శివ

శివ

ఏడాదికో మారు హుస్సేన్ సాగర్ లో
వినాయకుడు మూడు మునకలు వేసి
భాగ్యనగర  వాసులకి ముక్తిని ఇస్తాడు.

కాపురం బాలేని ఒక చెల్లి
ఉద్యోగం రాలేదని ఒక తమ్ముడు
బ్రతుకు బాలేదని ఒక సంసారి
దిక్కు తోచక ఒకడు
దిక్కు లేక మరొకడు
పచ్చటి బ్రతుకుని ఆ సాగరంలో కలిపేసినప్పుడు
ఊపిరాడకు మరో లోకం చూసినప్పుడు
నేనున్నానంటూ తన బ్రతుకు చూసుకోకుండా
సాగరంలో  మూడుమునకలేసి
ఊపిరి ఉన్న వాళ్ళని 
ఊపిరి లేని వాళ్ళని
కన్నవాళ్ళకి 
కట్టుకున్న వాళ్ళకి కడసారి చూపు
అందించే మరో  అపర వినాయకుడు
ఈ భాగ్యనగర జీవి.

నామధేయం శివ
ఆ సాగరతీరమే అతని అడ్డా
జనాలకు ప్రాణహితుడు.
రక్షక  భటులకు కుడి భుజం.

భాగ్యనగరంలోని ఓ బడుగు జీవి
బ్రతకడానికి ప్రాణాన్ని పణంగా పెట్టిన త్యాగజీవి.

కొన ఊపిరి ఉన్న వాళ్లు సంతోషంగాను
ఈ లోకంలో లేని వాళ్ళ బంధుజనం కన్నీళ్ళతోను
ఇచ్చే పదో పరకో  అదే జీవనాధారం.

ఉపకారం అంటేనే పారిపోయే జనం ఉన్న రోజులు
పరుల ప్రాణం కోసం ప్రాణం త్యాగం చేసే పరమాత్ముడు
సార్ధక  నామధేయుడు.

భర్త అడుగుజాడల్లోనే భార్య
ఆడ ప్రాణం  ఆమె వంతు
ప్రాణ రక్షణ పంచుకున్నారు చెరి సగం.
సమయానుకూలంగా స్పందించడమే వారి వృత్తి ధర్మం.

భూమ్మీద నూకలు ఉండి 
బతికి వచ్చిన వారు పెట్టే దండాలు
కడసారి చూపు దక్కించావని
బంధువులు కళ్ళల్లో కనపడ్డ సంతోషం
ఆ జంటకి ఆశీర్వచనం.

సాగరాన్ని ఈదే గజ ఈతగాడు
సంసార సాగరానికి కావాలి సర్కారు వారి సహాయం.
ఆపర ప్రాణదాతకి నమస్కారం.

రచన మధునాపంతుల చిట్టి  వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆరోగ్యం వర్సెస్ ఆహారపు అలవాట్లు

కుటుంబం

సాయంకాలం సాగర తీరం