంధం. వేసవికాలం వచ్చిందంటే చాలు—మామిడికాయ వాసనతో పాటు ఆవకాయ మాటలు మొదలవుతాయి. పచ్చి మామిడికాయ, కారం, ఆవాలు, నూనె—ఈ నాలుగు పదార్థాలు కలిసి సృష్టించే అద్భుతమే ఆవకాయ.
ఆవకాయ తయారీ ఓ పండుగలా సాగుతుంది. ఇంటి ముంగిట్లో కూర్చొని మామిడికాయ ముక్కలు తరిగే అమ్మలు, ఆవాలు దంచే శబ్దం, ఎర్రగా మెరుస్తూ కారం—ఇవన్నీ కలసి ఒక సంబరమే. “నీరు తాకకూడదు”, “చెక్క చెంచానే వాడాలి” వంటి జాగ్రత్తలు ఈ పచ్చడికి ఉన్న గౌరవాన్ని చెప్పుతాయి. ఒక్క చిన్న తప్పు జరిగినా ఆవకాయ రుచి మారిపోతుంది; అందుకే ఇందులో ఓ శ్రద్ధ, ఓ భక్తి దాగి ఉంటుంది.
ఆవకాయ–ముద్ద అనేది ఆంధ్రుల తినే విధానానికి ప్రతీక. వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ, నువ్వుల నూనె చుక్కలు, పక్కన ఉల్లిపాయ ముక్క—ఇంతే చాలు. ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. పేదరికంలోనూ, పండుగలోనూ ఆవకాయకు ఒకే స్థానం. అది అన్నానికి రుచి మాత్రమే కాదు, తృప్తి కూడా.
ఆవకాయలో ఆరోగ్య పరమైన విలువ కూడా ఉంది. మామిడికాయలోని విటమిన్లు, ఆవాల్లోని జీర్ణశక్తి పెంపు, నూనెలోని శక్తి—ఇవి కలసి శరీరానికి బలం ఇస్తాయి. అందుకే పెద్దలు “కొంచెం ఆవకాయ మంచిదే” అంటారు. అయితే మితమే మేలు అన్న బుద్ధిని కూడా ఆవకాయ నేర్పుతుంది.
కాలం మారినా, ఫ్రిజ్‌లు వచ్చి పచ్చళ్ళు మార్కెట్‌లో దొరికినా, ఇంట్లో చేసిన ఆవకాయకు ఉన్న విలువ తగ్గలేదు. పట్టణాల్లో నివసించే వారు కూడా ఊరికి వెళ్లగానే ఒక బాటిల్ ఆవకాయ తీసుకురావడం పరిపాటి. అది రుచితో పాటు ఊరి వాసనను, అమ్మ చేతి స్పర్శను గుర్తు చేస్తుంది.
అందుకే ఆవకాయ ఒక పచ్చడి కాదు—అది ఆంధ్రుల సంస్కృతి, అనుబంధం, జ్ఞాపకాల గుళిక. ఒక చెంచా ఆవకాయ అన్నంలో కలిపితే చాలు… బాల్యం నుంచి ఇప్పటిదాకా ఉన్న జీవితమే కళ్లముందు నిలుస్తుంది.ఓ
ఆకులో పంచభక్ష పరమాన్నాలున్న ఆవకాయ ముద్ద రుచిని ఎలా మర్చిపోతాం?
ఇలా తన చిన్ననాటి సంగతులన్నీ గుర్తు చేసుకుంది భారతి.
“అమ్మో! దీనికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ రా! వాడి చేతి ముద్ద తింటే గాని పురుడు రాదేమో,” అనుకుంది సీతమ్మ.
అయినా సీమంతం ఇంక పది రోజులే ఉంది కదా. అప్పుడు తీరుస్తాడులే దీని కోరిక అని అనుకుంది. కానీ మనసులో ఒక భయం పట్టుకుపీడించింది.
మొన్ననే కదా యాక్సిడెంట్ అయ్యి తేరుకున్నాడు… రాగలడో లేడో సీమంతానికి?
అయినా దీని కోరిక గురించి వాడికి చెప్పకూడదు అనుకుంది. ఓపిక ఉన్నా లేకపోయినా బయలుదేరి వస్తాడు వాడు అని తెలుసు కాబట్టి.
కానీ సీమంతానికి పిలుస్తూ, మేనకోడలు కోరిక గురించి నవ్వుతూ చెప్పేసింది తన తమ్ముడికి సీతమ్మ.
మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు నోరు గుండె గదిలో దాచుకున్న కబుర్లన్నీ బయట పెడుతుంది.
ఆ కబురు విని, కాలు నొప్పిగా ఉన్నా భాగ్యనగరం వచ్చాడు. సీమంతం విందు భోజనం చేసి, భుక్తాయసం తీర్చుకుని, బయలుదేరడానికి సిద్ధమయ్యాడు హనుమంతు మావయ్య. అంతవరకు అసలు సంగతి ఎవరికీ గుర్తులేదు.
ఇంతలో—
“మావయ్య ఆవకాయ ముద్ద!” అని గట్టిగా అరిచింది భారతి.
అంతే! ఆ మాట విని యుద్ధంలో సైనికుడిలా బాధ్యతకు అంకితం అయిపోయాడు. హాల్లో బాసింపట్టు వేసుకుని కూర్చుని, యుద్ధ సామాగ్రి సమకూర్చుకుని యుద్ధం మొదలుపెట్టాడు.
అవును, నిజంగా అది యుద్ధమే.
ఎక్కువ తింటే కడుపులోకి వెళ్లి యుద్ధం చేస్తుంది. తక్కువ తింటే తృప్తి ఉండదు. అయినా దాన్ని పరిమితులు లేకుండా తింటూనే ఉంటారు జనం.
తీరని కోరిక తీరుతోందనే ఆనందంలో ఒక చెయ్యి ముందుకు వస్తే, మధ్యాహ్నం భారీగా విందు భోజనం చేసినా అందంగా కలిపిన ఆవకాయ అన్నం పళ్లెంలో చూసేసరికి నోరూరింది.
ఆకలి గుర్తొచ్చి—రక్తసంబంధీకులు కాదు, బంధువులు కూడా చేతులు ముందుకు చాపారు.
ఆఖరికి అరవై ఏళ్ల బావగారు కూడా ఆశగా ఆవకాయ పళ్లెం వైపు చూస్తే, తన చేతి ముద్ద రుచి చూపించాడు సదర హనుమంతు మావయ్య.
చిన్నప్పుడు పిల్లలు అన్నం తింటుంటే—
ఇది అమ్మ ముద్ద, నాన్న ముద్ద, మావయ్య ముద్ద
అని నామకరణం చేసి తినిపించేది అమ్మ.
అలా పెరిగి పెద్దయిన తర్వాత కూడా—
మామయ్య ముద్ద మీద… కాదు కాదు…
ఆవకాయ ముద్ద మీద ఆశ—చావని ఒక నిండు చూలాలు కోరిక అలా తీరింది.
చిన్నప్పుడు అన్నం ముద్దలు పేర్లు పెట్టుకుని తిన్నాం.
పెరిగాక పేర్లు పోయాయి…
కానీ ముద్దలపై ఆశ మాత్రం పోలేదు.
కాలం మారింది, ఊళ్లు దూరమయ్యాయి,
చేతుల స్పర్శలు అరుదయ్యాయి.
అయినా—
ఆవకాయ ముద్దలో
చిన్ననాటి వేసవులు,
అమ్మమ్మ గది వాసన,
మావయ్య పిలుపు,
పిల్లల నవ్వులు—
అన్నీ కలిసే ఉన్నాయి.
అందుకే
అది కేవలం ఆవకాయ కాదు…
ఒక జ్ఞాపకం.
ఒక బంధం.
ఒక తరం చేతి నుంచి
మరో తరానికి అందిన
అమృతపు ముద్ద.
ఆ రోజు
భారతికి తీరింది కోరిక కాదు…
తీరింది ఒక జీవితం నిండా దాచుకున్న
చావని చిన్నతనం.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి